Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెట్టివిధానం, తెలంగాణ ప్రజల జీవిత విధానాన్ని అట్టడుగుస్థాయికి దిగజార్చింది. కేవలం బానిసత్వంలోకి నెట్టింది. మానవుని ఆత్మగౌరవాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ వెట్టి విధానం రద్దుకోసం ఉద్యమం విస్తృతంగా వ్యాపించింది. 1940 తర్వాత రైతాంగం ఫ్యూడల్ భూస్వాములతో తలపడింది కూడా ఈ సమస్యపైనే. అయితే అప్పటికే కమ్యూనిస్టుపార్టీ సంఘటితశక్తిగా రూపొందింది. పోరాటం సాగించే ఈ పీడిత కౌలుదార్ల గ్రామీణ పేదల హక్కుల కోసం ముందుండి నిలబడే పార్టీగా ప్రజలలో విశ్వాసాన్ని సాధించింది. అందువల్ల ఉద్యమం గతపోరాటంతో పోల్చినప్పుడు గుణాత్మకంగా భిన్నమైన రూపం తీసుకొంది.
వెట్టివిధానం (నిర్బంధచాకిరి, వసూళ్ళు) ఆటవిక తెగల ప్రాంతానికి, ఇతర ప్రాంతాలలో బాగా వెనుకబడిన కొన్ని సాంఘిక తెగలకూ మాత్రమే పరిమితమయినదిగా సాధారణంగా భావించబడుతుంది. కాని, తెలంగాణలో వెట్టివిధానం సమాజమంతటా ఆవరించి ఉండేది. ప్రజలలో అన్ని వర్గాల ప్రజలకు తర తమ స్థాయిలో అది వర్తించేది. ప్రతి హరిజన కుటుంబమూ వెట్టిచాకిరి చేయటానికి కుటుంబంలోని వారినొకరిని కేటాయించవలసి ఉండేది. చిన్నపల్లెల్లో ప్రతి ఇంటి నుండి ఒక మనిషిని పంపటం జరిగేది. పటేల్ పట్వారీ, మాలీపటేల్ లేదా దేశ్ముఖ్ల ఇండ్లలో గృహ సంబంధమైన పనులు చేయటం, పోలీసుస్టేషన్లకు, తాలూకా ఆఫీసులకు రిపోర్టులు మోసుకెళ్ళటం, గ్రామ చావిడికి, బందిలిదొడ్డికి కాపలాకాయటం రోజువారీ పనిలో భాగమే. ఇవి గాక, గ్రామ చావిడికి ఎవరయినా అధికారి వచ్చినప్పుడు వాళ్ళకు మరింత ఎక్కువ పనివుండేది. చిలుకూరు గ్రామంలో ప్రతిరోజూ 16 మంది హరిజనులు వెట్టిచాకిరి చేస్తుండేవారు. అడవుల నుండి కట్టెలు కొట్టి తెచ్చేవారు. టపా మోసుకెళ్ళేవారు. టపాగాని, ఇతర సరఫరాలను గాని మోసుకెళ్ళినందుకు గాను వారికి రెండున్నర మైళ్ళకు ఒక అణా చొప్పున ఇవ్వడుతున్నట్టు కాగితాల మీద ఉండేది. అయితే ఆచరణలో అదీకూడా ఇచ్చేవారు కాదు. ఈ విధానాన్నే ''కోసుకు వీసం'' అనేవారం.
చర్మకారులుగా పనిచేసే హరిజనులు, తోళ్ళను పదునుజేసి చెప్పులు కుట్టినందుకు, వ్యవసాయ పనులకు, నూతుల నుండి నీరు తోడటానికి అవసరమైన తోలు పరికరాలు తయారు చేసినందుకు, అరకలకు తయారుజేసినందుకు భూస్వాములు ఏమీ చెల్లించేవారు కాదు. హరిజనులు భూస్వాములకు వాటిని ఉచితంగానే సరఫరా చేయవలసి వచ్చేది. మిగతా రైతాంగం మాత్రం ఆ హరిజనులకు ధాన్యం రూపంలోనో, ఇతర వ్యవసాయ పంటల రూపంలోనో నిర్ణీతమైన మేర చెల్లించేవారు.
బోయలు, బెస్తలు, రజకుల వంటి మరికొన్ని ఇతర వెనుకబడిన కులాలవారు భూస్వామి కుటుంబాలకు చెందిన పురుషులను, స్త్రీలను పల్లకీలలోనో, మేనాలోనో ఎక్కించుకొని తమ భుజాల మీద మోసుకు వెళ్ళవలసి వచ్చేది. తమ బంధువులను చూచిరావాలనుకున్నప్పుడూ, తీర్థాలు, తిరనాళ్ళను సందర్శించ దలచినప్పుడల్లా భూస్వాములు ఆ విధంగా వారిచే నిర్బంధంగా మోయించుకునేవారు. భూస్వామి కుటుంబాల వారు వేగంగా నడిచే ఎద్దుల బండ్లలో ప్రయాణం చేసేటప్పుడు బండిముందు దారి బాగుజేయటానికి, బండి వెనక కాపలా దారుగా వారు పరుగెత్తవలసి వచ్చేది. వారు గుర్రాలపై స్వారీ చేసేటప్పుడు, గుర్రాల వద్ద పనిజేసే వ్యక్తులు వాటి వెంట పరుగెత్తవలసి ఉండేది.
కల్లుగీత కార్మికులు కల్లుగీత గీస్తూ, భూస్వాముల కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయటం కోసం ఐదు నుండి పదిచెట్ల వరకు ప్రత్యేకంగా కేటాయించి ఉంచాలి. వారికి రోజుకు ఐదుకుండల కల్లు సరఫరా చేయాలి. పండుగ పబ్బాలప్పుడు మరింత ఎక్కువ కల్లు ఇచ్చిరావాలి.
చేనేత పనివారు భూస్వాముల ఇండ్లలో పనిజేసే నౌకర్లకు బట్టలు సరఫరా చేయాలి. వడ్రంగులు, కమ్మర్లు, భూస్వాములకు వ్యవసాయ పరికరాలన్నీ ఉచితంగానే చేయాలి.
రజకులు, దేశముఖుల, గ్రామాధికారుల ఇండ్లలో బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. గ్రామ చావడిలో మకాం వేసిన అధికారుల కొరకు మంచాలు, పరుపులు మోసుకెళ్ళాలి. వంట చేయటానికి అవసరమైనవన్నీ చేరవేయాలి. వారే అధికారుల ఇండ్లలో పసుపు, కారం కొట్టాలి.
కుమ్మరులు అధికారులకు, భూస్వాములకు అవసరమైన కుండలివ్వాలి. జాగీర్దారుగాని, దేశముఖుగాని హైదరాబాదులో నివాసముంటున్నా, అంత దూరమూ నడిచివెళ్ళి, అవసరమైన కుండలన్నీ యిచ్చిరావాలి. గ్రామ చావడిలో మకాం వేసిన అధికారికి అవసరమైన కుండల్ని ఇచ్చిరావాలి. వంట కూడా చేసిపెట్టాలి. మంగలివారు ప్రతిరోజూ దేశముఖుల ఇండ్లలో సేవ జేసి రావాలి. రాత్రివేళ భూస్వామి పాదాలొత్తాలి. అతని వొళ్ళు మర్దన చేయాలి. భూస్వాముల ఇండ్లల్లో ఏదైనా వేడుక జరుపుకున్న ప్రతిసారి గ్రామానికంతటికీ పండుగ పబ్బాలొచ్చినప్పుడూ గొల్లవారు ప్రతిమంద నుంచి ఒక గొర్రెనిచ్చి తీరాలి. ఏదో ఒకసాకుతో భూస్వాములు ఎప్పుడు కోరితే అప్పుడు గొర్రెనిచ్చి తీరాలి.
గ్రామాలలో వ్యాపారం చేసేవారు పోలీసుపటేలు నుండి చీటీ అందగానే గ్రామంలోకి వచ్చిన ఏ అధికారికయినా మంచి నెయ్యితో సహా అవసరమైన సరుకులన్నీ వంతులవారీగా సరఫరా చేయాల్సి ఉండేది. వాళ్ళవద్ద ఏదైనా సరుకులేకపోయినా, ఏదైనా సరుకు యివ్వకపోయినా, ఇవ్వటానికి వ్యతిరేకించినా నానా విధాలయిన చిత్రహింసలకు, అవమానాలకు గురిచేయబడేవారు.
గ్రామ ప్రజలు, ప్రత్యేకించి సరఫరా జేయటానికి ఏ ఇతర వస్తువులూ లేని పేద ప్రజలు ఉచితంగా కోడిపెట్టలు సరఫరా చేయవలసి వచ్చేది. ఈ వెట్టి నుండి రైతులను కూడా వదలిపెట్టేవారు కాదు. ఎవరైనా అధికారి వచ్చినప్పుడల్లా రైతులు వారిని ఉచితంగానే తమ బండ్లలో ఎక్కించుకెళ్లాలి. ఏ వేళప్పుడుబడితే ఆ వేళప్పుడు ఎడ్లకు మేతమేపడం కూడా ఆపి వారిని వారి గమ్యస్థానాలకు చేరాలి. తమ స్వంత పొలాలలో పని ప్రారంభించటానికి ముందే గ్రామాధికారుల, భూస్వాముల పొలాలు దున్నిపెట్టాలి. భూస్వాముల భూములు తడిసేంత వరకూ రైతుల పొలాలకు నీళ్ళు అందనిచ్చేవారు కాదు. అధికారుల, భూస్వాముల పొలాలలో వ్యవసాయ కార్మికులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. ఆ తర్వాత గాని వారు తమ జీవనభృతి కోసం రైతులు పనులలోనికి వెళ్లటానికి వీలు లేదు. వివిధ రూపాల్లో సాగుతుండిన ఈ నిర్బంధ చాకిరి చేయించుకొన్నది, వసూళ్ళు సాగించింది భూస్వాములు మాత్రమే కాదు. చిన్న ఉద్యోగులు, పెద్ద ఉద్యోగులు, గ్రామాలలో నివశించుతున్న వారూ లేదా పర్యటనలలోనో ప్రత్యేక తనిఖీలకోసమో గ్రామాలకు వచ్చిన వారందరూ ఈ విధమైన చాకిరి చేయించుకోవటం, వసూళ్ళు సాగించటం జరిగేది.
ఈ ఫ్యూడల్ దోపిడీలలో కెల్లా దారుణమైనది భూస్వాముల ఇండ్లలో ''బానిసలుగా'' బాలికలను పంపించే పద్ధతి. భూస్వాములు, తమ కుమార్తెల పెళ్ళిళ్ళు చేసినప్పుడు, బానిసలుగా బాలికలను బహూకరించి, పెండ్లి జరిగిన తమ కుమార్తెలతో పాటే, వారి అత్తవారిండ్లలో పనిచేయటానికి పంపేవారు. భూస్వాములు ఈ బానిస యువతులను ఉంపుడుగత్తెలుగా కూడా ఉపయోగించుకునేవారు.ఆవిధంగా వెట్టివిధానం, తెలంగాణ ప్రజల జీవిత విధానాన్ని అట్టడుగుస్థాయికి దిగజార్చింది. కేవలం బానిసత్వంలోకి నెట్టింది. మానవుని ఆత్మగౌరవాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ వెట్టి విధానం రద్దుకోసం ఉద్యమం విస్తృతంగా వ్యాపించింది.
తమ అక్రమ వసూళ్ళను ఉదృతం చేయటానికి, సాగుచేసుకుంటున్న రైతులను వారి భూముల నుండి బేదఖలుజేసి ఆ పొలాలను ఇతరులకు కౌలుకివ్వటానికి వివిధ తరహాలకు చెందిన ఈ ఫ్యూడల్ భూస్వాములు ప్రయత్నించినప్పుడు, అంతకు ముందు కూడా రైతులు వీరోచిత పోరాటాలనేకం సాగించారు. 1920లో విసునూరు దేశముఖుకు వ్యతిరేకంగా పేద ముస్లిం రైతు బందగీ సాగించిన పోరాటం అలాంటి వీరోచిత పోరాటాలలో ఒకటి. 1945-49 తెలంగాణ పోరాటపు రోజులలో అశేష ప్రజాదరణ చూరగొన్న 'మాభూమి' నాటకంలో బందగీ అమరగాథకు శాశ్వతస్థానం కల్పించబడింది. రెండువందల ఔత్సాహిక నాటక దళాలు ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా, భారతదేశంలో తెలుగు ప్రజలు నివసించే అన్నిచోట్ల ప్రదర్శించారు.
అంతేకాదు, 1940 తర్వాత రైతాంగం ఫ్యూడల్ భూస్వాములతో తలపడింది కూడా ఈ సమస్యపైనే. అయితే అప్పటికే కమ్యూనిస్టుపార్టీ సంఘటితశక్తిగా రూపొందింది. పోరాటం సాగించే ఈ పీడిత కౌలుదార్ల గ్రామీణ పేదల హక్కుల కోసం ముందుండి నిలబడే పార్టీగా ప్రజలలో విశ్వాసాన్ని సాధించింది. అందువల్ల ఉద్యమం గతపోరాటంతో పోల్చినప్పుడు గుణాత్మకంగా భిన్నమైన రూపం తీసుకొంది.
- పుచ్చలపల్లి సుందరయ్య
(వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు నుంచి)