Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దు కుంటుంది'' అని డాక్టరు కొఠారి 1964-66లో విద్యా కమిషన్ ఛైర్మన్‌గా తన రిపోర్టులో చెప్పారు. దేశ భవిష్యత్తును తరగతి గదిలో రూపొందించేవారెవరు? ఉపాధ్యాయులే. డాక్టరు కొఠారి గారే ఇంకోమాట కూడా చెప్పారు. ఉపాధ్యాయుని ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే, అతనికి సామాజికంగా గౌరవం ఉంటుంది. అప్పుడే మంచి విద్యను అందించే అవకాశముంటుందన్నారు. 1990 దశకంలో అక్షరాస్యత ఉద్యమం జరిగే సందర్భంలో ఒకపాట గొప్పప్రాశస్త్యం పొందింది. ''చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతె మన భవిత పెద్ద సున్నా.'' ''విద్య-వైద్యం ఉచితంగా ఇవ్వండి చాలు ఇంకే ఉచితాలు అవసరం లేదని'' డా|| బి.ఆర్. అంబేద్కర్ చెప్పారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యత ఇది. అట్టి చదువు మంచిగా ఉండాలంటే, మంచి ఉపాధ్యాయులుండాలి. ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయుల స్థితిగతులు, విద్యారంగ పరిస్థితులను ఒకసారి పునరావలోకనం చేసుకునే సందర్భం కూడా.
సెప్టెంబర్ 5, మన దేశానికి రెండవ రాష్ట్రపతి, గొప్ప ఆచార్యుడు డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు. వారి కోరికమేరకు సెప్టెంబర్ 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సన్మానిస్తున్నారు. భారతదేశంలో బాలికల విద్య కొసం మొట్టమొదట కృషి చేసిన మహనీయురాలు సావిత్రీబాయి పూలే. వీరి పుట్టిన రోజు జనవరి 3న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సమంజసమనే అభిప్రాయం కూడా ఉన్నది.
ఉపాధ్యాయులు కూడా ఈ సమాజంలోనే నివసిస్తున్నారు. సమాజంలోని అన్నిరకాల ప్రభావాలు ఉపాధ్యాయులపై ఉంటాయి. కొందరు ప్రభావాలకులోనై వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించనివారు కూడా నేడు మనకు కన్పిస్తున్నారు. మంచి ఉపాధ్యాయులను గుర్తించి, ప్రోత్సహించే విధంగా... వృత్తి ధర్మం నుంచి ప్రక్కకు జరుగుతున్న ఉపాధ్యాయులను గాడిలో పెట్టే విధంగా ''ఉపాధ్యాయ దినోత్సవాన్ని'' నిర్వహించినట్టయితే, విద్యారంగం అభివృద్ధికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కానీ, జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఒక తంతుగా కొనసాగుతుంది. ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన గ్రహితలలో అర్హులకు, అనర్హులకు కూడా చోటు దక్కుతుంది. అత్యంత అర్హులైన ఉపాధ్యాయులు ఈ తంతుకు దూరంగా కూడా ఉంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవానికి ఎంపిక కావాలంటే ఉపాధ్యాయులు, తమకు తామే అధికారులకు దరఖాస్తులు పెట్టుకోవాలి. దీనివలన కూడా కొంత మంది మంచి ఉపాధ్యాయులు గుర్తింపునకు నోచుకోవటం లేదు. ఏమైనా మంచి ఉపాధ్యాయుల ఎంపికలో మార్పు రావాలి. ''ఉపాధ్యాయ దినోత్సవం'' నిర్వహణలో కూడా మార్పు రావాలి. ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఎందుకు ఎంపికైనారో ఒక బ్రోచర్ వేసి కార్యక్రమంలో పంచాలి. వేదిక నుంచి కూడా మంచి ఉపాధ్యాయులు తమ తమ విద్యా సంస్థలలో చేసిన కృషిని రేఖామాత్రంగానైనా చెప్పాలి. అప్పుడు మాత్రమే ఉపాధ్యాయ వర్గం స్ఫూర్తి పొందే అవకాశముంటుంది.
'బతకలేని బడిపంతులనే' నానుడి మన సమాజంలో ఉన్నది. కానీ, నేడు ''బతికే బడిపంతులు, అట్టట్ట బతుకే బడిపంతులు, బతకలేని బడిపంతులు'' అనే మూడు రకాల ఉపాధ్యాయులు మనకు కన్పిస్తారు. ఇదెలా? నేడు విద్యా సంస్థలలో రెగ్యులర్ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు ఉపాధ్యాయులు, పార్ట్‌టైం ఉపాధ్యాయులుంటారు. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఈ నాలుగు దొంతరల ఉపాధ్యాయులున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు మాత్రమే బతికే ఉపాధ్యాయులు. వీరి జీతాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ధరలు పెరిగినప్పుడు డియర్నెస్ అలవెన్సు పేరిట వీరికి జీతం కొంత పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు పన్నెండు నెలలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అందువల్ల వీరు అట్టట్ట బతుకుతున్నారు. ఇక గెస్ట్ ఉపాధ్యాయులకు, పార్ట్‌టైం ఉపాధ్యాయులకు ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. అది కూడా విద్యాసంస్థలు పనిచేసినప్పుడు మాత్రమే ఇస్తారు. వేసవి సెలవుల్లో రెమ్యునరేషన్ ఉండదు. ఆ కాలంలో అడ్డమీద పనిచేసుకోవాలి. ఇంక పాఠశాలల్లో విద్యావలంటీర్ల పేరుతో ఖాళీ పోస్టులలో సంవత్సరానికి సంవత్సరం నియామకాలు చేస్తారు. వలంటీరంటే స్వచ్ఛందంగా పనిచేసేవారనే అర్థం కదా! నా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసులో ఏ ఒక్కరూ ఉన్నతాదాయ వర్గం వారు స్వచ్ఛందంగా వచ్చి బడిలో చదువు చెప్పిన సందర్భంలేదు. ఉన్నత చదువులు చదువుకొని, ఏ ఉపాధి లభించని అల్పాదాయ వర్గాలవారే విద్యా వలంటీరుగా పనిచేశారు. వారికి ప్రభుత్వం ఇచ్చే రెమ్యునరేషన్‌నే జీవనాధారం. ఆచరణలో విద్యావలంటీర్ అనే పేరు అర్థరహితం. విద్యా సంస్థలలో పైన పేర్కొన్న నాలుగు రకాల ఉపాధ్యాయులు ఒకే గదిలో (స్టాఫ్ రూమ్) కూర్చొని తమ విద్యా సంస్థ స్థితిగతులు, తమ విద్యార్థుల ప్రమాణాల గురించి చర్చించే వాతావరణముంటుందా? ఇదంతా ప్రభుత్వ విద్యా సంస్థలలోని పరిస్థితి.
డాక్టరు కొఠారే చెప్పారు. కేంద్ర బడ్జెట్లో 10శాతం రాష్ట్రాల బడ్జెట్లో 30శాతం విద్యకు కేటాయింపులుండాలని. కేంద్ర బడ్జెట్లో ఏనాడు కూడా 4శాతం మించలేదు. ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014-15 నుంచి కేంద్ర బడ్జెట్లో విద్యకు కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు 2.8శాతం మాత్రమే. నూతన విద్యా విధానము 2020 అమలు చేస్తున్నాం, అన్ని స్థాయిలలో నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రసంగాలలో ప్రగల్భాలు పలుకుతుంటారు. ఆచరణలో విద్యకు బడ్జెట్ కేటాయింపులు అట్టడుగుకుపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. 2014-15 నుంచి 2020-21 వచ్చే సరికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గిపోతున్నాయి. అన్ని శాఖల కేటాయింపులు కలుపుకున్నా 13శాతం దాటడం లేదు. తెలంగాణలో చదువు చర్చవస్తే, ప్రభుత్వ పెద్దలు గురుకులాల ప్రస్తావనే తెస్తారు. తెలంగాణలో కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థుల సంఖ్య 75లక్షలకు పైగా ఉంటుంది. గురుకుల విద్యా సంస్థలలో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థుల సంఖ్య నాలుగు లక్షల యాభై వేలకు మించదు. 75లక్షల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి విద్యపై నిర్థిష్టమైన చర్చ జరగలేదు. రోజురోజుకు ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రయివేటు విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య 12శాతం మించదు. కానీ, భారతదేశంలో 40శాతం పైగా విద్యార్థులు ప్రయివేటు విద్యా సంస్థలలో చదువుకోవలసిన దుస్థితి. తెలంగాణలో పాఠశాల విద్యలో 53శాతం, ఇంటర్, డిగ్రీ విద్యలో 75శాతం, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యలలో 90శాతం విద్యార్థులు ప్రయివేటు విద్యా సంస్థలలో చదువుతున్నారు. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు (కిలో రూపాయి బియ్యం) మాత్రం 80శాతం మందికి ఉన్నాయి. 80శాతం ప్రజలు దారిద్య్రరేఖ దిగువన ఉన్నప్పుడు ఆ కుటుంబాల పిల్లలందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా! కేరళ రాష్ట్రం నికరంగా 22 నుంచి 25శాతం వరకు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయించడం వల్లనే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, 85శాతం పైగా విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థలలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు 25శాతం కేటాయింపులు చేసి, ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నది. కేంద్రంలో, రాష్ట్రాలలో పాలన చేస్తున్న పాలక పార్టీలకు విద్యపై ఒక విజన్ లేకపోవటం వల్లనే, ప్రయివేటు రంగానికి విద్యను వదిలేస్తున్నారు. సేవారంగంగా ఉండవలసిన విద్యారంగాన్ని తక్కువ పెట్టుబడితో అధికలాబాలనిచ్చే వ్యాపార రంగంగా మార్చివేశారు. ఈ దోరణి మారకుంటే మన చదువులు మారవు. తరగతి గదిలో దేశం భవిష్యత్తు రూపుదిద్దుకునే అవకాశముండదు.
విద్యలో ప్రయివేటురంగానిది తెలంగాణలో సింహభాగం, భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాలలోనూ పెద్ద భాగమే. కానీ, ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలలో ప్రయివేటు ఉపాధ్యాయులకు స్థానం లేదు. దీనిపై చర్చ జరపాల్సిన అవసరమున్నది. కరోనా కాలంలో ప్రయివేటు విద్యా సంస్థల దివాలాకోరుతనం బహిర్గతమైంది. నేను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2015లో రాష్ట్రంలో విద్యాయాత్ర చేశాం. ఆ సందర్భంలో ''ప్రయివేటు విద్యా సంస్థ పెట్టుకున్న వారు చెడిపోలేదు. ఆ సంస్థలో పనిచేసిన వారు బాగుపడలేదు'' అనే నినాదం ఇచ్చాను. ఈ కరోనా కాలంలో ప్రయివేటు విద్యా సంస్థలలో చదివించే తల్లిదండ్రులేమో మా ముక్కుపిండి పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారని అంటుంటే, అందులో పనిచేసే ఉపాధ్యాయులేమో మాకు జీతాలు చెల్లించడంలేదని మొత్తుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి పరిస్థితిని అంచనా వేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తే అతీలేదు, గతీలేదు. ఈ అంశంపై రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించినట్లు కన్పించలేదు.
కేంద్రంలో, రాష్ట్రంలో పాలన చేస్తున్నవారు కావాలనే ఉపాధ్యాయదినోత్సవాన్ని తంతుగా మార్చివేశారు. సమాజ మార్పుకు, సర్వతోముఖాభివృద్ధికి విద్యకు మించిన సాధనం లేదనేది సార్వజనీన సత్యం. ఆచరణలో మాత్రం విద్యపై వ్యక్తిగతంగానే స్పందిస్తున్నారు. ఆచరిస్తున్నారు. ఆర్థిక, సామాజిక అంతరాలు అత్యధికంగా యున్న మన సమాజంలో అన్ని వర్గాల బాల, బాలికలు, యువతీ, యువకులు ఒకే విద్యా సంస్థలో చదువుకున్నప్పుడు మాత్రమే సమాజం అభ్యదయపథంలో అభివృద్ధి సాధిస్తుంది. ఈ మధ్యకాలంలో మెజారిటీ ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఉపాధ్యాయులు ప్రజలతో (తల్లి దండ్రులు) మమేకమై బాల, బాలికలందరికీ మంచి విద్యకై ఉద్యమించవలసిన తరుణం ఆసన్నమైంది. ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఉపాధ్యాయుల ఔన్నత్యం ఇనుమడిస్తుంది.
- ఎ. నర్సిరెడ్డి
సెల్ 9490300678