Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పడిపోవడం కొత్త కాదు
మోకాలు చిప్పలు పగులగొట్టుకోవడమూ కొత్త కాదు
పడిలేవడమే కొత్త-
ప్రపంచ పోలీసు తోకముడిసినంతనే
యుద్ధం ముగుసిందనుకోకు-
మధ్యయుగపు మతవాద విషనాగు
పడగవిప్పి ఆడుతోంది-
లే... ఆఫ్ఘాన్... లే
దారి తప్పిన విద్యార్థిని దండించేందుకు
లే... ఆఫ్ఘాన్.. లే
నువ్వు కలల మజిలీవి
కాబూలీ కథల మజిలీవి
వేల సంస్కృతుల సంగమ స్థలివి
జాతి వలసల ఆశ్రిత ఒడివి
అలెగ్జాండర్ అరబ్బు మౌర్య మంగోలు
చంఘిజ్ ఖాన్ మహా సామ్రాజ్యాల కేంద్రానివి నువ్వు కాందహార్
మానవ మహిమాన్విత పరాక్రమ ప్రతీక నువ్వు పంజిషీర్
వేరీజ్ మై నేమ్‌లో ఆఫ్ఘాన్ నువ్వున్నావు
పుస్తూన్ చారిత్రిక వికాసాల్లో నువ్వున్నావు
హిందూకుష్ ధగధగ జ్వలనాల్లో నువ్వున్నావు
జొరాష్ట్రియన్ పురిటినొప్పుల్లో నువ్వున్నావు
పస్తూ, దారి పదనిసల విన్యాసాల్లో నువ్వున్నావు
కళలు ఉల్లారబోసిన పర్షియా తివాచీవి నువ్వు
బౌద్ధం వికసించిన బమియాన్ విగ్రహానివి నువ్వు
సామ్రాజ్యమై విలసిల్లిన దుర్రానీ ముత్యానివి నువ్వు
మహాసౌర్ వీర విప్లవ జ్వాలవు నువ్వు
లే.. ఆఫ్ఘాన్.. లే
జీవితమే యుద్ధమని ఎలగెత్తి చాటినదానివి నువ్వు
మహా సామ్రాజ్యాల వల్లకాడువి నువ్వు
దొంగలు దోచిన కల్లంలాంటి దేహాన్ని వదిలి
వంచక కాగితపు పులి పారిపోయింది
గుంటనక్కలు పొంచి కూచున్నవి
ఒక భుజానికి ఆయుధం అందించి
మరో భుజం మీద అభయ హస్తం వేసి
అన్నీ తానై నీ వెన్నంటి నిలిచిన
అలనాటి మిత్రుడు లేడని బెంగపడకు.
వియత్నాం క్యూబా చిలీ కొలంబియా మెక్సికో
ఇరాన్ ఇరాక్ సిరియా టర్కీ పాలస్తీనా
నీ కోసం పిడికిళ్ళు బిగించి చూస్తున్నవి
లే... ఆఫ్ఘాన్... లే
నీ ప్రజల అవినీతి వ్యతిరేక హృదయ స్పందనలోంచి
పంజీషీర్ పరాక్రమ విజయపరంపర పథాల్లోంచి
పఠాన్ మాటల ముక్కుసూటి స్వచ్ఛతలోంచి
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని మట్టికరిపించిన బాక్జాయి వీరత్వంలోంచి
లే... ఆఫ్ఘాన్... లే
నాగరికతల మధ్య యుద్ధమన్నాడు వాడు
పీడితులకు, పీడకులకు మధ్య యుద్ధమిది
ఆధిపత్యపు ఆంక్షలకూ, సార్వభౌమౌత్వానికి మధ్య యుద్ధమిది
లే... ఆఫ్ఘాన్... లే
శత్రువు స్పష్టంగనే వున్నడు
ఒకడు సరిహద్దుకావల
ఒకడు సరహద్దుకీవల
లే... ఆఫ్ఘాన్... లే
మట్టికాళ్ళ మహారాక్షసిని మట్టుబెట్టేందుకు
మతశాసిత నియంతత్వ సంకెళ్ళు తెంపుకునేందుకు
లే... ఆఫ్ఘాన్... లే
(దేశమంటే మట్టి కాదు
దేశమంటే పాలకులూ కాదు
నాకు ఆఫ్ఘాన్ అంటే ఆ నేల నాగరికత మీద మొలిచి
తరతరాలుగా నిలిచిన గడ్డి పువ్వులు....
తాలిబాన్ అనగా విద్యార్థి)
-డాక్టర్ కాసుల లింగారెడ్డి