Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్ట్ గౌరీలంకేశ్‌ను 2017 సెప్టెంబర్ 5న అసాంఘిక, అప్రజాస్వామిక మతోన్మాద శక్తులు కాల్చి చంపాయి. నాలుగేండ్లు కాలం గడిచిపోయింది, కానీ 'న్యాయం' ఇంకా నిదురపోతూనే ఉంది. అందుకే గౌరీతో పాటు దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ లాంటి ప్రజాస్వామిక వాదుల హంతకులు నేటికీ దొరకడం లేదు. ఈలోగా నిజాయితీ పరులైన మరికొందరు జర్నలిస్టులు గౌరీలంకేశ్ లాగే హత్యకు గురయ్యారు, అందులో గులాం రసూల్, పింగళి దశరధరామ్లు ఉన్నారు.
ప్రముఖ పత్రికా సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్లుగారి మాటల్లో పత్రికల్లో పారదర్శకత అనేది పూర్తిగా తగ్గిపోయింది. వార్తా పత్రికలలో ఎంత స్వేచ్ఛ ఉందో, పత్రికా రంగంలో నిజాయితీగా పనిచేసే ఏ జర్నలిస్టుని అడిగినా చెబుతారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన మీడియా కూడా ప్రభత్వం ఒత్తిడితో దాని ప్రభావంతో చాలా భారంగా కాలం వెలుబుచ్చుతున్నది. పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకుండా, తమకు సహకరించని ఎలక్ట్రానిక్ మీడియానైతే వారి ప్రసారాలను అడ్డుకొని కొనసాగించిన ప్రభుత్వ నిర్బంధాలను అర్థం చేసుకోనివారు ఎవరూ ఉండరు. గౌరీలంకేశ్కి ఈ పరిస్థితులు ఏవీ లేకుండానే, చిన్న వారపత్రికను నడిపినప్పటికీ మతోన్మాద శక్తుల ఘాతుకానికి బలికావల్సి వచ్చింది. స్వతంత్ర మీడియా సంస్థ ''ద హూట్' రూపొందించిన 'ఇండియా ఫ్రీడం రిపోర్టు 2017' ప్రకారం... భారతదేశంలో పాత్రికేయ వాతావరణం గణనీయంగా క్షీణించింది.
పాత్రికేయుల హత్యలు, దాడులు, దౌర్జన్యాలు అనేకం జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో మీడియా మీద నిషేధాజ్ఞలు, అనుమతి నిరాకరణ వంటి చర్యలు కూడా జరిగినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛలో భారతదేశపు స్థానాన్ని గమనించడం ఏమాత్రం సంతోషం కలిగించదనడంలో ఆశ్చర్యం లేదు. పాత్రికేయులను హత్య చేయడం, వారి మీద దాడులు చేయడం, నిర్బంధించడం, అరెస్టు చేయడం, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వారి మీద నిషేధం విధించడం వంటి సందర్భాలను పత్రికా స్వేచ్ఛ మీద నేరుగా దాడిగా గుర్తించగలం. అయితే సమాచారాన్ని సేకరించకుండా అడ్డుకోవడం, సంబంధిత ప్రభుత్వాధికారులను కలవనీయకుండా చేయడం వంటి సంఘటనలు కూడా ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛని హరించేవే అని గుర్తించాలి. భారతదేశంలో మీడియా నాలుగో మూలస్తంభంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నా... చరిత్రను గమనిస్తే, ఆ పాత్రని ఏమంత నిలకడగా పోషించినట్లు కనిపించదు. ప్రశ్నించకపోవడం, భిన్నాభిప్రాయాలు ఉన్న చోట ఒకే అభిప్రాయాన్ని అందించడం అనే లక్షణాన్ని ఈ మధ్యకాలంలో ప్రస్ఫుటంగా గమనించవచ్చు. భారతదేశంలో పత్రికా సమావేశాలు లేదా ప్రకటనల ద్వారా చట్టబద్ధంగా సమాచారాన్ని సేకరించే అవకాశాలను మృగ్యం చేయడానికీ, పత్రికా స్వేచ్ఛ ఉన్న పరిస్థితికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రభుత్వ విధానాలను నిలదీసే ప్రశ్నలు వేసి, వాటిలో ఉన్న లోటుపాట్లను బహిర్గతం చేయడమే పాత్రికేయుల కర్తవ్యం అని అధికార వర్గం విస్మరించినప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2017 సెప్టెంబర్ 5న తన ఇంట్లోకి అడుగు పెట్టిన గౌరీలంకేశ్‌ను హత్యచేసిన హంతకుల బుల్లెట్లు ఆమెను హత్య చేయడానికే పరిమితం కాలేదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే, ఆధిపత్యం చెలాయిస్తున్న భావాల పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తే, సామాజిక రుగ్మతలపై పరిశోధన కొనసాగిస్తే, అవినీతిని ఎండగడితే హత్యచేస్తామని పరోక్షంగా హెచ్చరిక చేశాయి. హత్యలతో ఆలోచనలను నియత్రించాలను కోవడం ఫాసిజం అవుతుంది. కాని ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజస్వామ్యం నిలబడుతుందని గౌరీలంకేశ్ హత్య తర్వాత వచ్చిన ప్రజా ఉద్యమం నిరూపించింది. దళితులు, మైనారిటీల హక్కులకు భంగం కలిగించే వారిని బహిరంగంగా విమర్శించడం గౌరీలంకేశ్ స్వభావం. లంకేశ్ తండ్రి పి.లంకేశ్ కన్నడ పత్రిక లంకేశ్ ద్వారా టాబ్లాయిడ్ పత్రికలకు ఒరవడిదిద్దారు. ఆ పత్రిక ద్వారా బలమైన, సవిమర్శనాత్మకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు. తండ్రి మరణించిన తర్వాత గౌరీలంకేశ్ సొంతంగా గౌరీలంకేశ్ పత్రిక ప్రారంభించారు. అత్యంత శక్తివంతులనుకునే వారిని సైతం ఆమె నిర్మొహమాటంగా ఆ పత్రికలో విమర్శించే వారు. ఆమె నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీ యొక్క అప్రజాస్వామిక విధానాలను విమర్శ చేశారు. అదే సమయంలో కర్నాటకలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వదిలి పెట్టే వారు కాదు. ఆమె అధికార పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీసేవారు.
గౌరీలంకేశ్ హత్య పత్రికా రచయితలను, సామాజిక కార్యకర్తలను, అసమ్మతి వ్యక్తం చేసే వారిని ఆందోళనకు గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆమె కన్నడ పత్రికను ప్రారంభించడానికి ముందు ఇంగ్లీషు పత్రికలలో పని చేశారు. ఆమె పత్రిక నడుపుతూనే రాష్ట్రంలో అనేక చోట్ల పర్యటించే వారు. ఆమె మీద అనేక పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. అందులో రెండు సందర్భాలలో ఆమెకు శిక్ష కూడా పడింది. ఏమైనప్పటికీ భారతీయ మీడియాలో గౌరీలంకేశ్ సాహసోపేతమైన వ్యక్తి. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు శక్తివంతంగా ఉన్నందువల్ల యాజమాన్యాలు అంగీకరిస్తే తప్ప వ్యక్తిగతంగా పత్రికా రచయితలు బలసంపన్నుల బండారాన్ని పరిశోధించి బయట పెట్టడం సాధ్యం కాదు. కార్పొరేట్ సంస్థలకు, రాజకీయ అధికారానికి విభజన రేఖ దాదాపు లేదు కనుక అలాంటి పత్రికా రచయితలు ఉండడమూ అరుదే. అందువల్లే ఆర్థిక వ్యవస్థ నుంచి విదేశీ వ్యవహారాలు, అంతర్గత ఘర్షణల దాకా అధికారంలో ఉన్న వారు చెప్పేదే వాస్తవంగా విశ్వసించాల్సి వస్తుంది. భిన్న స్వరం వినిపించే పత్రికలు అరుదు. అందుకే గౌరీలంకేశ్ పత్రిక లాంటివి విశిష్టంగా కనిపిస్తాయి. అవి చిన్నవి, స్వతంత్రమైనవే అయినా తోసిపుచ్చగలిగేవి కావు. శక్తివంతమైన వారు మీడియాకు లంచాలు ఇవ్వజూపినప్పుడు, దుడ్డుకర్రతో బాదాలని చూసినప్పుడు ఇవి ఎంత చిన్న పత్రికలైనా తమ గళాన్ని చాలా బిగ్గరగానే వినిపిస్తాయి. ఈ పత్రికలకు మరే దన్నూ లేనందువల్ల అవి రాజ్యానికున్న అపారమైన శక్తికే కాక, రాజ్యంతో సంబంధం లేని శక్తులకు కూడా బలౌతాయి.
హేతువాది ప్రజాస్వామిక వాది డా|| ధబోల్కర్తో మొదలైన మతోన్మాద హత్యలు పన్సారేను, 82ఏండ్ల ప్రొ. ఎం.ఎం. కల్బుర్గీని అదే క్రమంలో గౌరీలంకేశ్‌ను కూడా పొట్టన బెట్టుకున్నాయి. బహిరంగంగా ఇప్పుడు హత్య చేయొద్దనుకున్న వాళ్ళను భీమా కొరేగాం లాంటి తప్పుడు కుట్ర కేసులలో ఇరికించి అరెస్టు చేసి ఏండ్లకు ఏండ్లు జైల్లో నిర్బంధించి బెయిల్ రాకుండా చేసి, అనారోగ్యంతో హత్య చేస్తున్నారు. దానికి ఫాదర్ స్టాన్‌స్వామి హత్య తిరుగులేని ఉదాహరణ. అధికారంలో ఉన్న ప్రభుత్వాలే హత్యలు చేస్తున్నాయి. ప్రశ్నించడంలో పలుకుబడి ఉంటే, ఒక నిర్మాణ రూపంలో విస్తరిస్తే అలాంటి సంస్థలను వ్యక్తులను నిశ్శబ్దం చేయడానికి ఊపా లాంటి అప్రజాస్వామిక నిర్బంధ చట్టాన్ని విరివిగా వాడుకున్నారు. మేధావుల, బుద్ధిజీవుల జీవించే హక్కును చాలా కఠినంగా రద్దు చేస్తున్నారు. హత్యలే లేని సమాజం కోసం హంతకులను శిక్షించే వరకు మనందరం ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచే విధంగా ఆచరణలో కొనసాగుదాం.
(గౌరీలంకేశ్ వర్థంతి సందర్భంగా)
- ఎన్. నారాయాణరావు