Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు పాదయాత్రలు చూస్తున్నది తెలం గాణ. అధికారం యావతో సాగుతున్నది బండి సంజరు యాత్ర. కార్మికుల హక్కుల కోసం నడుస్తున్నది సీఐటీయూ బృందం నడక. ఈ రెండు నడకల నడత వీటి స్వభావానికి అద్దం పడుతున్నది. రెండేండ్లలో రానున్న ఎన్నికల దాకా కూడా ఓపిక పట్టలేక, పదవీదాహంతో సాగే హంగూ, ఆర్భాటం ఒకటి. పదేండ్లుగా వేతన సవరణ లేక, ఉన్న చట్టపరమైన హక్కులు కోల్పొయిన కార్మికుల గర్జన మరొకటి. ఒకటి రాజకీయ ప్రయోజనం. మరొకటి కష్టజీవుల ప్రయోజనం. కేబినెట్ మంత్రి అయినందుకు ఆశీర్వదించండని తిరిగిన కిషన్‌రెడ్డి యాత్రనూ చూసారు. కోట్లు ఖర్చుపెట్టి చేసిన మంత్రిగారి హడావుడినీ చూసారు. పోరాట చైతన్యం రగిలిస్తూ, కార్మికవర్గ ఐక్యతను చాటే ఎర్రజెండా యాత్రనూ చూస్తున్నారు. కుర్చీకోసం సాగుతున్న కుర్చీలాట ఒకవైపూ, కోటీ ఇరవైలక్షల మంది కార్మికుల భవిష్యత్తు కోసం సాగుతున్న పోరుబాట ఒకవైపు. పదవీ కాంక్షతో సాగే ప్రహసనంలో అవకాశవాద ఎత్తుగడలు సహజం. రాజ్యాంగ స్ఫూర్తికీ, స్వాతంత్య్రోదమ వారసత్వానికీ భిన్నంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే బీజేపీ నేతల యాత్ర లక్ష్యం. అందుకే ప్రజలందరి గురించి కాకుండా, ఒక మతం గురించి మాత్రమే మాట్లాడుతామని భావోద్వేగాలను ప్రయోగిస్తున్నారు. హక్కుల కోసం, న్యాయం కోసం పోరు బాట చూపించే అరుణ పతాకం మాత్రం కష్టజీవుల ఐక్యతను కోరుతున్నది. కార్మికులు, రైతుల హక్కుల కోసం గర్జిస్తున్నది. ఇతర రాష్ట్రాలనుంచి పొట్టచేతబట్టుకుని వచ్చిన వలస కార్మికులకు తెలంగాణ కార్మికులు అండగా నిలబడాలన్న సందేశం ఇస్తున్నది. ఆకలిగొన్న వాడికి కావల్సింది బుక్కెడు అన్నం మెతుకులే తప్ప దేవుడూ, మతం కాదన్న స్వామి వివేకానంద సందేశాన్ని కులమతాలకతీతంగా కార్మిక జనానికి చేరవేస్తున్నది. అందుకే... ఈ రెండు యాత్రల తీరు వేరు. స్వభావమే వేరు.
పాదయాత్ర ప్రారంభించింది రెండు సమస్యల పరిష్కారం కోసం. పదేండ్లకు పైగా కనీస వేతనాలు పెంచలేదు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వానిదీ అదే దారి. 73 రంగాలలో (షెడ్యూల్స్) కోటి ఇరవైలక్షల మంది కార్మికుల సమస్య ఇది. ఇప్పుడు ఐదు రంగాలలో పెంచితే యజమానుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆ సాకుతో కార్మికశాఖ మెత్తబడుతున్నది. మరోవైపు మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు చేసింది. యూనియన్ రహిత భారతదేశం... రైతు రహిత భారతదేశం నిర్మిస్తామని అంబానీలకు వాగ్దానం చేసింది. అదే అమలు చేస్తున్నది. అందుకే కనీస వేతనాల కోసం, కార్మికుల హక్కుల కోసం కదిలింది సీఐటీయూ.
రంగారెడ్డిజిల్లా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభమైంది. ఒక్క కొత్తూరులోనే కనీసవేతనాలు పెంచనందువల్ల ఏడువేల కార్మికులు వెయ్యికోట్లు నష్టపోయారు. యాజమాన్యాల బొజ్జలు నిండాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా కోటీ ఇరవైలక్షల మంది కార్మికులు ఎన్నివేల కోట్లు నష్టపోయారో ఊహించవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సవరించటం మొదలు పెట్టింది. అది కూడా భరించలేని పెట్టుబడిదారుల సంఘాలు కంపెనీలు మూసుకుంటామని బెదిరిస్తున్నాయి. వారికి స్వేచ్ఛగా కార్మికుల శ్రమను దోచుకునే అవకాశం కావాలి. ఇప్పటికే కొత్తూరు, సాతంరాయి, కాటేదాన్ లాంటి పారిశ్రామిక ప్రాంతాలలో 12గంటల పని దినం అమలు చేస్తున్నారు. ఇంటిదగ్గర ఎప్పుడు బయలు దేరాలీ, ఇంటికి ఎప్పుడు చేరుకోవాలీ... ఇది యాజమాన్యాలకు పట్టదు. మహిళా కార్మికులది మరింత దీనావస్థ. ఇంటిపనీ, కంపెనీ పని చేసిచేసి విశ్రాంతికి సమయం ఉండదు. స్థానికులైతే స్థానబలం ఉంటుందని యజమానులకు తెలుసు. హక్కులు అడుగుతారనీ తెలుసు. అందుకే సగానికన్నా ఎక్కువ మందిని వలస కార్మికులను నియమిస్తున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణం. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాలు జైళ్ళుగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. లోపలి కార్మికులు బయటికి చూడకుండా, బయటివారు లోపలికి పోకుండా పెద్ద పెద్ద గేట్లు. అవి బందెల దొడ్లను మరిపిస్తున్నాయి. అయినా పాలకుల దృష్టి ఆవైపు పడదు. కార్మికశాఖ అధికారులు యాజమాన్యాల సేవలో తరిస్తున్నారు.
యూనియన్లు ఏర్పడి పోరాడుతున్న కంపెనీల సంఖ్య నామమాత్రం. అత్యధిక కార్మికులు అణచివేతకు గురైతే, యూనియన్లు పెట్టుకుని, హక్కులు సాధించుకున్న కార్మికుల బేరసారాల శక్తి కూడా బలహీనపడుతుంది. కార్మిక చట్టాలుండగానే అవి యజమానుల చుట్టాలైనాయి. ఇప్పుడు ఆ ఉన్న చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి తెల్లదొరలను మరిపిస్తున్నది. స్వాతంత్య్రోద్యమంతో మమేకమై కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులు అవి. జాతీయోద్యమంతో అణువంత సంబంధంలేని ఆరెస్సెస్ రాజకీయ విభాగం బీజేపీ. అలాంటి పార్టీ నేతల చేతుల్లో అధికారం ఉన్న తర్వాత వలస పాలకు బాటలోనే నడుస్తా కదా! ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్న పని అదే! శ్రమను దోచుకునేందుకు, దాచుకునేందుకు పెట్టుబడిదారులు. ఉత్పత్తి చేసేందుకు, చాకిరీ చేసేందుకు శ్రామికులు. ఇదీ మోడీ ప్రభుత్వం నీతి. స్వాతంత్య్ర పోరాట వారసత్వంగా సాధించుకున్న హక్కులు మరో స్వాతంత్ర పోరాట స్ఫూర్తితోనే పునరిద్ధరించుకోగలం. సెప్టెంబర్ 8న ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైన రోజు. ఆ స్ఫూర్తితోనే... ఆ రోజునే ఈ యాత్ర మొదలైంది.
కార్మిక చట్టాలు రద్దుచేసి, రైతు వ్యతిరేక చట్టాలు చేసి, దేశంలో శ్రామిక వర్గాల మీద మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. మరోవైపు శ్రామికుల ఐక్యతను భగం చేసేందుకు మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నది. ప్రజల మధ్య మతపరమైన భావోద్వేగాలు రగుల్చుతున్నది. ఇందులో భాగంగానే బండి సంజరు పాదయాత్రను సెప్టెంబరు 17న ముగిస్తున్నారు. భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం (అందులో భాగంగానే తెలంగాణ) విలీనమైన రోజు అది. వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించి, దానిని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా, హిందువుల పోరాటంగా చిత్రీకరించేందు కోసం ఈ ఎత్తుగడ. అధికార పగ్గాల కోసం ప్రజల జీవితాలతో ఆడుతున్న ఆట. ఈ పరిస్థితుల్లో శ్రామిక ప్రజల ఐక్యతను కాపాడుకోవాలి. కనీసవేతనాల కోసం, కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి. కార్మికవర్గాన్ని చైతన్యపరిచి, పోరుబాట నడపాలి. అందుకే ఈ పాదయాత్ర. ఇది కార్మిక నేతల కాలినడక కాదు.. ఇది కార్మికవర్గ కదనయాత్ర.
అధికారం కోసం సాగే యాత్రలో నాయకులకు లాడ్జీలూ, ఏసీ గదులూ, మెత్తని పరుపులూ విశ్రాంతినిస్తాయి. ఇది పెట్టుబడిదారుల దోపిడీ మీద పోరుయాత్ర. వారి కుడి ఎడమ భుజాలుగా సేవ చేస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకుల మీద కార్మికుల గర్జన. అందుకే ఈ పాదయాత్ర బృందానికి పేద కార్మికుల ప్రేమప్రదమైన ఆదరణే పట్టుపాన్పులూ, విశ్రాంతి గదులూ. బడుగు బలహీన వర్గాల హృదయస్పందనలే సీఐటీయూ నాయకత్వ బృందానికి పరమపద సోపానాలు. రాత్రి పేద కార్మికుల ఇండ్లలో, వారు పెట్టింది తిని, బస చేసి, తెల్లవారగానే బయలుదేరి కార్మికులను కలుసుకోవటమే వీరి దినచర్య. పాదయాత్ర బృందానికి ఆశ్రయమిస్తున్న కుటుంబాలన్నీ దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులవే! వారు పెట్టింది తింటూ, వారు చూపిన చోట నడుము వాల్చుతూ వారి కష్ట సుఖాలను అర్థం చేసుకుంటున్నది పాదయాత్ర బృందం. ఈ పాదయాత్ర ఖర్చులో ప్రతిపైసా కార్మికుల విరాళమే. సౌకర్యవంతమైన మర్యాదలు చేయడానికి కూడా యూనియన్లు సిద్ధంగానే ఉన్నాయి. కానీ, కార్మికవర్గం కోసం పోరాడే కార్మికనేతలు కార్మికుల జీవన స్థితిగతులను అత్యంత దగ్గరగా గమనించాలని సీఐటీయూ భావించింది. అందుకే ఈ యాత్రలో పేద కార్మికుల అగ్గిపెట్టెలాంటి ఇరుకు గదులే ఈ నాయకుల విశ్రాంతి గదులు. కార్మికుల ఆర్థిక పరిస్థితులే కాదు... వారి సామాజిక, సాంస్కృతిక సమస్యలు కూడా అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ సందర్భంగా వారు చూపుతున్న ప్రేమపూరిత ఆదరాభిమానాలు అనిర్వచనీయం.
పాదయాత్ర చేస్తున్నామంటే, గెస్ట్ హౌజులలో రాత్రి బసలు ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు సిద్ధం. ఖర్చులన్నీ భరించడానికీ సిద్ధమే. ఇది కార్మికనేతల ఆదరాభిమానాలను చూరగొనాలనే యజమానుల ఎత్తుగడ. కార్మికుల కష్టాల పట్ల జాలిచూపే నాయకులుగా, పెట్టుబడిదారుల పట్ల కృతజ్ఞతా పూర్వకంగా నడుచుకునే నేతలుగా ప్రభావితం చేసే యోచన. ఇది పెట్టుబడిదారీ సంస్కృతి. కానీ కార్మికులతో, బడుగు బలహీన వర్గాలతో మమేకమై నడిచే నడక కార్మికుల హృదయ ఘోషను వినిపిస్తుంది. ఈ నడత కార్మికవర్గ సంస్కృతిని ఎలుగెత్తి చాటుతుంది.
- ఎస్. వీరయ్య