Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆజాదికా అమృత్ మహౌత్సవం పేరుతో సంబరాలను ప్రారంభించారు. అందుకు యాజమాన్యాలు, కార్పొరేట్ శక్తులు కేరింతలు కొట్టాయి. కార్మికులు మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తమపై పడుతున్న నిత్యవసర సరుకుల భారాల దాడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చేసే పనికి భద్రత లేక, పనికి తగిన కనీస వేతనం రాక, నెలవారీ జీతాలకు గ్యారంటీ లేక, ఎలాంటి కార్మిక చట్టాలూ అమలుకు నోచుకోలేక, ఎంతో కొంత ఆసరాగా ఉన్న కార్మిక చట్టాలను సైతం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు కోటి 20లక్షల మందికి వర్తించే కనీస వేతనాల జీఓలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమూ కార్మికులకు అన్యాయం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో 2014, 2016 సంవత్సరాలలో ఏర్పడిన కనీస వేతనాల సలహా మండలి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపినా, ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడకపోయినా యజమానుల ప్రయోజనాల కోసం కనీస వేతనాల పెంపు జీఓలను రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేయడం లేదు. ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో అన్‌స్కిల్డ్ లేబర్ కుటుంబమైనా బతకాలంటే కనీసం రూ.21,000లు వేతనం ఉండాలి. ఐఎల్‌సి 15వ తీర్మానం ప్రకారం కార్మికుడికి రోజుకు 2,700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరం. కుటుంబానికి సంవత్సరానికి 72 గజాల బట్టలు, ఇంటి అద్దె 10శాతం, ఇంధన ఖర్చు 20శాతం, రిటైర్మెంట్ అయిన తర్వాత జీవన ఖర్చులు, పిల్లల చదువు, వైద్యం, సాంస్కృతిక కార్యక్రమాల ఖర్చులు 25శాతం ఉండాలి. కానీ ప్రభుత్వాలు అశాస్త్రీయ పద్ధతుల్లో కనీస వేతనాలను నామమాత్రంగా నిర్ణయిస్తున్నాయి. 2012లో కాంట్రాక్టు లేబర్‌కు నిర్ణయించిన బేసిక్ రూ.5,579లు ఇప్పటికీ కొనసాగుతున్నది. వీరి వేతనాలు యజమానుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటున్నాయి.
కార్మిక సంఘాలు నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగా జూన్ నెలలో ప్రభుత్వం 5 జీఓలను విడుదల చేసింది. జీఓ నెం.21 సెక్యూరిటీ సర్వీసెస్, జీఓ నెం.22 కన్స్‌స్ట్రక్షన్ లేదా మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ Ê బిల్డింగ్ ఆపరేషన్స్, జీఓ నెం.23 స్టోన్ బ్రేకింగ్ Ê స్టోన్ క్రష్షింగ్ ఆపరేషన్స్, జీఓ నెం.24 కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్క్లూడింగ్ డ్యామ్స్ Ê మల్టీపర్పస్ ప్రాజెక్టులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగాలకు జీఓలు ఇచ్చారు. నైపుణ్యం లేని కార్మికుడి కనీస వేతనం రూ.18,019లు నిర్ణయించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిని గెజిట్ చేయాల్సి ఉంది. కానీ ఈ జీఓలు అమలు కాకుండా యజమానులు అడ్డుకుంటున్నారు. సీఐఐ, ఎఫ్టిసిసి తదితర యాజమాన్య సంఘాలు వేతనాలు పెంచితే కంపెనీలు నడపలేమంటున్నారు. ఇది దుర్మార్గం. 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లలో కేవలం 5 రంగాలకే జీఓలు జారీ చేశారు. మిగిలిన 68 ఊసే ఎత్తడం లేదు.
ప్రభుత్వం, పెట్టుబడిదారులు కలిసి కార్మిక వర్గంపై నేడు యుద్ధం ప్రకటించారు. పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కొద్దిమంది పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కోట్లాది మంది కార్మికుల కడుపులు కొట్టే చర్యలకు మోడీ ప్రభుత్వం పూనుకున్నది. అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
భారత రాజ్యాంగం కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, బేరసారాల హక్కు, నిరసన తెలిపే హక్కు కల్పించింది. కానీ నేడు రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో ఉన్న కార్మిక చట్టాలను కనీసం మాట వరుసకు అయినా రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. 12 గంటల పనిని చట్టబద్ధం చేశారు. యాజమాన్యాలకే ఏకపక్షంగా వేతనాలు నిర్ణయించే అధికారాన్ని కట్టబెట్టారు.
ఇండిస్టియల్ డిస్ఫూట్ యాక్ట్ 1947 సెక్షన్ 5బి ప్రకారం 100 మంది, అంతకన్నా పైగా కార్మికులు పనిచేసే పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్ని తొలగించాల్సి వచ్చినా, పరిశ్రమ మూసివేయాల్సి వచ్చినా, లే-ఆఫ్‌లు ప్రకటించాల్సి వచ్చినా పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వం నుండి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. కొత్త లేబర్ కోడ్లలో 300 మందికి పైగా కార్మికులు పనిచేసే పరిశ్రమలకు మాత్రమే ముందస్తు అనుమతి తీసుకోవాలని మార్చారు. రాష్ట్రంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేసే పరిశ్రమలు వేళ్ళపై లెక్కించవచ్చు.
ఇండిస్టీయల్ ఎంప్లాయీమెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946లో 100 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే పారిశ్రామిక సంస్థల్లో స్టాండింగ్ ఆర్డర్స్ తయారుచేసి నోటీసు బోర్డుపై పెట్టాలనే నిబంధన ఉంది. దాన్ని 300 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేసే పారిశ్రామిక సంస్థల్లోనే స్టాండింగ్ ఆర్డర్స్ ఉండాలని సవరించారు. యాంత్రీకరణ, ఆటోమేజేషన్, కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తున్న నేటి ఆధునిక కాలంలో ఉత్పాదక శక్తి పెరిగి కార్మిక శక్తి స్థానాన్ని యంత్రం ఆక్రమించింది. గతంలో 100 మంది పనిచేసిన పరిశ్రమల్లో ఇప్పుడు 10, 15 మందితో అదే ఉత్పత్తి జరుగుతోంది. ఇండిస్టీయల్ రిలేషన్ కోడ్ 2020లో స్టాండింగ్ ఆర్డర్స్‌కి చేసిన మార్పుల వల్ల అత్యధిక పరిశ్రమల్లో కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ కనుమరుగు కానున్నాయి. యాజమాన్యాలు అవసరమైనప్పుడు కార్మికులను పనిలో పెట్టుకోవడం, అవసరం లేనప్పుడు తీసివేయడం హైర్ అండ్ ఫైర్ పద్ధతి అమల్లోకి వస్తుంది.
పి.ఎఫ్కి 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులుండే సంస్థల కార్మికులకే కార్మిక చట్టాలు వర్తిస్తాయి. ఇ.ఎస్.ఐకి 10 మంది అంతకంటే ఎక్కువ, గ్రాడ్యూటీకి 10మంది లేదా అంతకంటే ఎక్కువ, మెటర్నిటి బెనిఫిట్‌కి 10 లేదా అంతకంటే ఎక్కువ, బోనస్‌కి 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులుంటేనే కార్మిక చట్టాలు వర్తిస్తాయి. ఆ సంఖ్యల పరిమితిని ఎత్తివేయాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిమితి వల్ల అత్యధిక మంది కార్మికులు ఈ చట్టాల పరిధిలోకి రావడం లేదు. ఈ సంఖ్యను తగ్గిస్తే అనేకమందికి ప్రయోజనం కలిగేది. ఇప్పుడు ఆ సంఖ్యల పరిమితిని రెట్టింపు చేశారు. 75 శాతం మంది కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుండి గెంటివేయడానికి కసరత్తు చేశారు.
పాత కార్మిక చట్టాలలో కార్మికుడి పని గంటలు, ఓటీ, సెలవులు, భద్రత, ఆరోగ్యాలకు సంబంధించిన నియమ-నిబంధనలుండేవి. వాటిని ఎమర్జన్సీ సందర్భాలలో ఒకటి లేదా అంతకుమించిన నిబంధనలకు గరిష్టంగా 3 నెలల పాటు వెసులుబాటు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త కోడ్ల ప్రకారం ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించిన దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్న కాలం వరకు అంటే ఎంతకాలమైనా ఏదైనా లేదా అన్ని నిబంధనల నుండి మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. ఈ చర్యలు కార్మికుల్ని శాశ్వతంగా బానిసత్వంలోకి నెట్టేందుకే దారి తీస్తాయి.
సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ''కార్మికవర్గ పోరాటాల''ను ఉధృతం చేయాలని, క్షేత్రస్థాయిలో కార్మికులను ఐక్యం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాన్ని నిర్మించాలని కర్తవ్యంగా తీసుకున్నది. ఈ నేపథ్యంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లలో కనీస వేతనాల జీఓలను సవరించి వేతనాలు పెంచాలని, ప్రభుత్వం విడుదల చేసిన 5 జీఓలకు గెజిట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక గర్జన పేరుతో 2021 సెప్టెంబర్ 8 నుండి 30 వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, జరుగుతున్న ఈ పాదయాత్రలో కార్మికవర్గం భాగస్వామ్యం కావాలి. కార్మికులు ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాలి. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కును కాపాడుకోవాలి. కార్మికవర్గం జాగృతమై రానున్న రోజుల్లో కార్మిక చట్టాలను కాపాడుకుంటూ, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జరిగే పోరాటంలో మమేకం కావాలి. అందుకు కార్మిక గర్జన-సిఐటియు పాదయాత్ర నాంది కావాలని ఆశిద్ధాం.
- పి. భాస్కర్
సెల్: 9490098033