Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మకం..! నమ్మకం కాదు, కాదు.. కాదు, అమ్మకం! అమ్మకమే. సెల్లింగ్, బేచ్నా - అదే నమ్మకాన్ని వమ్ము చేస్తూ అమ్ముతున్నారు. అమ్మయితే ఇంట్లోవి ఏవీ అమ్మనిచ్చేది కాదు. ఓసారి పక్కన ఉన్న జాగా, అవసరాల నిమిత్తం అమ్మాల్సివస్తే, అన్నం తినకుండా దు:ఖపడింది అమ్మ. ఆ స్థలంపైన నడయాడిన గుర్తులను యాది చేసుకుని కుమిలిపోయేది. అమ్మను చూస్తే మాకు ఏడ్పు వచ్చేది. రెక్కలు ముక్కలు చేసుకుని ఇగురంగ ఉన్నదాంట్లోనే ఇంత పొదుపు చేసుకుని ఎన్నోయేండ్లుగా సమకూర్చుకున్న ఫలం కదా అది! అవును కష్టపడ్డవాడికి తెలుస్తుంది దాని విలువ. వాడికే ఉంటుంది దానిపై నిజమైన ప్రేమ. కేవలం ఆస్తిపైన ఉన్న ప్రేమకాదు. అనుబంధంపై ఉన్నది. దాని ఆధారంగా ఉండే భవిష్యత్తుపై బెంగతో అమ్ముకోవడానికి తల్లడిల్లుతారు. ఎందుకంటే అమ్మకమంటే కోల్పోవడమే.
మరి నువ్వేమిటి తల్లీ! ఇలా ఒక్కొక్కటే బేరానికి పెట్టేస్తున్నావు. అమ్మకతనం మూర్తీభవించిన మంత్రిలా అన్నీ అమ్మేస్తూ పోతున్నావ్! నువ్వే కాదులే నీ బృందమంతా అమ్మకరాయుళ్ళేకదా! అమ్ముతున్నవన్నీ తమవేనన్న బాధ వీళ్ళకు లేదు. ఎందుకంటే ఈ దేశపు స్వాతంత్య్రం కోసం, స్వేచ్ఛ కోసం, భారతమ్మను దోపిడీ చేస్తున్న బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన గుండెల వారసత్వం వీళ్ళది కాదు కదా! నేలను, సంపదను కాపాడుకోవడం కోసం రక్తతర్పణ చేసిన త్యాగాల వారసత్వం వీరికిలేనేలేదు కదా! పోనీ ఈ సంపద సృష్టి కోసం ఒక్క చెమటబిందువైనా విడిచిన చరిత్ర లేనివాళ్ళు. వాళ్ళది కాక, వాళ్ళ వల్ల సృష్టీకాక, దానిపై ప్రేమో, అనుబంధమో, అమ్మరాదనో ఎందుకుంటుంది? మా తెలివితక్కువ తనం కానీ, అమ్మడంపైననే ఆధారపడి, అమ్ముడుపోవడంలోనే ఘనత వహించిన వీళ్ళ లాంటివారుగాక ఇంకెవరు చేయగలరు ఇలాంటి పనులు. దేశభక్తి నినాదాల వెనక, దేశభక్తి ప్రవచనాల వెనక ఇంతింత అమ్మకపు శక్తియుక్తులు దాగున్నాయని పసిగట్టలేని అమాయక ప్రజలు భారతీయులు! దేశ భక్తి రసాలు కాలువల్లా పారిపారి స్వాములు, బాబాలు, యోగులు, భోగుల ముసుగేసుకున్న చీకటి వ్యాపారాల మార్కెటు శక్తులకు సాగిలపడుతున్న మిమ్ములను చూసి, ఆ ఒంటిపై కప్పుకున్న కాషాయాన్ని చూసి దయార్థ్ర హృదయులనుకున్న ఉదార జీవులీ జనులు.
గురజాడ అన్నట్టుగా దేశమంటే మనుషులే కాదు సంపద కూడా. ఈ మనుషులు చెమటోడ్చి సృష్టించిన సంపద కూడా. ఆ సంపదను అమ్మడమంటే దేశాన్ని అమ్మడమే. కార్పొరేట్లూ, పెట్టుబడిదార్లూ సంపదను సృష్టిస్తారన్న మీ వాక్కే నిజమైతే సృష్టించుకోమనండి. వీటినెందుకు అప్పనంగా అందిస్తారు? గత డెబ్భై ఐదేండ్లుగా ప్రజల శ్రామికుల శ్రమ ఫలితంగా ఎదిగిన దేశ సంపదను, అమృతోత్సవం పేర వేలానికి వ్రేలాడదీస్తారా? బేరానికి పెడుతున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తారా? తల్లి భారతి స్తన్యాన్ని అమ్మకానికి పెడతారా? ఈ కృత్యాన్నే దేశభక్తి అంటారా? ఇది దోచిపెడుతున్న భక్తి. దోపిడీశక్తులకు ఊడిగం చేస్తున్న భక్తి. అధికారం కోసం ఆదాయాల్ని సమకూర్చుకుంటున్న భక్తి. సిగ్గు కూడా సిగ్గుపడుతున్నది మీ భక్తిని చూసి.
ఎంత నిర్భయత్వం ఎంత నిస్సిగ్గుతనం! ఇంతక్రితం ఏదైనా ఓ ప్రభుత్వ సంస్థను అమ్మాలంటే, అది నష్టాల్లో కునారిల్లుతోందనే నెపమైనా వేసేవారు. కుక్కను చంపటానికి పిచ్చిదని పేరయినా పెట్టేవాళ్ళు. లాభాల ఫలాలు కనపడుతున్న సంస్థలను అమ్మటానికి కొద్దో గొప్పో సిగ్గుపడేవాళ్ళు. ఇంత నిర్లజ్జగా డెబ్భైఐదేండ్ల స్వాతంత్య్రాన ఎవరూ ధైర్యంగా వేలానికి పూనుకోలేదు... సరికదా ఆ మాటను చెప్పటానికి కొద్ది కొద్దిగానైనా జంకేవారు. అయితే వీళ్ళ ధైర్యాన్ని సాహసాన్ని, తెగింపునూ చూసి వాళ్ళు కొంత ఆత్మన్యూనతకు గురవుతున్నారు. తమ బలహీనతకు దు:ఖపడుతూ మేమెందుకు ఈ ధైర్యం చేయలేకపోయామని వేదనా పడుతుండవచ్చు. ఇంత క్రితం కొన్నింటిని అలా అలా ఎవరికంటా పడకుండా, ఇంట్లో వస్తువులు అమ్ముకొని డబ్బులు జేబులో వేసుకునే ఇంటోడి లానే చిన్నగా అమ్మేసేవారు. ఇప్పుడు ఆ రకమైన శషభిషలేమీలేవు. ఒకటి, రెండూ అనే ముచ్చటే లేదు. 'అరేక్ మాల్ అగ్గువ సగ్గువ అందుకోండి, మీ కోసమే ఇవన్నీ' అన్న చందంగానే అమ్మకాల దేశభక్తి స్తోత్రం మైకుపట్టుకుని మరీ గొంతెత్తి చెబుతున్నారు.
'ఇదిగో రోడ్లు, రహదారులు. వేల వేల మైళ్ళు... నున్నని మెరుపులతో నిర్మించిన దారులు, అన్నీ మీకోసమే అందుకోండి. మీ దారుల్లోనే, దయా దాక్షణ్యాలతోనే ఇకమేమంతా నడుస్తాం నడుస్తాం' అంటూ రోడ్లను కూడా ప్రయివేటుకు అప్పజెప్పటంలోనే మనదారి ఎటు మళ్ళిందో తెలిసిపోతుంది. నేల దారులే కాదు, గాలి విమానాలనూ వేలం వేసేసారు. ఎయిర్‌పోర్టులకు జాతి నాయకుల చిహ్నాలే ఉండవిక, ఆదానీ, అంబానీలే ఆదర్శపురుషులై దర్శనమిస్తుంటారు హౌర్డింగులపై వేలాడుతూ. గాలిలో గమ్యాలు చేరుస్తారో! గగనాన వొదిలేస్తారో! కాచుకోండి జనులారా! ప్రయివేటుకు లాభాలు తప్ప, బాధ్యతలు ఉండవని బాగా గుర్తుంచుకోవాలి. ఇక లక్షల కోట్లతో విరాజిల్లుతున్న, లాభాలలో అగ్రగామిగా ఉన్న, అశేష ప్రజల జీవితాలకు పూచీపడుతున్న ఆశాజ్యోతి, ఇంతకాలం తన రెండు చేతుల మధ్య ఆరిపోకుండా కాపాడిన ప్రాణదీపాన్ని జీవిత భీమారంగాన్ని తులసినీళ్ళుపోసి తరలిస్తున్నారు. వేలాదిగా పనిచేస్తున్న ఉద్యోగుల బతుకుల్ని కసాయి చేతికి శ్రమకోర్చి అందిస్తున్నారు. ప్రజల భరోసాకు చరమగీతం పాడుతున్నారు. బంగారు బాతును కసికసిగా కోసేస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ.. సామాన్యులను, సామాన్లను, సరుకుల్ని గమ్యాలకు చేరవేస్తున్న వేలాది మైళ్ళ ప్రయాణ సామర్థ్యపు మెయిలు. దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల ఆదాయవనరు. లాభాల రైలునూ పట్టాలనూ జంక్షన్లనూ ప్రయివేటు చేతుల్లో పెట్టేసాక, ఇక బోగీలన్నీ ఉన్నోళ్ళకు రిజర్వు చేయబడతాయిరా నాయనా! సరుకుల ధరలన్నీ బుల్లెట్ ట్రైన్ వేగంతో పరుగెడతాయి. ప్రయాణానికి మనకింకేదీ మిగల్దుగాక మిగలదు. చెప్పుకోవటానికే సిగ్గేస్తోంది. ఓడరేవుల్ని, పడవ పయనాల్ని గుండుగుత్తగా అమ్మేస్తున్నారు. ఇప్పుడు బీమిలి సముద్రపు ఒడ్డున, చెన్నయి మెరీనా బీచ్లోన సముద్రాన్ని చూస్తూ కవిత్వమై ఉప్పొంగడం కలగా మిగిలిపోనుంది. ఖరీదు కడితేగాని అలలు ఎగిరిపడని పాడు కాలం దాపురించింది మనకు. మనదే ఇదంతా అనే మాటలు ఇక ఇసుకపై రాసుకున్న రాతలై సముద్రాన కలిసిపోతాయి. ఎంతయినా చలం, శ్రీశ్రీలు అదృష్టవంతులు. ఇక మత్స్యకారులు దినసరి కూలీలుగా వేశాలు మార్చుకోవాల్సిందే.
మంచిలో చెడో, చెడులో మంచోగాని ఆనాడు దేశంలోని అనేక బ్యాంకులను జాతీయం చేసి ప్రజల సంపదగా మారిస్తే, ఈనాడు బ్యాంకులనూ అమ్మేస్తున్నారు. ప్రజల సొమ్మును కార్పోరేట్ల గల్లాల్లో ఉంచి రక్షణ కల్పిస్తారట! కళ్ళప్పగించి చూడండి. దేశంలోని ఆడిటోరియాలన్నింటినీ, ఆటస్థలాలనూ, కంటెయినర్లనూ, విద్యుత్తునూ, గిడ్డంగులనూ అన్నీ ప్రయివేటువాళ్ళకే కానుకలుగా సమర్పిస్తున్నారు. అంతెందుకు మహారాష్ట్రలో శివాజీ టర్మినల్‌ను ఆదానికి ఆసాంతం అమ్మేసాక, అది అదాని టర్మినల్‌గా పేరు మార్చేసుకుంది. మిత్రోం! ఆప్నే శ్రద్దాసేసునో! చత్రపతి శివాజీని హిందూ రాజుగా సమయం దొరికినప్పుడల్లా తెగపొగిడి గొంతు చించుకునే వాళ్ళే ఈ నికృష్టపు దౌర్భాగ్యపు పనికి పూనుకుంటున్నది. తెలుగు వారి గుండెలన్ని నినదించి సాధించిన సంస్థ విశాఖ ఉక్కు ఇప్పుడిది ఆంధ్రుల హక్కు కాదు. అమ్మకానికి పెట్టిన సరుకు. 'మీరు తలక్రిందికి పెట్టి తపస్సు చేసినా అమ్మకాన్ని ఆపేదేలేదని' కుండ బద్ధలు కొట్టి మరీ అంగట్లో ప్రయివేటు ముంగిట్లో పెట్టేస్తున్నారు ఉక్కునూ హక్కునూ. వీళ్ళ దేశభక్తి గంగలో కలవ, దేశాన్ని రక్షించే రక్షణరంగాన్ని ప్రయివేటుగాళ్ళకు అప్పజెప్పి, దేశ అంతర్గత భద్రతా వ్యవస్థను బహిరంగ రహస్యంగా మార్చేయటం చూస్తుంటే భక్షక భక్తి తప్ప దేశభక్తి ఇసుమంతయినా కనిపించని దేహాలు వీళ్ళవి. నిత్యం రాజకీయ రామజపం చేసేవీళ్ళు రామాలయ భూమినీ వొదిలేయలేదు సుమా! వారి అమ్మకపు మనస్సును నిరూపించుకున్నారు. ఎన్నని చెప్పాలి. 'జియో' వాడి కోసం మన బీ.ఎస్.ఎన్.ఎల్.ను ముక్కలు ముక్కలు చేసి కుప్పలు పెట్టి, ఉద్యోగులకు ఉద్వాసన పలకటం, ఇంతకు ముందు ప్రభుత్వాల కంటే ఎంతో ఉత్సాహంగా చేసిన అమృతహాస్తాలు వీళ్ళవి. స్వతంత్ర భారతదేశం ఏడున్నర దశాబ్దాలుగా అనేక శ్రమలకోర్చి నెలకొల్పుకున్న సంపద్వంతమైన సంస్థలన్నింటినీ బరాబర్‌గా అమ్మేస్తామని చెప్పటానికి, అమ్మటానికి వీళ్ళకున్న హక్కేమిటి? ఎవడబ్బ సొమ్మని తెగనమ్ముతున్నారు. వీళ్ళకు అధికారమిచ్చింది ఐదేండ్లు ప్రజలకు, ప్రజాసంపదకు కాపలా కాయమని, చాతనైతే అభివృద్ధి కోసం పనిచేయమని, ఐదేండ్ల అధికారానికొచ్చిన వీళ్ళు డెబ్భైయిదేండ్ల ఆస్తుల్ని అమ్మడం దుస్సాహస చర్య. ఏమని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు? ఎన్నికల వేళ ఇవన్నీ చెప్పారా? మాట్లాడితే 'లీజు'కిస్తున్నామని గలీజు అబద్ధాలు వల్లిస్తారు. ఎన్నేండ్లకు ఇస్తున్నావు లీజుకు? ఇప్పుడు అంతా మింగేసి ఆ తర్వాత నష్టాలొస్తున్నాయని వాళ్ళు చేతులెత్తేసి నోరెళ్ళబెడితే, కరిమింగిన వెలగపండును తిరిగి తీసుకుంటావా? ఏం చెబుతున్నారు బుర్రలేని కథలు! ఊరికినే తలలూపే వెర్రివెంగళప్పలా ప్రజలు! మీకు తెలుసా.. ఈ దేశపు పురాణాలలోని హరిశ్చంద్రుని కథ. మాట మీద నిలబడటం కోసం, సత్యం తప్పకూడదని, పెళ్ళాం, పిల్లల్ని, సర్వాన్ని అమ్ముకున్నాడు. మీరేమో అసత్యాలు పలుకుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆస్తులు స్వాహా చేస్తున్నారు. మళ్ళీ అధికారం చేజిక్కించుకునేందుకు ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. మాటలు ఘనం, చేతలు శూన్యం. మాటల్లో నీతి సూత్రాలు, చేతల్లో అవినీతి కుతంత్రాలు.
ఇక వీళ్ళిప్పుడు ప్రజా పాలనా నేతలు కాదు, సేల్స్ రిప్రజెంటేటర్స్. మన ఓట్లతోనే గద్దెనెక్కి, మన భవిష్యత్తుకు తూట్లు పొడుస్తున్న ద్రోహ చిత్తులు, వారి అమ్మకాలకు అడ్డుగానున్న దేనినీ ఖాతరు చేయరు. ఆఖరికి రాజ్యాంగాన్ని కూడా. అందుకే అంబేద్కర్ అందించిన ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తినే తుంగలోతొక్కే యాలని చూస్తున్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరమయ్యాక రాజ్యాంగం కల్పించిన బడుగు బలహీన సామాజికవర్గాల చేయూత కోసం ఏర్పరచిన రిజర్వేషన్లు అప్రకటితంగానే మాయమవుతాయి. ఈ సారాన్ని దళిత, వెనుకబడిన అశేష సామాజిక వర్గాలు అప్రమత్తమై ఆలోచించాలి. ఆస్తులమ్మి సంక్షేమాన్ని చేపడతామనే మాయమాటల్ని కనిపెట్టాలి. కొండనాలికకు మందేసి ఉన్న నాలికను ఊడబెరికే ఊసరవెల్లుల రంగులు పసికట్టాలి. లక్షల కోట్ల రైటాఫ్‌తో బడాబాబులకు లబ్దిచేకూర్చే సేవకులు, వేలకోట్లతో విలాస వంత విస్టాలు నిర్మించే నాయకులు సామాన్యుల సంక్షేమం - రైతు కంట్లో కారం, గ్యాసు బండ భారం, శ్రామికులకుస్వేదం, నిరుద్యోగ శోకం, అత్యాచార పర్వం. ఇదే వారి పాలనం.
ఇప్పటికయినా మేల్కోవాలి. అమ్మకపు దారుల అధికారాన్ని అడ్డుకోకపోతే నిన్నూ, నన్నూ మనందరినీ వేలానికి పెడతారు. అమ్మేస్తారు. కండ్లు తెరచిచూడాలి. మనమంతా పోగేసుకున్న దాన్ని తెగబడి అమ్మేస్తున్నారు. మేథావులారా, శ్రామికులారా, ఆలోచనా పరులారా దేశభక్తి జెండా కప్పుకున్న తోడేళ్ళ గుంపుని పసిగట్టండి. నిజమైన దేశభక్తితో భారతమ్మను రక్షించండి. మీరు ప్రశ్నలు ఎక్కుపెడితే సామాన్యులు ఓటు తూటాను పేల్చుతారు. హక్కుల పతాకలై వెల్లువెత్తుతారు.
- కె. ఆనందాచారి
సెల్: 9948787660