Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యంగా మూడు విషయాలున్నాయి. ఒకటి: పైకి తలెత్తి నక్షత్రాల్ని చూడడం. తలవంచుకుని నీ పాదాల్ని నువ్వు చూసుకోవడం. రెండు: నిరంతరం పని చేయడం. అది - మన జీవితాలకు ఒక అర్థాన్ని, ధ్యేయాన్ని వివరించడం. మూడు: ప్రేమ - ఎవరికి ఎంత ప్రేమ దొరుకుతుందో చెప్పలేం. కాని, దాన్ని ఎప్పుడూ ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. జీవితానందం అదే... - స్టీఫెన్ హాకింగ్
మూఢనమ్మకాలు లేకుండా, పురాణాల గోల లేకుండా కూడా మానవ సంబంధాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని నిలుపుకోవచ్చునన్నది స్టీఫెన్ హాకింగ్ గట్టిగా చెప్పారు. ''దేవుడి మానవత్వం - మనిషి దైవత్వం రెండూ అజరామరం'' అని అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్. ''నేను దేవుణ్ణి ప్రేమిస్తాను ఎందుకంటే, అతణ్ణి తిరస్కరించే స్వేచ్ఛని ఆయన నాకిస్తాడు'' అని, మార్మికంగా చెప్పారాయన. 1931లో హిబ్బర్ట్ లెక్చర్‌లో భాగంగా - ఒక స్థాయి ఉన్నవాడి మాట ఆ స్థాయికి తగ్గట్టుగానే ఉంటుంది. స్థాయి లేనివాణ్ణి ఉన్నత పదవిలో కూర్చోబెట్టినా, అతనిది నేలబారు ప్రకటనగానే ఉంటుంది. శ్రీరాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ చదివి, తమ జీవితాలకు అన్వయించుకుని, ఆచరించాలని - భారత ఉప రాష్ట్రపతి చెప్పారు (ఏప్రిల్ 2021). చిన్నారులకు నిద్రపోయే ముందు కథలు చెప్పే అలవాటు క్రమంగా కనుమరుగవుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ''రామాయణం, మహాభారతం వంటి కావ్యాలు తెలుసుకుంటే బాల్యం నుండే నైతిక విలువలు పెంపొందుతా''యన్నారు - ఆయన అలా చేయడం వల్లనే ''గొప్ప నైతిక విలువలు'' గల రాజకీయ పార్టీలో చేరి, అంచలంచలుగా ఎదిగి భారత ఉపరాష్ట్రపతి అయ్యారన్న మాట!
తపసు చేసుకునే నిరాయుధుడైన శంభూకుడి తల నరకి - చెట్టు చాటునుండి దొంగ చాటుగా బాణం వదిలి, వాలిని చంపిన పరమ ''పరాక్రమ వంతుడైన'' రాముడిలో.. గర్భవతి అయిన భార్యను అడవుల పాలు చేసిన రాముడిలో - ఉప రాష్ట్రపతికి చాలా నైతిక విలువలు కనిపించాయి మరి? నమ్మకాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో మూఢత్వాన్ని ప్రోత్సహించేవారు ఏ మతస్థులైనా, సామాన్యులైనా, సంపన్నులయినా, మతాధిపతులైనా, మంత్రులైనా, ఆర్టికల్ 51ఎ(హెచ్) ప్రకారం అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. సామాజికంగా అది ప్రజలను వంచించడమే అవుతుంది! ఉపరాష్ట్రపతి అయినా, రాష్ట్రపతి అయినా దేశ ప్రధాని అయినా రాజ్యాంగ సూత్రాలకు అతీతులు కారు. విడాకులు తీసుకోకుండా భార్యను వదిలేయడం నైతికత అవుతుందా? ముందు ఆ విషయం స్పష్టంగా చెబితే బావుండేది కదా? దేశ ప్రజల సందేహం తీరేది.
హిందూ పురాణాల ప్రకారం భూగోళంపై సప్త సముద్రాలున్నాయి. అనేక పురాతన గాథల్లో, జానపద కథల్లో సప్త సముద్రాల ప్రసక్తి తరచూ వస్తుంది. భాగవతంలోని 5వ స్కందం 1-33 అధ్యాయంలో సప్త సముద్రాల వివరాలున్నాయి. అవి: 1. పాల సముద్రం 2. ఉప్పు సముద్రం. 3. పెరుగు సముద్రం, 4. నెయ్యి సముద్రం 5. మద్యం సముద్రం 6. శుద్ధ సముద్రం, 7. చెరకు సముద్రం. బూమి మీద ఇవి ఇలా ఈ పేర్లతో ఉన్నట్లు ఏ భూగోళ శాస్త్రజ్ఞుడికి గానీ, శాస్త్రవేత్తలు, చరిత్ర కారులకు గానీ, ప్రపంచ పర్యాటకులకు గానీ ఎవరికీ తెలియదు. ప్రపంచంలోని అన్ని సముద్రాలలో ఉన్నదంతా ఉప్పునీరే. శుద్ధ అంటే మంచి నీటి సముద్రాలు లేవు. పాలు, పెరుగు, నెయ్యి, కల్లు, సారా, చెరుకు రసాలతో సముద్రాలు లేవు. పాల సముద్రం అన్నది ఊహించుకున్నారు కాబట్టి దానిలోంచి వచ్చే పెరుగు-నెయ్యి సముద్రాలు కూడా ఉంటాయని ఊహించుకున్నారు. ఇందులో ఉన్నది కేవలం అవగాహనా రాహిత్యమే. ఇలాంటి వాటిని ఈతరం / ఈ కాలం స్వీకరించాలా? గత కాలపు అజ్ఞానాన్ని, అవివేకాన్ని నెత్తిన మోస్తూ తిరగాలా? జానపద కథల్లో కూడా ఉండని అభూత కల్పనలు, పురాణాల్లో ఉన్నాయి కదా?
అదే విధంగా, కేవలం భారతదేశ మనువాదులకే స్వంతమయిన కాల విభజన ఈ విధంగా ఉంటుంది. మొత్తం నాలుగు యుగాలు. 1. కృతయుగం అంటే సత్యయుగం - 17,28,000 సంవత్సరాలు. 2. త్రేతాయుగం - 12,96,000 సంవత్సరాలు. 3. ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు. 4. కలియుగం - 14,32,000 సంవత్సరాలు. మొత్తం 53,20,000 సంవత్సరాలు. ఈ కాలాన్ని 'మన్వంతరం' అన్నారు. ఆధునిక కాలంలో క్రీస్తు తర్వాత అని ఎలా అన్నారో అలాగే వీరు మనువు అనంతరం అన్నారు. అంటే మనువు అనేవాడి తర్వాత కాలం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో వేరెవ్వరికీ ఈ కాల విభజన తెలియదు. ఇది కేవలం పురాణ రచయితల కల్పిత కాల విభజన. ఈ కాల విభజనకు ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు. హేతుబద్ధత లేదు. కేవలం వారి విశ్వాసాలే వారికి ఆధారాలు. అయినా, ఒకరి విశ్వాసాల్ని మరొకరు ఎందుకు విశ్వసించాలీ? అంటే మనువాదుల నుండి సమాధానం ఉండదు. మూఢ విశ్వాసాలన్నీ మన పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న అజ్ఞాన అవశేషాలే!
'సండే యా మండే - రోజ్ ఖావ్ అండే' అని ప్రకటించే ప్రభుత్వం ''కోడిగుడ్డు ఉన్న చోటికి దేవతలు రారు'' అనే మూఢ నమ్మకాన్ని ప్రచారం చేస్తున్న బడుద్దాయిని ఎందుకు వదిలేస్తోందీ? తప్పుకదా? అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా? లేదంటే ప్రభుత్వ ప్రకటన అయినా రద్దు చేసుకోవాలి! ప్రవచన స్వాములు చెప్పే గుడ్డి సూత్రాలు ఇలా ఉంటాయి. ఈ చెత్తంతా శాస్త్రీయం అని చెప్పుకునే మూర్ఖత్వంపైగా - చూడండి ఎలా ఉంటుందో...
''స్నానం చేయకుండా, చెప్పులు వేసుకుని, ఎడమ చేతితో ఆవుకి గడ్డిపరకలు తినిపించినా కూడా ముప్పయి మూడు కోట్ల దేవతలకు మడికట్టుకుని సుశాస్త్రీయంగా హవిస్సులు అర్పించినంత ఫలితం వస్తుంది. 5గంటలు నానబెట్టిన ఉలవలు గోవుకు పెడితే వృత్తిలో నిలకడ ఉంటుంది. ఐదు గంటలు నానబెట్టిన బొబ్బర్లు గోవుకు పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. అదే విధంగా అదే పద్ధతిలో గోవుకు గోధుమలు పెడితే కీర్తి పెరుగుతుంది. కుసుమలు పెడితే ఆత్మకు స్నానం చేయించినంత ఫలితం లభిస్తుంది. కందిపప్పు పెడితే రుణవిముక్తి కలుగుతుంది..'' ప్రవచన స్వాములు చెప్పిన పాతిక ముప్పయి చిట్కాలలోంచి, నేనిక్కడ మచ్చుకి ఐదారు మాత్రమే ఇచ్చాను. వీటిలో దేనికీ రుజువులేదు. ఉండదు కూడా. కావాలంటే ఎవరైనా బ్యాంకు రుణం తీసుకుని తిరిగి ఇన్స్టాల్మెంట్లు కట్టకుండా ఐదుగంటలు నానబెట్టిన కందిపప్పు రోజూ గోవుకు పెడుతూ ఉంటే బ్యాంకు రుణం తీరిపోతుందేమో చూడాలి. ఈ లిస్టులో ప్రవచన స్వాములు చెప్పిన 27వ చిట్కా ఇలా ఉంది. ఐదుగంటలు నానబెట్టిన పొట్టు పెసరపప్పు గోవుకు పెడితే.. విద్యాభివృద్ధి, బుద్ధికుశలత లభిస్తుందని ఉంది. శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ప్రవచన స్వామిగారు ఆపనే చేసి ఉంటారు. అలా సముపార్జించిన తెలివి తేటల్ని ఆయన ఇలా జనానికి పంచుతున్నారేమో - అందుకేనేమో, హేతురహిత, ఇంగిత జ్ఞాన రహిత, అపార పాండిత్య ప్రకోపం? మూర్ఖ జనం ఉన్నందుకే కదా ఇలాంటి మహా మూర్ఖుల ప్రవచనాలు, మత బోధలు సాగుతున్నాయీ? ఇలాంటి వారిని చూసే కాబోలు అమెరికన్ జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్ ఎడ్వర్డ్ ఆర్. ముర్రో అంటారు. ''గొర్రెల దేశానికి తోడేళ్ళ ప్రభుత్వమే ఉంటుంది'' అని. ఇక్కడ ప్రభుత్వమంటే ప్రభుత్వమే కానక్కరలేదు. జనం గొర్రెల్లా గుంటే మంచి మాటల పేరుతో ప్రవచనకారులు మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తూనే ఉంటారు.
''మతం పేరుతో ప్రజల నుండి డబ్బు వసూలు చేయడం, దాన్ని మళ్ళీ సంతర్పణల పేరుతో దుబారాగా బ్రాహ్మణులకు ఖర్చు చేయడం ఒక ఆచారం, ఒక సంస్కృతి, ఒక వృత్తీ అయిపోయింది. షిరిడీకి చెందిన సాయి బాబా హిందూ ముస్లింల ఐక్యత కావాలన్నాడు. అన్ని మతాలు కలిసి ఐక్యమైపోవాలన్నాడు. బ్రాహ్మణ మతవాదులు దాన్ని పెడచెవిన పెట్టి, తమకు అనుకూలంగా మలుచుకున్నారు'' - అఖిల భారత సాయి భక్తుల సమావేశాన్ని ప్రారంభిస్తూ నాటి పార్లమెంటు సభ్యుడు, మాజీ భారత న్యాయశాఖా మంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడేమయ్యింది? అంబేద్కర్ లాగా మనుస్మృతిని దహనం చేయడానికి ఈ బాడా బడా దేశ నాయకులకు మనసొప్పదు. ఆయన లాగా ఇరవై రెండు ప్రతిజ్ఞలు పలకడానికి వారి పెదాలు కదలవు. అయినా, అంబేద్కర్ జయంతినాడు అంబేద్కర్ విగ్రహానికి దండవేసి, దండం పెట్టి చేతులు దులుపుకుంటారు.
బసవణ్ణ లింగాయత సంఘం వారు ఓసారి గౌరీలంకేశ్‌ను వక్తగా ఆహ్వానించారు. ఆమె వెళ్ళాలనుకోలేదు. కానీ, మళ్ళీ వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి?.. అనుకుని, వెళ్ళారు. ఆమె తన సహజ ధోరణిలో ఉపన్యాసం ప్రారంభించారు. ఒక్కోచోట కవితాత్మకంగా కూడా మాట్లాడారు. ''సంపన్నులు శివుడికి ఆలయం నిర్మిస్తారు. పేదవాడిని నేనేం చేయగలను? నా కాళ్ళే స్తంభాలు, నా శరీరమే ఆలయం, నా శిరస్సే స్వర్ణగోపుర శిఖరం. విను, నదీ సంగమదేవా - నిశ్చలమైనవి కూలిపోతాయి. చలన శీలమైనవి నిలబడతాయి'' అంటూ సాగే ఉపన్యాసంలో గౌరీలంకేశ్ మధ్యలో నిర్వాహకుల్ని ఓ ప్రశ్న అడిగారు. ''మీ లింగాయత మతాన్ని స్థాపించిన బసవణ్ణ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించాడు కదా! మరి మీరెందుకు ఒక కాల్పనిక దేవుడికి గుడికట్టాలనే వారితో స్నేహం చేస్తున్నారూ?.. అని! - అంతే వెంటనే సభ భగ్గుమంది. ఆహ్వానించిన వారే గౌరీలంకేశ్‌ను మాట్లాడనివ్వలేదు. మతం ఏదైనా కానివ్వండి. మతస్థుల ప్రవర్తన అలాగే ఉంటుంది. వారు చెప్పేది ఎదుటివారు వినాలే గానీ ప్రశ్నించగూడదు. మతాన్ని అనుసరించడం, అనుసరించకపోవడం ప్రజల ఇష్టా ఇష్టాలకు వదిలేయాలి. నిజానికి ఏ మతమూ గొప్పది కాదు. స్వేచ్ఛ - స్వాతంత్య్రాలూ గొప్పవి. అందుకే అంటున్నది... సంస్కృతి (జAూుఖ=జు) అనేది ప్రజల మృతకళేబారాన్ని పీక్కు తినే రాబందువు (హూూుఖ=జు)గా మారపోగూదని! కేవలం తంత్ర విద్యలు, క్షుద్రపూజలుమాత్రమే మూఢనమ్మకాలు కాదు.. దైనందిన జీవితంలోని శుభమంత్రాలు, దైవపూజలు, ప్రేయర్లు, దువా మాంగటాలు, నమాజ్‌లు అన్నింటికి అన్నీ మూఢనమ్మకాలే!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు