Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జల్.. జంగల్.. జమీన్ హమారా అని అనేక పోరాటాల్లో అమరులైన ఆదివాసులు నినదించారు. వారి పోరాట ఫలితంగానే అటవీ సంరక్షుకులైన ఆదివాసీలకు స్వాతంత్రానంతరం రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. ఆదివాసుల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఐదవ షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన 1/70 చట్టం, పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే నేషనల్ పాలసీ ఆన్ ట్రైబల్స్‌లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలైన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐటిడిపి), గిరిజన సహకార సంస్థలు (జిసిసి), సంస్మృతీ, సంప్రదాయాల పరిరక్షణ, పరిశోధన కోసం ట్రైకార్ సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి.
విద్యా రంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, షెడ్యూల్డ్ ఏరియాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, వ్యవసాయ, పశుపోషణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రవాణా సౌకర్యాల కల్పన, ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం కోసం బడ్జెట్లో అధిక మొత్తాలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆదివాసులకు వీటి ఫలితాలు అందక, అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయారు. పైగా పాలకులు అటవీ ప్రాంతంలోని ఖనిజాలు, కలప వంటి ప్రకృతి సంపదను కొల్లగొట్టే చర్యలకు పాల్పడుతూ, అణచివేత చర్యలకు పూనుకొంటున్నారు. చివరకు ప్రధాన జీవనాధారమైన భూముల నుంచి కూడా ఆదివాసులను తరిమివేసే దృశ్యాలను నేడు మనం చూస్తున్నాం.
అడవిలో సహజసిద్ధంగా లభించే అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు, తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న పోడు భూములను లాక్కొనే అప్రజాస్వామిక ధోరణి నేటికీ కొనసాగుతోంది. 2006 నుంచి అమలులో ఉండాల్సిన అటవీహక్కుల చట్టాన్ని పక్కకు నెట్టి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే అనేక బహిరంగ వేదికల్లో, సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారే తప్ప దీని కొరకు ఉన్నత స్థాయిలో సీరియస్ సమీక్ష గానీ, విధివిధానాల రూపకల్పన గానీ ఇంతవరకు రూపొందించలేదు. మైదాన ప్రాంతాల్లో భూమి రికార్డుల ప్రక్షాళన, ధరణిపోర్టల్ ఏర్పాటు, సమగ్ర భూసర్వే ఏర్పాటు వంటి పనులు జరుగుతున్నా పోడు భూముల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వానికి శీతకన్ను ఎందుకు? చిత్తశుద్ధితో ప్రయత్నించి ఆదివాసీల పోడు భూములకు పట్టాలిచ్చి, వారి బతుకుల్లో వెలుగులు నింపలేరా? అసలు 2006లో వామపక్షాల ఒత్తిడితో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలుకు పూనుకొంటే పోడు భూముల సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన అటవీ విధానం-2019 ద్వారా ఉన్న చట్టాలను సవరించి అటవీహక్కుల చట్టానికి తూట్లు పొడిచింది. ప్రజా సంక్షేమానికి బాధ్యత వహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల అములునే అటకెక్కించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 42.92 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి. 2019, మార్చి 31 నాటికి ఇందులో వ్యక్తిగతంగా 93,639 మందికి 3.02 లక్షల ఎకరాలు, సామూహికంగా 721 గ్రూపులకు 4.54 లక్షల ఎకరాలు మొత్తంగా 7.56 లక్షల ఎకరాలకు టైటిల్స్ ఇచ్చారు. వీటిలో వ్యక్తిగతంగా, సామూహికంగా దరఖాస్తు చేసుకొన్న 1,86,679 క్లెయిమ్స్‌లో 88,757 క్లెయిమ్స్‌ను తిరస్కరించారు. సామూహిక గ్రూప్‌లకు ఇచ్చిన భూమిని కూడా తిరిగి వారి నుంచి అటవీశాఖ అధికారులే స్వాధీన పర్చుకున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా ఆదివాసీల జీవితాలు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అనేక రూపాల్లో పోరాటాలు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. పైగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటవీ, పోలీస్ శాఖల అధికారులు దాడులు చేసి పోడు భూముల్లో కందకాలు తవ్వి, హరితహారం పేరుతో ఆదివాసీలను నిరాశ్రయుల్ని చేస్తున్నారు. అదీ చాలదన్నట్లు హత్యాయత్నంతో సహా అనేక సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించి స్త్రీలతో సహా వందలాది ప్రజలను జైళ్లకు పంపిస్తున్నారు. 2005 డిసెంబర్‌కు పూర్వమే గత ప్రభుత్వాలు ఆ భూముల పై ఇచ్చిన బి1 పట్టా కాగితాలు, రెవెన్యూశాఖ రికార్డులు,రశీదులు మొదలైన ఆధారాలు చూపించినా అటవీశాఖ రికార్డులో ఆ భూములు ఫారెస్ట్ డిపార్టుమెంట్‌కి చెందినట్లుగా ఉన్నవని చెప్పి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం-2006, 2007 రూల్స్ ప్రకారం హక్కుల నిర్ధారణకు రైతులు ఆధారాలు చూపించినా, లెక్క చేయకుండా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అదే విధంగా తిరస్కరించిన, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ భూములపై కోర్టు స్టే అమలులో ఉన్నా, ధిక్కరిస్తూ ఖాళీల పర్వం కొనసాగుతున్నది.
2007లో చట్టం వచ్చిన విషయం గానీ, పట్టాల కొరకు దరఖాస్తు చేసుకోవాలనే సంగతి గానీ, ఏమీ తెలియని ఆదివాసీలు, తరతరాలుగా ఆ భూముల్లో సాగుచేసుకొంటున్నా కూడా హక్కు పత్రాలు పొందలేక ప్రభుత్వ దాష్టీకానికి గురవుతున్నారు. చట్ట ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 90శాతం ఆదివాసీలు లక్షలాది ఎకరాల అటవీ భూములకు హక్కు పత్రాలు పొందలేకపోవడం అత్యంత విషాదకరం. రాజ్యాంగం ప్రకారం గిరిజన హక్కుల్ని, చట్టాలను కాపాడాల్సిన గవర్నర్ కూడా ఎన్నడూ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా ఆదివాసుల పట్ల బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు ఫారెస్ట్, రెవెన్యూ, ట్రైబల్ శాఖలు సమన్వయంతో చట్టం అమలుకు నిర్ణీత కాలవ్యవధి కార్యక్రమంతో ప్రణాళిక రూపొందించుకోవాలి. చట్టంలోని నిబంధన 6(1) ప్రకారం దరఖాస్తు ఫారాలు ఎ,బి,సి నమూనాలు వేర్వేరుగా వ్యక్తిగత, సామూహిక, అటవీ వనరులు, ఉత్పత్తుల హక్కుల కోసం క్లెయిమ్ చేసుకోవడానికి అసంఖ్యాకంగా అందుబాటులో ఉంచాలి.
రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, గిరిజన సలహామండలి నుండి ముగ్గురు ఎస్.టీలను సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్ పర్సన్‌గా రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని నియమించాలి. ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నోడల్ ఆఫీసర్లుగా మొత్తంగా చట్టం అమలుకు కేంద్ర బిందువుగా, చొరవతో పనిచేయాలి. అటవీ భూములు, అటవీ ఉత్పత్తుల వనరుల లభ్యతకు సంబంధించిన సమస్త సమాచారాన్ని రికార్డులు, మ్యాపులు, కోర్టు తీర్పులు, వివిధ శాఖల పథకాల వివరాలు వ్యక్తులకు, గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలకు అందుబాటులో ఉంచాలి.
ఎప్పటికప్పుడు క్లెయిమ్స్‌ను పరిశీలించి హక్కు పత్రాలు ఇస్తూ, ఆదివాసీలలో విశ్వాసం పెంపొందించాలి. ఇవన్నీ అమలు జరగాలంటే ప్రజా పోరాటాలు అనివార్యం. ఆ పోరాటంలో భాగంగానే సెప్టెంబర్ 12న వామపక్షాలు, కాంగ్రెస్, టీజేయస్, ఆదివాసీ సంఘాలు సదస్సులు నిర్వహించి, సెప్టెంబర్ 30న రాష్ట్ర వ్యాప్త రహదారుల దిగ్బంధనానికి పిలుపు నిస్తున్నాయి. అంతిమంగా ఇది అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు దారి తీస్తుంది. ఆదివాసుల హక్కుల రక్షణకై జరగబోతున్న ఈ పోరాటంలో ప్రజలందరం భాగస్వాములమవుదాం.
- ఎన్. శ్రీనివాస్
సెల్ : 9676407140