Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నేల మీద సాగిన వీరోచిత త్యాగాల చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ పోరాటంలో నాలుగు వేల మంది వీరుల రక్త తర్పణంతో తెలంగాణ పునీతమైంది. బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులే బందూకులెత్తి సాయుధ పోరాటం సాగించాయి. ఈ పోరాటం పదిలక్షల ఎకరా భూమిని పేదలకు పంచింది. మూడువేల గ్రామాలలో గ్రామరాజ్యాలు నెలకొల్పింది. భేదాఖల్లను నిలిపివేసింది. వెట్టిచాకిరి రద్దు, వడ్డీ వ్యాపారం మాఫీ, రోజు కూలీ పెంపుతో పాటు ఈనేలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను సాధించింది.
ఈ క్రమం సాగుతుండగానే మరోవైపు 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో నిజాం స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. భారీ మర ఫిరంగులతో 50వేల సైన్యం కవాతు తొక్కింది. కేవలం ఐదు రోజుల్లోనే యుద్ధం ముగిసింది. సెప్టెంబర్ 17న ఏడవ నిజాం భారత సైన్యాలకు లొంగిపోయాడు. నిజాం స్టేట్ భారతదేశంలో విలీనమైంది. కానీ నిజాంను లొంగదీసుకోవడానికి వచ్చిన నెహ్రూ సైన్యాలు రైతాంగ ఉద్యమాన్ని అణచడానికి మూడేండ్లపాటు శతవిధాల ప్రయత్నించాయి. 1947లో పాకిస్థాన్‌పై కాశ్మీర్ విషయంలో చేసిన యుద్ధంలో భారతదేశం ఎంత ఖర్చు పెట్టిందో అంత సొమ్మును ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేయడానికి ఖర్చు చేశారు. ఫలితంగా భూస్వాములు టోపీలు మార్చి ఖద్దరుతో కాంగ్రెస్ నాయకులుగా తిరిగి గ్రామాలలో అడుగుపెట్టారు. సైన్యంతో ప్రజలను నిర్బంధకాండకు గురి చేశారు. అనేకులైన రైతు యోధులు, కమ్యూనిస్టులు నెహ్రూ సైన్యాల చేతిలో హతమార్చబడ్డారు. పదివేల మంది కార్యకర్తలను కాన్సన్ట్రేషన్ క్యాంపులలో నిర్బంధాల గురిచేశారు. బ్రిగ్స్ ప్లాన్ పేరుతో గ్రామాలను దహనం చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు. అయినా పార్టీ ఆదేశాలు వచ్చేంతవరకు సాయుధ పోరాట విరమణ జరగలేదు. ప్రజలు చివరి వరకు పోరాటం సాగిస్తూనే వచ్చారు. చివరికి... 1946లో ప్రారంభమైన సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబర్ 21న భారత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విరమిస్తున్నట్టు కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.
ఇది చరిత్ర కాగా, భారతీయ జనతా పార్టీ నిజాం లొంగుబాటును విమోచన దినంగా ప్రకటిస్తున్నది. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం రాజుకు హిందూ ప్రజలకు మధ్య జరిగిన యుద్ధమని గోబెల్స్ పలుకులు పలుకుతోంది. తెలంగాణ సాయుధ పోరాటంతో గాని నిజాం వ్యతిరేక ఉద్యమాలతో గానీ ఆనాటి జనసంఫ్‌ుకు,ఈనాటి బీజేపీకీ ఏ సంబంధమూ లేదు. ఈనాడు హిందువుల ముస్లిముల పోరాటంగా చిత్రీకరించి మత ప్రాతిపదికన అసలు విషయాన్ని మరుగున పరచాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. చరిత్రను వక్రీకరించి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది కులానికి మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఇది నిరంకుశమైన నిజాం పాలనకు, భూస్వామ్య, ఫ్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా ఆనాడు హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రజలు ముఖ్యంగా రైతాంగం సాగించిన వర్గపోరాటం. 1943లో పరమ దుర్మార్గుడైన పాలకుర్తి, విస్నూర్ దొరలపై చట్టబద్ధంగా తిరగబడి సవాల్ చేసిన పేద ముస్లిం రైతు బందగి. తన భూమిని దక్కించుకునే ప్రయత్నంలో భూస్వాముల గుండాల దాడిలో బలి అయిన తొలి అమరుడు. ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ నిజాంకు వ్యతిరేకంగా రాస్తున్నాడని దొంగచాటుగా రజాకార్లు ఆయన కాళ్ళు చేతులు నరికి వేశారు. షోయబుల్లాఖాన్ రజాకార్ల అకృత్యాలను, నైజాం పాలనను ఎండగట్టాడు. అదిరింపులు, బెదిరింపులకు లొంగలేదు. ఎందరో ముస్లిం మేధావులు, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రముఖ కవి మఖ్దూమ్ లాంటి వారి నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినవారిలో ప్రముఖంగా ఉన్నారు. కుల మతాలకు అతీతంగా ఎందరో యోధులు అనేక త్యాగాలు, బలిదానాలు చేసిన చరిత్ర తెలంగాణ సాయుధ ప్రజా పోరాటానిది. ఇది మహౌజ్వల ప్రజా పోరాటంగా భారతదేశ చరిత్రలోనే మహౌన్నతమైన స్థానం పొందింది. గత రెండు వందల సంవత్సరాలలో తెలంగాణ ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని పోరాటం గాని దేశ చరిత్రలో కానరాదు. పదివేల గ్రామ దళాల సభ్యులు, రెండు వేల మందితో గెరిల్లా దళాలు, శక్తివంతమైన సాయుధ బలగాలు నిర్మించుకున్నది. అసఫ్ జాహీ వంశపు మధ్యయుగాల నాటి నిరంకుశ పాలనను కూకటివేళ్లతో పెకలించింది. భూసంస్కరణలకు నాందిగా మారింది. బ్యాంకుల జాతీయకరణకు అంకురార్పణం అయింది. అధికార పాలకవర్గాలకు కమ్యూనిస్టులు ప్రతిపాదించిన ఎజెండాను అమలుపరచక తప్పని పరిస్థితి కల్పించింది. దున్నేవాడిదే భూమి నినాదాన్ని సర్వ వ్యాప్తం చేసింది. తెలంగాణలోనే కాదు మొత్తం దేశ వ్యాప్త రైతాంగ ప్రజఉద్యమాలకు మార్గదర్శిగా నిలిచింది.
భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రారంభం కావడంతో దక్షిణాదిన వారి సామంతులుగా ఉన్న అసఫ్ జాహిల పాలన మొదలైంది. హైదరాబాద్ స్టేట్ నిజాం ఏలుబడిలోకి వచ్చింది. హిందువులు మెజారిటీగా ఉన్నా ముస్లిం రాజుల పరిపాలన వందల ఏండ్లు కొనసాగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి సామంతుడిగా నిజాం వ్యవహరించాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రజలలో స్వాతంత్ర కాంక్ష, సమరశీల పోరాటాలు ఊపందుకున్నయి. దీంతో బ్రిటిష్ పరిపాలన అంతం కావడం, దేశానికి స్వాతంత్రం రావడం దాదాపు 565 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగిపోయింది.
కానీ, స్వాతంత్రానంతరం భారతదేశంలో ఐదు సంస్థానాలు స్వతంత్రంగా వ్యవహరించడానికి నిర్ణయించుకున్నాయి. అందులో తెలంగాణ స్టేట్ ఒకటి. నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారం కలిగి ఉన్నాడు. ఇంగ్లాండ్, రష్యాల కన్నా సంపన్నంగా తెలంగాణ నిజాం సంస్థానం ఉన్నట్లు మౌంట్ బాటెన్ పేర్కొన్నాడు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు 1947 జూన్ 11న నిజాం పర్మాన ప్రకటించాడు. అందుకు ముందే మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం' పార్టీనీ ఖాసిం రజ్వీ. 1927లో స్థాపించాడు. నిజాం దేవుడి ప్రతి రూపం అంటూ ఎంఐఎం ప్రచారం ప్రారంభించింది. మరికొందరు ముస్లిం నాయకులు, తాబేదార్లు మతం పేరుతో, హిందూ ముస్లిం పేరుతో ప్రజలను విడదీసి నిజాంను శాశ్వత పరిపాలకునిగా చేసేందుకు ప్రయత్నించారు. రజాకార్ వ్యవస్థను నిజాం కిరాయి సైన్యంగా కాశీం రజ్వీ సృష్టించాడు. ప్రజలను భయభ్రాంతులను చేయడం దోచుకోవడం మానభంగాలు హత్యలు లూటీలు చేయడం, చేయించడం దొరలకు జాగీర్దార్లకు అండగా నిలవడం రజాకార్లకు నిత్యకృత్యంగా మారింది. ప్రజలలో నిజాం పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అది కమ్యూనిస్టులు నేతృత్వంలో సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంది. చివరకు నిజాం అవమానకరంగా భంగపాటుకు గురయ్యాడు. అదే సమయంలో మిలట్రీ జనరల్ చౌదరి నాయకత్వంలో ప్రవేశించిన యూనియన్ సైన్యాలకు తలవంచాడు. బీరాలు పలికిన ఖాసిం రజ్వీ చివరికి జైలు పాలయ్యాడు. ఆ తరువాత పాకిస్థాన్‌కు దొంగచాటుగా పారిపోయాడు. తెలంగాణ సంస్థానంలో నిజాం పాలన అధ్యాయం ముగిసిపోయింది. నెహ్రూ ప్రభుత్వం రాజభరణాలను ప్రకటించింది. ప్రజల పాలిట కర్కోటకుడైన పాలకుడు నిజాం నవాబును రాజ్ ప్రముఖునిగా చేసింది.
పోలీస్ యాక్షన్, నిజాం పాలన అంతంతో ప్రజల కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. తెలంగాణలో నైజాం పాలన స్థానంలో నెహ్రూ పాలన వచ్చింది. పాలన రూపం మారింది. ఆనాటి దొరలే తిరిగి కాంగ్రెస్ నాయకులు అయ్యారు. ప్రజలపై దౌర్జన్యాలు పెరిగాయి. గ్రామాలలో దొరలకు, దేశ్ ముఖ్లకు ఎదురుతిరిగిన ప్రజలను, కమ్యూనిస్ట్ నాయకులను, కార్యకర్తలను, దళాలను వెంటాడి, వేటాడి నెహ్రూ సైన్యం కాల్చి చంపింది. నిర్బంధించింది. ఆస్తులను కొల్లగొట్టింది. పటేల్ పట్వారి దౌర్జన్యాలు పేరిగాయి. దొరలే ఎమ్మెల్యేలు మంత్రులు పాలకులయ్యారు. పాలనలో మార్పు లేదు ప్రజల బతుకుల్లో మార్పులేదు. అందుకే నిజాం లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా తెలంగాణ పోరాటం కొనసాగింది. ప్రజలపై దాడులను ప్రతిఘటించాలని పార్టీ నిర్ణయించింది. ప్రజలకు అండగా నిలవాలని తీర్మానించింది. నిజాం పోలీసు, మిలిటరీ, రజాకార్లను ఎదుర్కొన్న ఆ ప్రజా పోరాటం, భారత సైన్యాలను మిలటరీ దాడులను ఎదుర్కోవడంలో అనేక కష్టాలకు గురైంది. కానీ వెనకడుగు వేయలేదు. చివరకు పార్టీ నాయకత్వంతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపి పోరాట విరమణకు కొన్ని హామీలను ఇచ్చింది. నాయకత్వం పోరాట విరమణ ప్రకటించింది. ఆ తర్వాత ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయితే వీరుల త్యాగాలు వృధా కాలేదు. పోరాటాలు వృధా కాలేదు. అనేక విషయాలలో ఆ సాయుధ పోరాటం గొప్ప ఫలితాలు సాధించింది. వర్తమాన సమాజంలోనూ ఆ స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాలు సాగుతూనే ఉన్నాయి. అరుణ పతాకం రెపరెప లాడుతూనే ఉంది.
- జూలకంటి రంగారెడ్డి