Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనకు సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ సన్నాహాలు రెండేండ్ల క్రితమే మొదలు కావాల్సి ఉండగా ఎన్నికలు, అనంతరం వచ్చిన కోవిడ్ లాక్డౌన్ల వలన తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈలోగా బీహార్, ఒడిస్సా, మహారాష్ట్ర ప్రభుత్వాలు 2021 జనగణనలో ఇతర వెనకబడిన కులాలకు సంబంధించిన సమాచారం కూడా సేకరించేలా ప్రశ్నావళి రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ తీర్మానాలు ఆమోదించాయి. బీహార్లో పాలక పక్షం జనతాదళ్ యునైటెడ్, ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ నేతలిద్దరూ ప్రధానిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. అంతకు మునుపే 2018 పార్లమెంట్ సమావేశాల్లో 2021 జనగణనలో కులాల వారీ వివరాలు కూడా సేకరిస్తామని అప్పటి హౌం మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల గండం గట్టెక్కడంతో ఈ హామీని తుంగలో తొక్కింది బీజేపీ. ఇదే భారతీయ జనతా పార్టీ 2011 జనగణనకు ప్రశ్నావళి రూపొందిస్తున్నప్పుడు కులాల వారీగా వివరాలు సేకరించాలని డిమాండ్ చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సామాజిక ఆర్థిక గణాంకాలు సేకరించటానికి రూపొందించిన ప్రశ్నావళిలో కులానికి సంబంధించిన సమాచారం కూడా పొందుపర్చేలా చేయటంలో నాటి రాజ్యసభలోని వామపక్ష సభాపక్షనేతలు కీలక పాత్ర పోషించారు. మొత్తానికి 2012 సామాజిక ఆర్థిక కుల గణన సేకరణ పూర్తయింది. దాని విశ్లేషణతో కూడిన స్థూల పట్టికలు 2014 నాటికే అందుబాటులో ఉన్నా ఆ వివరాల్లో కులానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం తొక్కి పెట్టి పాక్షిక వివరాలు జారీ చేసింది. కుల గణన అంటే పాలకవర్గాలకు ఎందుకంత భయం?
కులగణన - సమన్యాయం
కుల గణనకు, రిజర్వేషన్లకు, దారిద్య్ర నిర్మూలనకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. దారిద్య్ర నిర్మూలన రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన అంతిమ లక్ష్యం. భూమి, ఉపాధి, జాతీయ సంపద ప్రజలందరికీ సమానంగా అందుబాటులోకి తేవడమే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల సారాంశం. దారిద్య్ర నిర్మూలనకు భూమి, ఉపాధి కీలకం. దారిద్య్ర నిర్మూలన జరిగిన తర్వాత రిజర్వేషన్ల అవసరం ఉండబోదు. రిజర్వేషన్ల ఫలాలు సమంగా అందరికీ అందుబాటులోకి రావాలంటే కులాలవారీ కుటుంబాల ఆర్థిక స్థితిగతుల గురించిన సమాచారం అందుబాటులో ఉండాలి. ప్రత్యేకించి మూడు దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా సంక్షేమ రాజ్య స్వభావం పూర్తిగా మారిపోయింది. 1991 కి ముందు సార్వత్రిక సంక్షేమం, సామూహిక అభివృద్ధి, ప్రాంతీయ అసమానతల నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ విధానాలు, ఆర్థిక విధానాలు రూపొందేవి. అమలు జరిగేవి. ఈ విధానాల ఫలితాలు ప్రజలకు చేరకపోవటానికి పాలనా యంత్రాంగంలోని అవినీతే కారణమంటూ ఓ సిద్ధాంతం ముందుకొచ్చింది. ఈ సిద్ధాంతం అంతిమంగా సార్వత్రిక సంక్షేమం స్థానంలో లక్షిత సంక్షేమ విధానాలకు తెరతీసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉనికిలోకి వచ్చిన రకరకాల రంగుల కార్డులు - తెల్లకార్డు, పచ్చకార్డు, అంత్యోదయ కార్డు వంటివి ఈ లక్షిత సంక్షేమ విధానాలకు నిదర్శనం.
లక్షిత సంక్షేమం అంటే నిజానికి సంక్షేమ చేయూతకు ఏ కుటుంబాలు అర్హులో గుర్తించి నేరుగా వారికే సంక్షేమ పథకాలు, ఫలాలు అందేలా చేయటమే. దీనికి కొనసాగింపుగానే నగదు బదిలీ పథకం వంటివి వచ్చాయి. నగదు బదిలీ పథకం తొలుత తెరమీదకు వచ్చినప్పుడు అచ్చం పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతోనే నగదు బదిలీ పథకాన్ని ఆవిష్కరిస్తున్నామని, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలను జోడిస్తే ఈ ఫథకం విజయవంతంగా అమలు జరుగుతుందని బీజేపీ వాగ్దానం చేసింది. బడ్జెట్లో జామ్ (జనధన్ ఖాతా - ఆధార్ కార్డు - మొబైల్ నంబరు) నినాదం ఈ రకంగా పుట్టిందే. పాలకులు చెప్పిందే వాస్తవమని మనం నమ్మినా, ఈ రెండు వాదనలూ న్యాయంగా అమలు జరగాలంటే వెనకబాటుతనం, పేదరికం గురించిన సూక్ష్మ స్థాయి వివరాలు అందుబాటు లో ఉండాలి. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనివార్యమైన అంతర్భాగమనీ, దాన్ని విస్మరిస్తే అభివృద్ధి గతితప్పుతుందని వాదించే వాళ్లు సైతం సమాజంలో అంతగా విడదీయరానంతగా ఉన్న కులాల పొందిక గురించి సమాచారాన్ని బహిర్గతం చేయాలన్న డిమాండ్ ఎందుకు ముందుకు తేవడం లేదు అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న.
కుల గణన - రిజర్వేషన్లు
జనగణన ఈ దేశ పౌరుల గురించిన సమగ్ర సమాచార సాధనం. ఇందులో కేవలం కులం మాత్రమే కాదు. కుటుంబ సభ్యుల విద్యార్హతలు, వయో వివరాలు, కుటుంబ ఆస్తిపాస్తుల గురించిన సమగ్ర సమాచారమే మానవాభివృద్ధి సూచికలకు పునాది. అటువంటి విస్తృత సమాచారానికి కుల గణన కూడా తోడైతే సమగ్రత సిద్దిస్తుంది. కులాలవారీ జనాభా పొందిక వివరాలు పొక్కితే రిజర్వేషన్ల గురించిన డిమాండ్లు కొత్త రూపం తీసుకుంటాయని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా జరుగుతున్న చర్చలో వివిధ రాజకీయ పక్షాల స్పందనను గమనిస్తే కుల గణన విషయంలో వారి వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది. స్థూలంగా రిజర్వేషన్లను సమర్థించే వాళ్లకు, వ్యతిరేకించే వాళ్లకూ ఉన్న వ్యత్యాసమే కుల గణన సమర్థించేవాళ్లకూ కుంటిసాకులతో తిరస్కరించేవాళ్లకూ ఉండటాన్ని గమనించవచ్చు.
ఇలాంటి వాదనలు చేస్తున్న వాళ్లకు మనం మరో ప్రశ్న వేయాలి. నిజానికి వెనకబాటుతనానికి, కులానికి సంబంధం లేనప్పుడు, ఆర్థిక ప్రయోజనాలు, రిజర్వేషన్లు, విద్యా ఉపాధి అవకాశాలు కేవలం కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మాత్రమే అమలు జరుగుతున్నప్పుడు మన గురించి సవాలక్ష కోణాల్లో ప్రభుత్వం దగ్గర సమాచారం పోగుపడుతున్నట్టుగానే ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారన్న సమాచారం కూడా పోగుపడుతుంది. దాని వల్ల నష్టం లేనప్పుడు కుల గణనను ఎందుకు వ్యతిరేకించాలన్నదే ఆ ప్రశ్న. నిజానికి కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు, వాటి ద్వారా సామాజిక ఆర్థిక హౌదా పొందిన కొద్దిమంది ఈ కులగణనను వ్యతిరేకించాలి. కానీ పాలక కులాలు, వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆలోచించుకుని అంచనాకు రావల్సిన బాధ్యత మనందరిదీ.
ఒబిసి రిజర్వేషన్లు - న్యాయ వ్యవస్థ
గత పదేండ్ల కాలంలో అనేక రాష్ట్రాలు వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు వర్తింప చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. మరికొన్ని కులాలను వెనకబడిన తరగతుల జాబితాలోకి చేరుస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయాలు, ఆదేశాలు కోర్టు గుమ్మాలు తొక్కాయి. అంతిమంగా కోర్టులు ఈ నిర్ణయాలను కొట్టేశాయి. ఈ నిర్ణయాల వెనక రాజకీయాలు, పాలకవర్గ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ న్యాయస్థానాలు ఆయా సందర్భాల్లో ఈ నిర్ణయాలను కొట్టేయటానికి చెప్పిన కారణాలేమిటి? ఏ కులానికి ఎంత మోతాదులో రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయించే స్వేచ్ఛ, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాకపోతే ఏ కులం ఏ మోతాదులో వెనకబడి ఉందో గణాంకాలతో సహా నిరూపించిన తర్వాత మాత్రమే అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నది న్యాయస్థానాల ఆదేశం. మరి ఏ కులానికి చెందిన కుటుంబాలు ఏ మోతాదులో వెనకబడి ఉన్నాయన్నది తెలుసుకోవాలంటే కులగణనతో కూడిన జనగణన లేకుండా ఎలా సాధ్యం? ఈ చిన్న మెలికను గుర్తించలేనంత, విప్పలేనంత అమాయకంగా ఉన్నారా మన పాలకవర్గ మేధావులు? కానేకాదు. అయినా కులగణన డిమాండ్ దగ్గరకు వచ్చేసరికి నంగనాచి కబుర్లు, ఆకుకు అందని, పోకకు చెందని వాదనలు ముందుకు తెస్తున్నాయి. భారతదేశంలో రిజర్వేషన్ల అమలుకు మైలురాయి లాంటి తీర్పు ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. జస్టిస్ జీవన రెడ్డి నాయకత్వంలో మెజారిటీ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పులోనే పదేళ్లకొకసారి అటువంటి గణాంకాలు సేకరించాలని ఆదేశించింది. కానీ నాటినుంచి ఈ అంశం మాత్రం చర్చకు రానీయకుండా చేయటంలో పాలకవర్గం, దాని చేతుల్లో నడుస్తున్న మీడియా జయప్రదమయ్యాయి. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాతనే పార్లమెంట్లోనూ, సమన్వయ కమిటీల్లోనూ ఈ అంశం ఎజెండాగా మారింది. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టానికి ఉన్న రాజకీయ నేపథ్యమే ఈ అంశాన్ని ఎజెండాలోకి తేవడానికీ ఉంది.
ఈ వివరాలు పరిశీలించినప్పుడు కులగణనకు వ్యతిరేకంగా వస్తున్న వాదనలు హేతురహితమైనవీ, పాక్షిక వాస్తవాలపై ఆధారపడినవీ అని మనం నిర్థారించవచ్చు. స్వాతంత్య్రానంతరం ఆంధ్రొపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించే అన్ని సర్వేల్లోనూ కులం వివరాలు ఉంటున్నాయి. ఎస్సీ ఎస్టీల్లో భాగంగా ఉన్న ఉపకులాల వివరాలు సేకరిస్తూనే ఉంది ప్రభుత్వం. దీన్ని ఒబిసి కులాలకు విస్తరించటం వల్ల వచ్చే నష్టం కానీ, పాలనా పరమైన అదనపు భారం కానీ ఏమీ లేదు. 2012లో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణనలో దాదాపు 40వేలకు పైగా కులాలు నమోదైనట్లు సమాచారం. సామాజిక ఆర్థిక కుల గణన దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన కులగణనకు మౌలిక పునాదిని సిద్ధం చేసింది. ఇక్కడ కావల్సింది రాజకీయ శక్తుల నిబద్ధత. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ది. ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ధి లోపిస్తే నిలేసి సాధించుకోవటం ప్రజల కర్తవ్యం. సామాజిక ఆర్థిక న్యాయంతోనూ, దీర్ఘకాలంలో కుల నిర్మూలనతోనూ ముడిపడి ఉన్న ఈ లక్ష్య సాధన కోసం రాజకీయ పార్టీలే కాక కుల సంఘాలు, కులాధారిత సంస్థలు కూడా గొంతు కలపాల్సిన సమయం ఇది.
కొండూరి వీరయ్య
సెల్: 9871794037