Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 మహమ్మారి విజృంభనతో ప్రపంచ మానవాళి దిక్కుతోచని దుస్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్న సందర్భమిది. 2వ వేవ్ సమిసిపోతోందనే ఉపశమన వార్తలతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ, ప్రమాదకరమని భావించిన డెల్టా వేరియంట్ భయంతో ప్రజలు 3వ అల వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి అస్థిర కరోనా కారుమబ్బుల భవిష్యత్ వార్తల నడుమ నేడు అత్యంత ప్రమాదకరమైన సి.1.2 అనబడే కొత్త కరోనా వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికెబుల్ డిసీజెస్, క్వాజులు నాటల్ రీసెర్చ్ ఇన్నొవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫాంకు చెందిన శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ వార్తతో ప్రపంచ మానవాళి గుండెల్లో గుబులు మొదలైంది. గత నెల రోజుల్లో దక్షిణాఫ్రికాలో 3.09 లక్షల కోవిడ్-19 కేసులు (81,595 మరణాలు) నమోదైనాయి. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో కూడా నిర్థారించిన సార్స్-కోవి-2 కొత్త వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. నూతన వేరియంట్ సి.1.2 అధ్యయనంలో కొన్ని ప్రమాదకర అవాంఛనీయ ఫలితాలను గుర్తించారు. గత వేరియంట్ల మ్యుటేషన్ రేటుతో పోల్చితే కొత్త సి.1.2 వేరియంట్ రెట్టింపు వేగంతో (1.7 రెట్లు అధికంగా) మ్యుటేషన్ కాగలదని, ఏడాదికి 41.8 మ్యుటేషన్లను పొందగలదని నిర్థారించారు. సి.1.2 వేరియంట్ సాంక్రమిక రేటు అధికమని, ఈ వేరియంట్‌కు కోవిడ్-19 టీకా రక్షణ వర్తించక పోవచ్చనే భయానక వార్తను వెలువరించారు.
'వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ (విఓఐ) లేదా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (విఓసి)'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుస్తున్న సి.1.2 వేరియంట్‌ను సౌత్ ఆఫ్రికాలో మే-2021 మాసంలోనే కనుగొనడం జరిగింది. అనంతరం ఆగస్టు 13 వరకు చైనా, కాంగో, మారిషస్, యుకె, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విస్ దేశాల్లో కూడా గుర్తించడంతో ప్రపంచ దేశాలు భయకంపిత మవుతున్నాయి. కోవిడ్-19 విపత్తు కాలంలో అనేక వేరియంట్లు ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందడం, డెల్టా వేరియంట్ సాంక్రమిక రేటు అధికంగా ఉందని భయపడ్డాం. తొలిసారి యూకేలో గుర్తించబడిన అల్ఫా-బి.1.1.7, సౌత్ఆఫ్రికాలో బయట పడిన బీటా-బి.1.351, జపాన్ బ్రెజిల్లో కనుగొన్న గామా-పి.1, ఇండియాలో తొలి సారి బయట పడిన డెల్టా-బి.1.617.2 వేరియంట్లను గమనించి ఇప్పటి వరకు అధ్యయనం చేశారు. సగానికి పైగా సీక్వెన్సెస్‌లో 14 మ్యుటేషన్లు గమనించారు. సి.1.2 వేరియంట్ స్పైక్ ప్రాంతంలో 52శాతం మ్యుటేషన్లను పొందగలుగుతూ, ఆంటీబాడీలను కూడా ప్రతిఘటించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. చైనా వూహాన్లో బయట పడిన వైరస్ నాటి నుంచి నేటి వరకు సి.1 వర్గ వైరస్ 59 వరకు మ్యుటేషన్లు పొందగలిగిందని గుర్తించారు.
కరోనా వేరియంట్స్, స్టేయిన్స్ అంటే?
కరోనా వైరస్ మానవ కణాలపై దాడి చేస్తూ డుప్లికేట్ అవుతూ మల్టిప్లై అవుతుంది. డుప్లికేటింగ్ అవుతున్నపుడు వైరస్ జెనెటిక్ సీక్వెన్సింగ్‌లో జరిగిన మార్పులను మ్యుటేషన్ అంటూనే, మ్యుటేషన్ పొందిన వైరస్‌ను వేరియంట్‌గా పిలుస్తారు. వేరియంట్ సమూల మార్పులకు లోనవుతూ మాతృ వైరస్‌కు విభిన్నంగా భౌతిక ధర్మాలను ప్రదర్శించినపుడు 'స్టేయిన్'గా పిలవడం జరుగుతుంది. అన్ని స్టేయిన్లు వేరియంట్సే అయినప్పటికీ, అన్ని వేరియంట్లు స్టేయిన్లు మాత్రం కావని అర్థం చేసుకోవాలి.
మన కర్తవ్యమేమిటి?
అత్యంత ప్రమాదకరమని భావిస్తున్న సి.1.2 వేరియంట్ పరిశోధనలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, దానిని పూర్తిగా విశ్లేషించడానికి మరి కొంత సమయం పట్టవచ్చని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను తట్టుకొని బయట పడ్డ ప్రపంచ మానవాళి, సి.1.2 వేరియంట్ నుంచి రక్షణ పొందడానికి మాస్కుల ధారణ, భౌతిక దూరాలు పాటించడం తప్పక ఆచరించాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 టీకాను, వ్యాధినిరోధకశక్తి, ఆంటీబాడీలను ప్రతిఘటించ గలిగే సి.1.2 వేరియంట్ వేగంగా విస్తరిస్తే ప్రపంచ మానవాళికి మరో భయంకర ఆరోగ్య సంక్షోభ అనుభవం కలుగవచ్చని హెచ్చరిస్తున్నారు. సి.1.2 వేరియంట్ వ్యాప్తి పెరిగితే తట్టుకోవడం కష్టమని, వేరియంట్ సోకకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుత ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించిన టీకాలు, సి.1.2 వేరియంట్ నుంచి రక్షణ కల్పించక పోవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ సోకినపుడు జలుబు, ముక్కు కారడం, దగ్గు, గొంతు/శారీరక నొప్పి, వాసన/రుచి కోల్పోవడం, జ్వరం, డయేరియా, పింక్ ఐస్ లాంటి సాధారణ రోగ లక్షణాలు కనిపిస్తాయని గమనించాలి. మన జీవనశైలిని మార్చుకుంటూ, కరోనా సోకకుండా జాగ్రత్త పడడమే మన ముందున్న ఏకైక సురక్షిత మార్గమని మరిచి పోవద్దు. 'చికిత్స కన్న నివారణే మిన్న' అని గుర్తుంచుకుందాం. కరోనాకు దూరంగా ఆరోగ్యంగా జీవనయానం చేద్దాం.
(24 ఆగష్టు 2021న 'మెడ్ఆర్గ్జ్సివ్' పరిశోధనా వ్యాసం ఆధారంగా)
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037