Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత తిప్పికొట్టినా
మన పురాణాల సంఖ్య పద్దెనిమిదే
తిట్ల పురాణాలు అంతకు మించి!
అనుభవం ఏం చెబుతుందంటే
తిడితే గాలికి తింటే లోనికి
తిట్ల ప్రయోజనమూ ఇంతే!
నేనవర్నీ వేలెత్తి చూపడం లేదు
మన ప్రియతమ నేతల ఒంటి నిండా
చెరిగిపోని బురద మరకలే!
ఒకప్పుడు మిషన్ భగీరథ రాక మునుపు
నల్లాల కాడ గొంతెండిన మహిళలు
ఇట్లాంటి పురాణాలు విప్పేవారు!
ఇప్పుడు పలు మాధ్యమాలల్లో
దృశ్య శ్రవణ పేయంగా
మన నేతలు ప్రెస్మీట్లల్లో!
ముక్తిని కోరే జనం
ప్రవచనాలకు అడిక్ట్ అయినట్లు
వినోదం కోసం తిట్ల పురాణాలకు!
ఒకరు పొద్దున్నే తిట్ల అష్టోత్తరమెత్తుకుంటే
సాయంత్రం మరో అర్చక స్వామి
సహస్రార్చనతో ముగింపు పలుకుతాడు!
అన్నం తిన్న నోళ్ళ నుంచే
ఇంత మురికి ప్రవహిస్తుంటే
టాయిలెట్ క్లీనర్ల ఉత్పత్తి రెండింతలు!
నిత్యం ఆధునీకరిస్తున్న
ఈ తిట్ల పురాణాలకు
ఏ లింగ వివక్ష లేకపోవడము ఓ విశేషం!
సాహసించి జనం నిలదీస్తే కష్టమనే
మన నేతలు ఈ తిట్ల పురాణాలను
సహజ కవచ కుండలాలుగా మలచుకున్నారు!!!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి
సెల్: 9440233261