Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి, భుక్తి, వెట్టి చాకిరి రద్దు, సామాజిక న్యాయం కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో, తెలంగాణ రైతు, కూలీ బిడ్డల పోరాటాలు సువర్ణాక్షరాలతో మిగిలి పోయాయి. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ఈ మహత్తర పోరాటం నైజాం రాచరిక భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించివేసింది. నైజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. నరహంతక కర్కోటకులైన భూస్వాములు, దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్ధార్లు, జమీందార్లు ప్రజల పోరాటదెబ్బకు నాడు పట్నం పారిపోయారు. ప్రజా పీడకులైన వారి భూములను కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పది లక్షల ఎకరాలను రైతు కూలీలు పంచుకున్నారు. నాటి నైజాంకు, అతని రజాకార్లకు ఆయనకు అండగా ఉన్న నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టు రైతు కూలీ బిడ్డలు తమ ప్రాణాలను బలిదానం చేశారు.
కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ, పురుష తేడా లేకుండా తెలంగాణ మట్టి మనుషులు చేసిన చారిత్రాత్మకమైన పోరాటం ఇది. ఆనాడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సురవరం ప్రతాపరెడ్డి ఈ పోరాటంపై వ్యాఖ్యానిస్తూ.. ''ఈ కమ్యూనిస్టుల దగ్గర ఏ మహత్యం ఉందో కానీ, నీ కాల్ మొక్కుత దొరా! నీ బాంచెన్ దొరా! అన్న తెలంగాణ రైతు కూలీల చేత ఆ దొరలకు వ్యతిరేకంగా తుపాకులు పట్టించారని, కమ్యూనిస్టులు యిచ్చిన దున్నేవానికే భూమి'' నినాదంలోనే ఈ శక్తి ఉన్నదని వ్యాఖ్యానించారు. అలాంటి చరిత్రాత్మకమైన ఈ పోరాటాన్ని నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల తిరుగు బాటుగా మత కోణంలో ప్రజలను చీల్చడానికి ప్రచారం చేస్తున్నారు. పోరాటంతో ఏ మాత్రం సంబంధంలేని బీజేపీ తామే ఈ పోరాటానికి వారసులం అన్నట్టుగా చరిత్రను వక్రీకరిస్తూ గోబెల్స్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. వీరి గోబెల్స్ ప్రచారానికి చెంపపెట్టు తెల్దారుపల్లి జాగీర్దారు వ్యతిరేక పోరాటం. 1940వ దశకంలో ఈ గ్రామ ప్రజలు జాగీర్దారుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆనాడు ఖమ్మం తాలూకా తెల్దారుపల్లిలో హమ్జద్ అలీ అనే జాగిర్దారు ఉండేవాడు. ఈయన ప్రజల్ని పెట్టే బాధలు, దౌర్జన్యాలు ఇన్నీ అన్నీ కావు. ఆయన బీళ్ళలో (భూములు) ప్రజలు పొయ్యిలకి కట్టెలు తెచ్చుకున్నా, యిస్తారాకుల కోసం మోదుగు ఆకులు తెంపినా ఎవరింటనైనా పెండ్లి జరిగినా, మనుష్యులు చనిపోతే కాటికి తీసుకెళ్ళినా ఈ జాగీర్దారుకు పన్నులు చెల్లించాలి. రైతులు వ్యవసాయ పనిముట్లు, ఉప్పు, మిరపకాయలు, పొగాకు తదితర నిత్యావసరాలన్నీ ఆయన వద్దే, ఆయన చెప్పిన రేట్లకే కొనాలి. ప్రజల అవసరాలతో సంబంధం లేకుండా జాగీర్దారు మనుషులు పడేసిన వస్తువులు తప్పనిసరిగా కొని తీరాల్సిందే.
జాగీర్దారుకు గుర్రాలకు ప్రతి రైతు రెండు మోపుల జీలుగు, వంద జొన్న కంకులు ఉచితంగా పంపించాలి. జాగీర్దారుకున్న 250 ఎకరాల భూమిని రైతులు తమ స్వంత అరకలతో ఉచితంగా దున్ని, దుగాలు పెట్టాలి. ఆయన మామిడితోటలోకి పొరపాటున రైతుల పశువులు వెళితే బంధించి పన్నులు, జరిమానాలు వేసి బలవంతంగా వసూలు చేసేవాడు.
పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఖమ్మం ఆంధ్ర మహాసభ
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మంలో 12వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ గ్రామ రైతుబిడ్డ తమ్మినేని సుబ్బయ్య నాయకత్వంలో తెల్దారుపల్లి రైతులు ఈ మహాసభకు హాజరయ్యారు. ఆంధ్ర మహాసభ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని కలిగించింది. మహాసభ యిచ్చిన పిలుపుతో జాగీర్దారులు పశువులపై విధించే పన్నును రైతులు వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన జాగీర్దారు రైతుల పశువులను బలవంతంగా బందెల దొడ్డిలో బంధించాడు. రైతులు ఆంధ్ర మహాసభ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. నాటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సర్వదేవభట్ల రామనాథం సూచనతో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు రావెళ్ళ జానకిరామయ్య నాయకత్వంలో గంగవరపు శ్రీనివాసరావు, కె.ఎల్.నర్సింహారావు, శీలం సత్యం, మాణిక్యాల నరసయ్య, మల్లెంపాటి సీతయ్య, రాజారాం, దశరథరామయ్యలు తెల్దారుపల్లి చేరారు. రాత్రి రహస్యంగా సమావేశం జరిపి ప్రజలందర్ని ఐక్యం చేశారు. బందెల దొడ్డి వద్ద సాయుధ రజాకార్లు కాపలా ఉన్నప్పటికీ ఆ రాత్రి బందెలదొడ్డిపై దాడిచేసి అడ్డంగా పెట్టిన కంచెను తీసివేసి పశువులను బయటకు వదిలారు. గుమికూడిన రైతులపై వారు కాల్పులు జరిపారు. దీనిలో ఏగినాటి లక్ష్మయ్య అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతటితో ఆగక జాగీర్దారు రైతులు అక్రమంగా తమ ఇంటిపైన దాడి చేశారని తప్పుడు కేసు బనాయించాడు. తమ్మినేని సుబ్బయ్య, లింగాల ముత్తయ్య, సిరికొండ వీరయ్యలకు చేతులు, కాళ్ళకు బేడీలు వేసి ఖమ్మం పట్టణంలో ఊరేగించారు. అంతటితో ఆగలేదు. ఖమ్మం నుండి జాగీర్దారు గూండాలు వచ్చి గ్రామంపై దాడి చేశారు. ప్రజలంతా ఐక్యంగా గూండాలను ప్రతిఘటించారు. గూండాల చేతుల్లోని ఆయుధాలను లాక్కున్నారు.
వరి కోతల తరుణం. రైతులు పన్నులు చెల్లించడం లేదని, తమ పొలంలో వెట్టి చేయడం లేదని భావించిన జాగీర్దారు రైతుల పంటలు జబర్దస్తీగా తమ గూండాలతో కోయించడానికి సిద్దపడ్డాడు. జాగీర్దారు గూండాలను రైతులు ఐక్యంగా ఎదుర్కొన్నారు. ప్రతిఘటించారు. జాగీర్దారు కాల్పులలో అనేక మంది రైతులు గాయపడ్డారు. మరికొంతమంది మృతి చెందారు. అయినప్పటికీ రైతులు వెనుకడుగు వేయలేదు. పట్టుదలతో పోరాడారు. కమ్యూనిస్టు పార్టీ అండతో జాగీర్దారును గ్రామస్తులు తరిమారు. వీరోచితంగా సాగిన ఈ పోరాటం వల్ల కౌల్దారీ చట్టం రావడం, ఆ చట్టం క్రింద తెల్దారుపల్లి రైతులు తమ భూములకు పట్టాలు సాధించుకున్నారు.
జాగీర్దారు చేసిన ప్రయత్నాలు-తిప్పికొట్టిన ప్రజలు
తెల్దారుపల్లి జాగీర్దారు ముస్లిం, హిందువులుగా ప్రజలను చీల్చడానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాగీర్దారు ''ఇస్లాం మతానికి ప్రమాదమొచ్చిందని, హిందూ, ముస్లిం రైతులను విడదీయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాలు ప్రజల ఐక్యత ముందు పారలేదు. ఇక లాభం లేదనుకొని ఇత్తహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు మౌల్వీ కమల్‌ను గ్రామానికి తీసుకొచ్చాడు. అతను మసీదులో రెండు గంటల పాటు గుక్క తిరగకుండా కమ్యూనిస్టులను తిడుతూ ప్రసంగించాడు. ''మన నైజాం నవాబు కూడా జాగీర్దారే. కాబట్టి యిక్కడ జాగీర్దారుపై తిరుగుబాటు చేయటం అంటే మన ముస్లిం రాజుపైన, ఇస్లాం మతం పైన తిరుగుబాటు చేయటమే'' అన్నాడు. అది విని మస్తాన్ సాహెబ్ అనే పేద ముస్లిం రైతు లేచాడు. ''మౌల్వీ సాహెబ్! మసీదులో అల్లా ముందు మీరు అబద్దాలు చెప్పుతున్నారు. మన ముసల్మానులను మోసగిస్తున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నది కమ్యూనిస్టులు కాదు, జాగీర్దారు మమ్మల్ని భరించరాని హింసలు పెడుతుంటే వందలాది మంది ముస్లిం రైతులం పోరాడుతున్నాం. నాకు కమ్యూనిస్టులను గూర్చి బాగా తెలుసు. ఈ దుర్మార్గుడి బాధల నుండి మమ్ముల్ని కాపాడు తున్నది ఆ కమ్యూనిస్టులే'' అన్నాడు మస్తాన్ సాహెబ్ ఏ మాత్రం తొణకకుండా, బెదరకుండా. ఈ ప్రయత్నం కూడా విఫలం కావడంతో జాగీర్దారు స్థానిక ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుని సహాయం తో హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను చీల్చి, వారి మధ్య కొట్లాటలు లేవదీయాలని జాగీర్దారు చూశాడు. ఆంధ్ర మహాసభ నాయకులు జోక్యం చేసుకొని జాగీర్దారు ప్రయత్నాలన్నీ తిప్పి కొట్టారు. తెల్దారుపల్లి ప్రజలపై జాగీర్దారు దౌర్జన్యా లన్నీ అంతమయ్యాయి. తెల్దారుపల్లి ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించుకున్నారు. గత పోరా టాలు, తమ్మినేని సుబ్బయ్య వారసత్వంతో నేటికీ ఈ గ్రామం కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉన్నది.
- పి. సోమయ్య
సెల్: 9490098043