Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చారిత్రక పరిశోధనా సంస్థ (ఐసీహెచ్ఆర్) వారు 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లో జవహర్లాల్ నెహ్రూ ఫొటోను అందరి ఫొటోలతోపాటు చేర్చకుండా వదిలేసిన తీరు ఆ సంస్థ చిన్న బుద్ధికి, పాలక పార్టీ ఉద్దేశాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. జాతి నిర్మాణానికి నాయకత్వం వహించిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను ఉదహరించకుండా ఎవ్వరూ స్వాతంత్య్ర భారతదేశ చరిత్రను రాయలేరు. రాజకీయంగా, విధానపరంగా ఆయన కొన్ని తప్పులు చేయకపోలేదు. కానీ ఆయన మరణించిన 1964 దాకా, ఆయన 17 సంవత్సరాల పాలనలో అతని నిర్ణయాలు, విభిన్న మతాలు, తత్వాలు, భావాల పట్ల ఆయన దృష్టి కోణం, ఆయన రచనలు, ఎంతోమంది సందేహాల నడుమ ఆయన ప్రభుత్వం నెలకొల్పిన సంస్థలు, ప్రజాస్వామిక వ్యవస్థలు, 1947 తరువాత భారతదేశానికి అంతర్జాతీయంగా వచ్చిన గౌరవం లాంటివి అన్నీ ఆయన వారసత్వంలో భాగాలే.
బ్రిటిష్ ఇండియాలో నెహ్రూ అనేక దశలలో సుమారు తొమ్మిది సంవత్సరాలు రాజకీయ ఖైదీగా జైలు జీవితం గడిపిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టాడు. ''సంపూర్ణ స్వరాజ్యం'' డిమాండ్ అంత ప్రసిద్ధి చెందనినాడే ఆయన ఆ డిమాండ్ కోసం పోరాడాడు. భారతదేశం యొక్క ప్రజాస్వామిక, సంక్షేమ రాజ్యం నమూనాను వ్యక్తీకరించే 1931 కరాచీ తీర్మానానికి నేతృత్వం వహించాడు. ఆయన లౌకికవాది. ఆయనకు వేదాలు బాగా తెలుసు కానీ భగవధారాధనలో ఆసక్తిలేదు. సాంప్రదాయాల పట్ల మర్యాదగా ఉంటాడు కానీ శాస్త్రీయతకు అంకితమవుతాడు. తన రాజకీయ భావజాలానికి అన్ని విధాలా కట్టుబడి ఉంటాడు. అందుకే తన మంత్రివర్గంలో శ్యాంప్రసాద్ ముఖర్జీకి స్థానం కల్పించినప్పటికీ, హిందూ మహాసభను, ఆరెస్సెస్‌ను చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు.
నెహ్రూకు ఉన్న ప్రతిష్ట అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుంది. ఆయన మరణించిన సమయంలో 'ద ఎకానమిస్ట్' అనే పత్రిక ''వరల్డ్ విదౌట్ నెహ్రూ'' అనే శీర్షికను పెట్టగా, 'ద న్యూయార్క్ టైమ్స్' ఆయనను ''నవభారత నిర్మాత''గా పేర్కొంది. కానీ, హిందూ మహాసభ, ఆరెస్సెస్‌ల ఆలోచనా విధానంలో మార్పు రాలేదు, పైగా ఆయనను ద్వేషించాయి. ఎందుకంటే ఆయన యొక్క భారతదేశ భావన, ఆరెస్సెస్ వారి హిందూ రాజ్య స్థాపన అనే కలలకు అడ్డుగా నిలిచింది. ప్రతీ సంవత్సరం భారతదేశం 'నెహ్రూ ఆలోచనా మార్గం' పై చేస్తున్న ఖర్చు, వారి కలలు నిజం కావు అని తేల్చింది. అందుకే ఆరెస్సెస్, హిందూ మితవాద శక్తులు నెహ్రూను అయిష్టపడడం, ప్రజాస్వామిక, లౌకిక భారతీయ భావనను వ్యతిరేకించడం మాత్రమే కాక, వారిని అలక్ష్యం చేసి, తలక్రిందులు చేయాలని కోరుకుంటాయి. ఆరెస్సెస్ శిక్షణ పొందిన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నెహ్రూను పలుకరించే లౌక్యం ప్రదర్శించేవారు. అది కూడా 2014లో మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హౌంమంత్రి అమిత్ షాలు ద్వేషభావాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు తమ ముసుగును తొలగించారు. వారు ఒప్పుకున్న విధంగా వారి బృందం లక్ష్యం ''కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని సృష్టించడం'', కానీ ఇది రాజకీయ ప్రతిపక్షాన్ని దాటి పూర్తిగా ధ్వంసం దిశగా వెళ్లింది. అంటే నెహ్రూ, గాంధీ కుటుంబాలను అపకీర్తిపాలు చేయడం, దురదృష్టం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం పర్యాయంగా మారడం, నెహ్రూ పాలనా కాలంలో చేసిన కార్యక్రమాలను తోసిపుచ్చడం, నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన వ్యక్తిగత జీవితంపై మచ్చ తెచ్చే విధంగా ప్రచారం చేయడం, అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో ఆయన జ్ఞాపకాలను అగౌరవ పరచడం వారికి పరిపాటిగా మారింది.
నెహ్రూ ఆలోచనా విధానాన్ని చెరిపి వేసి, స్వాతంత్య్ర భారతదేశ చరిత్రను తిరగరాయడం వారి ప్రధానమైన ఎజెండా. కానీ ఈ రెండు అనివార్యంగా పరస్పర సంబంధితాలు. ప్రజాస్వామ్యం కన్నా నిరంకుశంగా వ్యవహరించే ఒక ప్రభుత్వంలో పాలకుల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదు. హిందూ రాజ్య స్థాపనను సవాల్ చేయడాన్ని మసకబరచే రివిజనిస్ట్ ఉద్యమంలో భాగమే ఐసీహెచ్ఆర్ పోస్టర్. ఈ సంస్థ కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన ఒక విభాగం. జలియన్‌వాలా బాగ్‌ను ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మార్పు చేయడం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏకైక మతఛాందస తీవ్రవాదంగా ''జీహాదీ టెర్రరిజం'' అనే కోర్సును ప్రవేశపెట్టడం లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
నెహ్రూ కోరుకున్న భారతదేశం యొక్క మన సమిష్టి జ్ఞాపకాలు, ఆయనకు సంబంధం ఉన్న సంస్థలు, వ్యవస్థలను చెరిపి వేసే ఏకైక ఎజెండా లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. నెహ్రూను, ఆయన ఆలోచనలను మసకబరిచే యోచన కేవలం ఐసీహెచ్ఆర్ పోస్టర్‌కే పరిమితం కాకుండా నిర్మాణాలకు, పూర్వకాలపు దస్తావేజులకు, సంస్థలకు, వర్గాలు, ఇతర అనేక విభాగాలకు విస్తరిస్తుంది. మితవాద పాఠ్య పుస్తకంలో, విద్యను తిరిగి రాయడం, చరిత్రను తిరగరాసేందుకు చాలా కీలకమైన అంశం. వ్యక్తిత్వాలను మసకబరచడం లేదా ఉన్నతంగా కీర్తించడం, రివిజనిస్ట్ చరిత్రను తెలియజేయడం అనేవి వారి ఈ చర్యలకు ఆధారపడే అంశాలు. అక్బర్‌ను మసకబరచడం ద్వారా తన విరోధి అయిన రాణాప్రతాప్ హాల్దీఘాటీ యుద్ధంలో విజేతగా ప్రత్యక్షమయ్యాడు. పాఠ్యాంశాలలో మహాత్మా గాంధీని అప్రధానమైన వ్యక్తిగా మసకబరుస్తూ, ఆయన హంతకుడైన నాథూరామ్ గాడ్సేను దేశభక్తునిగా కీర్తిస్తున్నారు. వీ.డీ. సావర్కర్ భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయ్యాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ను మాత్రం బ్రిటిష్ వారు ''పెంచి పోషించిన బిడ్డ''గా పిలుస్తారు.
బీజేపీ ఉద్దేశాలపై ముఖ్యంగా నెహ్రూ వారసత్వం పట్ల మోడీ-షాల ద్వయం ఉద్దేశాలపై ఇప్పటికీ చర్చించాలనుకునే వారు ఈ ఎజెండాను కోల్పోయారు. ఈ బీజేపీ యోచన విజయవంతం అయిందా, లేదా అనేది ఒక చర్చించదగిన విషయం. ఇక్కడ పొసగని విషయం ఏమంటే, రాజకీయ ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గాంధీ కుటుంబం, పౌర సమాజాల నుండి ఎటువంటి ఉత్సాహం లేకుండా, అనాసక్తతతో ఉంటూ, తాత్కాలిక ప్రతిస్పందనలకే పరిమితమవు తున్నాయి. తరతప్రస్తుత ప్రభుత్వం కన్నా దేశం పురాతనమైనది, పెద్దది అనే విషయాన్ని భారతదేశంలోని రాజకీయ ప్రతిపక్షం తెలుసుకోవాలి.
సుదీర్ఘ కాలంపాటు ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో ఒక ప్రధాని యొక్క ఆలోచనలను చెరిపి వేసేందుకు జాతి చరిత్రను తిరగరాసే చర్య మంచి జోస్యం చెప్పదు. కానీ, ప్రతిపక్ష పార్టీలు ఇతర గొడవల్లో నిమగమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యకరంగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీపైన అరుస్తూ కోపోద్రిక్తులవుతుంటే కొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు. బహుశా, నెహ్రూ ఆలోచనలకు అనుకూలంగా ఉంటే పాలకుల దృష్టిలో నేరస్థులమవుతామని వారు భయపడుతుండవచ్చు. నెహ్రూ వారసత్వం భారతదేశ చరిత్రలో ఒక భాగం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆ వారసత్వాన్ని కాపాడేందుకు, దానిని స్వంతం చేసుకునేందుకు మార్గాలను వెతకాలి.
నెహ్రూ గాంధీ కుటుంబాలకు నెహ్రూ గురించి మాట్లాడే హక్కు సహజంగానే ఉంటుంది, కానీ తన తల్లీ, చెల్లి కంటే కూడా, రాహుల్ గాంధీనే తన ముత్తాత గురించి మాట్లాడడం లేదు. నెహ్రూ జ్ఞాపకాలను ఒక క్రమపద్ధతిలో చెరిపి వేసే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఆ కుటుంబానికి ఉంటుంది. వారి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ నెహ్రూను గురించి యువతరానికి తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. భావజాలపరంగా హిందూత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, ఆఖరికి బీ.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల భావాలను, బీజేపీ ఎందుకు ఉపయోగించుకుంటుందో నెహ్రూను ఎందుకు అగౌరవ పరస్తుందో తేలికగానే గుర్తించవచ్చు. నెహ్రూ కోసం, అంతే సమానంగా భారతదేశ చరిత్ర కోసం ఈ భారాన్ని మోయాల్సిన బాధ్యత కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రెండింటిపై ఉంటుంది.
పౌర సమాజంతో మాట్లాడటం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. నెహ్రూ పాలనా కాలంలో, నెహ్రూ ఆలోచనా విధానంతో నిర్వహించబడిన సంస్థల ద్వారా లబ్దిపొందిన వారు కూడా నెహ్రూ విధానాలపై ఇతరులతో చర్చించడానికి, సవాల్ చేయడానికి అయిష్టంగా ఉంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ, లేక గాంధీలు ఆ విషయాలపై సంభాషిస్తే, కనీసం పౌర సమాజంలోని ఒక వర్గం వారికి మద్దతిస్తారు. నెహ్రూను అంచనా వేసే అన్ని వేదికలు ఇవ్వజూపిన అవకాశాలను స్వీకరించాలి.
ఒకవేళ బీజేపీ భారతదేశ చరిత్రను తిరగరాసినా, అది అంత తేలిగ్గా స్పృశించలేని అంతర్జాతీయ రికార్డులు, చరిత్రలు ఉన్నాయి. అన్ని రికార్డుల నుండి స్వాతంత్య్ర భారతదేశంలోని మొట్టమొదటి 17 సంవత్సరాలను కొట్టివేయకుండా నెహ్రూను చెరిపి వేయలేము. ఆరెస్సెస్, బీజేపీల హిందూ రాజ్యస్థాపన లక్ష్యానికి నెహ్రూను చెరిపి వేయడం చాలా కీలకమైన అంశం. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దీనిని జార్జ్ ఆర్వెల్ ''1984''లో, ''వర్తమానాన్ని అదుపు చేసే వారు గతాన్ని అదుపు చేస్తారు, గతాన్ని అదుపు చేసే వారు భవిష్యత్తును అదుపు చేస్తారని'' చక్కగా వివరించాడు.
(''న్యూస్ క్లిక్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్,
- స్మతీ కొప్పీకర్
సెల్: 9848412451