Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కర్మ, నుదిటిరాత, పూర్వజన్మ సుకృతం - అనే నమ్మకాలు దేశ ప్రగతికి అవరోధం! కులం, మతం, ప్రాతిపదికగా కాక, లౌకిక వాదం ప్రాతిపదికగా, సమానత్వం ఆధారంగా భారత పౌరులు మెలగాలి.'' - అని అన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి, దీనిని, భారత పౌరులు పాటిస్తున్నారా? మరీ ముఖ్యంగా మానసిక రోగులైన పరిపాలకులు పాటిస్తున్నారా? ఈ దేశ ప్రజలు మానసిక రోగులను కావాలని ఎన్నుకుంటున్నారా? లేక, ఎన్నికైన తర్వాత నాయకులు మానసిక బలహీనులుగా మారిపోతున్నారా? - తెలియదు! ఎవరైనా పరిశోధన చేసి తేల్చాల్సిన విషయం!
అది 1898వ సంవత్సరం - బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ జేమ్స్ స్క్విడ్ తాగిన మైకంలో ఒక మర్రి చెట్టు తనను అనుసరించి వస్తూ ఉందని భ్రమించాడు. వెంటనే దాన్ని అరెస్ట్ చేయమని తన కింది అధికారులకు ఆర్డర్ వేశాడు. వారు వెంటనే దాన్ని అరెస్ట్ చేశారు. చెట్టును గొలుసులతో కట్టేశారు. చెట్టు చుట్టూ గొలుసు తిప్పి, రెండు చివరలు కలిపి తాళం వేశారు. 'నేను అరెస్ట్ చేయబడ్డాను' - అని ఒక బోర్డు ఆ చెట్టు కొమ్మల మధ్య ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉన్న ఆ మర్రి చెట్టు 19వ శతాబ్దం నుండి బందీగా ఉంది. దాన్ని అరెస్ట్ చేయించిన వాడు, దాన్ని ఇంకా కొనసాగిస్తున్న వారూ మానసిక రోగులు కారని ఎలా అనగలం?
''దేశంలో కోవిడ్ వ్యాప్తికి కారణం నెహ్రూనే'' అని కేంద్ర హౌమ్ మంత్రి అమిత్‌షా అన్నారు. 1962లో చైనాతో నెహ్రూ యుద్ధం చేశారు కాబట్టి, అప్పటి కోపంతో చైనా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని కరోనా వైరస్‌ను సృష్టించిందని - అన్నారు. నెహ్రూ నిర్ణయాల ఫలితంగానే ఈ రోజు దేశంలో పరిస్థితులు ఇంత భయానకంగా తయారయ్యాయని, ఇక ముందు కూడా తయారవుతాయని.. వీటన్నిటికీ నెహ్రూనే కారణమని ఆయన అన్నారు. పెట్రోలు రేట్లు పెరగడానికి కారణం - గోమూత్రాన్ని పెట్రోలుగా మార్చే ఫార్ములాని గత ప్రభుత్వాలు కనుక్కోకపోవడమేననీ, మేం కనుక్కుందామంటే మమ్మల్ని ఆవుశాస్త్ర ప్రవీణులని ఎద్దేవా చేస్తున్నారనీ... వాపోయాడు ఓ బీజేపీ నాయకుడు! ఇలాంటి వారు మానసిక రోగులు కారని ఎలా అనగలం?
భూమి మీద వేడి తగ్గాలని బీజేపీ నేతలు గ్లోబుకు గోమూత్రంతో అభిషేకం చేశారు. వేడి తగ్గలేదు కదా? అలా తగ్గదని అతి సామాన్యుడికి కూడా తెలిసిన రోజులివి. కేంద్రమంత్రి రామ్‌దాస్ అథ్వాలే, కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు 'గో-కరోనా-గో' అన్నాడు. రెండోవేవ్ వచ్చినప్పుడు 'నో-కరోనా-నో' అన్నాడు. వీరు అధికారంలో ఉండి ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో దేశ ప్రజలు గమనించాలి. 'భాభీజీకా పాపడీ తింటే కరోనా రాదు' అని మరో కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రచారం చేశాడు. మరి ఆయన ఆ పాపడ్ ఎందుకు తినలేదో ఏమో - అనవసరంగా కరోనా తెచ్చుకుని ఆసుపత్రి పాలయ్యాడు? ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ అవుపేడ ఒంటికి రాసుకుని, ఆవు మూత్రం తాగే గ్రూపులను తయారు చేశాడు. ఆవు మూత్రంలో చల్లని నీరు కలుపుకుని తాగాలని చెబుతూ ఆయన తాగి చూపించాడు. అట్లా చేస్తే - 'బ్లాక్ ఫంగస్ సోకుతుందని' - మెడికల్ డాక్టర్లు వివరించారు. ''ఆవు మూత్రం తాగితే కరోనానే కాదు, ఎలాంటి ఇన్ఫెక్షన్సూ సోకవని'' భోపాల్ పార్లమెంట్ మెంబర్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రకటించారు. వెంటనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రంగంలోకి దిగి - ఆవు మూత్రం, పేడ రోగ నిరోధక శక్తిని పెంచవుగాక పెంచవు అని దేశ ప్రజల్ని హెచ్చరించింది. మానసిక వికలాంగులంతా అధికారంలోకి వస్తే ఇదిగో ఇలాగే దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. సామాన్యులు విషయాలు గ్రహించుకుంటూ ఉండాలి!
బ్రాహ్మణులకు అందరితో కలిపి కాకుండా, విడిగా, ప్రత్యేకంగా వ్యాక్సిన్లు వేయాలని కర్నాటకలో ఒక డిమాండ్ వచ్చింది. వ్యాక్సినేషన్‌కు కూడా కులాల పట్టింపులా అని ఆశ్చర్యపోవద్దు. మనువాదులు వారి మూర్ఖత్వాన్ని దాచుకోరు. ఎక్కడైనా, దేనికైనా అంటగడతారు. ''భారతదేశంలో జాతి వివక్షలేదు'' అని అన్నాడు బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు తరుణ్ విజరు. ఈయన ఆరెస్సెస్ పత్రికకు సంపాదకుడు కూడా - ''జాతి వివక్ష ఉంటే మేము నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో ఎందుకు ఎలా కలిసి ఉంటామని'' ప్రశ్నించాడు. అదీ ఎక్కడా? ఒక అంతర్జాతీయ న్యూస్ చానెల్ వారి చర్చా గోష్టిలో. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆ వ్యాఖ్యను తీవ్రంగా ఖండించారు. తరుణ్ విజరు వ్యాఖ్య వివాదాస్పదమై పెద్ద దుమారం చెలరేగింది. గత్యంతరం లేక ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. మానసిక వైకల్యాలున్నవారు తమకున్న లక్షణాల గూర్చి ఈరోజు కాకపోతే, రేపైనా తెలుసుకోక తప్పదు. తెలుసుకోక పోతే, సమాజమే ముఖం వాయగొట్టి తెలిసేట్టు చెపుతుంది.
ఇటీవల బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ - ''నేను రోజూ ఆవు మూత్రం తాగుతున్నాను. మీరూ తాగండి. ఆరోగ్యంగా ఉంటారు. కరోనా రాదు'' అని.. ఎన్నికల సభలో (మే - జులై 2021) ప్రచారం చేశాడు. బెంగాల్లో బీజేపీ ఎన్నికైతే అందరూ ఇక ఆవు మూత్రం తాగాల్సి వస్తుందేమోననుకుని, బెంగాల్ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో మనకు తెలుసు. యజ్ఞాలు చేస్తే - అగ్నిహౌత్రం వేడికి కరోనా నాశనమవుతుందన్నారు ఉషాఠాకూర్, గోపాల్ శర్మ. వీరిద్దరూ బీజేపీ నాయకులే. మీరట్‌లో యజ్ఞం ప్రారంభిస్తే.. ఆ తర్వాత అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు - అనే మాట వారు విన్నట్టులేదు. కర్నాటకలో బీజేపీ నేత శంకేశ్వర్ - ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ముక్కుద్వారా నిమ్మరసం పీల్చమన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగంలోని కొందరు ప్రముఖులు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవునెయ్యిని ముక్కుతో పీల్చమన్నారు. అలా చేయలేకపోతే రెండు చెంచాల నూనె నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేయమన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మళ్ళీ రంగంలోకి దిగింది. అలాంటి చిట్కాలు కరోనా కట్టడికి ఏ మాత్రం పని చేయవని హెచ్చరించింది. ఇలాంటి చేష్టలు, ఇలాంటి ప్రకటనలు మానసిక రోగులు (PARANOID SCHIZOPHRENIA) కాక, ఎవరు చేయగలరూ? ఎవరినో విమర్శించాలని కాదు గానీ.. ఊరికే ఇంగిత జ్ఞానంతో ఆలోచించి ఎవరికి వారు వారి ఆలోచనా విధానం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి!
కాంగ్రెస్ హయాంలో యమున ఒడ్డున వేర్లు, మూలికలు, దుంపలు ఏరుకుని సైకిల్ మీద తిరిగి అమ్ముకున్న రాందేవ్ - పతంజలి ప్రోడక్ట్స్‌తో కోట్ల వ్యాపారానికి అధిపతి ఎలా అయ్యాడూ? అంతా ఆ పువ్వుగుర్తు చలవ కాదా? పతంజలి ప్రోడక్ట్స్‌ని నేపాల్, బంగ్లాదేశ్ లాంటి ఇరుగు పొరుగు దేశాలు ఎందుకు నిషేధించాయి. భారతదేశంలో కూడా నిషేధించాలని పార్లమెంట్లో - సభ్యులు ఎందుకు డిమాండ్ చేశారు? పువ్వు గుర్తు నాయకులు ఎందుకు మౌనం వహించారు? వారికీ రాందేవ్‌కి ఉన్న లావాదేవీలేమిటి? పతంజలి రామ్‌దేవ్ అల్లోపతి వైద్యాన్ని 'స్టుపిడ్ సైన్స్' అన్నాడు. అందుకు ఇండియన్ మెడికల్ సైన్స్ అసోసియేషన్ లీగల్ నోటీసిచ్చింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఢిల్లీ కోర్టు స్వీకరించింది. ప్రధానికి, కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖలు రాసింది. పతంజలి రాందేవ్ ఠారుమన్నాడు. దెబ్బకు మాట మార్చాడు. వైద్యులు దేవతలని అన్నాడు. త్వరలో తను వ్యాక్సిన్ వేయించుకుంటానని కూడా అన్నాడు. ఎదిరించే వాడు లేనంత వరకు బెదిరించేవాడిదే రాజ్యం. ఎదిరించే వాడు వస్తే బెదిరించే వాడు పారిపోవడం ఖాయం!
రాందేవ్ 'కరోనిల్'కు కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్థన్, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం చేశారు. దానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని కూడా చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జోక్యం చేసుకుని, తాము ఏ సర్టిఫికెటూ ఇవ్వలేదని చెప్పి వారి అబద్దాల్ని బద్దలు కొట్టింది. హర్యానా ప్రభుత్వం, ప్రభుత్వ ఖర్చుతో కరోనిల్‌ను ఇంటింటికీ సరఫరా చేసింది. ప్రజలకు జరిగిన మేలు శూన్యం. ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి. పతంజలి రాందేవ్‌కు ధనలాభం. ఇలాంటి దుర్మార్గాల్ని సామాన్యులు అర్థం చేసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రంగంలోకి దిగకపోతే, పతంజలి రాందేవ్ మాట మార్చేవాడు కాదు. పైగా ఇంకా ఇంకా రెచ్చిపోయేవాడు. ''ముక్కులో ఆవనూనె పోసుకుంటే కరోనా చస్తది'' - అని ప్రకటించిన మూర్ఖుడు రాందేవ్. శ్వాసనాళాల్లో కరోనా ఉన్నట్టయితే అది జీర్ణకోశంలోకి వెళ్ళి - అక్కడ జీర్ణకోశంలోని ఏసిడ్స్ వల్ల కరోనా చనిపోతుందని వివరణ కూడా ఇచ్చాడు. ముక్కులో వేసుకున్న ఆవనూనె శ్వాసనాళాల్లోంచి ఊపిరితిత్తులకు చేరుతుందంటే సరే.. మరి ఊపిరి తిత్తుల నుండి జీర్ణకోశానికి దారి ఎక్కడిదీ? హ్యూమన్ ఎనాటమీ - గురించి కనీస పరిజ్ఞానం లేని మూర్ఖులు, వైద్య విధానాల గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. సామాన్యజనం అప్రమత్తంగా ఉండాలి. ఏది బడితే అది, ఎవరిని బడితే వారిని నమ్మకూడదు. రాయచూర్ ప్రాంతంలో బసవరాజు అనే 43ఏండ్ల ఉపాధ్యాయుడు ముక్కులో నిమ్మరసం పిండుకుని, అన్యాయంగా చనిపోయాడు. స్వంత ఆలోచనని పక్కనపెట్టి ఎవడేది చెపితే అది నమ్మి ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నవారు ఎంతోమంది ఉన్నారు.
ఇలాంటి రాజకీయ నాయకులను, గురు మూర్ఖులను ఉద్దేశించి, జస్టిస్ మార్కండేయ - 'వీళ్ళను కాల్చేసినా తప్పులేదు' - అని అన్నారు కోపం పట్టలేక - ''చదువు హౌదాలతో పనిలేదు.. 80శాతం మంది భారతీయులు మూర్ఖులు'' అని కూడా ఆయన తన ఆవేదనని వెళ్ళగక్కాడు. ఆయన అన్నదాంట్లో నిజం ఉంది - అని అనడానికి మనకు రోజూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. హెల్త్ చెకప్ - పేరిట దేవుడి విగ్రహానికి స్కెత్ పెట్టి, దేవుడి గుండె చప్పుడు ఎవరు వినగలరు చెప్పండి! వాళ్ళు తప్పకుండా ఆరెస్సెస్ భావజాలం ఉన్న డాక్టర్లే అయి ఉంటారు. అంతటితో ఆగలేదు. వాళ్ళు దేవుడి విగ్రహానికి రెండు డోసులు వ్యాక్సిన్ కూడా వేసి, తమ తమ భగవాన్‌లను కరోనా నుండి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇంతటి అద్వితీయమైన అజ్ఞాన మూర్ఖత్వానికి విశ్లేషణలు అవసరమా? పరిపాలకులే మానసిక రోగులైతే ఎలా? ప్రజలే కదా మార్చుకోవాల్సింది?
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు