Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నగా ఉంటే ఎంత స్లిమ్ముగా ఉన్నారు ఏమేమి తింటున్నారని అందరూ అడుగుతారు. అదే కొంచం లావుగా ఉంటే ఎవ్వరూ అడగరు. మా మిత్రుడు మాత్రం లావుగా ఉన్నా ఏమేమి తింటారని ఒక కొత్త వ్యక్తిని అడిగాడు. ఆయన సీరియస్‌గా చూసి వెళ్ళిపోయాడు. ఎందుకురా అడిగావు ఒక వేళ కొడితే ఎంత సిగ్గుపోయేది ఐనా ఎవరన్నా స్లిమ్ముగా ఉంటే అడుగుతారు కాని లావుగా ఉన్నోళ్ళను అడగడం నిన్నే చూశాను అంటే తన సమాధానం తమాషాగా ఉంది. అతను తినేవేమిటో తెలిస్తే అవి మానేయవచ్చని చెప్పాడు. ఆ విధంగా స్లిమ్ముగా ఉండేవాళ్ళే కాదు మందంగా ఉండేవాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా. ఒకరి దగ్గర మంచిని చూస్తే ఇంకొకరి దగ్గర బాగా లేనిది చూడాలంటాడు పైన చెప్పుకున్న మిత్రుడు. కాబట్టి మనం మన మెదడులోని మందమైన ఆలోచనలను తగ్గిస్తే దేన్నుంచయినా మంచిని స్వీకరించొచ్చు.
మందమన్నది దేనిలోనూ మంచిది కాదు. ఒక చిత్రకారుడు బొమ్మ వేస్తున్నాడనుకుందాం. కలుపుకున్న రంగులు మందమైతే కుంచె కదలదు. గోడకు కొట్టే సున్నం మందమైతే ఫినిషింగు రాదు. ఇలా ఎన్నో చెప్పొచ్చు. ఆఖరుకు శరీరంలో ప్రవహించే రక్తంలో చెడు కొవ్వు ఎక్కువైతే రక్తం మందమై గుండె రోగాలొస్తాయి. అందుకే దీనితో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మందమైన దానిని పలుచగా చేస్తూ ఉండాలి. సోమరుల శరీరం మందమై పోతూ ఉంటుంది, పనిచేసేవాళ్ళ ఒళ్ళు సన్నబడుతూ ఉంటుంది. అదే ఆరోగ్యాన్ని చూపిస్తుంది మనకు.
యాది అంటే మతి మందమైనోళ్ళు ఇంకో రకం. ఇది ఇంకా భయంకరమైన కేసు అనుకోవాలి. అసలు శరీరం, మెదడు రెండూ కలిస్తేనే మనిషి. అందుకని ఇవి రెండూ వేరని చాలామంది అనుకుంటారు. మొదట పెయ్యి మందమయ్యాక యాది కూడా మందమవుతుంది ఎక్కువమందిలో. అసలు మొదటినుండీ మందమతులు ఉండొచ్చు కూడా. వాటికి కారణాలు వేరే. సోమరిపోతు తనం వల్ల శరీరం, మతి మందమయిన వాళ్ళ గురించే ఇప్పుడు మాట్లాడుకునేది. ఈ చర్మం మందమోళ్ళు ఇతరుల తిట్లను అదేదో దీవెన లాగ భావించి నవ్వుతారు. ఒక పక్క ధరలు పెరుగుతున్నారు, పెట్రోలు మరీ పెరిగిపోతోంది, ప్రభుత్వ సంస్థలు మూసేస్తున్నారు అని ఎంత గగ్గోలు పెట్టినా చెవిలో కర్ణభేరి కూడా మందమయ్యుంటుందేమో అస్సలు పలకరు. వినబడనట్లు నటిస్తారు కూడా.
పూర్వం పక్క ఊళ్ళో మంచి అబ్బాయి ఉన్నాడని తెలిసి ఓ పెద్దమనిషి వచ్చాడంట చూసిపోదామని. ఇంట్లో అబ్బాయి తండ్రి ఉన్నాడు. నేను ఫలానా పనిమీద వచ్చాను మీ అబ్బాయిని చూసి పోదామని, పిలిపిస్తారా అన్నాడట. అప్పుడు తండ్రి అంటే అబ్బాయి తండ్రి వాడా అచ్చోసిన ఆంబోతులాగా ఉంటాడు, ఊరుమీద పడి తిరుగుతుంటాడు, ఊళ్ళొ ఎవరినడిగినా చెబుతారు పోయి అడగండి అన్నాడట. మావాడి ఎడ్రెస్సు చెట్టు కింద పేకాట ఆడుతున్నవారిలో ఉండొచ్చు, ఒకవేళ అక్కడ లేకపోతే వారినడిగితే ఇంకో చెట్టు చూపిస్తారు అక్కడ కనుక్కోచ్చు అని కూడా చెప్పాడనుకొండి, ఇక అమ్మాయి తండ్రి సీదా తమ ఊరికి వెనక్కి పోవచ్చు. అలా తయారుకావడానికి కారణం స్వయంగా సోమరిపోతులవ్వడం కావచ్చు, లేదా ఇంట్లో గోము చేయడమైనా కావచ్చు. వాడు అలా కావడానికి కారణం నీవంటే నీవని తల్లిదండ్రులు రోజూ కొట్లాడుకోవచ్చు. ఇంట్లో ఇంత జరుగుతున్నా సదరు సోమరి వానపడుతున్నా చలించని దొన్నపోతులా హాయిగా నిద్రపోనూ వచ్చు. లేదా మీరు కొద్దిగా సైలెంటుగా ఉంటే కాస్త నిద్రపోతాను అని కూడా అనొచ్చు. ఇలాంటివాళ్ళు కూడా మనం చెప్పుకునే క్యాటగిరీ కిందికే వస్తారు.
మొన్న వాట్సప్‌లో ఒక సందేశమొచ్చింది. సంపాదించడానికి పరుగులు పెట్టాలి, సంపాదించి తిన్నది అరగడానికి కూడా పరిగెత్తాలన్నది దాని సారాంశం. ఇక పోతే మన చుట్టుపక్కల చూస్తే కడుపులో ఉన్న కొవ్వును అరగదీయడానికి మనుషులు నానా ప్రయత్నాలూ చేస్తుంటారు. మార్నింగు వాకులు, జిమ్ములు, జాగింగులు, ఇలా ఎన్నో. అక్కడికీ పొట్ట తగ్గకపోతే పెద్ద పేగును కోసి, కొవ్వు తీసేసి, తక్కువ తినడం కోసం పేగుకు కుట్లు వేయించుకునే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండే దొరకదు అని మన సినారె ఒక సినిమాలో పాట రాశారు కూడా. వీటన్నింటికి కడుపులో ఉన్న మందమే కారణమని మనం తెలుసుకోవాలి.
డబ్బు సంపాదించే విషయంలో ఈ మందానికి చోటే లేదసలు. సంపాదించిన కొద్దీ ఇంకా ఇంకా సంపాదించాలనిపిస్తుంది జనాలకు. దేశంలోని బ్యాంకుల్లో, విదేశాల్లోని బ్యాంకుల్లో ఎంత సొమ్ము ఉన్నా ఇంకా కావాలి. ఉన్న సొమ్ము చాలక బ్యాంకుల్లో అప్పులు తీసుకొని, దాన్ని ఎగ్గొట్టే ఒక రకమైన మంద శరీరులు కూడా మనకు కనిపిస్తారు. అలా సంపాదించిన దానిలోనుండి భార్యకు, పిల్లలకు విమానాలు, ఇంకా మంచి బహుమతులు పుట్టిన రోజులప్పుడు కొనిస్తారు. ఇవన్నీ మీడియాలో చూసి మనకు కళ్ళు తిరుగుతాయి. ఈ మందమైన వాళ్ళకు, అంతకంటే ముఖ్యమైన రాజకీయ మందం కలవాళ్ళు తమ స్వామి భక్తిని ప్రదర్శించి వాళ్ళకు సర్వ విధాలా లాభాలు చేకూర్చి వారికి కావలసిన అందమైన పనులు చేస్తుంటారు. ఇంతకుముందు ఓ సారి అలా పోగుపడ్డ డబ్బు, అది పెంచే మదం, మందం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలు. అలాంటి మందమైన శరీరము, ఎవరిమాటా వినని మొద్దుబారిన మెదడూ ఉన్నవాళ్ళు కష్టజీవుల శ్రమను పిండుకునే వాళ్ళే కాని వారినుండి ఏమీ నేర్చుకోరు.
ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. సన్నగా ఉన్నా సోమరిలా ఏ పనీ చెయనివాళ్ళు, లావుగా ఉన్నా ఉత్సాహంగా ఇచ్చిన పనేదైనా చేసేవాళ్ళు అన్ని చోట్లా ఉంటారు. కాబట్టి ఒంటిలోని మందమే కాకుండా మెదడులోని మందం కూడా ఒక్కొక్కరిని ప్రభావితం చేస్తుంది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మనిషిని అంచనా వేసే ముందు రూపాన్ని మాత్రమే చూసి నిర్ణయించొద్దన్నది సారాంశం.
- జె. రఘుబాబు
సెల్:9849753298