Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాకళల ప్రయోక్తగా డాక్టర్ గరికపాటి రాజారావు తెలుగునాట సుపరిచితులు. కళ కళ కోసం కాదు, కాసు కోసం కాదు, ప్రజల కోసం ప్రగతి కోసం అనే నినాదానికి ప్రాణం పోసినవాడు. ప్రతి ఏటా ఆయన వర్థంతిని (సెప్టెంబర్ 8) ప్రజా కళల దినోత్సవంగా పాటించి ప్రజా కళలను సమీక్షించుకోవడం పరిపాటి. ప్రజా కళాకారులు కర్తవ్యపథంలో ముందుకడగిడటం ఒక వరవడి.
ప్రజలకు సంబంధించిందంతా ప్రజాకళ కాదు. ప్రజలను చైతన్యపరిచేదే ప్రజాకళ. ప్రజా చైతన్యమంటే ఉద్యమ చైతన్యంగానే పరిగణించవలసి ఉంటుంది. ఉద్యమం అంటేనే ప్రజలు పాల్గొనేది. ప్రజలు అంధయుగం కాలంలో పాల్గొనే మూఢ బలిదాన భక్తి ఉద్యమాల నుండి, భూమికోసం, భుక్తికోసం పీడిత ప్రజ విముక్తి కోసం సాగిన సాయుధ తెలంగాణ రైతాంగ విప్లవోద్యమాల వరకు ప్రతిదీ ఉద్యమంగానే ఉంటున్నది. విరుద్ధమైన భిన్న దృవాల్లాంటి ఈ ద్వంద ఉద్యమాల కొసలు మన సమకాలీన ప్రపంచం కూడ చవి చూస్తున్నది. చంపడం, చావడం వంటి మత ఉగ్రవాద ఉద్యమాలూ మానవ హక్కుల కోసం నిలబడే ప్రజా ఉద్యమాలూ పరస్పరం ఘర్షణ పడటం మనం గమనిస్తున్నాం. ఏది సహేతుకమో, ఏది ప్రజానుకూలమో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఉన్న స్థితి నుండి మెరుగైన ఉన్నత జీవితం కోసం ప్రజలు సామూహికంగా చేపట్టే ఐక్య కార్యాచరణే ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది.
ఉద్యమాల నుండే ఉద్యమ కళలు ఉద్భవిస్తాయి. ఉద్యమ కళలు కూడా ఉద్యమాలను ఉత్తేజపరస్తూ ముందుకు నడిపిస్తాయి. ఇక్కడ ఉద్యమాలు - కళలు పరస్పర ప్రభావితాలు, ఆధారితాలు, ప్రేరితాలు. యాధృచ్ఛికమైనా భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరుగుతున్న తరుణంలోనే 1943 మేలో (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోయేషన్) 'ఇప్టా' ఆవిర్భవించింది.
'సామాజిక అవసరాల నుండి కళ ఉద్భవిస్తుంది. ఆ అవసరాలు తీర్చలేని కళ మృతప్రాయం. నాటకం సర్వకళల సమాహారమే కాదు. సర్వోత్కృష్టమైన కళ. శాస్త్రీయమైన జీవకళ. లోక వృత్తానుకరణం నాటకం. ప్రజల జీవితాలకు దగ్గర ఉండటమే కాదు, జీవితాలనే ప్రతిబింబిస్తుంది. మానవ బహిర్గత అంతర్గత స్వరూప స్వభావాలను విశదపరుస్తుంది. జీవితం ఎలా ఉన్నది? అనేకాకుండా ఎలా ఉండాలి? అని స్వప్నించి యథాతథంగా ఆవిష్కరిస్తుంది. ఇదో సృజనశీల. జాగృత స్వప్నం. సోషలిస్టు సామాజిక వాస్తవికత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల ఆచరణకు ప్రేరణగా గొప్ప గొప్ప కళాకృతులు, ముఖ్యంగా నాటకాలను ప్రజా కళాకారులు సృష్టించాలని' మార్కిస్టుమేథావి హిరేన్ ముఖర్జీ ఆ సందర్భంగా ఇచ్చిన పిలుపు డాక్టర్ రాజారావు వంటివారికి పథనిర్దేశం చేసింది. ప్రజా కళలే ఓ ఉద్యమంలా సాగేందుకు సైద్ధాంతిక బలం చేకూరింది. డాక్టర్ రాజారావు ప్రజానాట్యమండలి వ్యవస్థాపక కార్యదర్శి అయ్యాడు.
అప్పటికే 1934లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి, దైవం కేంద్రంగా నిలిచే అశాస్త్రీయ మాయాజాల భావవాదాన్ని తుత్తునియలు చేసింది. ప్రజలను మూఢత్వంలోకి నెట్టే పుక్కిట పురాణాలను పూర్వపక్షం చేసింది. ఆధునిక సాహితీ కవిత్వాలకు మానవుడినే కేంద్రంగా నిలిపింది. సమ సమాజాన్ని కాంక్షించే సోషలిస్టు వాస్తవికతకు పట్టం కట్టింది.
నరహంతక హిట్లర్ ఫాసిస్ట్ ఉన్మాదంతో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. అంతర్జాతీయ కార్మికోద్యమ సారథ్యంలో ప్రపంచ శాంతి ఉద్యమం ఎల్లెడలా ఇనుమడిస్తున్న కాలమది. ఉద్యమం విస్తరించడంతో పాటు ప్రజల జీవితాల్లో అంతర్భాగం కావడానికి 'కళారూపాలను' మించిన సాధనం మరేదీలేదు. 'హిట్లర్ భాగోతం' కళారూపంలో ఎర్రసైనికునిగా డాక్టర్ రాజారావు తాండవ నృత్యాన్ని చూసినవారు కథలు కథలుగా చెప్పుకునేవారంటే దానికి కారణం, ప్రపంచ రాజకీయాలను ఆ సైద్ధాంతిక కోణంతో అధ్యయం చేయడం వలన ఫాసిస్టు దుర్మార్గంపై తనలో ఏర్పడిన కసి, దానితో పాటు ప్రజల్లో కూడా అదే రకంగా ఉద్రేకం కలిగించాలన్న భావంతో అహౌరాత్రులు అవిశ్రాంతంగా చేసిన సాధనే అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వస్తువు సైద్ధాంతికమైనప్పటికీ, శిల్పం కోసం అప్పటికే ప్రజల్లో అలరారుతున్న జానపద కళను ఆశ్రయించక తప్పదు. డాక్టర్ రాజారావు అదేపనిని ఓ ముఖ్యమైన పనిగా పెట్టుకుని తపస్సులా కృషి చేశాడు. పాటలు, పగటివేషాలు, నృత్యాలు, భజనలు, కోలాటాలు ఆ విధంగా జానపద కళ నుండి ప్రజా కళగా రూపాంతరం చెంది రాజకీయ చైతన్యాన్ని రగిలించేవి.
శారదగాండ్ర తంబుర కథ రాజకీయ బుర్రకథగా పరిణమించింది. కథకునితో పాటు జంట వంతల్లో ఒక వంత ప్రధానంగా రాజకీయం బోధించే పాత్రగా అవతరించింది. ఆ మార్గంలో డప్పువంటి అట్టడుగు వాద్య పరికరం శాస్రీయ జతులు పలికించే మృదంగ స్థాయికి చేరింది. పాటలకే కాదు ఎన్నో సంగీత నృత్య రూపాలకు డప్పు ఆలంబన అయింది. ఇక మా భూమి, ముందడుగు, సీతారామరాజు వంటి నాటకాలు డాక్టర్ రాజారావు నిర్దేశకత్వంలో వర్గ చైతన్యాన్ని పాదుకొల్పేవి.
75ఏండ్ల స్వాతంత్య్రానంతరం మరల అదే ఫాసిస్టు ప్రమాదం ప్రజలను అణచేవిధంగా నేడు ముంచుకొస్తున్నది. ఉగ్రవాదం ఎల్లెడలా కారుమబ్బులా కమ్ముకుంటున్నది. హింసోన్మాదం చెలరేగుతున్నది. రైతులు, కార్మికుల హక్కులు గల్లంతవుతున్నాయి. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ సంస్థలు బాజాప్తుగా కార్పొరేట్ల పరం అవుతున్నాయి. పాలకులు, కార్పొరేట్ శక్తులు, ఉగ్రవాదులు కలగలిసిన ఓ భయంకర విషనాగు పడగనీడలో మనం బతుకుతున్నాం.
ఈ నేపథ్యంలో ప్రజా కళాకారుల ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. 1. ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రజలను కళారూపాలతో సంఘటిత పరచడం. 2. వ్యక్తివాదంతో, స్వార్థ ప్రయోజనంతో కొట్టుకుపోయే కళారూపాలను కాపాడి, నిలబెట్టి ప్రజాపరం చేయడం.
సీపీఐ(ఎం) రూపొందించిన సాంస్కృతిక విధానం అదే చెపుతున్నది. 'శ్రామిక ప్రజల సాంప్రదాయ కళారూపాలను సమర్థించాలి. ఈ కళారూపాలను ప్రస్తుతం పెద్ద పెద్ద మత సంస్థలు, వ్యాపార సంస్థలు పూర్తిగా తమ అదుపులో పెట్టుకుంటున్నాయి లేదా ఆ కళారూపాలు ధ్వంసమైపోతున్నాయి. దీనివలన ఆ కళారూపాలు ప్రదర్శించే వారితో పాటు వాటిని చూసి ఆనందించి, ప్రేరణ పొందే శ్రామిక ప్రజలు తమ సంస్కృతికి దూరమైపోతున్నారు. ఈ కళా రూపాలను ప్రోత్సహించాలి.అప్పుడే తమ సృజనాత్మకతతో ప్రజలకు సేవ చేస్తారు (5.9). డాక్టర్ రాజారావు తన జీవితకాలంలో అదే పనిచేశాడు. అందుకే అతడు మార్గదర్శకుడయ్యాడు.
- కె. శాంతారావు
సెల్: 9959745727