Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది.. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం 'అణచివేత.. గోప్యత - నిర్వీర్యం.. నిఘా..' అనే ఫార్ములాను అనుసరిస్తోంది. ఓ వైపు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూనే.. ప్రజా ఉద్యమాలను అణచివేస్తోంది. నిర్బంధాలను అమలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన చట్టసభలు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతోపాటు మీడియాపై నిఘా పెట్టి.. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్టు తేలితే వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకంగా ఉండాల్సిన విధానాల పట్ల గోప్యతను పాటిస్తోంది. 2014లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీ పాటిస్తున్న విధానాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది.
అణచివేత.. నిర్బంధం..
ఏడేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, వాటికి తొత్తుగా మారిన పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమకారులను నిరవధికంగా జైళ్లలో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎల్గార్ పరిషత్ కేసులో పౌర హక్కుల ఉద్యమకారులను మావోయిస్టులుగా ముద్రవేసి సంవత్సరాలుగా జైలులో ఉంచారు. ఉగ్రవాదం, తీవ్రవాదం పేరుతో ఊపా ద్వారా అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా చేస్తున్నారు. మేథావుల గొంతు నొక్కడానికి విచారణ జరపకుండా సుదీర్ఘ కాలంగా జైళ్లలో ఉంచుతున్నారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయడమే వారి లక్ష్యం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో 3762 మంది మీద రాజద్రోహ నేరం మోపితే, నరేంద్రమోడీ పదవీ కాలంలో ఇప్పటికే 7136 మందిని ఈ నేరారోపణతో జైళ్లలో వేశారని 'ఆర్టికల్ 14' అనే పరిశోధనా సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. 2014 తరువాత పెట్టిన రాజద్రోహం కేసుల్లో 96శాతం అధికారంలోని రాజకీయ నాయకులను విమర్శించినందుకే పెట్టారని తేల్చింది. అంతేకాకుండా 2016 నుంచి 2019 వరకు మొత్తం 5922 మంది మీద ఊపా కేసులు పెట్టి అరెస్టు చేస్తే, కేవలం 2.2శాతం కేసులు మాత్రమే రుజువయ్యాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే అణచివేత, నిర్బంధాలు, అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
వ్యవస్థలు నిర్వీర్యం..
అధికారంలోకి వచ్చినప్పటి నుంచే బీజేపీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేయడమే కాకుండా రాష్ట్రాల హక్కులనూ కాలరాస్తోంది. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల హక్కులు కాలరాయడం ఎక్కువైంది. కేంద్రీకృత పాలనా వ్యవస్థ వైపు నడవాలన్న ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేలా చట్టాన్ని చేసింది. ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ రాష్ట్రాల ఆదాయ వనరులకు గండి కొట్టింది. ఏకపక్షంగా నూతన విద్యావిధానాన్ని రుద్దుతోంది. డిగ్రీ కోర్సుల్లో మార్పులు, సిలబస్ తయారీ, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలన్నీ నూతన విద్యా విధానం ద్వారా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. రాష్ట్రాల హక్కులను కబళించడానికి పదేపదే ప్రయత్నాలు చేస్తోంది.
న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి పెరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా అంతో ఇంతో ప్రజలకు సమాచారం బహిర్గతమయ్యే అవకాశమున్నా.. ఆర్టీఐ కమిషనర్ల అధికారాలను గణనీయంగా తగ్గించి, స్వతంత్రంగా వ్యవహరించకుండా చేసింది. అవినీతిని వెలికితీసే కాగ్‌ను నిర్వీర్యం చేసేశారు. నోట్లరద్దు, రాఫెల్ డీల్‌పై సరైన విధంగా స్పందించడంలో కాగ్ విఫలమైనట్టు స్పష్టంగా కనిపించింది. ఆర్థికవేత్తలు ఆర్బీఐ చైర్మన్లుగా ఉంటుండగా, వారు తమ మాట వినడం లేదని చరిత్రలోనే మొదటిసారి 'చరిత్ర' సబ్జెక్టు చదివిన శక్తికాంతదాస్ను చైర్మన్‌గా నియమించి కేంద్రం ఆర్బీఐని తన చెప్పుచేతల్లోకి తీసుకుంది. సీబీఐ అయితే కేంద్ర ప్రభుత్వానికి పంజరంలో చిలకలా మారిపోయింది. పాలకుల రాజకీయావసరాలకు అనుగుణంగా వారి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడానికి సీబీఐకి ఈడీ, ఐటీ కూడా తోడైంది. ఎన్నికలు జరుగుతున్న తీరును చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ కూడా పాలకుల ఒత్తిడితో స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నట్టు తెలుస్తోంది.
గోప్యత.. నిఘా..!
ప్రజలకు, దేశానికి తెలియాల్సిన విషయాల పట్ల గోప్యతను పాటించేలా విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం.. తమకు అనుకూలంగా లేని వారి వ్యక్తిగత గోప్యతను సైతం లెక్క చేయకుండా వారిపై నిఘా పెంచినట్టు స్పష్టమవుతోంది. దీనికి అనేక ఉదాహారణలను మనం చూడవచ్చు. సొంత పార్టీని ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేసుకోవడంతోపాటు విపక్షాలు, ప్రాంతీయ పార్టీలకు విరాళాలు దొరకకుండా చేయడానికి, ఇంకా ఏ వ్యాపారవేత్త ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చారో ప్రజలకు తెలియకుండా ఉండడానికి ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా పార్టీలకు ఇచ్చే విరాళాల వ్యవస్థలో పారదర్శకత నెలకొనడానికి బదులు అది మరింత సంక్లిష్టంగా తయారైంది. దీని ద్వారా ఎక్కువ లాభం పొందింది బీజేపీయే.. కార్పొరేట్ల నుంచి అందిన నిధుల్లో 95శాతం ఒక్క బీజేపీ ఖాతాలోకే వెళ్లిపోయాయి. 2020లో సైతం 52శాతం నిధులు బీజేపీకే అందాయి. అంతేకాకుండా పార్టీలకు ప్రభుత్వమే విరాళాలు సమకూర్చాలన్న ప్రతిపాదనను తీసుకురాగా, దీనిని ఎన్నికల కమిషన్ వ్యతిరేకించడంతో ఆగిపోయింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్ జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించినా.. ఇక్కడ మాత్రం సుప్రీం కోర్టు ద్వారా క్లీన్ చిట్ తెచ్చుకొని వాటి వివరాలు ప్రజలకు బహిర్గతం కాకుండా చేసింది. డీల్ మొత్తాన్ని గోప్యంగానే ఉంచారు. పెగాసస్ నిఘాలో అప్పటి జడ్జిపై లైంగిక ఆరోపణలు చేసిన సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని నెంబర్ కూడా ఉండడంతో రాఫెల్ డీల్, కోర్టు తీర్పుల మధ్య ఏమైనా బ్లాయిమెయిలింగ్, ఇతర ఒప్పందాలు ఏమైనా జరిగాయా అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. కరోనా మరణాల లెక్కలను స్పష్టంగా చెప్పకుండా గోప్యంగా ఉంచింది. ఒత్తిడి రావడంతో కేవలం నాలుగు లక్షల వరకే మరణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. తీసుకున్న రుణాలు వాపస్ రాక బ్యాంకులు క్రమక్రమంగా నిర్వీర్యమవుతున్నా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను ఇప్పటి వరకు బహిర్గతపర్చలేదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డిఫాల్టర్ల వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని 'డిస్క్లోజర్ పాలసీ'ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ.68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పినా.. ఇది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కనీసం నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు సైతం బయటపెట్టలేదు. నోట్ల రద్దు ఎందుకు చేపట్టారో.. దాని వల్ల ఏం లాభమైందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోయింది.
ప్రభుత్వ విధానాలు ప్రజలకు తెలియకుండా గోప్యత పాటిస్తున్న కేంద్రం.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాస్తోంది. ఇటీవల బహిర్గతమైన పెగాసస్ కుంభకోణం దీన్ని స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన 50 వేల మంది ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని, అందులో భారతదేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్లు హ్యాక్ చేసినట్టు చెబుతున్నా.. కనీసం విచారణకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇప్పటికే ప్రజాస్వామ్యం ఎంతో బలహీనపడిందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికలో పేర్కొంది. 179 దేశాల జాబితాలో భారత్‌కు 90వ స్థానాన్ని ఆపాదించింది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రతకు ముప్పు, భిన్నాభిప్రాయా లను అణచివేయడం వంటి చర్యలకు బీజేపీ పాల్పడుతోంది. ముంచుకొస్తున్న ముప్పును ఇప్పటికైనా గ్రహించకపోతే ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరం. ప్రజలు చైతన్యవంతులైతేనే రాజ్యాంగ సంస్థలను, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం.
మహమ్మద్ అరిఫ్
సెల్:9618400190