Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నివురు కప్పిన
నిప్పులా ఉంటామనే కదా
నిప్పును రాజేశావ్.
చిరుగాలి వస్తే చాలు
చెలరేగిపోతామనే కదా
చిందరవందరగా విసిరేశావ్
కత్తులు దిగబడుతున్నా గొంతులు
లాల్ సలామ్ అంటాయనే కదా
జై శ్రీరాం అని పిచ్చి వేషాలేశావ్.
తలలు తెగిపడుతున్నా దేహం
ఎర్రజెండాను ఎత్తి పట్టుకుంటుందనే కదా
శ్రమజీవి ఆలయాల్ని ధ్వంసం చేశావ్
చెమట చుక్కల దొంగల... గల్ల పట్టి
చెంప చెల్లుమనిపిస్తామనే కదా
మాతాకి జై అంటూ.....
మార్క్సిస్టు ఆఫీసులకు మంట పెట్టావ్
బిడ్డా... గుర్తుంచుకో!
జనం కోసం దేశం కోసం
జీవితాలు ఆరబోసినోళ్ళం
నువ్... నిప్పు పెడితే మూటా ముళ్ళె సర్దుకుంటామనుకున్నావా?
నరహంతక నాజీలను
ఈ నేలన నైజాములను
కంటి మీద కునుకు లేకుండ
ఒంటి తోలు వలిచిన వాళ్ళం
నువ్... చిందరవందర జేస్తే
ముడుచుకు కూర్చుంటామనుకున్నావా?
ముస్సోలిని హిట్లర్
పేరేదైతేనేం... ఊరేదైతేనేం
విర్రవీగిన నియంతలకు
నీ తాత ముత్తాతలకు
కర్రు కాల్చి వాత పెట్టినోళ్ళం
నువ్... కత్తులు విసిరితే చేతులెత్తి
వేడుకుంటామనుకున్నావా?
బిడ్డా... గుర్తుంచుకో!
నెత్తురు తాగే గడీల కోరలు
నింగిని తాకే దొరల కోటలు
ఏదైతేనేం... ఎవరిదైతేనేం
ముప్పు తిప్పలు పెట్టి
ముప్పై మూడు చెరువుల
నీళ్ళు తాగించినోళ్ళం
నువ్... ధ్వంసం చేస్తుంటే
దండం పెడతామనుకుంటున్నావా?
వెలుగుల్ని ప్రేమించలేని
గూండాల్లారా
కలుగుల్ని దాటలేని
ఉన్మాదుల్లారా
ఒళ్ళు విరుచుకొని ఓసారి
కళ్ళు తెరుచుకోండి .
మేం... సాగిపోయే వాళ్ళం తప్ప
ఆగిపోయే వాళ్ళం కాదు.
జైత్రయాత్ర చేసే వాళ్ళం తప్ప
జారిపోయే వాళ్ళం కానేకాదు.
(త్రిపుర సిపిఐ(యం) పార్టీ ఆఫీసులపైన ఫాసిస్టు బీజేపీ - ఆర్ యస్ యస్ గుండాల దాడులను నిరసిద్దాం - ప్రజాస్వామ్య ప్రేమికులకు అండగా నిలబడదాం )
- బండారు రమేష్