Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ పోరాటం పేదలకు 10లక్షల ఎకరాల భూమి పంచింది. అందులో మీ వాటా 10గజాలు కూడా లేదు. ఆ దళాలు 3వేల గ్రామాలను దొరల దోపిడీ నుండీ, పాలననుండీ విముక్తి చేశాయి. గ్రామ స్వరాజ్యం స్థాపించాయి. మీరొక వార్డును కూడా దొరల దాష్టికాన్నుంచి విడిపించలే. ఆ యుద్ధంలో వేలకొద్దీ గడీలు నేల కూలాయి. అందులో ఒక్క ఇటుక ముక్క ఇరగటంలో కూడా మీ పాత్ర లేదు. నాడు వేల టన్నుల ధాన్యం, దొరల ధాన్యాగారాలనుండి తీసి పేదలకు పంచారు. అందులో మీకు పావుసేరు భాగం లేదు. ఆనాటి గుదప సంఘాలు, దొరలకూ, పటేల్, పట్వారీ, కర్నాలకూ కంట్లో నలుసులయ్యాయి. మీరేమో దొరల దోపిడీ సయ్యాటలకు, ఉయ్యాలలయ్యారు. నీ బాంచన్ (నీ బానిసను) దొరా, నీ కాల్మొక్కుతా దొరా అన్న తెలంగాణ పేద పుత్రుని చేత ఆపోరాటం గుతప పట్టించింది. గునపం పట్టించింది. బందూకు (తుపాకీ) కూడా పట్టించింది. వంగిన ఆ నడుమును లేపి నిలబెట్టి వీరుణ్ణి చేసింది. చివరకు ఆ వీరపుత్రునిచేత మరఫిరంగి మోత మోగింప చేసిందా పోరాటం. నువ్వు మాత్రం అప్పుడైనా, ఇప్పుడైనా ఆ గులాంగిరీనే ఉండాలంటున్నావు. నాలుగువేల మంది ఎర్రజండా బిడ్డలు, ఆ నైజాం, భూస్వామ్య సైన్యాన్ని, రజాకారు ముష్కరులను, పటేల్ సైన్యాన్ని ఎదిరించి పోరాడి, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఆ అమరుల జాబితాలో భూతద్దం పెట్టి వెతుకులాడినా, ఒక్కరంటే ఒక్కరు కూడా మీరు కనపడటం లేదు. ఆ పోరాటం గురించి ప్లాను వేసిన వాళ్ళల్లో, రాత రాసిన వాళ్ళల్లో, పాట పాడిన వాళ్ళల్లో, తుపాకి పట్టిన వాళ్ళల్లో, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళల్లో, ప్రాణాలు తీసిన వాళ్ళల్లో, ప్రాణాలిచ్చిన వాళ్ళల్లో, సకలకులాల వాళ్ళున్నారు. సకల మతాల వాళ్ళూ ఉన్నారు. మీరేమంటున్నారు. ఇది మత పోరాటమంటున్నారు. ఇది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా, హిందూ ప్రజలు చేసిన పోరాటమంటున్నారు.
మీరు చెప్పేదే నిజమయితే, దొరలిచ్చిన దొంగ తీర్పులను ఎదిరించి పోరాడి అమరుడైన షేక్ బందగీ ఎవరు? ''హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలేతో సారే జమానేకో, సాత్లేకే చలో'' అంటూ, నైజాంకు వ్యతిరేకంగా చైతన్యాన్ని రగిలించిన ముగ్దుం మొహియుద్దీన్ ఎవరు? తను పని చేస్తున్న పత్రికలను ఒకటెంట మరొకదాన్ని నిషేధిస్తుంటే, ఉన్న పొలమమ్మి, భార్య నగలమ్మి మరీ పత్రిక పెట్టి, నిజాం వ్యతిరేక ప్రచారాన్ని సాగించిన షోయబుల్లా ఖాన్ ఎవరు? నిజాం వ్యతిరేక భావజాలం, భారత స్వాతంత్య్ర సాధన, ప్రజాస్వామ్యం, ప్రధాన లక్ష్యాలుగా ఏర్పాటు చేసిన ''కామ్రేడ్స్ అసోసియేషన్'' నాయకుడు జువాద్ రజ్వీ ఎవరు? ఈ అసోసియేషన్ నుంచి కమ్యూనిస్టు పార్టీ వైపుకు ఆకర్షితులైన సయ్యద్ ఇబ్రహీం, అలంఫ్ు మీర్ ఎవరు? మహారాష్ట్ర పరిషత్ నుండి సోషలిస్టు భావాలవైపు ఆకర్షితులైన హబీబుద్దీన్ ఎవరు? దేశం స్వాతంత్య్రం పొందిన నాడు, తెలంగాణలో ఆ స్వేఛ్చా వాయువులు వీయ వీలులేదని, జాతీయజండాలు ఎగురవేయటాన్ని నిషేదిస్తూ నైజాం ఫర్మానా జారీ చేశాడు. ఆ నిషేదాన్ని సవాలు చేస్తూ, ఆ నిజాం కాలేజీలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి నిజాంకే సవాల్ విసిరిన రఫీ అహ్మద్ ఎవరు? వీరంతా ముస్లింలు కాదా?
మేం భారత పటాన్ని తిరగ రాస్తున్నాం. జమునా, మూసీలను కలగలిపి దగ్గరకు తెస్తున్నాం. మేం బాబర్ కొడుకులం, ఘజనీ మనవళ్ళం, మేం తలుచుకొంటే ఎర్రకోటపై అసఫ్‌జాహీ జండా ఎగురవేస్తామని విర్రవీగిన ఖాసిం రజ్వీ స్థాపించిన రజాకార్ సైన్యంలో చేరిన విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఎవరు? కల్లూరు జమిందారు రాఘవరావు, జన్నారం ప్రతాపరెడ్డి వీళ్ళందరూ ఎవరని రజాకార్లను బలపరిచారు. ఆనాడు తెలంగాణ అతిపెద్ద భూస్వాముల్లో ఒకరైన అశ్వారావుపేట జమిందారు బాబు, ఎవరని తన కోటగోడలోని గడీలో రజాకార్లకు స్థావరం కల్పించాడు. ఆ స్థాన బలాన్ని ఆసరా చేసుకొనే గదా ఆ ప్రాంత గిరిజన ముద్దుబిడ్డ సోయం గంగులును ఆ నైజాం ముష్కరులు బలిగొన్నది. ఈ దొరలు, జమిందార్లు, జాగీర్దార్లు, కరణాలు, పటేల్‌లు, పట్వారీలు ఎవరు వీరంతా? హిందువులు కాదా?
అందుకే ఆ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులో, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలో చేసిన పోరాటం కాదు. అది వర్గ పోరాటం. పీడిత వర్గాలకు చెందిన సకల ప్రజలు, సకుల ప్రజలూ పాల్గొన్న పోరాటం. అది భూస్వామ్య వ్యతిరేక పోరాటం. దొరలకు, దేశ్‌ముఖ్‌లకు, జమిందారులకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం. దున్నేవాడికి భూమికావాలని సాగిన పోరాటం. బలవంతంగా, ఉచితంగా చేయించుకొంటున్న వెట్టి చాకిరీ రద్దు కావాలని సాగిన పోరాటం. ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఆ పోరాటంలో పీడకులలో హిందువులూ, ముస్లింలూ ఉన్నారు. పీడితులలోనూ హిందువులూ, ముస్లింలూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పీడకులలో అయినా, పీడితులలో అయినా ఎక్కువమంది హిందువులే ఉన్నారు.
కాకపోతే ఈనాడు మీ పార్టీ ప్రజలను విభజించి రాజకీయ లబ్ది పొందటానికి చేస్తున్నట్లుగానే, ఆనాడు ముస్లిం ప్రజలందరినీ తనవెంట తిప్పుకోవాలని నైజాం నవాబు, ఆయన అనుయాయూడు ఖాసిం రజ్వీ ఆలోచించిన మాట నిజం. ఎప్పుడైనా పాలక వర్గాలు తమ ఆధిపత్యం అంతమవుతుంటే, ఏ రూపంలో అయినా దానిని నిలుపుకోవాలని చూస్తారనే విషయం జగద్విదితం. అందులో భాగంగానే వారా విభజన తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అమన్ మాలిక్ (నేనే యజమాని, మనమే యజమానులం) అనే నినాదాన్ని తీసుకువచ్చారు. తీవ్రమయిన మత భావాలను తన ఆవేశపూరిత ప్రసంగాలద్వారా ముస్లిం సమూహంలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం రజాకారు నేత ఖాసిం రజ్వీ చేశాడు. ఆ ఉద్రేక భావాలకు కొందరు యువకులు లోనయ్యి ఉండవచ్చు. కానీ పేద ముస్లిం ప్రజానీకం అంతా, దానిని స్వీకరించలేదు. అందుకే రజాకారు సైన్యాలలో దొరలు, దొరల వద్ద పనిచేసిన రౌడీలు, గూండాలూ చేరిపొయ్యారు. మీరెన్ని కుట్రలు చేసి, వాస్తవాలు వక్రీకరించి, మత చిచ్చు రగిలించి, రాజకీయలబ్ది పొందుదామని చూసినా, ఇక్కడ మీ ఆటలు సాగవు. ఇది వీర భూమి. హిందూ భూమో, ముస్లిం భూమో కాదు. గోద్రాల, ముజఫర్ నగర్ల భావజాలాలకు ఇక్కడ స్థానం ఉండదు.
మీరు సెప్టెంబర్ 17 విమోచనా దినోత్సవమంటున్నారు. ఎవరినుండి విమోచనో, ఎవరికి విమోచనో చెపుతారా? పటేల్ సైన్యం వచ్చిన నాలుగురోజుల్లోనే నాటి తెలంగాణను విమోచన చేసింది కాబట్టి, దానిని ఉత్సవంగా జరపాలంటున్నారు. నిజంగా అంత ప్రజా కంటకుడి నుంచి విమోచన చేస్తే, మళ్ళీ అదే ప్రాంతానికి అతనినే రాజ్‌ప్రముఖ్ (గవర్నర్) చేసి, పటేల్ తరపున పరిపాలన చేసే అధికారం ఆ నవాబుకే ఎందుకిచ్చారు? ఆయన అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు ఆయనకే ఎందుకు వదిలేశారు. ఆనాడే 850కోట్ల రూపాయలు విలువ చేసే రాజాభరణాలు ఎందుకొదిలేశారు. ఏడాదికి 50లక్షల జీతం ఎందుకిచ్చారు. నవాబుకే కాదు. జమిందార్లు, జాగీర్దార్లకు కూడా వార్షికాదాయాన్ని లెక్కగట్టి పటేల్ సారు పరిహారం ఇప్పించారు కదా! 1948 సెప్టెంబర్ 17 నుండి, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26దాకా అలానే పోషించారు కదా! అప్పటిదాకా ఆ నిజాం ఫర్మానాలతోనే కదా పాలన సాగింది. అంతెందుకు 1950 జనవరి 26న యంకె వెల్లోడీ (ముల్లాత్ కాడింగ్ వెల్లోడి)ని ముఖ్యమంత్రిగా నియమించటం నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేతులమీదుగానే సాగింది కదా.
పీడకుడైన నైజాం నుండి, పటేల్ చేతికి పాలన పోతే, నైజాం చేతుల్లో 1500 మంది చంపబడితే, 2500 మంది తెలంగాణ వీరపుత్రులు మీరు చెప్పే పటేల్ సైన్యం చేతుల్లో ఎలా చనిపోయారు? అందుకే ఆనాటి ఆపరేషన్ పోలో లక్ష్యం నిజాంను లొంగతీసుకోవటం కాదు. నైజాం మూకలు, రజాకారు సైన్యాలు అప్పటికే కమ్యూనిస్టు దళాల చేతుల్లో నలిగి పొయ్యాయి. కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని అణచి భూస్వాముల భూములు వారికే తిరిగి అప్పచెప్పి, వాళ్ళని గ్రామాలకు పంపి, తమ భూస్వామ్య విధానాన్ని కాపాడుకోవటమే ఆ ఆపరేషన్ పోలో లక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లోనే నైజాం నవాబు లొంగిపొయినా, 3సంవత్సరాలు యూనియన్ సైన్యాలు తెలంగాణానే అంటిపెట్టుకొని ఉన్నాయి. తెలంగాణలో బలంగా వ్యాపిస్తున్న కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. మిలటరీ చెయ్యాల్సిన యుద్ధంతో పాటు అతి నీతిబాహ్యమైన పనులను కూడా పటేల్-నెహ్రూ సైన్యాలు చేశాయి. స్త్రీల మాన-ప్రాణాలు దోచుకొన్నారు. కాన్సన్ట్రేషన్ క్యాంపుల్ని పెట్టి 20మంది మాత్రమే పట్టే గుడారాల్లో 200మందికి పైగా నిర్భంధించారు. మల, మూత్ర విసర్జనకు కూడా బైటకు వెళ్ళకుండా గుడారాలలోనే అన్నీ అన్నారు. బ్రిగ్స్ ప్లాన్ పేరుతో అర్థరాత్రులు గ్రామలమీద దాడులు చేసి బందిపోట్లను మరిపించారు. స్త్రీలను వలువలూడదీసి, నగంగా నిలబెట్టి, రాక్షసానందం పొందారు.
ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల, వాళ్ళను బలపరుస్తున్న ప్రజల మనో నిబ్బరాన్ని, పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేక పోయాయి. ప్రజాపోరాటంలో పంచుకొన్న భూములకు, తగిన చట్టబద్ద రక్షణ కలిగే వరకూ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించింది కమ్యూనిస్టు పార్టీ. మూడు సంవత్సరాల అనంతరం కేంద్రప్రభుత్వమే దిగివచ్చింది. భూసంస్కరణల ద్వారా పేదల స్వాధీనంలో ఉన్న భూములపై వారికే హక్కు కల్పిస్తామన్నది. చట్టపరంగా ఈ రక్షణలుంటాయని, రక్షిత కౌల్దారీ చట్టం 38(ఇ) తెచ్చింది. అప్పుడు కమ్యూనిస్టుపార్టీ 1951 అక్టోబర్ 21న సాయుధపోరాటాన్ని విరమించుకొన్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నది. ఆనాటి భూస్వామ్య, ఈ నాటి పెట్టుబడిదారీ పాలన ప్రజలపై రుద్దాలని చూస్తున్నది. భూస్వాములకు, పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను కట్టబెడుతున్నది. డీ మోనిటైజేషన్ పేరుతో ఒకసారి, మోనిటైజేషన్ పేరుతో ఇంకోసారి కార్పొరేట్‌శక్తుల అడుగులకు మడుగులొత్తుతున్నది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అయినా, నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ ప్రకటనలయినా, పాలసీలయినా, ప్రజాసంపదను కార్పొరేట్ కంపెనీలలోకి తరలించే వరద పైపులు కాదా? ఆ పైపుల్లో నుండే కదా, ఇప్పటికే ప్రభుత్వం వేసిన 26,700 కి.మీటర్ల రోడ్లు, ప్రభుత్వమే కట్టి నడుపుతున్న 400 రైల్వే స్టేషన్లు, 90 రైళ్ళు, 1400 కి.మీ రైల్వే ట్రాక్‌లు, 4 హిల్ రైల్వేస్, 265 రైల్వే గూడ్స్ షెడ్స్, 15 రైల్వే స్టేడియాలు, 673కి.మీ డియఫ్సి రైల్వే ట్రాక్, 28,608 కి.మీ పవర్ సికెటి, 6 గిగావాట్ల పవర్ జనరేషన్ ప్లాంట్లు (ఒక్కొక్క గిగావాట్‌తో 3లక్షల ఇళ్ళకు విద్యుత్ సప్లరు చేయవచ్చు), 2.86 లక్షల కి.మీ భారత్ నెట్వర్క్ ఫైబర్‌లైన్, 14,917 బియస్యన్యల్ టవర్లు, 8,154 కి.మీ వంట గ్యాస్ పైపులైన్లు, 3,930 కి.మీ యల్పీజీ పైపులైన్లు, రెండు కోట్ల పది లక్షల టన్నులు నిల్వచేసే ఎఫ్‌సీఐ, సెంట్రల్ వేర్‌హౌస్ గోడౌన్ లు, 160 ప్రాంతాలలోని బొగ్గు బావులు, 25 ఎయిర్‌పోర్టులు, 2నేషనల్ స్టేడియాలు, 2రీజనల్ స్టేడియాలు, దేశ రాజధాని ఢిల్లీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 250 ఎకరాల భూమి, ఇవన్నీ ఇప్పుడు మీరు కార్పొరేట్లకు కేవలం కట్టబెడుతున్నారు..?
మీది పోరాట వారసత్వం కాదూ నైజాం వారసత్వమనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఆనాడు ఆయన జాగీర్దారీ విధానం ద్వారా దొరలకు జాగీర్లు అప్పజెప్పాడు. ఇప్పుడు మీరు మోనిటైజేషన్ పైప్‌లైన్ విధానం ద్వారా కార్పొరేట్లకు జాగీర్లతో పాటు, అన్ని రంగాలను అప్పజెపుతున్నారు. ఆనాడు నవాబు తనకు వ్యతిరేకంగా రాసిన పత్రికలు తేజ్ అక్బర్, రయత్, ఇమ్రోజ్లను నిషేధించాడు. ఈనాడు మీరు మీకు వ్యతిరేకంగా వాస్తవాలు వ్రాసిన దైనిక్ జాగరణ్, దివైర్, న్యూస్ క్లిక్ పత్రికలపై దాడులు చేసి వేధిస్తున్నారు. ఆనాడు షోయబుల్లా ఖాన్ చేతులు నరికేసి నవాబు తన నైజాన్ని చాటుకొంటే, ఈనాడు మీరు గౌరీలంకేష్‌ను, గోవింద్ పన్సారేను, యంయం కల్బుర్గీని బలిగొని మా నైజమూ అదే అని రుజువు చేశారు. మీరు తెచ్చిన దుర్మార్గమైన రైతు చట్టాలను, సోషల్ మీడియాలో ప్రశ్నించిందని 22ఏండ్ల యువతి దిశారవిని జైలుకు పంపారు. అత్యంత అమానవీయ అకృత్యమైన హత్రాస్ మనీషా ఘటనను పరిశీలించడానికి వచ్చిన, సిధ్దికీ కప్పన్పై దేశద్రోహ నేరంమోపి నెలల కొద్దీ జైళ్ళల్లో పెట్టి వేధిస్తున్నారు. ఆనాడు గ్రామాలమీద బందిపోట్ల వలే దాడిచేసిన నవాబు బ్రిగ్స్ ప్లాన్ లాగానే, ఈనాడు రైతులు రాజధానికి రాకుండా రోడ్లపై కందకాలు తవ్వి, మేకులు కొట్టి శత్రుదేశ సైనికులను తలపిస్తున్నారు. ఆనాడు ప్రజలపై దాడులకు రజాకార్లను నైజాం సృష్టిస్తే, ఈనాడు దేశ రాజధాని సరిహద్దుల్లో, 10మాసాలుగా ఆందోళన చేస్తున్న అన్నదాతలపై దాడులకు మీ సంఘ సైన్నాన్ని పంపించారు. ఇలా చెప్పుకొంటూ పోతే మీ పాలనకూ, నైజాం పాలనకూ చాలా పోలికలున్నాయి. అందువలన మీరూ ఆ వర్గ పుత్రులే. ఆ వర్గ వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళ్ళడమే మీ పని.
మీవర్గ నైజాన్ని మేము గమనించాం. అందుకే నీ ఆటలు సాగనివ్వకూడదనే దేశవ్యాపితంగా 19పార్టీలు ఐక్యమై మీ పాలనకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తున్నాం. మా రైతు, కార్మిక సోదరులు, కష్టజీవులందరం కల్సి ఈ నెల 27న దేశమంతా బందు చేసి నీకు నిరసన సెగను చూపించబోతున్నాం. గత బందునాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25కోట్లమంది పాల్గొన్నారు. ఇప్పుడింకా ఆ సంఖ్య ఎంత పెరుగుతుందో చూసుకో. ఇప్పటికైనా విభజన రాజకీయాలు మానుకో.
- పి. సుదర్శన్ రావు