Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం నిరంకుశ పాలనకు అంతం పలికిన వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తీవ్రం చేయడం గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ నాయకులకు అలవాటైంది. నిజాం నవాబు తన సంస్థానాన్ని విలీనం చేసిన రోజును, తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భాన్ని ఉపయోగించుకొని వారు చరిత్రను వక్రీకరించి, అమృతం పేరుతో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మలబార్ తిరుగుబాటును ఆరెస్సెస్ నాయకత్వంలోని సంఘ్ పరివార్ వక్రీకరిస్తున్న విధంగానే ఇప్పుడు మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కూడా మన సమిష్టి జ్ఞాపకాల నుంచి చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్, హిందూ మహాసభలు ఎటువంటి పాత్రను పోషించని మాట నిజం. చారిత్రక రుజువులను, సమాచారాన్ని తిరగరాసి, స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ కూడా పాల్గొన్నదని నమ్మించడానికి బీజేపీ, ప్రభుత్వాన్ని ఉపయోగించు కుంటున్నది. అటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆగస్ట్ 28న ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని 'పాదయాత్ర' 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా దశల వారీగా కొనసాగనున్నది.
హైదరాబాద్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, దానిని అంతం చేసింది ఆరెస్సెస్, హిందూ మహాసభలు, నాటి కేంద్ర హౌంశాఖ మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ అని బీజేపీ వాదన. పటేల్ కారణంగానే నిజాం షరతులు లేకుండా లొంగిపోయాడనీ, హైదరాబాద్ భారతదేశంలో భాగం అయిందని బీజేపీ చెపుతుంది. వాస్తవానికి నాటి భారత ప్రభుత్వానికి మూల స్తంభాలుగా ఉన్న నెహ్రూ, పటేల్‌ల ద్వయం నిజాంకు 'రాజ ప్రముఖ్' బిరుదు ఇచ్చి, ఎటువంటి శిక్ష లేకుండా వదిలివేశారు. ఆఖరికి, నిజాం సైన్యానికి కమాండర్ అయిన ఖాసీం రజ్వీని కూడా కొద్ది రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతించారు. తెలంగాణ ప్రజలపై పాల్పడిన అకృత్యాలకు అతనిపై ఎటువంటి విచారణ కూడా చేయలేదు. మరోవైపు, కమ్యూనిస్టులకు బూటకపు విచారణలతో మరణశిక్షలను విధించారు. అనేక మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను జైలు నుండి అడవులకు, గుట్టల్లోకి తీసికెళ్ళి కాల్చిచంపారు. ఆనాడు ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పెరిగిపోతుందని ఆందోళనచెందింది.
నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు నిజాం, అతని ఫ్యూడల్ ప్రభువుల ఆగడాలను తట్టుకోలేక నానా కష్టాలు పడ్డారు. కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభలో చేసిన కృషి ద్వారా ఫ్యూడల్ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేశారు. వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, పేద వృత్తిదారులు, ''దున్నే వానికి భూమి'' కావాలని డిమాండ్ చేస్తూ, దోపిడీకి కారణమైన వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా 'ఎర్రజెండా' నీడన ఐక్యం అయ్యారు. కమ్యూనిస్టులు వెట్టిచాకిరీని, భూముల నుండి కౌలుదారుల బలవంతపు తొలగింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌలుదారులు సాగుచేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని, కౌలు ధరలను, పన్నులను తగ్గించాలని, జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించాలని, తమకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని డిమాండ్ చేశారు. మతంతో నిమిత్తం లేకుండా ప్రజలంతా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం, ఆయన ఫ్యూడల్ పాలకులు మద్దతు కోసం, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించే ప్రయత్నం చేశారు. కానీ కమ్యూనిస్టు పార్టీ చేసిన ప్రయత్నాల వల్ల ముస్లిం రైతులు, గ్రామీణ వృత్తిదారులు, గ్రామీణ పేదలంతా పోరాటం చేస్తున్న తెలంగాణ రైతాంగం వెనుక నిలిచారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు పార్టీల వలన మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో హిందూ, ముస్లింల ఐక్యత సాధ్యమైంది.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభ, ఆరెస్సెస్‌లకు ఎటువంటి పాత్ర లేదు. అంతకు ముందు రెండు దశాబ్దాల క్రితం వరకు వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న సంబంధాల విషయంలో ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా పేరున్న హైదరాబాద్ రాష్ట్రంలో వారు ప్రజల మధ్య మత విద్వేషాలను సృష్టించి, ఐక్యతను విచ్ఛిన్నం చేశారు. 'ముస్లింల ఊచకోత'ను విచారించడానికి భారత ప్రభుత్వం నియమించిన సుందర్ లాల్ కమిటీ ఈ విషయాలను రుజువు చేసింది.
ఆర్య సమాజ్, హిందూ మహాసభల రాకతో ఈ మతపరమైన స్నేహ సంబంధాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ రాష్ట్రానికి బయటినుంచి వచ్చిన ఆర్య సమాజ్, ఇతర మత విశ్వాసాలు గల వారు ముఖ్యంగా ముస్లింలపై చేసిన తీవ్ర విమర్శలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మౌల్వీలు ఆర్య సమాజ్ సభ్యులను అనుసరించారు. మిగతా భారతదేశంలో నెలకొని ఉన్న ప్రసంగాలు, పోటీ ప్రసంగాలు, మతపరమైన విరోధం, పరస్పర అపనమ్మకాల పరిస్థితులు హైదరాబాద్‌ను ప్రభావితం చేయకుండా ఉండలేవు. ఆ విధంగా రెండు మతాల మధ్య ఉన్న స్నేహ పూర్వక సంబంధాలు నెమ్మదిగా మాయమైపోయి, హైదరాబాద్ మత ఉద్రిక్తతలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆ కమిటీ నివేదిక పేర్కొంది.
కమ్యూనిస్టు పార్టీ, ప్రజాతంత్ర ఉద్యమాలు బలహీనంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ మతోన్మాద శక్తులు ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేష భావాన్ని వ్యాప్తి చేసి, విస్తృతంగా దాడులు చేశాయి. హైదరాబాద్ రాష్ట్రంలోని 16జిల్లాల్లో, ఉస్మానాబాద్, బీదర్, గుల్బర్గా, నాందేడ్ లాంటి జిల్లాలలో జరిగిన మతోన్మాద దాడుల్లో ముస్లింలే బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆ నాలుగు జిల్లాల్లో హిందూత్వ శక్తులు ముస్లింలను పెద్ద సంఖ్యలో హత్యలకు, అత్యాచారాలకు గురిచేసి, వారి ఆస్తులను లూటీ చేశారు. ఒక అంచనా ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 25వేలకు తగ్గకుండా ఉంది. ముస్లింల ఆర్థిక జీవన స్థితిగతులు ఒక క్రమ పద్ధతిలో ధ్వంసం చేసిన తీరును కమిటీ తెలిపింది. రాష్ట్రంలో మొత్తంగా లూటీలు లేక ధ్వంసం చేయబడిన ఆస్తుల విలువ పదుల కోట్లలో ఉంటుందని కమిటీ అంచనా వేసింది. ఈ మతోన్మాద వీరావేశపరులు మహిళలకు వ్యతిరేకంగా చేసిన అకృత్యాలకు హద్దులు లేకుండా పోయాయి. అనేక మంది మహిళలు తమ మానాలను కాపాడుకునేందుకు బావుల్లో దూకగా, అనేక మందిని వారి ఇళ్ళ నుండి బలవంతంగా తీసుకొని వెళ్ళి, కొన్ని రోజుల పాటు దాచి తరువాత వారి ఇళ్ళకు పంపించారు.
ఆర్య సమాజ్, దాని ఇతర సోదర మత సంస్థలు ప్రజలను బలవంతంగా మతమార్పిడి చేసిన విషయాన్ని గమనించినట్లు కూడా కమిటీ పేర్కొంది. వందల సంఖ్యలో ముస్లిం మహిళలకు బలవంతంగా తమ నుదుటిపైన, కొందరికి చేతులపైన మతమార్పిడికి గుర్తుగా పచ్చబొట్లు వేశారు. హిందూ మత పద్ధతిలో చెవులు కుట్టించుకున్న కొంత మంది చిన్న పిల్లలను కూడా చూసినట్లు కమిటీ తెలిపింది.
తమ మత సంబంధమైన కార్యక్రమాల నిర్వహణకు ఈ మతోన్మాద శక్తులు చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకున్నారు. ఆర్య సమాజ్‌కు చెందిన ఒక ప్రముఖుడు స్థానిక ఆర్య సమాజ్ మందిరాన్ని ఒక సబ్ జైలుగా మార్చిన విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. ఆయన తన స్వగ్రామం, చుట్టుపక్కల గ్రామాల నుండి ముస్లింలను నిర్బంధంలోకి తీసుకొని నాలుగైదు రోజులు తన 'సబ్ జైలు'లో ఉంచుకొని డబ్బు వచ్చిన తరువాత విడుదల చేసేవాడు.
కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంలోని భారత ప్రభుత్వం రెండూ కూడా మతోన్మాద వైరస్ వ్యాప్తిని వ్యతిరేకిస్తూ దేశాన్ని ఎలా రక్షించాలి అనే దాని కంటే కూడా కమ్యూనిస్టుల ప్రభావం వ్యాప్తి చెందకుండా ఎలా అదుపు చేయాలనే అంశాన్నే ఎక్కువగా ఆలోచించాయి. తెలంగాణ పోరాటం చాలా ప్రాంతాలకు విస్తరిస్తుందనే వాస్తవాన్ని భారత ప్రభుత్వం తెలుసుకొని దానిలో జోక్యం చేసుకుంది. నిజాం నవాబు భారత యూనియన్‌లో హైదరాబాద్‌ను విలీనం చేయడం, రజాకార్ల హింసను నిలువరించాలనే విజ్ఞప్తుల మేరకు కేంద్రం సైన్యాన్ని దింపింది. కానీ కమ్యూనిస్టులను అణిచివేయడమే కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యంగా అది పనిచేసింది.
భారత సైన్యంలోని కొన్ని శక్తులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, హిందూ మతోన్మాద శక్తులకు మద్దతుగా నిలిచాయని సుందర్ లాల్ కమిటీ పేర్కొంది. అనేక ప్రాంతాల్లో భారత సైన్యం ముస్లింల దుకాణాలను, వారి ఇళ్ళను లూటీ చేయమని హిందూ మత గుంపులను ఒప్పించి, ప్రోత్సహించింది. కొన్ని చోట్ల వారే లూటీలకు పాల్పడ్డారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, ఆడ పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్లారని మిలిటరీ సైన్యానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి. ప్రత్యేకంగా ఒక మతం పట్ల ఇలాంటి ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం అంటే, ఆయుధాలను స్వాధీనంలో ఉంచుకున్న హిందువులను వదిలివేసే విధానం సాధారణం అయింది. దీని వల్ల మతోన్మాద శక్తులు తమ హింసాయుత చర్యలకు పూనుకున్నారు. ఫలితంగా నిజాం నిరంకుశ చర్యలను వ్యతిరేకించిన సాధారణ ముస్లింల పైన దాడులు చేసి, వారిని చెప్పనలవికాని విధంగా కష్టాలపాలు చేశారు. కానీ గ్రామాల్లోని హిందువులు, ముస్లింలకు తమ ఇళ్ళలో ఆశ్రయం ఇచ్చి వేల సంఖ్యలో ముస్లిం కుటుంబాలను రక్షించారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇలాంటి ప్రజల ఐక్యత, వారి పోరాటాలు మాత్రమే నిజాం నవాబు లొంగిపోయి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసేందుకు దోహదం చేశాయి. నిజాంకు, భూస్వాములకు, గ్రామాల్లోని వారి సామంతులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ దాదాపు నాలుగువేల మంది నాయకులను, యోధులను కోల్పోయింది. వెట్టిచాకిరీ, అక్రమ నిర్బంధాలు, భూముల నుండి బలవంతపు తొలగింపులు, అధిక వడ్డీ రుణాలు, అవినీతి అధికారులు, గ్రామ అణచివేతదారుల వేధింపులను అంతమొందించడంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. వ్యవసాయ కార్మికులకు న్యాయమైన వేతన చెల్లింపులు అమలు జరిగాయి. ప్రజలకు ధాన్యం పంపిణీ చేశారు. కౌలుదారులు సాగు చేసిన భూములకు హక్కు పత్రాలు ఇచ్చారు. మూడు వేల గ్రామాల్లో స్వయం పాలన ఏర్పడింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర గ్రామీణ సేవలు ప్రజాకమిటీల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. పది లక్షల ఎకరాల భూమిని పంచారు. భూస్వాములు, దేశ్ ముఖ్లు, వడ్డీ వ్యాపారులు ఇచ్చిన రుణాలను రద్దు చేసి, వందల వేల సంఖ్యలో ప్రజలకు లబ్ది చేకూర్చారు. ఇదీ అసలు వాస్తవం.
నిజాంకు, అతని ఫ్యూడల్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం అనేది సంఫ్‌ుపరివార్ ఎజెండాలోనే లేదు. వారు వ్యవస్థ పైన వదిలేసిన మచ్చలు ఇప్పటికీ హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు వివిధ పాదయాత్రల పేరుతో చరిత్రను కట్టుకథలుగా ప్రచారం చేస్తూ, మతపరమైన మచ్చలను మరింత పెంచాలని చూస్తున్నారు. వారి ఈ యోచనను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
అనువాదం: బోడపట్ల రవీందర్,
- ఆర్. అరుణ్‌కుమార్
9848412451