Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిబిఐ చేపట్టిన కేసులలో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదని సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే తమకు వివరాలతో నివేదిక సమర్పించాలని న్యాయమూర్తులు కిషన్‌కౌల్, సుందరేశన్‌లతో కూడిన ధర్మాసనం ఒక కేసు విచారణ సందర్భంగా ఆదేశాలిచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు ఏడాదిలోగా పూర్తి కావాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమయ్యాయనేదానిపై ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వాటికోసం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అవకాశం పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై పాత కేసులలో ఎఫ్ఐఆర్లు దాఖలుచేసిన సిబిఐ బీజేపీలోచేరిన ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారిని, ఆపార్టీలోనే చేరి ఇటీవల మళ్లీ టిఎంసివైపు వచ్చిన ముకుల్రారుని మినహాయించింది. టీడీపీలో ఉండగా సిబిఐ, ఇడి దాడులకు గురైన సుజనాచౌదరి, సిఎం రమేష్ వంటి ఎంపీలు బీజేపీలో విలీనమైనాక కొంత సురక్షితంగా ఉన్నారు. అదే టీడీపీ పూర్వనేత టిఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర రావు సంస్థపై దాడులు జరిగాయి. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తదితరులపై నడుస్తున్న కేసులలో బెయిలు రద్దు కోసం దాఖలైన పిటిషన్లో సిబిఐ దాగుడుమూతలాడుతున్నది. ఈ కేసుల్లో రెండవ నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. బెయిలు రద్దు పిటిషన్ వేసిన ఎంపీ కూడా బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో దర్యాప్తు విచారణ జాప్యం రీత్యా తన బెయిలు నిబంధనలు సడలించి స్వస్థలమైన బళ్లారి వెళ్లడానికి అనుమతించాలని బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి చేసిన అభ్యర్థనకు ఆమోదం లభించింది. అప్పట్లోనే సంచలనం కలిగించిన ఐనాక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఆయన కుమారుడు కార్తిలను కూడా బాగా వెంటాడినప్పటికీ ఎట్టకేలకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. 2జి కేసులో నిందితులూ కొంత స్వేచ్ఛగానే సంచరిస్తున్నారు. హైదరాబాదులో కార్వే కంపెనీ లక్షమంది షేర్హౌల్డర్లను ముంచి వేల కోట్లు గల్లంతు చేసిన కేసు మామూలుగానే నడుస్తున్నది తప్ప ఒకప్పుడు సత్యం కుంభకోణంలా పెద్ద ప్రచారం పొందడం లేదు. ముంబయిలోనైతే పోలీసులు మీడియా మాఫియాల పీటముడిలో శివసేన, ఎన్సీపీ, బీజేపీ అన్నీ చిక్కుకుపోయాయి.
అమరావతి నుంచి అదానీదాకా
ఏపీ ప్రభుత్వం అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి పెట్టిన ఇన్సైడర్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. సాంకేతికంగా దీనికి ఇన్సైడర్ నిబంధనలు వర్తించవని, ఆస్తి సమకూర్చుకోవడం రాజ్యాంగంలోని 19(1) (ఎఫ్), 31 అధికరణాల కింద హక్కు అని తేల్చి చెప్పింది. రైతుల దగ్గర సమీకరించిన 30వేల ఎకరాల భూమిలో సింగపూర్ ద్వారా అభివృద్ధ్ది చేస్తామని గత ప్రభుత్వం చెబితే జగన్ సర్కారు వచ్చాక వారు చడీ చప్పుడులేకుండా నిష్క్రమించారు. ఈ ప్రభుత్వం కొత్త పాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తానంటున్న విశాఖలో గంగవరం రేవును కారుచౌకగా అదానీ గ్రూపునకు విక్రయిస్తోంది. మధురవాడ ఐటిసెజ్లో ఎకరా 20 కోట్లుచేసే భూమిని ఎకరా కోటికే ఆ గ్రూపు వశం చేసుకుంది. హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలతో ఎల్‌అండ్‌టికి ఇచ్చిన మెట్రోలో వాటాను అమ్మకానికి పెట్టగా జిఎంఆర్ గ్రూపు తీసుకుంది. విశాఖ ఉక్కునే ప్రయివేటుపరం చేయడానికి కేంద్రం పథకాలు ప్రకటిస్తే రాష్ట్రం నామకార్థపు నిరసనకు పరిమితమైంది. ఇప్పుడు ఏకంగా దేశంలోని ప్రభుత్వ ఆస్తులను పంచాయతీల స్థాయి దాకా నగదీకరణ(మానిటైజేషన్) చేసేందుకు నాలుగు సూత్రాల కార్యక్రమం ప్రకటించింది. అవినీతి ఆరోపణల మధ్య రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఎగిరివచ్చేశాయి. రాఫెల్ విమానాలు వచ్చేశాయి గాని రాహుల్‌గాంధీ కుదుట పడలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎకసెక్కం చేశారు. మొదట్లో చెప్పుకున్న సుప్రీం కోర్టుకు వస్తే కార్పొరేట్ తిమింగళాలు పాలకపార్టీలకు నిధులిచ్చేసి తర్వాత తమ గుప్పెట్లో పెట్టుకునే ఎన్నికల బాండ్లపై కనీస విచారణకు ప్రాధాన్యత నివ్వడం లేదు. చెప్పాలంటే ఇలాటి ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. వీటన్నిటిలో ఉమ్మడి సూత్రాలు ఏమిటి?
మొదటిది : రాజకీయమే రాజశాసనం
మొదటిది రాజకీయకోణం. సీబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటి వంటివాటిని రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్రం వినియోగిస్తున్నది. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పంజరంలో చిలుకగా తనను తాను సుప్రీం కోర్టు ముందు అభివర్ణించుకున్న ఆ సంస్థ ఇప్పుడు మరింత పక్షపాతమయమైంది. వివక్షకు మారుపేరైంది. ఫిర్యాదులు స్వీకరించడం మొదలు దర్యాప్తు, ఎఫ్ఐఆర్ ప్రతిదీ రాజకీయరంగు పులుముకున్నది. బీజేపీలో ఉన్నవారిపై కేసులు నామమాత్రం కాగా దానికి అనుకూలమైన వారికి, లోబడిన వారికి కొంత సానుకూలత చూపిస్తూనే గుప్పెట్లో అట్టిపెట్టుకోవడం అనధికార సూత్రంగా మారింది. బీజేపీ నాయకులు తాము ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను జైలుకు పంపిస్తామనడం ఊతపదంగా చేసుకోవడం తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం. వారు ఏ హౌదాలో ఆ మాట అంటున్నారో తెలియదు గాని పాలక ప్రాంతీయ పార్టీలపై ఆ ప్రభావం పడి ఒత్తిడికి లోబడిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కేరళ పినరయి విజయన్ ప్రభుత్వం ఈ తరహా వివాదాల బెడదలేకున్నా కేంద్ర సంస్థల పోకడలను న్యాయస్థానంలోనే సవాలు చేసింది. తీవ్రఆరోపణలు దర్యాప్తులు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ సర్కారు కూడా కేంద్రం ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తున్నది. అనేక హైకోర్టులు సిబిఐ తీరును తప్పు పడుతున్నాయి. సిబిఐ డైరెక్టర్‌గా నియమించలేకపోయిన రాకేష్ ఆస్తానాను ఢిల్లీలో పునర్నియమాకం చేయడం ఈ బలీయ బంధానికి దర్పణం.
రెండు : అలసత్వం, అత్యుత్సాం
ఏదైనా కేసులో వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేసి నిజానిజాలు నిర్ధారించడం ముఖ్యం. కాని రాజకీయ కారణాల వల్ల చేసే ఆలస్యాలు లేదంటే అత్యుత్సాహాలతో ఈ ప్రక్రియ నడుస్తుంటుంది. అక్రమ వ్యవహారాలు నడిపే వారెప్పుడూ పత్రాలు రాసుకోరు. చట్టానికి చిక్కకుండా కావలసినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కనుక స్పష్టమైన ఆధారాలు(క్లించింగ్ ఎవిడెన్స్) దొరకడం అంత సులభం కాదు. పట్టుదలగానూ వృత్తినైపుణ్యంతో వెంటపడాలి. రాఫెల్ విమానాల సంఖ్య బాగా కుదించి, రేటు రెట్టింపునకు పెంచడానికి ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధతో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కోన్తో అనూహ్య చర్చలు జరపడానికీ అక్కడ సాగుతున్న దర్యాప్తులకు సంబంధం ఏమిటో పరిశోధిస్తే గాని తెలియదు. సుప్రీం కోర్టు మొదటే తోసిపుచ్చడంతో అదంతా జరగనేలేదు. భూకుంభకోణాల విషయంలో ఇదే ప్రధాన సమస్య. వైఎస్‌హయాంలో భూములు కేటాయించబడిన సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడిపెట్టాయనేది ప్రధాన ఆరోపణ. అప్పుడు తాను ప్రభుత్వంలో లేనని, ఆ సంస్థలు లాభం కోసమే పెట్టుబడి పెట్టి లాభపడ్డాయని జగన్ తదితరుల వాదనగా ఉంది. అప్పట్లో ఆయనను అరెస్టు చేసి 16నెలలు జైలులో పెట్టారు గాని ఇప్పటికీ చాలాకేసులలో అభియోగాలే పూర్తిగా దాఖలుచేయలేదు. గాలి జనార్థనరెడ్డి కేసుల్లోనూ అదే పరిస్థితి. అమరావతి భూముల కొనుగోళ్లలో పెద్దల హస్తం, సింగపూర్‌తో లావాదేవీలు బహిరంగ విషయాలే అయినా ఆధారాలదే సమస్య. మోడీతో చెడినప్పుడు ఈ కారణంగానే చంద్రబాబు ప్రభుత్వం సిబిఐకి అనుమతి నిరాకరించింది. తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన శాసనసభలో మాట్లాడారు. అయిదేండ్ల తర్వాత జగన్ ప్రభుత్వం ఆ విషయాలు తిరగదోడి సిబిఐని విచారణ కోరితే కేంద్రం సిద్ధపడలేదు. దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ కొనుగోళ్లు జరిగినపుడు ఆయన అదనపు ఎజి మాత్రమే గనక రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదని హైకోర్టు చెప్పింది. ఒక విధంగా జగన్ కేసుల్లో వాదన ఇదే. అక్కడ పెట్టుబడి పెట్టిన వ్యాపారవేత్తలు గాని ఇక్కడ భూములు అమ్మిన రైతులు గాని తాముగా ఫిర్యాదులు చేయలేదనేది మరో ఉమ్మడి అంశం. అనుకోని లింకులు ఏమైనా దొరికితేనో, ఎవరైనా అప్రూవరుగా మారితేనో, పోలీసులు, సిబిఐ స్వతంత్రంగా లోతుగా దర్యాప్తు చేస్తేనో మాత్రమే పూర్తి వివరాలు వస్తాయి. అదైనా జయలలిత కేసులో వలె ఎంత ఆలస్యం అవుతుందో చెప్పలేము. ఇన్ని కారణాల వల్ల చాలా కేసులు రాజకీయ విమర్శలతో వివాదాలతో ముగిసిపోతుంటాయి. జైలుకు వెళ్లిన లాలూప్రసాద్ యాదవ్, శశికళ, చౌతాలా వంటివారు తిరిగివచ్చి రాజకీయాల్లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. ఈ లోగా వారి వారసులు ఆ లోటు భర్తీ చేసి నాయకులైపోతారు.
మూడు:చిల్లర నుంచి టోకు పాలసీ
ముప్పయ్యేండ్ల సరళీకరణ తర్వాత ఈ శషభిషల అవసరమే లేకుండా పోయింది. ప్రతిదీ టోకున ప్రయివేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధ్దమైపోయింది. బివోపిని ఇప్పుడు మానిటైజేషన్గా మార్చింది. ఏదైనా, ఎంతకాలమైనా, ఏవిధంగానైనా ప్రయివేటుపరం చేయొచ్చు. జాతీయ రహదారులు, రైల్వేలు, రవాణాసంస్థలు, రేవులు, టెలికాం, బ్యాంకులు, బీమా, రక్షణ, సేవలు, భూములు ఒకటేమిటి ఇందుకు మినహాయింపే లేదు. పైగా టెండర్లకు ఎవరూ రావడం లేదని షరతులు సడలించడం, ప్యాకేజీలివ్వడం, రాయితీలు పెంచడం సర్వసాధారణమైంది. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, నవయుగ మెగా వంటి భారీ కాంట్రాక్టు సంస్థలు, ఎల్‌అండ్‌టి షాపూర్జీ వంటి నిర్మాణ సంస్థలు వ్యవస్థలో భాగాలై పోయాయి. రాష్ట్రాల స్థాయిలోనూ ఫార్మా కంపెనీలు, రియలెస్టేట్, మీడియా సంస్థలు అనధికార స్థానం పొందాయి. ఈ సంస్థలు గనక తమ ప్రత్యర్థి పార్టీలకు విరాళం ఇచ్చాయని తెలిస్తే అప్పుడు మళ్లీ వేట మొదలవుతుందని హైదరాబాదులోనే కొంతకాలం కిందట జరిగిన దాడులు స్పష్టం చేశాయి. ఆ మాటకొస్తే పెద్ద పార్టీల నేతలలో ప్రముఖులంతా మరోవైపున బడా వ్యాపార వేత్తలైపోయారు. ఆ విషయం గర్వంగా చెప్పుకుంటున్నారు కూడా. గతంలో మాదిరి క్విడ్ ప్రోకోల అగత్యమే లేకుండా ఏదైనా అమ్మకానికి పెట్టొచ్చు. అందులో ఎవరి వాటా ఎంతో ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు. ఎన్నికల కోసం ముందే నిధులు జమ చేసుకోవలసిన అవసరం లేకుండా ఎలక్టొరల్ బాండ్ల ద్వారా వేలకోట్లు ఇచ్చేయవచ్చు. బీజేపీకి అధికారికంగానే మూడున్నర వేలకోట్లకు పైగా నిధులు అందినట్టు లెక్కలు చెబుతూనే వున్నాయి. లంచం, ముడుపు, కుంభకోణం, స్కామ్ వంటి రకరకాల పేర్లతో పిలవబడిన అవినీతి ఈ విధంగా అధికార విధానస్థాయి పొందడం స్వాతంత్ర అమతోత్సవంలో గరళం లాంటి వాస్తవం. ప్రజాప్రతినిధులపై కేసుల విషయంలోనే విచారణకు న్యాయమూర్తులు, దర్యాప్తునకు అధికారులు తగినంతమంది లేరని సిజెఐ రమణ స్వయంగా వ్యాఖ్యానించారు. ఉన్నమేరకు కూడా మన న్యాయవ్యవస్థ వ్యక్తిగత ఆస్తి, వ్యాపార స్వాతంత్రం ఎప్పుడూ పరమ పవిత్రంగా చూస్తుంది. రాజకీయ నేతలపై ప్రభుత్వాలపై ఇంతగా మాట్లాడే కోర్టులు కార్పొరేట్ల నిర్వాకాలకు సమాన ప్రాధాన్యతనివ్వకపోవడం అందుకో ఉదాహరణ. ఇప్పుడు దేశంలోనే తొలి అర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాదులో ఏర్పాటుచేస్తున్నారు. అంటే ఏ న్యాయసూత్రాలకూ వ్యవస్థలతో నిమిత్తం లేకుండా వ్యాపార సంస్థలు తమలో తాము పంచాయితీలు పరిష్కరించుకోవడమన్నమాట. (ఇప్పుడు సింగపూర్‌లో వుంది.) కాని దానికోసం ఒక న్యాయమూర్తిని యావజ్జీవ సభ్యుడుగా ట్రస్టులో పెట్టారు. ఇదంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేర పాకులాట. న్యాయవ్యవస్థ తోడ్పాటు. ఎందుకంటే అది సరళీకరణ వెనకనున్న తాత్వికతను తప్పు పట్టదు. కనుక కోర్టులే అన్నీ సరిచేస్తాయనుకోడం పొరబాటు.
- తెలకపల్లి రవి