Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రైతాంగ సాయుద పోరాట యోదులు, కల్లుగీత కార్మిక సంఘం మాజి రాష్ట్ర అధ్యక్షులు బైరు మల్లయ్య మరణించి నేటికి సంవత్సరం అవుతుంది. వారి స్వస్థలం నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం, ఔరవాణి గ్రామం. 7వ తరగతి వరకు ఉర్ధూ మీడియం చదివారు. చిన్నతనం నుండే దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు తత్వం గల మనిషి. గ్రామ చావడిలో దొరలు కూర్చుండేచోట తన తమ్ముడు కూర్చున్నాడని దొరలు కొట్టడంతో మల్లయ్య దొరలపై దాడికి సిద్ధమైనాడు. 12ఏండ్ల వయస్సులో ఏడాదిపాటు హైదరాబాద్‌లో ఉన్నాడు. అప్పుడే కమ్యూనిస్టులతో సంబంధాలు ఏర్పడ్డాయి. గ్రామానికి తిరిగి వచ్చిన మల్లయ్య బాలసంఘంలో చేరి బాలలను సమీకరించాడు. సాయుధ దళాలకు కొరియర్‌గా పనిచేస్తూ ప్రధానంగా ఆయుధాలు సమకూర్చేవాడు. క్రమంగా ఉద్యమాలలో బాగస్వామి అయ్యాడు. స్వాంతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.
ప్రధానంగా స్థానిక కల్లుగీత కార్మికులను సమీకరిస్తూ సమస్యలపై ఆందోళన చేసేవారు. క్రమంగా జిల్లా గీత సంఘం నాయకుడిగా అభివృద్ధి అయ్యారు. 1975 కల్లు గీత కార్మిక సంఘం నల్గోండ జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 2 దశాబ్ధాలకు పైగా గీతకార్మికుల్లో పనిచేశారు.
1975 ఆగస్టు 25న నెల్లూరులో అన్ని జిల్లాలనుండి వచ్చిన గీతకార్మికులతో సదస్సు జరిగింది. రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘాన్ని పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కల్లుగీత సంఘం సంబంధాలు, నిర్మాణం ఉంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో బలంగా ఉన్నది. రాష్ట్ర సంఘం నిర్వహణకు ఇక్కడనుండే నాయకత్వం రావాలని నల్లగొండ జిల్లానుండి బైరు మల్లయ్య, తొట్ల మల్సూర్, బిక్షం, కొండ నాగులు తదితర 10మందిని గుర్తించారు. 1978 ఆగస్టు 25న హైదరాబాద్ జైన్ భవన్లో 3వ రాష్ట్ర మహాసభ జరిగింది.
రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో నల్లగొండ జిల్లా ఉద్యమమే విస్తృతమైనది. ప్రతి సమస్యపై గీతకార్మికులను కదిలించేవారు. దాని నాయకుడిగా బైరు మల్లయ్య కృషి చెప్పుకోదగ్గది. మహాపూజ్ (తాటి, ఈత చెట్లను రిజర్వు చేయడం) విధానం గీతకార్మికుల మెడపై కత్తిలా వేలాడేది. రాష్ట్రంలో తాటి, ఈత చెట్లు ప్రధానంగా భూస్వాముల భూముల్లోనే ఉండేవి. ప్రతి గ్రామంలోని భూస్వామి కల్లు ముస్తాజరు (కాంట్రాక్టరు)గా ఉండేవారు. భూస్వాముల ఫ్యూడల్ దోపిడీ పెత్తనాన్ని వ్యతిరేకించిన గీత కార్మికులను లొంగదీసుకోవడానికి మహాపూజ్ విధానాన్ని ఒక ఆయుధంగా భూస్వాములు ఉపయోగించేవారు. దీనికి వ్యతిరేకం గా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. రాష్ట్రవ్యాప్త ఉద్యమంద్వారానే ప్రభుత్వం దీనిని రద్దు చేసింది.
తెలంగాణ జిల్లాల్లో ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ బలమైంది. ఇసునూరు రామచంద్రారెడ్డి 40గ్రామాల్లో వేలాది ఎకరాలు కలిగిన పెద్ద భూస్వామి. ఈ అన్ని గ్రామాల్లోని గీతకార్మికులు వీరు చెప్పినట్లు వినాల్సిందే. ప్రతి గ్రామంలో భూస్వాముల భూముల్లోనే తాటి, ఈత చెట్లు ఉండేవి. వీరి పెత్తనం, దోపిడీ నుండి బయటపడాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం గ్రామ సొసైటీలకే కల్లుషాపులు కేటాయించాలనే ఉద్యమాన్ని నడిపించింది. దీనిలో బైరు మల్లయ్య కృషి మరువలేనిది. సంఘటిత ఉద్యమాల ద్వారా ఆనాటి ప్రభుత్వం 1957-58 ఎక్సైజ్ పాలసీలో కల్లుగీత సొసైటీల ఏర్పాటుకు నిర్ణయించింది. మొత్తం వేలం పాటలను రద్దు చేయకుండా ప్రతి సంవత్సరం కొన్ని గ్రామాలకు మాత్రమే సొసైటీలు ప్రకటించేది. 1994లో వేలంపాటలను పూర్తిగా రద్దు చేశారు. కల్లుగీత సొసైటీలు ఏర్పడినప్పటికీ సొసైటీ వాటి నిర్వహణలోనూ దొరలు, ధనికరైతుల ప్రభావం ఉండేది. మరొక ప్రక్క గీతకార్మికుల్లోనే కులపెద్ద ప్రభావం అధికంగా ఉండేది. వీరే సొసైటీ ప్రెసిడెంటుగా ఉండేది. సొసైటీలను వేలంపాట షాపులాగా నిర్వహించేది. గీతకార్మికులకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ పెత్తందారి తనానికి వ్యతిరేకంగా సంఘం పోరాటం చేస్తూ టి.యఫ్.టి (గీచేవానికే చెట్టు పదకం)ల ఏర్పాటుకు డిమాండ్ చేసి సాదించుకున్నాము. ఆనాడు సీపీయం ఫ్లోర్ లీడర్ నర్రా రాఘవరెడ్డి సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. వారితో బైరు మల్లయ్య అందుబాటులో ఉంటూ గీతకార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో చర్చనీయాంశం అయ్యేవిదంగా చేశారు.
రాష్ట్రంలో మొదటిసారిగా ఎక్స్‌గ్రేషియో
1977లో రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలో ఉంది. కేంద్రంలో మొరార్జీ దేశారు ప్రధానమంత్రిగా రావడంవల్ల దేశంలో మద్యనిషేధం సమస్య మరోసారి చర్చనీయాంశం అయింది. ఆంధ్రరాష్ట్రంలో కూడా మధ్యనిషేదం పెట్టవచ్చుననే చర్చ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, పెద్దగ్రామాల చుట్టూవున్న రెండుమూడు గ్రామాలను కలిపి గ్రూపు విధానాన్ని నిర్ణయించే ఆర్డినెన్సు తీసుకొచ్చింది. చెట్టు పన్ను పెంచారు. ఆనాడు రాష్ట్రంలో కల్లుపైన వచ్చే ఆదాయమే ప్రధానమైనది. సారాయి, బ్రాండీషాపులు పెద్దగాలేవు. కల్లుపై ఆంక్షలు పెట్టి బ్రాండీ, సారా, లిక్కరు సిండికేటులకు ఉపయోగపడేవిదంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంఘం వృత్తికి రానున్న ప్రమాదాన్ని గుర్తించి దీనిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గీతకార్మికులున్న అన్ని గ్రామాల్లో, తాలూకా, జిల్లా కేందాలలో ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించి 1978 ఆగస్టు 25న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టింది. వేలాదిమంది గీతకార్మికులు మోకులు, ముస్తాదులు ధరించి మహా ప్రదర్శన నిర్వహించారు. గీత కార్మికుల వేషధారణ, ప్రతి ఒక్కరికి వెన్నుల నల్లని కాయలు, శీలమడిమలకు గుజ్జిగడ్డలు, చేతిదండలకు నల్లని కాయలు చూసి అందరు ఆశ్చర్యపోయారు. మహా ప్రదర్శన అసెంబ్లీ వరకు చేరింది. సీపీయం ఫ్లోర్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య, సీపీఐ ఫ్లోర్ లీడర్ సీహెచ్ రాజేశ్వరరావు, జనతాపార్టీ ఫ్లోర్ లీడర్ జైపాల్‌రెడ్డి హాజరై ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కి మెమోరాండం ఇచ్చారు. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారు. ప్రమాదకరమైన ఈవృత్తి చేస్తూ, తాటిచెట్ల నుండి మరణించిన, వికలాంగులైన కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్పందించి చెట్టు పన్ను, గ్రూపు జివో రద్దు చేస్తామని, చెట్లపై నుండి పడి మరణించిన వారి కుటుంబానికి రూ.2,000, వికలాంగులైనా వారికి రూ.500లు చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఎక్స్‌గ్రేషియో మెమో 233/పి-78 ఆర్ ద్వారా అమలు జరిగింది. ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాదించిన మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. దీనిలో మల్లయ్య గారి పాత్ర అమోగం.
నిరంతరం ఆందోళనలతో సాధించుకున్న పెన్షన్
కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ 50ఏండ్లు దాటిన గీతకార్మికులకు రూ.1,000లు పెన్షన్ ఇవ్వాలనే నినాదంతో సుదీర్ఘ కాలం పాటు ఆందోళనలు జరిగాయి. 2008-2009లో పింఛన్, ఎక్స్‌గ్రేషియో ప్రధాన సమస్యలుగా ఆందోళనలు సాగాయి. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 50ఏండ్లు దాటిన గీత కార్మికులకు రూ.200లు పెన్షన్ ఇస్తామని ప్రకటించి జీవో నెం.350 విడుదల చేసింది. రాష్ట్రంలో సంఘం నాయకత్వాన వేలాదిమందితో దరఖాస్తులు చేయించాం. 25వేల దరఖాస్తులకు మంజూరు చేసినట్టు ప్రకటించి 20వేల మందికి పెన్షన్ ఇచ్చారు.
బైరు మల్లయ్య ప్రత్యేకంగా గీత కార్మిక సంఘం బాధ్యుడిగా ఉంటూ, యితర రంగాలకు కూడా పని చేసేవారు. నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంఘానికి 1986, 1994 జరిగిన మహాసభల్లో అధ్యక్షులుగా, 1991లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వారు చేసిన కృషి మరువలేనిది. వారి స్ఫూర్తితో గీత కార్మికుల ఉపాదికై నేటి తరం ముందుకు సాగాలి.
(బైరు మల్లయ్య ప్రధమ వర్థంతి సందర్బంగా...)
- కె. వెంకటయ్య