Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేం...
నాయకులకు జై కొట్టే
పనిలో ఉన్నాం తల్లీ !
వినాయకులకు
నైవేద్యాలు వండి పెట్టే
పనిలో ఉన్నాం చెల్లీ!!
బిగ్ బాస్ హాజ్లో
ఈ వారం ఎలిమినేషన్ ఎవరో
జోరుగా బెట్టింగ్ పెడుతూ
బిజీగా ఉన్నాం తల్లీ!
సినిమా రేసుగాడు వాడిన
బైకు అంగాంగాల అందాల
వర్ణనలో అర క్షణం తీరిక లేకుండా
అలిసిపోతున్నాం చెల్లీ!!
మాలో కోటీశ్వరుడు ఎవరా... అని
''మా''లో మమ్మల్ని చూసుకుంటూ
హాట్ చైర్ కోసం వెయిట్ చేస్తూ
కాలం వెళ్ళదీస్తున్నాం తల్లీ!
శ్రీదేవి డ్రామా కంపెనీ
జబర్దస్త్ పండీ పండని కామెడీ
బతుకు దారుల్లో లేని నవ్వుల్ని
బుల్లి తెరల్లో చూసుకుంటున్నాం చెల్లీ!!
జానకీ కలకనలేదు గుప్పెడంత మనసు
జీడిపాకం లాంటి కార్తీకదీపం
విసుగు లేకుండా... సీరియల్స్‌ని
సిన్సియర్‌గా వీక్షిస్తున్నాం తల్లీ!
కాసింత సమయం దొరికితే
కొంత అమేజాన్ ప్రైమ్‌కి
మరికొంత నెట్ ఫ్లిక్స్‌కి... న్యాయం
చేసే ప్రయత్నం చేస్తున్నాం చెల్లీ!!
మర్చిపోయాను చెల్లీ
చేతిలో ఉండనే ఉందిగా సెల్లు
వాట్స అప్ యూనివర్సిటీకి వెళ్ళాలి
ఫేసుబుక్ అప్ డేట్స్‌ని మిస్ కాకుండా
నిరంతరం అధ్యయనం చేయాలి
లైకులు కామెంట్లు షేర్ల డిగ్రీలు
సంపాదించే పని... అబ్బో...
ఎన్ని పనులో తల్లీ!!
కష్టం చేస్తే తప్ప
కడుపుకు అన్నం... కంటికి కునుకు
అసలే అందని బతుకు!
మా కోసం మేమే పరిగెట్టలేని వేగం
మా బుర్రలను ఎవడో దొంగిలిస్తున్న వైనం
పరుగులాటలో మమ్మల్ని మేమే ఓడించుకుంటున్న దారుణం!!
ఊపిరాడనంత ఒత్తిడిలో
నీ ఊపిరి ఆగిపోవడం
మమల్ని కదిలిస్తుందంటావా?
కదిలించినా...
కసిగా రగిలిస్తుందంటావా?
మొద్దుబారిన మా మెదళ్ళను
నిద్దరోతున్న మా ఆలోచనలను
తట్టి లేపుతుందంటావా?
ఏమో.....!
ఓ నా చిట్టి తల్లీ... నా చిన్నారి చైత్రా!!
ఘోరం జరిగినప్పుడల్లా ఉన్మాదిని
శిక్షించమంటూ ఊరంతా ఊరేగుతున్నాం
మరి....అసలు ఘోరం జరగకుండా
ఎవరిని శిక్షించాలి తల్లీ?
ఎవరిని సరిదిద్దాలి చెల్లీ?
(ఆగకుండా జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనల్ని మనం ప్రశ్నించుకుందాం)
- బండారు రమేష్