Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఫ్ఘనిస్తాన్ పరిణామాలనంతరం తాలిబాన్లను వ్యతిరేకించడమా- సమర్థించడమా? అన్న ప్రశ్న ఈ రోజు అమెరికా వైఖరి పట్ల తటస్థ వైఖరిని ప్రదర్శించిన ప్రపంచ దేశాలను, ప్రజలను వెంటాడుతోంది. భారత ప్రభుత్వానిది మరింత గడ్డు స్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పొరుగు దేశాలు అఫ్ఘనిస్తాన్‌ను బలపరుస్తుంటే మన సంగతేంటి అని ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకున్నారు. ఇన్నాళ్లుగా అమెరికా విదేశాంగ విధానాలతో అంటకాగుతున్న భారత్ ఇప్పటికిప్పుడు తాలిబన్ల దురాక్రమణను వ్యతిరేకించే స్థితిలో లేదు. ఎందుకంటే తాలిబన్లతో సరాసరి అమెరికానే ఒప్పందం కుదుర్చుకుని వెళ్ళిపోయింది, మరోపక్క చైనా పాకిస్థాన్‌లు తాలిబాన్లతో కలిసి పని చేస్తామని ప్రకటించాయి. అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భాగం అవుతామని, అక్కడి ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పిన భారత్ ఇప్పుడు ఒక్కసారిగా తాలిబన్ దురాక్రమణను వ్యతిరేకించే పరిస్థితిలో లేకుండా ఉండడానికి ప్రధాన కారణం స్వతంత్ర విదేశాంగ విధానానికి కట్టుబడి ఉండక పోవడమే. ఇలాంటి విధానం వలననే ఇరాన్ పట్ల అమెరికా తీసుకున్న వైఖరికి చమురు దిగుమతి పట్ల అమెరికా చెప్పినట్టుగా భారత దేశం ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే పొరుగు దేశాలైన చైనా పాకిస్థాన్లతో వైరం తారస్థాయిలో ఉన్నది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలతో అంతంత మాత్రమే సంబంధాలు కొనసాగుతున్నాయి. పొరుగు దేశాలతో అంతర్జాతీయ సంబంధాలు ఇంత స్థాయిలో పడిపోయిన స్థితి మునుపెన్నడూ లేదు. మతపరమైన ఏకీకరణ ద్వారా రాజకీయ లబ్ధి కోసం దేశ హితానికి, రాజనీతికి తిలోదకాలు ఇవ్వడం వలన ఈ దుస్థితి దాపురించింది. అందుకేనేమో భారత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు పరిస్థితులను గమనిస్తూ అఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న కొంతమందిని భారత్‌కు తరలించే కార్యక్రమాలు చేయడం తప్ప ఏమీ చేయలేదు. గత 20 ఏండ్లుగా అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఎందుకు తిష్ట వేసింది, ఏం సాధించింది, ఇప్పుడు అర్థాంతరంగా ఎందుకు వైదొలగింది? అన్న ప్రశ్నలను అగ్రరాజ్యానికి సంధించకుండా అఫ్ఘనిస్తాన్‌పై ఏ దేశం స్పందించినా అర్థరహితమే. ఇలాంటి ప్రశ్నలను భారతదేశం అమెరికాపై సంధించే అవకాశం ఉన్నదా? అమెరికా అదుపాజ్ఞలలో పనిచేసే పప్పెట్ ప్రభుత్వం అక్కడ 20ఏండ్లుగా నడుస్తూ ఉంటే తమకు తోచిన విధంగా వ్యవహారాలను చక్కబెట్టేసుకున్నాయి అనేక దేశాలు. కానీ ఏనాడైనా ఈ రకమైన ప్రభుత్వం స్థిరంగా ఉండగలదా లేదా అన్న ఆలోచనను లేదా ఆశ్చర్యాన్ని కూడా ప్రకటించలేదు. అందుకే నేటి అఫ్ఘనిస్తాన్ ఆహుతికి మౌనం వహించిన అన్ని దేశాలు ఆజ్యం పోసినట్లే. ''మూడు లక్షల అఫ్ఘన్ సైనికుల ముందు కేవలం 60, 70 వేల తాలిబాన్ సైనికులు నిల్వ జాలరు కనుక మేము వెళుతున్నాం'' అంటూ వెనకడుగు వేసిన అమెరికా ఇప్పుడు అంటున్న మాట ఏమంటే సైనికులలోనూ తాలిబన్లకు సహకరించిన వాళ్ళు ఉండడం గమనించలేదని. నిజంగా అఫ్ఘనిస్తాన్ సైనికులకు ఆ రకమైన శక్తి ఉంటే అమెరికా సైన్యం ఇన్నాళ్లు అక్కడ ఉండవలసిన అవసరమే లేదు. మరోపక్క అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంపై గానీ అక్కడ సైన్యంపై గానీ అమెరికాకు నమ్మకం ఉంటే అక్కడి నుంచి నిష్క్రమించే ముందు తాలిబాన్లతో అమెరికా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తాలిబన్లను ఆక్రమించు కొండి అని చెప్పకనే చెప్పినట్లు ఈ ఒప్పందం అర్థం కాదా? మరోపక్క తాలిబన్లు ''అఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకుంటారని తెలుసు కానీ ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు'' అని అమెరికా విదేశాంగ ప్రతినిధులు మాట్లాడడం గర్హనీయం. అందుచేత తాలిబాన్లను గానీ లేదా అమెరికా అండదండలతో అక్కడ ఏర్పడి కొనసాగిన ప్రభుత్వాన్ని గాని విమర్శించే ముందు లేదా తప్పు పట్టే ముందు దానికి కారణమైన ఒకే ఒక దేశం అమెరికా అన్న విషయాన్ని మరువరాదు. ''తాలిబాన్ల దురాగతాలను సహించలేము డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులు అందరిని మట్టు పెడతాం'' అంటూ అమెరికా అధ్యక్షుడు బైడన్ అంటున్నారు. అభ్యుదయవాద దక్పథంతో వాణిజ్యాన్ని పెంపొందించుకుని అభివృద్ధి పథంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి అక్కడ ఉగ్రవాద గ్రూపులుగా ఉన్న తాలిబాన్లను ప్రోత్సహించి 1990వ దశకం ప్రథమార్థంలో అక్కడి ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత అమెరికాదే అన్న విషయాన్ని ప్రపంచం ఇంకా మరిచిపోకూడదు. తాను పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థనే తనపై తిరగబడింది అన్న అక్కసుతో కదా తాలిబాన్లను మట్టికరిపించి ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని 2001లో అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా ఏర్పరిచింది! ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు అమెరికా ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ చర్చల ద్వారా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా చూడడమే.
అఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను వార్తల్లోనూ, వాట్సప్‌లోనూ చూస్తున్న జనం అది ఒక మత చాందస వాద తిరుగుబాటుగా, మతం ముసుగులో టెర్రరిస్టుల తిరుగుబాటుగా భావిస్తూ ఇస్లాం మతాన్ని దూషించే పనిలో పడ్డారు. నిజానికి అది మతపరమైన తిరుగుబాటు కానేకాదు. అధికార హస్త గతానికి టెర్రరిస్టు గ్రూపుగా ఏర్పడి తిరగబడిన తీరు మాత్రమే. అయితే చాందసవాదులు ఎప్పుడూ సాంప్రదాయ వాదాన్ని ముందుకు తెచ్చి ప్రజలను తమ గుప్పిట్లో ఉంచుకునే పద్ధతి అనేక దేశాలలో మత ఆధారిత పరిపాలనల ద్వారా బయట పడుతూనే ఉన్నది. తాలిబాన్ది కూడా అణచివేత ధోరణితో కూడుకున్న టెర్రరిస్టు భావజాలమే. నిజానికి అక్కడి ప్రజల బహిరంగ మద్దతు తాలిబాన్లకు, వారి పాలనా విధానానికీ లేదు. కానీ ఇంచుమించు అదే చాందసవాద ధోరణితో ఉన్న భారత ప్రభుత్వాన్ని ప్రజానీకం ఎన్నుకుంది. దీన్నేమనాలి? భారతదేశంలోనూ స్త్రీల పట్ల స్వేచ్ఛాయుత పాలన జరగడం లేదు. ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏమి చదవాలి, ఏమి చూడాలి, ఏ సందర్భంలో బయటకు వెళ్లాలి వంటి అనేక రకాల నియమ నిబంధనల మధ్య మన దేశ స్త్రీల జీవితాలు ఉన్నవి. అత్యాచారాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఆడవారిని తప్పుబట్టడం అధికార పార్టీలకు, మంత్రులకు అలవాటుగా మారింది. భారత పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) బిల్లు పాస్ అయిన సందర్భంగా దేశంలో చోటు చేసుకున్న హింసలన్నింటిని ప్రపంచ మీడియా ఉగ్రవాద పరిస్థితులతో పోల్చుతూ చూపింది. మన దేశంలోని కొన్ని మత ఛాందసవాద సంస్థలు వాలెంటైన్స్ డే సందర్భంగా యువతీ యువకులు కలిసి ఉన్నట్లు కనిపిస్తే బలవంతంగా రాఖీలు కట్టించడం, తాళీ కట్టించడం వంటి దృశ్యాలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న హింసాత్మక దృశ్యాలను తలపిస్తాయి. స్త్రీలు, ఈ దళితులు, ఆర్థికంగా వెనుకబడిన వారందరూ దేశంలో రెండవ తరగతి పౌరులే! పాకిస్థాన్ వంటి మతపరమైన దేశాలు ఇందుకు మినహాయింపేమీ కావు. స్త్రీల పట్ల, వారి స్వేచ్ఛ పట్ల, వారు బహిరంగంగా ఉద్యోగాలు- ఉపాధి చేపట్టడం పట్ల తాలిబాన్లు నిషేధిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా తప్పు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించకుంటే అంతర్జాతీయ సమాజం నుండే కాదు సొంత దేశంలోనూ తాలిబాన్లు ఆదరణ కోల్పోక తప్పదు. ఉగ్రవాద విధానాన్ని ద్వేషపూరిత భావజాలాన్ని తాలిబాన్లు వెంటనే వదలవలసి ఉంటుంది. తాలిబాన్లకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన దేశాలు, లోపాయికారిగా ఒప్పందం చేసుకున్న అమెరికా కచ్చితంగా ఈ విషయాన్ని స్పష్టం చేయవలసి ఉంటుంది. అలా కాదని అణచివేత ధోరణిని అమెరికా మళ్లీ ప్రదర్శిస్తే పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం ఉన్నది. తాలిబాన్లతో కలిసి పని చేస్తామని మద్దతు పలికిన చైనా పాకిస్థాన్‌లు కూడా మితిమీరి ప్రోత్సహిస్తే పరిస్థితులు తారుమారు అయ్యే ప్రమాదమూ ఉన్నది!
నేటి తాలిబన్ తిరుగుబాటు అమెరికా ఆధిపత్యానికి, ఇతర దేశాల పరిపాలనలలో అగ్ర రాజ్యాల అనవసర జోక్యానికి ఒక చెంప పెట్టు. వియత్నాం ఓటమి తర్వాత అమెరికాకు జరిగిన అత్యంత పరాభవం ఇది. 30లక్షల మంది వియత్నాయుమీలు 58వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న అమెరికా వియత్నాం యుద్ధ(1975) మాలిన్యాన్ని ప్రపంచం ఇంకా మరువలేదు. చైనా వాణిజ్య ఆధిపత్యాన్ని నిలువరించడంలో అఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని అందినంత మేర వాడుకున్న అమెరికా ఇప్పుడు తాలిబాన్లతో వైరం పెంచుకునే స్థితిలోనూ లేదు. ఎందుకంటే చైనా ఇప్పటికే తాలిబాన్లకు దగ్గరైన సంకేతాలు ఇచ్చింది. ఉగ్రవాద సంస్థల పట్ల మెతకవైఖరి వహించే పాకిస్థాన్ తాలిబాన్ల వ్యవహారాన్ని వ్యతిరేకించే స్థితిలో లేదు. అందుచేత తన కనుసన్నలలో నడిచే పాకిస్థాన్, తనకు బద్ద శత్రువైన చైనా- రెండూ తాలిబాన్లకు దగ్గరైన సందర్భంలో అమెరికా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. చైనా, అమెరికాల దిగుమతులపై భారత్ ఆధారపడి నప్పటికీ భారతదేశ ఎగుమతులకు అత్యంత ఎక్కువ స్థాయిలో గిరాకి కల్పిస్తున్న దేశాలు పాకిస్థాన్ అఫ్ఘనిస్తాన్లు. సుగంధద్రవ్యాలతో పాటు ఖనిజ సంపద అత్యంత చౌకగా భారతదేశానికి అందుతున్నది అఫ్ఘనిస్తాన్ నుంచి మాత్రమే. అంచేత సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత ఆత్మ నిర్భరత ఒక నినాదంగా మాత్రమే మిగిలిన ఈ సందర్భంలో అంతర్జాతీయంగా ముఖ్యంగా పొరుగు దేశాలతో సత్సంబంధాలు అత్యంత అవశ్యం. అఫ్ఘనిస్తాన్‌లో ఎవరు అధికారంలో ఉన్నా మానవ హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలని కోరుకోవడమే. ఎందుకంటే వాటి పర్యవసానాలు వ్యాపార వాణిజ్య అంశాలలో ఒక దేశం మరో దేశంపై ఆధారపడ వలసిన గత్యంతర పరిస్థితులలో అంతర్జాతీయ సమాజం పై ఉంటాయి కనుక.
-జి. తిరుపతయ్య
సెల్: 9951300016