Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైలాసమంతా హడావుడిగా ఉంది. పార్వతిదేవి ముద్దుల కుమారుడైన వినాయకుడి పుట్టిన రోజైన వినాయకచవితి సందర్భంగా అందరూ మంచి ఏర్పాట్లు చేశారు. తొలి పూజకోసం వినాయకుడిని పిలిచేందుకు తల్లి పార్వతి వచ్చింది! కాని వినాయకుడు అలిగి కూర్చున్నాడు! పార్వతిదేవి ఆశ్చర్యపోయింది!
''ఏమి నాయనా అలిగావు! ఎందుకో తెలుపు!'' అని అడిగింది పార్వతి.
''నాదో కోరిక తీర్చాలి మాతా!'' డిమాండు చేశాడు వినాయకుడు.
పార్వతి మల్ళీ ఆశ్చర్యపోయింది!
''నీవే అందరి కోరికలు తీర్చేవాడవు కదా! నీవే కోరిక తీర్చమని కోరటం విడ్డూరంగా ఉంది! అయిననూ నీ పుట్టినరోజు కదా! నీ కోరిక ఏమిటో తెలుపుము! తప్పక తీర్చెదను!'' వాగ్దానం చేసింది!
''అమ్మా!నేను భూలోకం వెళ్ళొస్తాను!'' కోరాడు వినాయకుడు.
పార్వతి కాసేపు ఆలోచించి, అంగీకరించింది! తొలిపూజ పూర్తికాగానే తన మూషిక వాహనం మీద భూలోకం బయలుదేరాడు వినాయకుడు. గత సంవత్సరం కరోనా కారణంగా వినాయకచవితి సక్రమంగా జరగలేదు. అంతెందుకు వినాయకుడిని భూలోకం వెళ్ళద్దనీ లాక్డౌన్ విధించింది పార్వతి! దాంతో వినాయకుడికి బర్త్డే సెలబ్రేషన్స్ లేకుండా పోయాయి! ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో పార్వతి కూడా పర్మిషన్ ఇచ్చింది.
ఉత్సాహంగా తన పర్యటన ప్రారంభించిన వినాయకుడు దేశంలోని పలు ప్రాంతాలు తిరిగి, వివిధ రూపాలలోని తన విగ్రహాలను, అక్కడ చేసిన ఏర్పాట్లను అన్నింటినీ కళ్ళారా వీక్షించాడు! ఇంతలో చిన్నగా మూలుగు విన్పించింది! అటూ, ఇటూ చూశాడు! మూలుగుతున్నది తన మూషికుడే!
''ఏమి మూషికా! అలసిపోతివా! మూలుగుచుంటివి?'' అనునయంగా ఆరా తీశాడు వినాయకుడు!
''అవును స్వామీ! బాగా అలిసిపోయితిని! మీ సుడిగాలి పర్యటనలో ఏకబిగిన దేశమంతా తిప్పితిరి కదా!'' అన్నాడు మూషికుడు నిష్టూరంగా.
''సరే! ఆ వటవృక్షము కింద సేద దీరుదము పద!'' అని ఇద్దరూ వటవృక్షము కిందికి చేరారు. కాని వినాయకుడు సంతృప్తిగా లేనట్టు మూషికుడు గుర్తించాడు.
''స్వామీ! ఏల నిరుత్సాహంగా ఉన్నారు! మీ పుట్టిన రోజు ఏర్పాటును భూలోకవాసులు ఘనంగా చేస్తున్నారు కదా!'' అన్నాడు మూషికుడు.
''భూలోక వాసులను చూడు ముషికా! వారి మాస్కుల వెనకున్న ముఖాలలో ఆనందం లేదు! చవితి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లే ఉంది గాని, ఎక్కువ మంది ప్రజలు, వారి కష్టాలను నాకు మొరపెట్టుకుంటున్నారు! అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను.'' అన్నాడు బాధతో వినాయకుడు.
''అదేమిటి స్వామి! తమ కోర్కెలు తీర్చమని భక్తులు కోరటం, మీరు వాటిని తీర్చటం ఆచారమే కదా! ఇందులో కొత్తగా బాధపడుతున్నారెందుకు?'' ప్రశ్నించాడు మూషికుడు.
''నిజమే మూషికా! అయితే గతానికీ, ఇప్పటికీ తేడా ఉన్నది. గతంలో భక్తులు విజ్ఞానము రావాలని, వర్షాలు కురవాలని, పంటలు పండాలని, ఇలా అందరికీ పనికొచ్చే కోర్కెలు కోరేవారు! ఇప్పుడు పరిస్థితి మారింది! తమ ఉద్యోగం నిలబడాలని, కనీసం నెల మొదటి వారంలోనైనా జీతం రావాలని, కరోనా పోవాలని, వర్షాలు పడకూడదని కోరుకుంటున్నారు!'' అన్నాడు వినాయకుడు.
''నా చిన్న బుర్రకేమీ అర్థంకాలేదు!'' అని తల అడ్డంగా ఆడించాడు మూషికుడు.
పొడవైన తొండం చాటున చిన్నగా నవ్వాడు వినాయకుడు.
''గతంలో భక్తులు కోరిన కోరికలు చాలా సహజమైనవి! కాని ఇటీవల భక్తులు కోరుతున్న కోర్కెలు అసహజమైనవి! తన ఉద్యోగం ఉండాలని కోరుకునే స్థితి రావటానికి కారణం ప్రభుత్వ విధానం! అదే విధంగా మొదటి వారంలోనైనా జీతం రావాలని కోరుకోవటం కూడా అసహజమే! ఎందుకంటే ఎవరైనా జీతం కోసమే ఉద్యోగం చేస్తారు! ఆ జీతం ఆలస్యంగా రావటమంటే, ఆ కార్మికుడి కుటుంబం గడవటం కష్టమవుతుంది! అంతే కాకుండా యజమానికి లాభం జరుగుతుంది! కష్టజీవుల నోర్లు కొట్టి యజమానుల బొజ్జలు నింపేలా ఉన్న ప్రభుత్వ విధానాలే దీనికి కారణం! అంటే కార్మికులు సహజమైన కోర్కెల వైపు నుండి ప్రభుత్వ విధానాల వల్ల వచ్చే సమస్యలు పరిష్కరించమని నన్ను కోరుతున్నారు!'' అని వివరించాడు వినాయకుడు.
''ఎందుకు ఇలా జరుగుతున్నది స్వామి?'' అడిగాడు మూషికుడు.
''ఇలా జరగటానికి పాలకుల కుటిల నీతే కారణం! నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి, దారిద్య్రం మొదలైన అనేక సమస్యలు ఉండగా, వాటిని పరిష్కరించకుండా రామజన్మభూమి, గోమాత లాంటి మత పరమైన సమస్యలు ముందుకు తెచ్చి ప్రజలు వాటి చుట్టూ తిరిగేలా ఎత్తుగడలు వేస్తున్నారు. వీటిని అర్థం చేసుకోకుండా ప్రజలు మత్తులో మునిగిపోతున్నారు! సందెట్లో సడేమియాలాగా ఈ మధ్యలో పెత్తందార్లు బొజ్జలు నింపుకుంటున్నారు'' వివరించాడు వినాయకుడు.
''మధ్యలో పెత్తందార్ల బొజ్జలు ఎలా నిండుతున్నాయి స్వామి?'' సందేహం వెలిబుచ్చాడు మూషికుడు.
''వివరిస్తాను విను! యాపిల్ పండ్లకు ప్రసిద్ధిగాంచిన హింమాచల్ ప్రదేశ్లో ఇంతకు ముందు డజను యాపిల్ పండ్లకు రూ.99 ఉండగా, ఇప్పుడు రూ.69 మాత్రమే ఇస్తామని ఆదానీ కంపెనీ ప్రకటించింది! కొత్త రైతు చట్టాలు అమలు చేయవద్దని తొమ్మిది నెలలుగా రైతులు ఢిల్లీకి కూత వేటు దూరంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు! అది దేశద్రోహుల పోరాటమని పాలకులు ముద్రవేశారు. దేశద్రోహం అనే పేరుమీద ప్రజలను దారి మళ్ళించి, అంబానీ, ఆదానీలకు బొజ్జలు నింపే రైతు చట్టాలు అమలు చేసే ప్రయత్నం జరుగుతున్నది'' అన్నాడు వినాయకుడు.
మూషికుడు జాగ్రత్తగా వింటున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిదే బీజేపీ సృష్టించింది! కరోనా నేపథ్యంలో నా కోసం ఎక్కువ సంఖ్యలో మండపాలు పెట్టొద్దని, నా విగ్రహాల సంఖ్యను కూడా తగ్గించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది! దీనిపై ఆ రాష్ట్రంలో బీజేపీ నానా హంగామా చేస్తోంది! విచిత్రం ఏమిటంటే దేశ ప్రధాని బీజేపీ నాయకుడైన నరేంద్రమోడీ కూడా ఎక్కువగా మండపాలు పెట్టొద్దని, విగ్రహాలు పెట్టొద్దని, నిమజ్ఞనం పేరిట కాలుష్యం సృష్టించొద్దని అన్నాడు. బీజేపీ నాయకులేమో కాదు కూడదని నానా యాగీ చేస్తున్నారు. దీనర్థం ఏమిటంటే నన్ను కూడా బీజేపీ వారు తమకు అవసరమైనట్టు వాడుకుంటున్నారు! అన్నాడు వినాయకుడు.
''అవును స్వామీ! ఎవరి ఇంట్లో వారు, మిమ్మల్ని పూజించుకుంటే ఏ సమస్యా ఉండదు కదా!'' అన్నాడు మూషికుడు.
''అవును! మాలాంటి దేవతలను, ఈ పాలకులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న విషయం ప్రజలు తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు నిజమైన పరిష్కారం దొరుకుతుంది! అంతవరకు ప్రజలు అన్యాయంగా మోసపోతుంటారు! తమను మోసం చేస్తున్న వారెవరో ప్రజలు గుర్తించే తరుణం త్వరలోనే వస్తుంది! పద కైలాసం వెళదాం!'' అంటూ వినాయకుడు, మూషికుడిని పరుగెత్తించాడు.
- ఉషా కిరణ్