Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతావని కళలకు కాణాచి. వాటికి పుట్టినిల్లు. సంగీతం, చిత్రలేఖనం, గానం, నాట్యం... ఇలా అనేక కళల్లో ఆరితేరిన మహానుభావులు ఇక్కడ ఎందరో ఉన్నారు. వారందరికీ తీసిపోని రీతిలో మన గులాబీ దళపతి కేసీఆర్... అత్యద్భుతమైన కొత్త కళకు ఆద్యుడయ్యారు. ఆ కళ పేరే వంగటం. గతంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... హైదరాబాద్‌లో 'గాండ్రు... గాండ్రు...' అంటూ గర్జించిన ఈ కారు పులి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి మోడీకి సాష్టాంగ నమస్కారం చేసొచ్చారు. ఈ అద్భుత సన్నివేశాన్ని మరిచిపోకముందే మన సారు మరోసారి... దాదాపు రెండేండ్ల తర్వాత దేశ రాజధానికి చేరుకున్నారు. అధికారికంగా ఢిల్లీలోని టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన నిమిత్తం అక్కడికి వెళ్లినా... ఆ తర్వాత జరిగిన తతంగమంతా మనకెరుకే. ముందు ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా దాదాపు ఆర్రోజులపాటు ఢిల్లీ గల్ల్ల్లీల్లో తిరిగిన టీఆర్ఎస్ అధినేత... ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులను కలిసిన విషయం విదితమే. కథ ఇంతవరకూ బాగానే ఉన్నా, ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది. సీఎం ఢిల్లీ ఫ్లయిటెక్కటానికి ముందు రోజు వరకూ రాష్ట్ర మంత్రులు... కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. ప్రతిగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, రాష్ట్ర బీజేపీ పెద్ద తలకాయలు... తెలంగాణ సర్కారు పథకాలు, కార్యక్రమాల్లో రంధ్రాన్వేషణ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే కేసీఆర్, 'పెద్దాయన్ను...' కలిసిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంపై ప్రేమ పుట్టుకొచ్చింది. అదే సమయంలో కేంద్ర మంత్రులకు తెలంగాణ స్కీములు, ప్రోగ్రాములు మస్తు నచ్చినరు. దీంతో అక్కడి మంత్రులు, ఇక్కడి అమాత్యులు పరస్పరం... పుష్ప గుచ్ఛాలు, పూల దండలు, శాలువలు, సన్మానాల్లో మునిగిపోయారు. చివరికి 'ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్...' అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఢిల్లీని వదిలి తిరిగి మన సారు హైదరాబాద్‌కు వచ్చారు కాబట్టి... కేంద్రంపై పాత పద్థతిలోనే 'గాండ్రు.. గాండ్రు...' అని గర్జిస్తారా..? లేక సైలెంటై పోతారా...? అనేది చూద్దాం. -బి.వి.యన్.పద్మరాజు