Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతాపం వల్లే విజృభిస్తుందని ఇంగ్లండ్ పరిశోధకులు తెలిపారు. భూతాపం అనేది రోజురోజుకు పెరుగుతుంది. స్ట్రాటోస్పియర్లో గల ఓజోన్ పొర కాలుష్యం వల్ల క్షీణీస్తోంది. అందువల్ల భూమి వేడెక్కుతుంది. అడవులని విపరీతంగా నరకడం ఇందుకు ప్రధాన కారణంగాచెప్పవచ్చు.
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి 1976 నివేదికలో ఓజోన్ క్షీణత పరికల్పనకు విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలున్నాయని తేల్చాక, యునైటెడ్ స్టేట్స్, కెనడా, స్వీడన్, డెన్మార్క్, నార్వేలతో సహా కొన్ని దేశాలు ఏరోసోల్ స్ప్రే డబ్బాల్లో సీఎఫ్‌సీల వాడకాన్ని తొలగించడానికి నడుంకట్టాయి. మరింత సమగ్ర నియంత్రణ విధానానికి మొదటి మెట్టుగా దీన్ని పరిగణించారు. అయితే వివిధ రాజకీయ కారణాల వలన (హేలోకార్బన్ పరిశ్రమ నుండి నిరంతర ప్రతిఘటన, పర్యావరణం పట్ల రీగన్ ప్రభుత్వ వైఖరిలో మార్పు), శాస్త్రీయ పరిణామాల వలన (ఓజోన్ క్షీణత పై మొదట వేసిన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ అకాడమీ చెప్పింది) ఆ తరువాత ఈ దిశలో పురోగతి మందగించింది. యునైటెడ్ స్టేట్స్ 1978లో ఏరోసోల్ డబ్బాల్లో సీఎఫ్‌సీల వాడకాన్ని నిషేధించింది. ఈ నిషేధాన్ని విధించాలనే ప్రతిపాదనలను యూరోపియన్ కమ్యూనిటీ తిరస్కరించింది. యుఎస్‌లో, సీఎఫ్సీలను రిఫ్రిజిరేటర్లలోను, సర్క్యూట్ బోర్డులను శుభ్రపరచడానికీ ఉపయోగించడం కొనసాగించారు. యుఎస్ ఏరోసోల్ నిషేధం తరువాత ప్రపంచవ్యాప్తంగా సిఎఫ్సి ఉత్పత్తి బాగా పడిపోయింది.
ఓజోన్ పొరకు చిల్లుపడడం అంటే బట్టల్ని ఎలుకలు కొట్టడం ద్వారా చిల్లుపడ్డట్టుగానూ, రేకులో మేకు దించితే ఏర్పడే చిల్లులాగానూ ఊహించుకోకూడదు. ఓజోన్ తరిగిపోయే క్రమంలో ఏర్పడేది ఆక్సిజన్ (ఉ2) అణువులు, ఆక్సిజన్ నవజాత(ఉ) పరమాణువులు. ఇవి తిరిగి ఓజోన్‌గా మారగలవు. అయితే ఓజోన్ విఘటనం ఈ విధంగా కాకుండా ఇతర మార్గాల్లో ధ్వంసం అయితే ఉ2 అణువులు, ఉ పరమాణువులు ఏర్పడవు. అంటే వరి పంట వేశాముకానీ గింజలు రాలేదనుకోండి. అపుడు తర్వాత పంటకు ధాన్యం ఉండదు కదా! అలాగే ఓజోన్ను ఇతర మార్గాల ద్వారా ఖర్చుచేస్తే తిరిగి అది ఓజోన్‌గా మారే దారుల్ని మూసేసినట్టే! ఆ ఇతర మార్గాలే ఇప్పుడు మనల్ని, ప్రపంచ వాతావరణ శ్రేయోభిలాషుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మనం మితిమీరిన స్థాయిలో ఇంధనాల్ని వాడడం వల్ల నత్రజని ఆక్సైడ్లు వాతావరణంలో పేరుకుపోతాయి. మితిమీరిన మోతాదులో ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించే ఫ్రియాన్ వంటి ఫ్లోరీన్ సంబంధిత వాయువులు వాతావరణంలో కల్సి ఓజోన్ పొరని దెబ్బతీస్తున్నాయి.
లక్షల మందికి చర్మ కేన్సర్ రాకుండా, సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడకుండా నిలువరించే ఓజోన్ పొరను 1930లో కనుగొన్నారు. భూ ఉపరితలంపై స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఓజోన్ ఉంటుంది. 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఎక్కువగా ఆవరించి ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ అతినీలలోహిత కిరణాలను సంగ్రహించుకుంటుంది. క్లోరోఫాం కార్బన్ ఉపయోగించడం వల్ల స్ట్రాటోస్పియర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లుతోంది. ఓజోన్ పొరకు చిల్లులు పడడం వల్ల అతినీలలోహిత కిరణాలు భూమిని డైరెక్టుగా తాకడంతో నేత్ర వ్యాధులు, చర్మ కేన్సర్, చివరగా జన్యుపరమైన వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం స్ట్రాటోస్పియర్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో నేత్ర వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నేత్ర వ్యాధులు ప్రబలడం తొలి దశలోనే ఉన్నాం. శీతల దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈ ప్రభావం కనిపిస్తోంది. ఒక సర్వే ప్రకారం భూమిమీద 20 నుంచి 30 లక్షల మంది వరకూ చర్మ కేన్సర్ బారినపడినట్టు తెలిసింది.మానవాళి అవసరాలకు వాడే అనేక వస్తువుల నుంచి వెలువడే కాలుష్యం, వాటి ఉత్పత్తికి వాడే రసాయనాలతో ఓజోన్ పొరకు ముప్పు ఏర్పడింది.
ఓజోన్ కోసం ఏం చేయాలి
క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా చేయాలి. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలూ చేపట్టాలి. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలి. అపార్ట్మెంట్లు, షాపింగ్ మాళ్లూ నిర్మించేటప్పుడే... 33శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు ప్లేస్ ఉండేలా నిబంధనలు తేవాలి. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా... భూతాపాన్ని తగ్గిస్తూ... ఓజోన్ పొరను కాపాడుకోవచ్చు. విద్యార్థులకు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత గురించి తెలపాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ఉమ్మడి బాధ్యత. విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు అందరూ కలసి ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి.
- ఎం. రాం ప్రదీప్
సెల్:9492712836
(సెప్టెంబర్16 - ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా)