Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న సాధ్వి నిరంజన్ జ్యోతి కేంద్రం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్‌లో పెంపుదల సాధ్యం కాదని పార్లమెంటులో ప్రకటించారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద కేంద్రం ఇప్పుడు 60 నుంచి 79ఏండ్ల మధ్య వయసుగలవారికి నెలకు రూ.200, 80ఏండ్లు పైబడినవారికి నెలకు రూ.500 చొప్పున ఘనమైన (!) మొత్తాలను పెన్షన్‌గా చెల్లిస్తోంది.
దేశంలోని వయోవృద్ధులకు ఇంత హీనమైన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం చెల్లించబూనుకోవడం సిగ్గుచేటు, అవమానకరం కూడా. కనీసం ఈ మొత్తాన్ని ధరలు పెరిగినప్పుడల్లా సవరించే విధానం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా కొంత కలిపి చెల్లిస్తూవుండొచ్చు. కాని అంతా కలిపినా మహా అయితే రూ.500 నెలకు అవుతుంది. తను పని చేసిన సంస్థనుండి ఎటువంటి పెన్షనూ అందే సదుపాయంలేని వయోవృద్ధులకు అందుతున్న నెలవారీ పెన్షన్ ఇది. అది కూడా అర్హత ఉన్న వారందరికీ చెల్లించడం లేదు. ఈ జాతీయ సామాజిక సహాయం పథకం కింద 2016-17లో చెల్లించిన మొత్తం రూ.5900 కోట్లు. ఒక్కో వ్యక్తికి నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తే ఈ సొమ్ము కేవలం 2 కోట్ల 46 లక్షల మంది లబ్దిదారులకు మాత్రమే సరిపోతుంది.
ఈ పథకం కింద పెన్షన్ పొందవలసిన మొత్తం వృద్ధులలో ఈ 2కోట్ల 46 లక్షలు ఒక చిన్న భాగం మాత్రమే. మన దేశంలో 60 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య సుమారు 12 కోట్లు. దేశ జనాభాలో దాదాపు 10 శాతం వృద్ధులు. ఆయా సంస్థలనుండి పెన్షన్ పొందే అవకాశం ఉన్నవారు పోగా తక్కిన వారు సుమారు 10 కోట్ల మంది ఉంటారు. ఒక్క వ్యవసాయ రంగంలోనే 5 నుండి 6 కోట్లమంది ఉంటారని అంచనా. ఈ 10 కోట్లమందిలో నాలుగోవంతు మాత్రమే ఈ సామాజిక పెన్షన్ పొందగలుగుతున్నారు. చెల్లించే మొత్తమే చాలా హీనంగా నెలకు రూ.200 ఉంది. అది కూడా అర్హులలో నాలుగో వంతుకు మాత్రమే అందుతోంది. ఈ కార్యక్రమానికే అర్థం లేకుండా పోయింది.
పౌర సంఘాలన్నీ నెలకు నిర్ణయించిన కనీస వేతనంలో సగమైనా పెన్షన్‌గా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కనీస వేతనం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. కనీసం రోజుకు కనీస వేతనం రూ.300 అని పరిగణించి లెక్క వేయడానికి బహుశా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అప్పుడు నెలవారీ కనీస పెన్షన్ రూ.4,500 ఉండాలి. అయినప్పటికీ చాలా పౌర సంఘాలు కనీసం రూ.3000 పెన్షన్ చెల్లించాలని కోరుతున్నాయి.
ఒక ప్రజాస్వామ్య సమాజంలో వయోవృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత బిడ్డల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసిన పరిస్థితి ఉండకూడదని, అందుచేత వారందరికీ పెన్షన్ చెల్లించేబాధ్యత ప్రభుత్వానిదేనని మనం గ్రహించాలి. పౌరులందరికీ పెన్షన్ ఒక హక్కుగా ఉండాలి. తాము పనిచేసిన సంస్ధలనుంచి పెన్షన్ పొందే అవకాశం లేనివారికి, పని చేస్తున్న కాలంలో వచ్చిన తక్కువ ఆదాయాలలో వృద్ధాప్యంలో అవసరాలకోసం దాచుకోలేకపోయినవారికి ప్రభుత్వమే పెన్షన్ చెల్లించేవిధంగా కేటాయింపులు చేయాలి.
సమాజంలో ఉత్పత్తి అయే సంపదలో ఎవరెవరికి ఎంతెంత వాటా దక్కాలన్నది (ఆ దేశంలో ఆదాయాల పంపిణీ) సామాజికంగా నిర్ణయించబడుతుంది. సమాజమే ఒక వ్యక్తి గౌరవప్రదమైన జీవితం గడపడానికి తగినంత పెన్షన్ అందేటట్టు గ్యారంటీ చేయాలి. సమాజం యొక్క ఈ బాధ్యతను నెరవేర్చేపని ఆ సమాజం ఎన్నుకున్న ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది.
పెన్షన్ మొత్తాన్ని పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నదంటే ఆ ప్రభుత్వం తనకు ఈ సమాజం అప్పజెప్పిన బాధ్యతను నెరవేర్చకుండా తప్పించుకోడానికి చూస్తున్నట్టే అవుతుంది. ఒక కుల వివక్షతో కూడిన భూస్వామ్య సమాజంలో పేదవారిని ఎక్కడుండాలో అక్కడే ఉంచాలని భావించే ఆధిపత్యవర్గ భావజాలం ఉంటుంది. వారికి కనీస జీవన ప్రమాణాలను కూడా నిరాకరిస్తుంది. ఈ ప్రభుత్వం అటువంటి ధోరణినే ప్రదర్శిస్తోంది తప్ప ఒక ప్రజాస్వామ్య సమాజంలోని ప్రభుత్వంగా, పెన్షన్‌ను ఒక హక్కుగా గుర్తించే విధంగా ప్రవర్తించడం లేదు.
పెన్షన్‌ను ఒక హక్కుగా గుర్తిస్తే అప్పుడు దానిని ఏవిధంగా చెల్లించాలి, వనరులు ఎక్కడినుంచి సమీకరించాలి అన్నది ఒక సమస్యగా పరిగణించడానికి వీలు లేదు. వనరులను తప్పనిసరిగా సమకూర్చుకోవలసిందే. ఒక్కొక్కరికి నెలకు రూ.3000 చొప్పున 10 కోట్లమందికి పెన్షన్‌గా చెల్లించాలంటే సంవత్సరానికి రూ.3.6 లక్షల కోట్లు అవసరం. ఇది మన దేశ జీడీపీలో సుమారు 1.8శాతం. ప్రభుత్వం గనుక తన జీడీపీలో 1.8శాతం పెన్షన్ల రూపంలో చెల్లించగలిగితే, ఆ పెన్షనర్లు ఆ మొత్తాన్ని వివిధ సరుకులను కొనుగోలు చేయడానికి, సేవలను పొందడానికి ఖర్చు చేస్తారు. ఆవిధంగా మార్కెట్లోకి వచ్చిన సొమ్ము పలుమార్లు చెలామణీలో ఖర్చు అవుతూ అదనపు ఆదాయానికి దారి తీస్తుంది. ప్రభుత్వం పెట్టిన ఖర్చు చెలామణీ ద్వారా సృష్టించే వృద్ధి సుమారు రెట్టింపు అవుతుందని అంచనా వేయవచ్చు. అంటే 3.6శాతం జీడీపీ వృద్ధి అవుతుంది. జీడీపీలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా సమకూరే ఆదాయం 15శాతం ఉంటుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం అదనంగా 0.54శాతం పెరుగుతుంది. ఖర్చు చేయవలసిన 1.8శాతంలోంచి రాబడిగా వచ్చే ఈ 0.54శాతాన్ని తీసివేస్తే నికరంగా ప్రభుత్వం పెన్షన్లకోసం చేయవలసిన అదనపు ఖర్చు జీడీపీలో 1.26శాతం ఉంటుంది.
ప్రభుత్వం గనుక నిజంగా పెన్షన్‌ను అందరికీ రూ.3000 చొప్పున నెలకు చెల్లించాలని భావిస్తే ఈ 1.26శాతం పెద్ద సమస్య కానేకాదు. మన దేశంలో ప్రయివేటు వ్యక్తుల దగ్గర పోగుబడిన సంపద మన జీడీపీకి నాలుగు రెట్లు కనీసం ఉంటుంది. దేశంలో ఉన్న పెట్టుబడికి, ఉత్పత్తికి ఉన్న నిష్పత్తి బట్టి ఈ కనీస అంచనాకి రావచ్చును. ఈ మొత్తం ప్రయివేటు సంపదలో కనీసం 50శాతం తమ చేతుల్లో ఉంచుకున్నవారు జనాభాలో ఒక్క శాతం. అంటే ఈ ఒక్క శాతంగా ఉన్న వ్యక్తులు దేశ జీడీపీకి రెట్టింపు సంపద కలిగివున్నారన్నమాట. ఈ ఒక్క శాతం వ్యక్తులమీద 0.63శాతం సంపద పన్ను విధిస్తే అది జీడీపీలో 1.26శాతం అవుతుంది. మన పెన్షన్లకు సరిపోతుంది. ఆ మొత్తంతో తమ తమ సంస్థలనుండి పెన్షన్లు పొందేవారు మినహా తక్కిన అందరికీ పెన్షన్లు చెల్లించవచ్చు.
సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి కావలసిన వనరులకోసం సంపద పన్ను అదనంగా విధించాలన్న ప్రతిపాదన ఇటీవల అమెరికాలో ముందుకొచ్చింది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన బెర్నీ శాండర్స్, ఎలిజబెత్ వారెన్ తమ ఎన్నికల ప్రచారంలో సంపద పన్ను పెంపు ఒక అంశంగా ముందుకు తెచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ దేశ ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన కోసం ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెంచే కార్యక్రమాన్ని చేపట్టాడు. అందుకోసం సంపద పన్నును, కార్పొరేట్ పన్నును పెంచాలని నిర్ణయించాడు. కాని ఇక్కడ భారత దేశంలో మాత్రం ఈ నయా ఉదారవాదవిధానాల కారణంగా సంపదల మధ్య వ్యత్యాసాలు విపరీతంగా ఒక పక్క పెరుగుతూ పోతున్నాయి. కాని మరొక పక్క సంపద పన్ను దాదాపు లేకుండా పోయింది. ప్రపంచమంతటా దాదాపు ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు ఈ పరిణామం పట్ల బూర్జువా ఆర్థిక వేత్తలు, సోషల్ డెమాక్రటిక్ ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ సంపద కేంద్రీకరణ ప్రజాస్వామ్య వ్యవస్థ పనికి ఆటంకంగా మారుతుందని భావిస్తున్నారు.
సంపద పన్ను విధించడం ద్వారా పెన్షన్ పథకాలను అమలు చేయడం ఏకకాలంలో మూడు ప్రయోజనాలను నెరవేరుస్తుంది. వయోవృద్ధుల సార్వత్రిక పెన్షన్ హక్కును పరిరక్షిస్తుంది. మాంద్యంలో ఇరుక్కుని సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోడానికి దోహదపడుతుంది. అంతే గాక సంపదలో అసమానతలు పెరగకుండా నిరోధిస్తుంది. (సంపద మీద పన్ను విధించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఖర్చు చేయడం వలన సంపద అసమానతలు ఏమీ తగ్గవు. ఆ అసమానతలు మరింత పెరగకుండా నిరోధిస్తాయి. అంతే)
విషాదం ఏమంటే మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి వ్యతిరేక దశలో ముందుకు సాగుతోంది. అటు అతి హీనంగా ఉన్న పెన్షన్‌ను పెంచడానికి గాని, ఇటు సంపద పన్నును విధించడానికి గాని అది సిద్ధంగా లేదు. అంతటితో ఆగకుండా ఆ సంపన్నులకు మరింత కట్టబెడుతోంది. ప్రజలనుండి వసూలు చేసిన పన్నులతో నిర్మించిన దేశ ఆస్థులను భౌతికంగా పెట్టుబడిదారులకు స్వాధీనం చేసి వారు వాటిని ఉపయోగించుకుని మరింత సంపదను కూడగట్టడానికి దోహదపడుతోంది. అందుకు బదులుగా వారివద్దనుండి రాబడుతున్నది నామమాత్రపు ప్రతిఫలం మాత్రమే. ఈ క్రమానికి పెట్టిన పేరే 'మానెటైజేషన్'. ఈ పదం చాలా తప్పుదోవ పట్టించే పదం. ఉదాహరణకు రైల్వే ప్లాట్ఫారంలను, రోడ్డు పక్క ఖాళీ స్థలాలను ఈ మానెటైజేషన్ పేర పెట్టుబడిదారులకు కట్టబెడితే వాటిని వినియోగించే ప్రజల నుండి ఆ పెట్టుబడిదారులు విపరీతంగా చార్జిలు వసూలు చేసి పీల్చి పిప్పి చేస్తారు. ఆ వనరులు పేదలకు పూర్తిగా అందుబాటులోకి లేకుండా పోతాయి.
ఈ ఆస్థులను పెట్టుబడిదారులు స్వాధీనం చేసుకోడానికి కూడా వారికి పన్ను రాయితీల పేర ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్లాను చేస్తోంది. మోడీ ప్రభుత్వం ఏ వర్గాల సేవలో వ్యవహరిస్తోందో పచ్చిగా బైట పెట్టుకుంటోంది. పేదలకు ఇచ్చే పెన్షన్‌ను పెంచడానికి నిరాకరిస్తూ దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే గాక వారికి పన్ను రాయితీలు కూడా ఇస్తోంది.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్