Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యలేనందున - జ్ఞానం లేకుండా పోయింది
జ్ఞానం లేనందున - నైతికత లేకుండా పోయింది
నైతికత లేనందున - ఐక్యమత్యం లేకుండా పోయింది
ఐకమత్యం లేనందున - శక్తి లేకుండా పోయింది
శక్తి లేనందున - శూద్రులు, అతిశూద్రులు
అణచివేయబడ్డారు
ఇన్ని అనర్థాలు కేవలం అవిద్య వల్లే జరిగిపోయాయి.
- జ్యోతి బాఫూలే
కాలానుగుణంగా మహాత్మ ఫూలే చెప్పిన అవిద్యను మనం ఇంకొంచెం విస్తృతంగా చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవిద్య అంటే చదవడం, రాయడం రాకపోవడం కాదు. గొప్ప చదువులు చదివిన పట్టభద్రులైనా.. ''మనుషులంతా ఒక్కటే!'' అని గ్రహించకపోవడం. మనువాదుల భావజాలంలో పడి గిలగిల కొట్టుకుంటూ బతకడం. అందులోంచి బయటికి రావాలన్న స్పృహ లేకపోవడం. విద్యావంతులంటే వివేకవంతులు. విద్యావంతులంటే విశాల హృదయులు. సంకుచిత మనస్తత్వంతో కుల, మత, ప్రాంతీయ భేదాలతో కుళ్ళిపోయే వారు కాదు. చదువుతో వివేకవంతులై ఆధునిక, వైజ్ఞానిక ఆలోచనా పరులవుతారని మహాత్మఫూలే భావించి ఉంటారు. కాని, తర్వాత కాలంలో చదువు - చదువే అయ్యింది. వివేకం - వివేకమే అయ్యింది. అందువల్ల ఇప్పుడు మనం - వివేకం లేనివారిని విద్యావంతుల కోవలోకి ఎలా తీసుకుంటాం?
పి.వి.సింధూ తండ్రి ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామిని - పెదవేగి మండలం, రాట్నాల కుంట - రాట్నాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. కూతురు టోక్యో ఒలింపిక్స్ (2021)లో కాంస్య పతకం సాధించి తెచ్చినందుకు. రోజుకు లక్షల ఆదాయం కలిగి ఉండి, ప్రభుత్వం నుండి కోట్ల సహాయం పొందిన పి.వి. సింధూ ఈ దేశానికి కాంస్య పతకం తేవడం ఏమాత్రం గొప్పకాదు. స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళడానికి రూ.60 ఆటోచార్జీ లేని స్థితిలో ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఒలింపిక్స్‌లో హాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన వందనా కటారియా గ్రేట్! హరిద్వార్, రోషన్‌బాద్ గ్రామ నివాసి వందనా కటారియా - ఇంటి వద్ద కొందరు అగ్రకులాల పెద్దలు, యువకులు నానా హంగామా చేశారు. ఆమెను కులం పేరుతో దూషించారు. భారత హాకీజట్టు, ఓడిపోవడానికి కారణం - ఆ జట్టులో 'ఎక్కువ మంది దళిత మహిళలు ఉండటమే!' ననీ.. 'హాకీ' జట్టులోనే కాదు, దళితుల్ని ఎందులోనూ భాగస్వాములుగా చేయకూడదని గట్టిగా అరుస్తూ, ఒంటిమీది గుడ్డలు తీసి డాన్స్ చేశారు. కింది నుండి పైదాకా ఏ పరిపాలకుడి నుండీ స్పందనా రాలేదు. చర్య తీసుకోకపోవడం అంటుంచి, కనీసం ఖండించక పోవడమంటే ఏమిటీ? ఆ అల్లరిమూకను వెనకేసుకొచ్చినట్టే కదా? అందుకే అబ్రహం లింకన్ ఒక చోట అంటారు... ''పులిని మేకను ఒకే చోట వదిలి రెండింటికీ సమానంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇచ్చామంటే - మేక స్వాతంత్య్రం మనం అర్థం చేసుకోలేనిది కాదు'' అని. ఇక్కడ దేశంలో నిచ్చెన మెట్ల సంస్కృతి నాశనం చేయకపోతే, మనువాదుల ఆగడాలు ఆగకపోతే, వారి మైండ్ సెట్ మారకపోతే... ఈ దేశంలో సమానత్వానికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అర్థమే ఉండదు. ఇలాంటి సంఘటనలు రోజూ వివిధ స్థాయిలలో జరుగుతూనే ఉంటాయి.
తన జట్టు సభ్యురాలైన వందనా కటారియా ఇంటిముందు జరిగిన సంఘటనను తీవ్రంగా నిరసిస్తూ.. భారత మహిళల హాకీజట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ విధంగా ప్రకటించారు.. ''మాకు కుల మతాల పట్టింపులేదు. మేం దేశంలోని వేరు వేరు ప్రాంతాల నుండి, కులాల నుండి, మతాల నుండి వచ్చిన వాళ్ళం. మా జట్టు సభ్యురాలు వందన కటారియా తండ్రిగారు ఈ మధ్యే చనిపోయారు. ఒలింపిక్స్ కోసం ఆమె తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు. అలాంటి గుండె పగిలే త్యాగాలు చూడకుండా, కొందరు ఆమెను కులం పేరుతో దూషించడం న్యాయం కాదు. అయినా, గెలుపు ఓటములకూ కులాలకు, మతాలకూ సంబంధమే లేదు కదా? ఆటలో నైపుణ్యాన్ని బట్టి ఒలింపిక్ జట్టులో స్థానం లభిస్తుంది. వందనకు జట్టులో స్థానం లభించిందంటే.. ఎంతటి ఉన్నత ప్రమాణాలు గల క్రీడాకారిణో తెలిసిపోతూనే ఉంది!'' అని ఆమె వివరణ ఇచ్చారు.
''అవార్డులు, రివార్డులూ తర్వాత.. ముందు రైతుల గొంతుకోసే వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి!'' అని డిమాండ్ చేస్తూ భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు రివార్డును భారత హాకీ జట్టు సారధి మాన్ ప్రీత్‌సింగ్ తిరస్కరించారు. డబ్బును కాదనడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపడం మరొక ఎత్తు. ఇందుకు ఎంత సాహసం కావాలి? దీన్నే దేశద్రోహమని అంటారేమో - ఏమో - అన్నా.. అంటారు! ఇలాంటి పరిపాలకుల అజ్ఞానాన్ని గమనించే అమెరికన్ వైజ్ఞానిక తత్త్వవేత్త డేనియల్ డెన్నెట్ట్ ఇలా అన్నారు.. ''అజ్ఞానం సిగ్గు పడాల్సిన విషయం కాదు, కానీ దాన్ని ఇతరుల మీద రుద్దడమనేది సిగ్గుపడాల్సిన విషయమే! అజ్ఞానులుగా ఉన్నందుకు చాలా మందిని వ్యక్తిగతంగా తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, వారు పనిగట్టుకుని తమ అజ్ఞానాన్ని ఇతరులకు పంపిణీ చేస్తుంటే మాత్రం అది ముమ్మాటికీ తప్పే అవుతుంది!'' పతకాలు తెచ్చాక అభినందించడాలు, చంకలు గుద్దుకోవడాలు కాదు. ఆయా పతకాలు తేవడానికి శ్రమించిన క్రీడాకారుల కష్టాల్ని గుర్తించాలి. మంచి క్రీడాకారుల్ని తయారుచేసే క్రీడా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. అవసరమైన విద్యావిధానమే లేదు. జాతీయ పరిశోధనా విధానమే లేదు. ఇక క్రీడా విధానం ఎప్పుడు రావాలీ? భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలైనా వీటి మీద దృష్టిపెట్టాలి!
వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన మీరాబాయి చానూ 150 మంది మణిపూర్ ట్రక్ డ్రైవర్లను ఆహ్వానించి వారిని సన్మానించింది. ఆమె ఇల్లు ఇంపాల్లోని స్పోర్ట్స్ అకాడమీకి 25 కి.మీ. దూరంలో ఉంది. శిక్షణ కోసం రోజూ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగా లేని ఆ ప్రాంతంలో బస్సుల్లోగాని, ట్రక్కుల్లోగాని ప్రయాణించాలి. బస్సు చార్జీలకు డబ్బులుండేవి కావు. ఏళ్ళకేళ్ళు ఆ ట్రక్ డ్రైవర్లు దయదలిచి, ఆమెను ఉచితంగా స్పోర్ట్స్ అకాడమీకి తీసుకెళ్ళేవారు. దాని ఫలితంగానే మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో విజయం సాధించగలిగింది. అందుకే ట్రక్ డ్రైవర్లనందరినీ ఇంటికి పిలుచుకుని, కృతజ్ఞతలు తెలుపుకుని, బహుమతులందించింది.
మానవీయ విలువలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన సంఘటన టోక్యో ఒలింపిక్స్‌లో జరిగింది. పురుషుల హైజంప్ ఫైనల్లో తంబేరి (ఇటలీ) బార్షిమ్ (ఖతార్)లు పసిడి రేసులో 2.37 మీ.తో సమ ఉజ్జీలుగా ఉన్నారు. 2.39 మీ. ప్రయత్నించి, ఇద్దరూ మూడుసార్లు విఫలమయ్యారు. ఇంతలో తంబేరి కాలు ప్రాక్చరయ్యింది. జంప్ ఆఫ్ నుండి విరమించుకున్నాడు. ఇంకేముంది? బార్షిమ్కు గోల్డ్ మెడల్ చేతికి అందినట్టే.. ఒకసారి ఊరికే జంప్ చేస్తే చాలు. తంబేరిపై విజయం సాధించినట్టే. కానీ... అతను అలా చేయలేదు. తనకు సమ ఉజ్జీ అయినవాడు కూడా అర్హుడే అని గ్రహించి.. ''నేనూ విరమించుకుంటాను - గోల్డ్ ఇద్దరికీ పంచండి'' అని అన్నాడు. అధికారులు అంగీకరించారు. ఒలింపిక్స్ దాకా రావడమే కష్టం. వచ్చినా, ఫైనల్స్‌కు రావడం మరింత కష్టం. ఫైనల్స్‌లో ప్రత్యర్థికి సమ ఉజ్జీగా నిలబడటం ఎంతో ఎంతో కష్టం. అయినా కూడా, తనకు సమ ఉజ్జీగా నిలబడిన వాడికి కాలు విరగడాన్ని ఓ అవకాశంగా తీసుకుని, సులభంగా గోల్డ్‌మెడల్ గెలుచుకుని పోవచ్చు. ఎవరూ కాదనరు. అక్కడే ఖతార్ ఆటగాడు బార్షిమ్లో మానవత్వం గుబాళించింది. దెబ్బతిన్న వాణ్ణి వదిలేసి తను గెలుపు తను చూసుకోలేదు. ఆ గెలుపు సాధించిన వాడిగానే కాక, మనిషిగా మహౌన్నతంగా ఎదిగాడు. ఒక కాలు విరిగిన వాడిమీద తన గెలవడమా? అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు. తనతో సమానంగా నిలబడి, గట్టిపోటీ ఇచ్చిన వాడు తనకంటే తక్కువేమీ కాదు అనే నిర్ధారణకు వచ్చాడు. అందుకే చేతికందిన గోల్డ్‌లో సగం తన ప్రత్యర్థికి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. క్రీడా స్ఫూర్తిని నిలుపుతూ మనిషిగా ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. ఈ సంఘటనలోని మానవతా దృక్పథాన్ని అర్థం చేసుకున్న వారికే దాని విలువ తెలుస్తుంది.
ఆటగాళ్ళను కేవలం ఆటగాళ్ళుగానే చూడాలి. వారిని హిందూ, ముస్లిం మతాలవారిగా విభజించి చూడొద్దని ప్రముఖ జర్నలిస్ట్ రవీశ్‌కుమార్ ప్రకటించారు. కులమతాల విద్వేషాల్ని రెచ్చగొట్టి, ప్రజల్ని విడగొట్టి పబ్బం గడుపుకుంటున్న ఈ దేశ రాజకీయాలు - విదేశాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి. క్రీడారంగంలో గల కుల వివక్ష గురించి రాస్తున్న సమయంలోనే డాక్టర్ గెయిల్ ఒమ్వెట్ (2 ఆగస్టు 1941- 25 ఆగస్టు 2021) మరణవార్త వినాల్సి వచ్చింది. అమెరికన్ - ఇండియన్ అయిన డాక్టర్ గెయిల్ మానవ హక్కుల కార్యకర్త. కుల నిర్మూలన ఉద్యమంలో, మహిళా ఉద్యమాల్లో - పర్యావరణ పరిరక్షణలో, రైతు ఉద్యమాల్లో ముఖ్యంగా దళితుల అణచివేత మీద లోతుగా అధ్యయనం చేసిన పరిశోధకురాలు. డాక్టర్ గెయిల్ ఒమ్వెట్ అమెరికాలోని మినిపోలీస్లో జన్మించి, బర్కిలీ - కాలిఫోర్నియా విశ్వవిద్యాలయపు కార్లిటన్ కాలేజి విద్యార్థిగా ఆమె, సోషియాలజీలో డాక్టరేట్ తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అనాగరికపు కుల వ్యవస్థ, కేవలం ఈ దేశంలోనే కొనసాగుతూ ఉందని తెలుసుకుని, ఆ విషయం మీద మరింత లోతుగా అధ్యయనం చేయడానికి 1973లో ఆమె భారతదేశం వచ్చారు. ఒక పదేండ్ల తర్వాత భారతదేశ పౌరసత్వం స్వీకరించారు. సామాజిక కార్యకర్త అయిన భారత్ పటంకర్ను వివాహమాడారు. సామాజిక ఉద్యమాల్లో భర్తతో కలిసి పనిచేశారు. గ్రామీణ మహిళలతో మమేకమై పనిచేసిన ఈవిడ గొప్ప రచయిత్రి కూడా! ఈ దేశ చరిత్రను అధ్యయనం చేయడమే కాక, సంస్కృతీ, సంప్రదాయాల పేర ఇక్కడ జరిగిన అణిచివేతల గూర్చి, శారీరక దోపిడీల గూర్చి, బలులు, హత్యల గూర్చి విరివిగా పుస్తకాలు రాశారు. అవి ఇక్కడ పుట్టి పెరిగిన వారికి కూడా స్ఫూర్తిదాయకమయ్యాయి.
డాక్టర్ గెయిల్ ఒమ్వెట్ రాసిన అనేక ప్రమాణిక, పరిశోధన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ దేశపు కలనేత (TEXTURE) గూర్చి వైవిధ్యం గూర్చి తెలుసుకో దలచినవారు అవి తప్పక చదవాలి! 1. పశ్చిమ భారతదేశంలో జరిగిన బ్రాహ్మణేతరుల ఉద్యమాల గూర్చి CULTURAL REVOLT IN COLONIAL SOCIETY (1966) 2. కుల వ్యతిరేక ఉద్యమం - భారతీయత నిర్మాణం గూర్చి DALIT VISIONS (1975) 3. జైలును బద్దలు కొడతాం WE WILL SMASH THIS PRISON - INDIAN WOMEN IN STRUGGLE (1980) 4. మహిళలపై జరిగిన హింస VIOLENCE AGAINST WOMEN - NEW THEORIES & NEW MOVEMENTS (1991) 5. రైతు ఉద్యమాలు - శ్రమశక్తి విలువ REINVENTING REVOLUTION (1993) 6. దళితులు: న్రపజాస్వామ్య విలువలు DALITS & DEMOCRATIC REVOLUTION(1994) 7. భారతదేశంలో అస్పృశ్యత GROWING UP UNTOUCHABLE IN INDIA 8. భారతదేశంలో బౌద్ధం BUDDISM IN INDIA (2003) ఇలా ఎన్నెన్నో -ఒరిస్సాలో, పూణెలో, నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ప్రొఫెసర్‌గా, రీసర్చ్ డైరెక్టర్‌గా ఆమె చేసిన సేవలు మహౌన్నతమైనవి. నోర్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏసియన్ స్టడీస్ - కోపెన్‌హాగన్‌లో గెస్ట్ ప్రొఫెసర్‌గా అంతర్జాతీయ స్థాయి లో కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా దేశంలో బ్రాహ్మణేతరుల ఉద్యమాలన్నింటినీ ఆమె గ్రంథస్థం చేశారు. అందుకే ఆమె ఈ దేశంలో 'బహుజనహిత మేథావి'గా గుర్తింప బడ్డారు. ఇక ఇక్కడ - ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీషు పాఠ్య గ్రంథం - సిలబస్ నుండి 'దళిత కథల్ని' తొలగించడ మన్నది తాజా సమాచారం! దీనితో ప్రభుత్వ పాలసీ ఏమిటో తెలుస్తూనే ఉంది కదా?
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు