Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళోజి... ఈ పేరు వింటే కవితాఝరులు ఉద్యమానికి ఊపిరిలూదుతాయి. అతడు రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. నిజాన్ని నిగ్గదీసిన ప్రజాకవి, వెయ్యి గన్నులు చెయ్యలేని పనిని ఒక పెన్నుతో చేయొచ్చని నిరూపించిన సాహితీ దిగ్గజం. తెల్ల పంచె, తెల్ల జుబ్బా, దానిమీద కోటు, పెద్ద కళ్ళద్దాలు, చేతిలో కర్ర, చంకలో సంచితో అతి సామాన్య రూపంతో జేబులో సిరాపెన్నే తుపాకీగా సమరం సాగించిన సాహసి. పద్మభూషణ్ బిరుదుతో పాటు డాక్టరేట్‌ను కూడా సొంతం చేసుకున్న కాళోజీ 1914 సెప్టెంబరు 9న కర్నాటక రాష్ట్రం బీజాపూర్ ప్రాంతంలోని రక్తహేళి గ్రామంలో రంగారావు, రమా భాయమ్మ దంపతుల ముద్దుబిడ్డగా జన్మించారు. కాళోజీగా అందరి మన్ననలను పొందుతున్న ఆయన అసలు పేరు ''రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి''. ఆయన తల్లి కర్నాటకకు, తండ్రి మహారాష్ట్రకు చెందిన వారు.
కాళోజీ నారాయణరావు జన్మించిన కొద్దిరోజులకే వీరి కుటుంబం తెలంగాణ రాష్ట్రం వరంగల్జిల్లా మడికొండలో స్థిరపడ్డారు. కాళోజీ ప్రాథమిక విద్యను మడికొండలో చదివారు. ఉన్నత విద్యను హైదరాబాద్, వరంగల్‌లో పూర్తిచేశారు. విద్యార్థి సంఘాలు పెట్టి ఆర్గనైజ్ చేశారు. ఆర్య సమాజంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కర్రసాము కూడా నేర్చుకున్నారు. చదువుకునే రోజుల నుంచే ప్రజా సమస్యలను చూసి చలించిపోయారు. కాబట్టే ''అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి /అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి- ప్రాప్తి/ అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు/'' అంటూ ఇలా విశిష్ట విలువలతో కూడిన కవితలల్లారు.
కాళోజి 1939లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కానీ అభ్యుదయ భావాలు గల కాళోజీ న్యాయవాద వృత్తిని కూడా పక్కనపెట్టి ఆ రోజుల్లో సాగుతున్న ఉద్యమాల్లో పాల్గొనేవారు. అలా సత్యాగ్రహౌద్యమంలో పాల్గొని 25ఏండ్ల వయసులోనే జైలు జీవితాన్ని అనుభవించారు. పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన ఉద్దండ పండితులైన రాజకీయ నేతలతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఓవైపు అక్షర సేద్యం చేస్తూనే మరోపక్క నిజాం నిరంకుశ పాలనపై ''సాగిపోవుటె బతుకు/ ఆగిపోవుటె చావు/ సాగిపోదలచిన ఆగిపోరాదిచటెప్పుడు/ ఆగిపోయిన ముందుకు సాగలేవెప్పుడు''/ అంటూ అద్భుతమైన జీవన సత్యాలను చెప్పి అందరిలో సామాజిక చైతన్యాన్ని నింపారు. ఇంకా ''నా నోటి కాడ బుక్కను నాణ్యంగా/ కాజేసిన ఓ నాగరికుడా విను/ నా నాగటి చాలు లోన/ నాజూకుగా సవళించి/ నను కాటేసిన నాగరికుడా వినమంటూ''/ పెత్తందారీ వ్యవస్థను కుండబద్దలు కొట్టినట్టు ప్రశ్నించిన ప్రజా గొంతుక కాళోజీది. కాలేజీ కవిత్వాన్ని చదివి పరిపూర్ణంగా అర్థం చేసుకుని చక్కగా ప్రభావితమైనవారు ఆయనను వేమనతో పోలుస్తారు.
ఆయన కవిత్వంలో వస్తువు, శైలి అన్ని సర్వజనీనమైనవి. ఎక్కడ వేదన, అణచివేత ఉందో, ఎక్కడ సామాన్యుడు ఇబ్బంది పడతాడో అక్కడ కాళోజీ కవిత్వం శివ తాండవం చేస్తుంది. ''అన్నపు రాసులు ఒక చోట/ ఆకలిమంటలొకచోట''/ అంటూ ఓ కవితలో పేదవాడి ఆకలి కేకలను ఎంతో ఆవేదనగా చెప్పారు.
ఒకసారి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యి శాసనమండలి సభ్యుడిగా విశిష్టమైన సేవలందించారు. ఆంధ్ర సారస్వత సభ్యత్వం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. 70ఏండ్ల పాటు ప్రజా జీవితంలో ఉండి ప్రజల పక్షాన నిలిచి వారి కోసమే రచనలు చేసి కాళన్నగా కాళోజీగా ప్రజల నాలుకలపై నిత్యం కదలాడుతూ ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. వాటిలో అణా కథలు, కాళోజీ కథలు, నా గొడవ, నా పరాభవ వసంతం, నా గొడవ పరాభవ వర్షం, నా గొడవ పరాభవ గ్రీష్మం, నా గొడవ పరాభవ శరత్, నా గొడవ పరాభవ హేమంతం, ఇది నా గొడవ అనే ఆత్మ కథ వంటి అనేక రచనలు చేశారు. రెబల్ ఇండియా పుస్తకానికి అనువాదం, నా భారత దేశ యాత్ర జీవన గీతాలు లాంటి చక్కని సామాజిక విలువలతో కూడిన రచనలు అందంగా విరబూయించారు.
అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించి జనాల్ని తన రచనలతో చైతన్యపరిచి మాండలికాల రుచిని తన మాటల్లో రచనల్లో చూపిన కాళోజీ నారాయణ రావు జయంతి నేడు. అందరి బాధలో తన బాధను, తన బాధలో అందరి బాధలు చూసిన కాళోజి ''పుట్టుక నీది/ చావు నీది /బతుకంతా దేశానిది/'' అన్న మాటలు అక్షర సత్యం చేసి 2002 నవంబర్ 13న కన్నుమూసారు. జీవించినంత కాలం ప్రజలే తన లక్ష్యంగా జీవించి మరణానంతరం కూడా తన భౌతిక కాయాన్ని తన జాతి జనులకు ఉపయోగపడాలని కాకతీయ వైద్య విద్యార్థులకు దానం చేసిన మానవతా మూర్తి కాళోజి. ఆయనకు ఘన నివాళి.
-పి. భాగ్యలక్ష్మి
సెల్: 9704725609