Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదిహేడు నెలల తర్వాత ప్రారంభ మైన ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళ లాడుతున్నాయి. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి కావచ్చు లేదా ప్రయివేటు విద్యా సంస్థల దోపిడీ వల్ల కావచ్చు లేదా ప్రభుత్వ పాఠశాల ల్లోనే సంపూర్ణ వికాసంతో కూడిన విద్య అందుతుందనే నమ్మకం కావచ్చు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇది మంచి పరిణామమే, అయితే పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత అటుంచితే ఉన్న తరగతి గదులను, టాయిలెట్లను, పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడం ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది.
అట్టకెక్కిన పారిశుద్యం: ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న పారిశుద్యం, కళకళలాడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో వెలవెలబో తుంది. పాఠశాలల్లో స్వీపర్ల నియామకం కనుమరుగు కాగా గత కొన్ని సంవత్సరాలుగా స్కావెంజర్లతో పారిశుద్య పనులు నెట్టుకొస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన స్కావెంజర్లను పునర్నియామకం చేయకపోవడంతో పాఠశాలల్లో పారిశుద్యం అట్టకెక్కింది. ఉపాధ్యాయులే స్వీపర్ల అవతారం ఎత్తినట్టు అక్కడక్కడ పేపర్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు భారమే: స్వీపర్ల నియామకం ఏమోగానీ స్కావెంజర్ల పునర్నియామకానికి అనుమతివ్వని ప్రభుత్వం, పాఠశాలల పారిశుద్య పనులను గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు అప్పగించింది. అరకొర సిబ్బందితో అతి కష్టంపై నెట్టుకొస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు వారం లేదా పక్షం రోజులకు ఒకసారి పాఠశాలలను శుభ్రం చేస్తే రోజు ఊడ్చవలసిన తరగతి గదులు, క్లీన్ చేయాల్సిన టాయిలెట్ల పరిస్థితి ఏమిటి? ఉపాధి హామీ కూలీలను పంపిస్తామని చెపుతున్న వారం లేక పక్షం రోజులకు ఒకసారి పంపిస్తున్నారే గాని రోజు పంపుతున్న దాఖలాలు ఎక్కడ లేవు. వారం లేక పక్షం రోజులకు ఒకసారి ఉపాధి హామీ కూలీలు వచ్చిన టాయిలేట్లను శుభ్రం చేయుటకు నిరాకరిస్తున్నారు.రోజు తరగతి గదులను ఊడ్చేందుకు విద్యార్థులు, ఆఫీస్, స్టాఫ్ రూమ్, పాఠశాల ప్రాంగణంను ఊడ్చేందుకు ఉపాధ్యాయులు స్వీపర్ల అవతారం ఎత్తాల్సిందేనా? శుభ్రం చేయని టాయిలెట్లను ఉపయోగిస్తున్న విద్యార్థులు రోగాల బారిన పడవాల్సిందేనా?
బాలికలుండే పాఠశాలలో కష్టాలు చెప్పనక్కర్లేదు: విద్యా వార్షిక స్థితి నివేదిక-2019 (ఎ.యెస్.ఇ.ఆర్) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో బాలలకన్న, బాలికల సంఖ్య ఎక్కువ. అక్కడి పాఠశాలల్లో టాయిలెట్లకు తప్పనిసరిగా రన్నింగ్ వాటర్ ఉండాల్సిందే. బాలికల నెలసరి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. రోజు టాయిలెట్లు తప్పక శుభ్రం చేయాల్సిందే. స్కావెంజర్లు లేకుండా ఆ పనులన్ని సాధ్యమా?
ఆసరా పింఛన్స్ ఇస్తారు-స్కావెంజర్లనివ్వరా?:
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ లక్షల సంఖ్యలో 2016, 3016 రూపాయలతో ఆసరా పింఛన్లు ఇస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులని ప్రసంగాల్లో చెప్పుకోవడం కాదు, రేపటి పౌర సమాజానికి విద్యనందించుటకు, వారిని రోగాల బారినుండి కాపాడుకోవడానికి ఒక ఆసరా పింఛన్తో సమానమైన స్కావింజర్లను (గౌరవ వేతనం నెలకు 2500 రూపాయలే)పాఠశాలకు కేటాయించలేరా?
అక్షరాస్యతలో సాధించాల్సిది ఎంతో ఉంది:
తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో సాధించాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా బాలికల అక్షరాస్యతలో ప్రత్యేక కృషి అవసరం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పాఠశాల విద్యా గ్రేడింగ్ సూచిక 2019-20 ప్రకారం తెలంగాణ రాష్ట్రం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకంటే వెనుక నాల్గోవ కేటగిరీలో ఉంది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 21వ స్థానంలో, బాలికల మరుగుదొడ్ల ఏర్పాటులో 26వ స్థానంలో, విద్యలో 19వ స్థానంలో ఉంది.
నమ్మకం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడు తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్లో పాఠశాల మౌళిక సదుపాయాల కోసం 4000 కోట్లు కేటాయించడం అభినందించ దగిన విషయం. ఆ నిధులను వెంటనే ఖర్చు చేసి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. కరోనా సమయంలో నిరంతర పరిశుభ్రతకై పాఠశాలలలో స్కావెంజర్ల సేవలు అత్యవసరం. ప్రభుత్వం వెంటనే వారిని నియమించుటకు అనుమతించి పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి, విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలి.
- జుర్రు నారాయణ
సెల్:9494019270