Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తక్కిన ప్రపంచ దేశాలలో ప్రజలు అందరూ ఒక్క పైసా కూడా చెల్లించకుండానే కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొందగలుగుతున్నారు. కాని మన భారతదేశంలో మాత్రం అలా కాదు. ఒక జాతిగా ప్రజలు రూపొందడానికి, ఒక జాతి చైతన్యం పెంపొందడానికి మూలాధారాలుగా ఉండే చారిత్రిక ఘటనలు, వాటి సజీవ ఆధారాలుగా నిలిచే వారసత్వ సంపద ఆయా దేశాలలో చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఆ చారిత్రిక కట్టడాలను యధాతథంగా పరిరక్షించుకుంటారు. ఇది తక్కిన ప్రపంచం మాట. కాని మన భారతదేశంలో మాత్రం కాదు. ప్రజలకు అవసరమైన సేవలను అందించే ప్రభుత్వ సంస్థలు, విద్యా, సాంస్కృతిక సేవలను అందించే ప్రజా సంస్థలు ప్రజలకు తమ సేవలను ఉచితంగా అందిస్తాయి. ఇది తక్కిన ప్రపంచంలో జరిగే విషయం. కాని భారతదేశంలో మాత్రం అలా కాదు. భారతదేశంలో కనపడే ఈ వికృత లక్షణం వెనుక మోడీ ప్రభుత్వపు ప్రత్యేకమైన ఎజెండా ఒకటి పని చేస్తోంది. ప్రతీదానినీ అమ్మకపు సరుకుగా మార్చేయ్యడమే ఆ ఎజెండా. మార్కెట్‌కు అతీతంగా ఉండేది ఏదీ లేదు. విలువైనది, పవిత్రమైనది, భద్రంగా కాపాడుకోవలసినది అంటూ ఏదీ మిగలదు. అంతా అమ్మకానికే.
పైన ప్రస్తావించిన మూడు ఉదాహరణలనే చూద్దాం. మొదట్లో ప్రయివేటు ఆస్పత్రులు కోవిడ్ వ్యాక్సిన్లను వేసినప్పుడు సేవల కింద రూ.250 చొప్పున వసూలు చేశారు. ఆ విధంగా వసూలు చేయడాన్ని అప్పుడే నిరోధించాల్సివుంది. అలా చేయలేదు. అయితే, ఆ చార్జీ ఎక్కువమంది భరించగలిగిన స్థాయిలోనే ఉంది. కాని ఇప్పుడు కోవిషీల్డ్‌కు రూ.780, కోవ్యాక్సిన్‌కు రూ.1410, స్పుత్నిక్-వికి రూ.1145 చొప్పున వసూలు చేసుకోడానికి అనుమతిచ్చారు. ప్రభుత్వం ప్రయివేటు ఆస్పత్రులకు ఉచితంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం నిలిపివేసినందువలన ఈ విధంగా వసూలు చేస్తున్నట్టు చెపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూసే ్తప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఒక సరుకుగా మార్చడానికి పూనుకున్నదని చాలా స్పష్టంగా కనపడుతున్నది.
అటువంటిదే జలియన్‌వాలాబాగ్‌ను ''అందంగా తీర్చిదిద్దే'' ప్రాజెక్టు. భారతదేశంలో సాగిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన మారణకాండ ఒక కీలకమైన ఘట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని దేశం నుండి తరిమివేయాలన్న దృఢసంకల్పాన్ని ప్రజలందరిలోనూ రగిల్చిన ఆ ఘటన ఒక నవభారతాన్ని ఉనికిలోకి ప్రజలు తెచ్చుకోవడానికి దారితీసింది. అక్కడ శాంతియుతంగా నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్న వారందరినీ కాల్చిపారెయ్యమని జనరల్ డయ్యర్ తన దళాలకు ఆదేశాలిచ్చాడు. తుపాకుల్లో గుళ్ళన్నీ ఖాళీ అయేదాకా ఆ కాల్పులు కొనసాగాయి. దేశం కోసం వేలాదిమంది ప్రాణాలర్పించిన ఆ స్థలం ప్రతీ భారతీయుడికీ అత్యంత పవిత్రమైన స్థలం. ఆ చారిత్రిక చిహ్నాన్ని ఏమాత్రమూ మార్చకుండా అదేవిధంగా భద్రంగా పరిరక్షించుకోవాల్సి ఉంది. ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ దేశంలో డాకర్ తీరంలో ఉన్న గోరీ దీవి నుండి లక్షలాదిమందిని బానిసలుగా ఓడల్లో నిర్బంధించి అమెరికాకు రవాణా చేసేవారు. అనేక సంవత్సరాల అనంతరం ఆ దీవిని సందర్శించిన నెల్సన్ మండేలా ఆనాటి దారుణాలకు సాక్ష్యంగా నిలిచిన భవనాలను, బారకాసులను, చీకటికొట్లను చూసినప్పుడు కళ్ళ నీళ్ళు తిరిగాయి. నేటికీ ఆ చారిత్రిక కట్టడాలన్నీ అలాగే యధాతథంగా ఉంచి పరిరక్షిస్తున్నారు. కాని మన దేశంలో జలియన్‌వాలాబాగ్‌ను ''అందంగా తీర్చిదిద్దే'' పని చేపట్టింది మోడీ ప్రభుత్వం. ఆ విధంగా చేయడం వలన ఎక్కువమంది విదేశీ సందర్శకులను, టూరిస్టులను ఆకర్షించి ఎక్కువ ఆదాయం సంపాదించడం వీలు పడుతుందని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. అంటే జలియన్ వాలాబాగ్ కాస్తా ఒక సరుకుగా మారిపోయిందన్న మాట. దేశం యావత్తూ పవిత్ర స్థలంగా పరిగణించే స్థలాన్ని ఒక వ్యాపార సరుకుగా దిగజార్చింది మోడీ ప్రభుత్వం. సరిగ్గా ఇటువంటి ధోరణినే దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి అయిన వారణాసిలోని విశ్వనాథుని దేవాలయానికి పోయే దారి విషయంలోనూ మోడీ ప్రభుత్వం ప్రదర్శించింది. దేవాలయానికి పోయే ఆ సన్నని దారికిరువైపులా ఉండే అతి పురాతన గృహాలు, పలు చిన్న చిన్న దేవాలయాలు చారిత్రిక ప్రాధాన్యత కలిగినట్టివి. వాటన్నిటినీ ధ్వంసం చేసింది మోడీ ప్రభుత్వం. విశ్వనాథుని దేవాలయ పరిసరాలను యాత్రికులు, ముఖ్యంగా విదేశీ యాత్రికులు సందర్శించడానికి సౌకర్యంగా ఉండే విధంగా చేయడానికే ఈ మార్పులను చేసినట్టు ప్రకటించారు. అంటే కాశీ విశ్వనాథ దేవాలయం కూడా ఒక సరుకుగా మారిపోయిందన్నమాట!
ఇక ఇప్పుడు రైల్వే స్టేషన్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, స్టేడియంలు, జాతీయ రహదారులు- ఒకటేమిటి చాలా రకాల ప్రజల ఆస్తులను మానెటైజ్ చేయడానికి పూనుకున్నారు. అంటే ప్రజల ఉపయోగార్థం నిర్మించిన ఈ ఆస్తులను ప్రయివేటు నిర్వాహకుల చేతులకప్పగించి వాటిని సరుకులుగా మారుస్తారన్నమాట. ఆర్థిక మంత్రి మానెటైజేషన్ అంటే ప్రయివేటైజేషన్ వంటిది కాదంటూ చాలా గట్టిగా వాదిస్తున్నారు. కాని అది కేవలం మాటల గారడీ మాత్రమే. మానెటైజేషన్ అంటే ఈ ఆస్తులను ప్రయివేటు నిర్వాహకులకు కొంతకాలంపాటు అప్పగించడం. ఆ కాలం గడిచాక ఆ ఆస్తులు తిరిగి ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చినా, (అలా తిరిగి ప్రభుత్వానికి అప్పగించేముందు ఆ నిర్వాహకులు ఆ ఆస్తులపై పెట్టిన పెట్టుబడుల విలువను తిరిగి రాబట్టుకోవడం వంటి అనేక అంశాలను తేల్చుకోవలసివుంటుంది) మళ్ళీ వాటిని ఆ పాత నిర్వాహకులకే అప్పజెప్పడం గాని, లేదా కొత్త వారికి అప్పజెప్పడం గాని మళ్ళీ జరుగుతుంది. దీనిని బట్టి మానెటైజేషన్ అంటే ఒకేసారి మొత్తంగా అమ్మడం కాకుండా అంచెలంచెలుగా అమ్మడం అని అర్థం అవుతుంది. ఎలాగ అమ్మినా మొత్తానికి ఇది ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే.
స్థూల ఆర్థిక శాస్త్ర పరిభాషలో ప్రభుత్వ వ్యయం నిమిత్తం ప్రజలకు చెందిన ఉమ్మడి ఆస్తులను మానెటైజ్ చేయడమనేది బడ్జెట్లో ద్రవ్యలోటును పెంచడం కన్నా భిన్నమైనదిగా భావించరు. ఖర్చు కోసం ద్రవ్య లోటును పెంచేటప్పుడు ఆ ఖర్చు నిమిత్తం ప్రైవేటు రంగం నుండి తీసుకునే సొమ్ముకు ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో హామీ ఇస్తుంది. ఆ హామీకి గ్యారంటీ ప్రభుత్వ ఆస్తులే. అదే మానెటైజేషన్ అయితే ప్రభుత్వ ఆస్తులనే (రోడ్లు, రైల్వే ప్లాట్‌ఫాం లు వగైరా) నేరుగా ప్రయివేటు రంగానికి అప్పజెప్పి అందుకు బదులుగా సొమ్ము తీసుకుని ఖర్చు చేస్తుంది. ఏ రూపంలో ప్రభుత్వ ఆస్తులని ప్రయివేటు రంగం చేతుల్లో పెడుతుంది అన్న తేడా తప్ప స్థూల ఆర్థిక శాస్త్రంలో ద్రవ్యలోటుకు, మానెటైజేషన్కు తేడా వేరే ఇంకేమీ లేదు.అయితే ఈ రెండు పద్ధతుల పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయన్నది పరిశీలిస్తే చాలా తేడా ఉంటుంది. ద్రవ్యలోటు పెంచి ఖర్చు చేయడం వలన కలిగే పర్యవసానాలకన్నా మానెటైజేషన్ వలన కలిగే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. మానెటైజేషన్ జరిగినప్పుడు ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు రంగం లీజుకు తీసుకుంటుంది. ఆ ఆస్తులమీద లాభాలు సంపాదించడం కోసం వినియోగ చార్జీలు పెంచుతుంది. కార్మికుల వేతనాలనిమిత్తం అయే ఖర్చును తగ్గిస్తుంది. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో కార్మికుల వేతనాల వాటా తగ్గిపోతుంది, ప్రయివేటు యజమానుల లాభాల వాటా పెరుగుతుంది. (వినియోగదారులుగా ఉండేవారిలో కూడా అత్యధికశాతం వేతనాలపై బతికేవారే.) మార్కెట్లో సరుకుల వినియోగం దీనివలన తగ్గుతుంది. కార్మికుల ఆదాయాలు తగ్గితే సరుకులు కొనగలిగే శక్తి తగ్గుతుంది. ఇంకోవైపు మానెటైజేషన్ వలన యజమానుల లాభాలు పెరిగినప్పటికీ, దానికి తగ్గట్టు వారి వినియోగం మాత్రం పెరగదు. అంటే మానెటైజేషన్ ఫలితంగా మొత్తం మీద వినిమయం తగ్గుతుంది. అదే ద్రవ్యలోటు పెంచితే ఆ సొమ్ము ప్రయివేటు రంగం నుంచి వస్తుంది గనుక వేతనాలమీద దాని ప్రభావం ఉండదు. అదే విధంగా అదనపు ఖర్చు కోసం సంపద పన్నును గాని లాభాలపై పన్నును గాని పెంచినా దానివలన కూడా మార్కెట్లో వినిమయం మీద ప్రతికూల ప్రభావం పడదు. అందుచేత మానెటైజేషన్ అనే ప్రక్రియ తీవ్ర స్థాయిలో నిరుద్యోగం ఉన్నప్పుడు, ఉత్పత్తి స్థాపక సామర్ధ్యం వినియోగంలో చాలా వెనకబడివున్నప్పుడు చేపట్టకూడని విధానం. పైగా దీని వలన ఆదాయాల మధ్య వ్యత్యాసాలు మరింత పెరుగుతాయి. ఆ కారణం వలన కూడా ఈ మానెటైజేషన్ బొత్తిగా పనికిమాలిన చర్యగా పరిగణించాలి.
ఆర్థిక సూత్రాల పరంగానే గాక, మౌలికంగా ఇది ఒక అప్రజాస్వామిక స్వభావం కల విధాన మార్పుగా మనం గుర్తించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం పౌరులకు పలు వస్తువులను, సేవలను ఉచితంగా గాని, దాదాపు ఉచితంగా గాని అందజేస్తుంది. ఇది దయాధర్మమేమీ కాదు. పౌరులుగా వారికి గల హక్కు. వస్తువులను, సేవలను పౌరులకు అందజేయడానికి పలు ప్రభుత్వ సంస్థలు ఏర్పడి పని చేస్తాయి. వీటి ద్వారా వస్తువులను, సేవలను పొందడం పౌరుల హక్కు.
చాలాకాలంగా ఆర్థిక వేత్తలలో ఒక అభిప్రాయం చాలా బలంగా కొనసాగింది. ఈ వస్తువులను, సేవలను పౌరులకు సాధ్యమైనంతవరకూ ఉచితంగా అందజేయాలన్నదే ఆ అభిప్రాయం. ఒకానొక పార్కులో ఏర్పాటైన బెంచిని పార్కుకు వచ్చిన వారు ఏ విధమైన రుసుమూ చెల్లించనవసరం లేకుండా వినియోగించగలగాలి. అదే విధంగా ఒక రైల్వే ప్లాట్‌ఫాంను ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునే వీలుండాలి. (మహా అయితే ప్లాట్‌ఫాం టికెట్ కోసం నామమాత్రపు రుసుము చెల్లించాలి. అంతే) ఒక పబ్లిక్ మ్యూజియంను ప్రతీ ఒక్కరూ సందర్శించే వీలుండాలి. అందుకోసం నామమాత్రపు రుసుము మాత్రం వసూలు చేయాలి, లేదా ఉచితంగా అనుమతించాలి. ఈ సూత్రాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం కొంత ఉల్లంఘనకి ఇప్పటికే పాల్పడుతూ వాటి వినియోగ చార్జీలను పెంచుతూ పోతోంది. అయినప్పటికీ ఇప్పటికీ నామమాత్రపు చార్జీలను మాత్రమే వసూలు చేయాలన్న సూత్రం కొనసాగుతూనేవుంది.
ఇటువంటి వస్తువులను, సేవలను ఉచితంగా అందజేయడమో లేక నామమాత్రపు చార్జీలు మాత్రమే వసూలు చేయడమో జరుగుతూవుండడం అనేది వాటి వినియోగదారులంతా సమానమే అన్న విషయాన్ని సూచిస్తుంది. అంతేగాక వారంతా ఆ ప్రభుత్వ ఆస్తులకు వాస్తవ యజమానులు అని, వారి తరఫున ప్రభుత్వం ఆ ఆస్తులను సమకూర్చి, నిర్వహిస్తోంది అని కూడా సూచిస్తుంది. ప్రభుత్వ ఆస్తులు అన్నవి ప్రజలకు చెందిన ఆస్తులు. అంటే ప్రజలు వాటి హక్కుదారులు. అందకే వాటిని వారంతా ఉచితంగా వినియోగించుకునే హక్కు కలిగివున్నారు.
మార్కెట్ వ్యవస్థ దీనికి పూర్తి విరుద్ధం. వినియోగదారుని కొనుగోలుశక్తిని బట్టి ఆ వ్యక్తికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రభుత్వం నిర్వహించే ప్రజా ఆస్తిని ప్రయివేటు నిర్వాహకుడికి అప్పజెప్పడం అంటే ఆప్రభుత్వ సంస్థద్వారా ఇంతవరకూ ఒక హక్కుగా, ఒక సహ యజమానిగా ప్రతీ పౌరుడూ పొందుతున్న ఉచిత సేవ కాస్తా ఇప్పుడొక సరుకుగా మారిపోవడమే. అలా మారిపోయాక ఏ వినియోగదారుడి కొనుగోలుశక్తి ఎక్కువగా ఉంటే అతడికే లేదా ఆమెకే దానిని వినియోగించుకునే అవకాశం వస్తుంది. తక్కినవారికి నిరాకరించబడుతుంది. ఒక హక్కుగా పొందే స్థితినుండి కొనుగోలు శక్తి ఉంటేనే పొందగలిగే స్థితి ఏర్పడుతుంది.
ఇంతవరకూ ఒక హక్కుగా ప్రభుత్వ ఆస్తుల ద్వారా సేవలను పొందగలుగుతున్న అత్యధిక ప్రజానీకం ఇకముందు వాటి సేవలను పొందలేని స్థితికి నెట్టబడడం అనేది ఆ ప్రజల ప్రజాస్వామిక హక్కును హరించడమే అవుతుంది. అందుచేత మానెటైజేషన్ అంటే కేవలం ఆదాయాల మధ్య అసమానతలను మరింత పెంచే చర్య మాత్రమే కాదు. ప్రజల హక్కులను కుదించడం కూడా. ఒక రోడ్డును, ఒక రైల్వే ప్లాట్‌ఫాంను ఇంతవరకూ ఉపయోగించుకున్న విధంగా ఇకముందు ఉపయోగించలేని స్థితికి నెట్టబడడం అప్రజాస్వామికం కాక ఇంకేమిటి? ఈ విధంగా ప్రతీ దానినీ ఒక సరుకుగా మార్చివేస్తూ పోవడం అంటే పౌరుల పౌరహక్కులను క్రమంగా కాలరాస్తూపోవడమే. ఈ విధంగా మోడీ ప్రభుత్వం పౌరులందరికీ ఉన్న సమాన ప్రజాస్వామ్య హక్కుల స్థానంలో పూర్తి వివక్షతతో కూడిన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెడుతోంది.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్