Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యం..ప్రజాస్వామ్యం..ప్రజాస్వామ్యం.. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి ఏం ప్రమాదమొచ్చింది.. అంతడనం కలవరిస్తున్నరు అనుకుంటున్నారా? గిప్పుడు గదే పంచాయతీ నడుస్తున్నది మన దేశంల. మీకు కొంత సమజై ఉంటది. ఇటీవల మన రాష్ట్రంతోపాటు దేశం మొత్తం గిదే 'ప్రజాస్వామ్యం' గురించి ముచ్చట నడుస్తున్నది. హస్తినలో ఉన్న పువ్వు సర్కారు, ఈడ ఉన్న గులాబీ ప్రభుత్వం... అందరూ మేంచెప్పినట్టు ఇనాలే.. మేము ఎవరి మాట ఇనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. గాడ ఆయన, గీడ ఈయన ఇద్దరూ సీతయ్యలేనాయే. జనం గురించి ఒక్క మాట మాట్లాడనిస్తలేరు, అడగనిస్తలేరాయే. కనీస జీతం గురించి, కార్మిక హక్కుల గురించి గా కమ్యూనిస్టోళ్లు, కార్మిక సంఘమోళ్లు నడవటం కూడా తప్పేనట. నోరు తెరిచేలోపల మూయించబట్టిరి. ఢల్లీీ అడుగులకు హైదరాబాద్ కూడా మడుగులొత్తబట్టే. మాట మాటాడితే నాలుక కోస్తా.. నోర్ముయి.. గప్చుప్ అంటూ బెదిరిస్తున్నారాయే. ఏమన్నా అంటే పోలీసులను ఉసిగొల్పి తమ పబ్బాలను, పంతాలను నెగ్గించుకోబట్టే. నయా తెలంగాణలో ప్రజల గోసలను సర్కారు చెవుల ఏద్దామన్నా కష్టంకాబట్టే. హతవీధీ ఏమీసేతురా లింగా !!
- బి.బసవపున్నయ్య