Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నీ బాంచెన్ దొరా... నీ కాల్మొక్త అంటూ దొరలు, భూస్వాములకు ఊడిగం జేసిన తెలంగాణ పేదోడిని ఆత్మగౌరవంతో నిలబెట్టి, బందూక్ చేతబట్టించి, నిరంకుశ పాలకులైన జాగీర్దార్లు, భూస్వాములు, పటేల్, పట్వారీలను వారి తాబేదార్లను గ్రామాల నుండి పట్టణాలకు పరుగులెత్తించిన మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1946 సెప్టెబర్ నుండి 1951 అక్టోబర్ వరకూ ఐదేండ్ల పాటు తెలంగాణలో సాగిన ఈ పోరాటం 'భూమి సమస్య'ను భారత దేశ రాజకీయ ఎజండాలోకి చేర్చింది.
చేతికి ఉన్న ఐదువేళ్లు సమానంగా ఉన్నాయా? మనుషులందరూ సమానంగా ఎలా ఉంటారు? కష్టపడి సంపాదించుకున్న భూమిని ఇతరులకు పంచటమేమిటి? అనే భావజాలంతో ఉన్న పాలకులు ఈ పోరాటంతో భూమిని మేమే పంచుతాం అని ముందుకు రాక తప్పలేదు. 38 కౌలుదారీ చట్టాలూ, ఇందిరాగాంధీ కాలంలో తెచ్చిన భూసంస్కరణల చట్టాల నుండి ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ పాలనలో తెలుగు మాగాణ సమారాధన, రాజశేఖర్ రెడ్డి భూపంపకాలు, కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి దాకా పాలకులందరూ అమలు చేయకపోయినా 'భూమి' గురించి మాట్లాడక తప్పలేదు. ఇదంతా నాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలితమే. ఆ పోరాటంలో అసువులర్పించిన నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోధుల త్యాగాల ఫలితమే.
నైజాం రాచరిక ప్రభుత్వం రద్దు కావాలి, దున్నేవానికి భూమి ఇవ్వాలి, రైతాంగానికి భూమి హక్కులు ఇవ్వాలి, వెట్టిచాకిరీ రద్దు కావాలి, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే ప్రధాన డిమాండ్లతో ఈ పోరాటం జరిగింది. ఈ పోరాట ఫలితంగా 10లక్షల ఎకరాల భూమి పంచబడింది. 3వేల గ్రామాలలో ప్రజారాజ్యం ఏర్పడింది. భూమిశిస్తులు రద్దు చేయబడినాయి. వెట్టి చాకిరీ రద్దఅయింది. అప్పటి వరకూ నిర్భందంగా అమలు జరిగిన ఉర్దూ భాషలో విధ్యాబోధన రద్దు చేయబడి తెలుగు సంస్కృతి పునరుద్దరించబడింది. అక్రమంగా రాసుకున్న అప్పుల పత్రాలు రద్దయ్యాయి. ఇంకా అనేక ఘన విజయాలు సాధించిన చరిత్ర తెలంగాణ పోరాటానిది.
నిజాం సంస్థానమంటే నేటి తెలంగాణ ప్రాంతమేగాక మాహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలు కలిసి ఉన్న ప్రాంతంగా ఉండేది. 200 సంవత్సరాలుగా నిజాం వంశస్థులే ఈ ప్రాంతాన్ని పాలించారు. చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో అధికారం చేబట్టి 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయేదాకా పాలించాడు. ఈ ప్రాంతంలో 5కోట్ల 30లక్షల ఎకరాల భూమి ఉంది. దీనిలో 3కోట్ల ఎకరాలు ప్రభుత్వానికి శిస్తు చెల్లించే దివానీ భూమిగా ఉండేది. కోటి 50లక్షల ఎకరాల భూమి జాగీర్దార్లు, జమీందార్లు, అగ్రహారీకుల కింద ఉండేది. ఈ భూములపై శిస్తులు విపరీతంగా ఉండేవి. దివానీ భూముల కంటే 10రెట్లు ఎక్కువగా శిస్తు వసూలు చేసేవారు. శిస్తులు కట్టలేక రైతులు భూములు వదులుకోవటం జరిగేది. ఇక మరో 45లక్షల ఎకరాల భూమి నిజాం కుటుంబ స్వంత భూమిగా ఉండేది. దీనినే సర్ఫేఖాస్ భూమి అంటారు. ఇతర పేదల జీవితం కూడా దుర్బరంగా ఉండేది. వెట్టి చాకిరీ అనేది ఆనాడు సర్వత్రా అమలు జరిగిన దోపిడీ రూపం. భూస్వాములు, దొరలు, పటేల్, పట్వారీలు ఇతర పెత్తందార్ల ఇండ్లలో దళితులు పారిశుద్యపనులు ఉచితంగా చేయాలి. చెప్పులు, తోలుతో చేసే వ్యవసాయ పరికరాలు ఉచితంగానే ఇవ్వాలి. రజకులు బట్టలు ఉతకటం, పల్లకీలు, మేనాలు మోయటం ఉచితంగా చేయాలి. నేత పనివారు ఉచితంగా బట్టలు ఇవ్వాలి. గీత పనివారు వారికి కేటాయించిన చెట్లకు కల్లుగీసి పోయాలి. ఇంకా ఇతర చేతివృత్తుల వారు కూడా ఈ ఉచిత సేవలు అందించాలి. గ్రామంలోకి బయటి నుండి వచ్చే అధికారులందరికీ కూడా ఈ సేవలందించాలి. పండుగలు, పబ్బాలు, దొరల, దొరసానుల జన్మదినాలు, ఇతర దినాలు వస్తే ఈ చాకిరీ, నజరానాలు ఇంకా ఎక్కువగా చేయాలి. నిజాం పాలనలో స్త్రీల దుస్థితి వర్ణనాతీతం. పేదవాడికి పెండ్లయితే భార్యను ముందు ఊరి దొరకు అప్పగించాలి. భూస్వాముల పొలాల్లో పనిజేసే మహిళలు పిల్లలకు పాలిచ్చి రావటానికి ఇంటికి వెళ్లాలంటే పాలుతాగే పిల్లలున్నారని భూస్వామికి 'నమ్మకం' కలిగించేందుకు రొమ్ముల నుండి పాలు పిండి చూపించాల్సి వచ్చేది. ఇక గుండాల, రజాకార్ల అత్యాచారాలకు అంతే లేదు.
నిజాం సంస్థానంలో ప్రజల ఈ దుర్భర జీవితాలకు చరమగీతం పాడేందుకు ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. మొదట తెలుగు భాషా సంస్కృతుల రక్షణ కోసం ఏర్పడిన ఈ సంఘం క్రమంగా భూమిపోరాటాలు నిర్వహించి, నిజాం పాలన అంతమొందించాలనే రాజకీయ పిలపులిచ్చిన సమరశీల సంస్థగా ఎదిగింది. 1928లో మాడపాటి హన్మంతరావు ఆధ్వర్యంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. 1940లో మల్కాపురంలో జరిగిన 7వ ఆంధ్రమహాసభ నాటికి కమ్యూనిస్టు యువకులు అనేక మంది ఈ సంఘంలో చేరి సంఘటితమయ్యారు. తరువాత చిలుకూరులో జరిగిన 8వ సభలో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణ రెడ్డి ఆంధ్రమహాసభ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. నిజాం ప్రభువుకు విజ్ఞాపనలకే పరిమితం కావాలనే మితవాదులకు, ఆ ప్రభుత్వాన్ని కూలదోసే పిలుపు ఇవ్వాలనే అతివాదులకు మధ్య భువనగిరిలో జరిగిన 11వ మహాసభలో చీలిక వచ్చింది. తరువాత ఖమ్మంలో 1944లో జరిగిన 12 ఆంధ్రమహాసభ భూపోరాటాలకు, నిజాంకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలకు పిలుపు ఇచ్చింది. భూస్వాములు సాగించే 'భూ బేదఖళ్లు' పంట కల్లాలపై భూస్వాముల గుండాలు దాడిచేసి పంట ఎత్తుకెళ్లటాలు ఆనాడు ముఖ్య సమస్యగా ముందుకొచ్చింది.
వరంగల్ జిల్లా కిష్టాపురంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు కూతురు ఐలమ్మ. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యకు ఇచ్చి పెండ్లి చేసారు. ఆనాడు చాకలి కులానికి బట్టలు ఉతికే వృత్తే జీవనాధారంగా ఉండేది. కానీ ఐలమ్మ ఆత్మాభిమానంతో భూమి సాగుజేసుకుని రైతుగా బతకాలని నిర్ణయించుకుంది. ఆ గ్రామ భూస్వామి దగ్గర 4ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించింది. 'ముట్టు గుడ్డలుతికి, ఇండ్లలో అన్నం అడుక్కుని బతికే చాకల్ది' రైతుగా మారటాన్ని పెత్తందార్లు భరించలేకపోయారు. ఎలాగైనా ఆమె వ్యవసాయం ఆపాలనే పన్నాగంతో దేశ్‌ముఖ్ ఆదేశాలతో పట్వారీ రికార్డులు తిరగరాసారు. పండిన పంట కాజేయటానికి ప్రయత్నించారు. ఐలమ్మ ప్రతిఘటించింది. అప్పటికే ఆప్రాంతంలో పనిజేస్తున్న 'సంఘం'లో (ఆంధ్రమహాసభను ప్రజలు అలా పిలుచుకునేవారు) చేరింది. ఐలమ్మ ఇల్లే సంఘం ఆఫీసు అయింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో దళం వెళ్లి ఐలమ్మ పంటను రక్షించి ఆమె ఇంటికి చేర్చింది. భీమిరెడ్డి తదితరులపై కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఇది మొదటి తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ప్రదర్శించిన మొదటి మహిళ ఐలమ్మ 'చాకలి ఐలమ్మ'గా చరిత్ర ప్రసిద్ది కెక్కింది. ఈ ఘటనతో తెలంగాణ వ్యాపితంగ రైతాంగానికి ధైర్యం వచ్చింది. ఎక్కడికక్కడ భూస్వాములు, దొరల భూబేదఖళ్లకు వ్యతిరేకంగా 'ఈ భూమి మనదిరో... ఈ పంట మనదిరో' అనే మహౌద్యమం ప్రారంభమైంది. దొరలు బేంబేలెత్తారు. ఎలాగైనా ఉద్యమాన్ని దెబ్బగొట్టాలనే కుట్రలు చేసారు. సంఘం నాయకులను మట్టుబెట్టి ప్రజలను బెదరగొట్టొచ్చనే కుయుక్తులు పన్నారు. 1946 జులై 4న కడవెండిలో భూస్వాముల దౌర్జన్యాలను నిరసిస్తూ సాగుతున్న ప్రదర్శనపై గుండాలు దాడిచేసారు. గురిపెట్టి కాల్పులు జరిపారు. ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న సంఘం నాయకుడు దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలకోసం ప్రాణాలర్పించిన మొదటి వీరుడు దొడ్డి కొమరయ్య. ఈ ఘటనతో తెలంగాణ ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోయింది. 'దొర ఎవడురో... దొర పీకుడేందిరో...' అనే స్థాయికి ఉద్యమం చేరింది. ఆయుధాలు చేబట్టయినా నిజాం దౌర్జన్యాలను అడ్డుకోవాలనే నిర్ణయానికి ప్రజానీకం వచ్చింది. పంటపైబడే పిట్టల్ని కొట్టడానికి వాడే 'వడిసెల' పంటలపై దాడిచేస్తున్న గుండాలను తరిమికొట్టటానికి ప్రజల చేతిలో మొదటి ఆయుధం అయింది. ప్రజాభీష్టానికి అనుగుణంగా సెప్టెంబర్‌లో సాయుధ పోరాట పిలుపు ఇవ్వబడింది. ఐదేండ్లు సాగిన ఈ పోరాటం అనేక విజయాలు సాధించి 1951 అక్టోబర్ 21న విరమించబడింది.
ఈ మహత్తర పోరాటాన్ని వక్రీకరించటానికి నేడు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటంగా చిత్రిస్తోంది. ఇది ఎంత హాస్యాస్పదం? ప్రజలు భూస్వాములు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు. 45వేల ఎకరాల విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ముస్లిమా? లక్షా 40వేల ఎకరాల జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ముస్లిమా? లక్ష ఎకరాల కల్లూరు భూస్వామి రాఘవరావు ముస్లిమా? ప్రజల్ని పీడించిన వీరంతా హిందువులే గదా? అక్కడక్కడ ముస్లిం జాగీర్దార్లూ ఉన్నారు. మరోవైపు ఈ రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిందెవరు? అంతా హిందువులేనా? తన భూమి కోసం పోరాడి ప్రాణాలిచ్చిన బందగీ ముస్లిం కాదా? ఆ అమరవీరుడి కథనంతో ప్రారంభమైన 'మా భూమి' నాటకం తెలంగాణ అంతటా ప్రజల్ని ఉర్రూతలూగించలేదా? నిజాం వ్యతిరేక రాతలు రాసాడని రజాకార్లు చేతులు నరికి చంపిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ ముస్లిం కాదా? ఈ పోరాటంలో ముందువరసలో పాల్గొన్న ప్రముఖ నాయకుడు ముఖ్దుం మొహియుద్దీన్ ముస్లిం కాదా? వీరంతా ముస్లిం అయిన నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు కదా? వీరే కాదు. ఇంకా వందల వేల మంది ముస్లింలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. అందువల్ల ఇక్కడ మతం సమస్య ఆవగింజంత లేదు. ఉన్నదంతా వర్గ సమస్యే. దోపిడీ సమస్యే. ఈ వాస్తవాలు బీజేపీ నాయకులకు తెలియక కాదు. కానీ తెలంగాణలో రాజకీయంగా బలపడటం కోసం వారు ఈ కుటిల ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రాజకీయంగా బలపడాలని కోరుకోవటం తప్పుకాదు. ప్రజలకు సేవచేయటం ద్వారా బలపడాలి. కానీ బీజేపీ గతంలో బలపడిందిగానీ, ఇప్పుడు తెలంగాణలో బలపడాలను కుంటున్నదిగానీ ప్రజలకు సేవచేయటం ద్వారా కాదు. మత కలహాలు రెచ్చగొట్టి బలపడాలనేది దాని కుతంత్రం. బీజేపీ చరిత్రంతా అదే. 2సీట్ల నుండి 85కు ఆ తర్వాత 180, 300కు పైగా పార్లమెంటు స్థానాలు గెలవటంలోని రహస్యం అదే. బీజేపీ బలపడిన చోటల్లా మతకలహాలు జరపటం, మతకలహాలు జరిగిన చోటల్లా బీజేపీ బలపడటం ఇదే జరిగింది. జరుగుతోంది. తెలంగాణలో ప్రజలందరికీ చిరపరిచితమైన సాయుధ రైతాంగ పోరాటాన్ని మత పోరాటంగా చిత్రించి రెచ్చగొడితే, హిందువులకు ముస్లింలకు మద్య చిచ్చు పెడితే తెలంగాణలో బలపడొచ్చనేది వారి దురాలోచన. ఆ పన్నాగాలు సాగనివ్వకూడదు.తెలంగాణ సాముధ పోరాటంతో ఏ సంబంధమూ లేని, ఏ పాత్రాలేని బీజేపీ తగుదునమ్మా అంటూ పోరాట ఉత్పవాలు జరపబూనుకుంటోంది. సెప్టెంబర్ 17న 'విమోచనదినం' పేరుతో సభ జరపటానికి కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నాడు.
తెలంగాణ పోరాటం జరిగిన కాలంలోనే కాశ్మీర్లో రాచరికానికి వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ప్రజా పోరాటం జరిగింది. అక్కడి రాజు హరిసింగ్ హిందువు. ఆయన పాలనను బీజేపీ సమర్థించింది. అక్కడి రాజు హిందువు అయినా, ఇక్కడి నిజాం ముస్లిం అయినా జరిగిన పోరాటాల స్వభావం ఒక్కటే. అవి రాజరికానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరాటాలు. పాల్గొన్నది ప్రజలు. తెలంగాణలోలాగే కాశ్మీర్‌లోనూ భూముల పంపకం జరిగింది. ఈ వాస్తవాన్ని మరుగుపర్చటానికి కాషాయ కూటమి సాగిస్తున్న ప్రయత్నాలు వమ్ముకాక తప్పదు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలు పోరాడుతుంటే బ్రిటిష్ పాలకులకు గులాంగిరీ చేయటంతో పాటు, పోరాటానికి నాయకత్వం వహించి జాతిపితగా కీర్తించబడ్డ మహాత్మా గాంధీని చంపిన 'గాడ్సే'ను దేశభక్తుడిగా పొగడుతున్న మతోన్మాద పార్టీ బీజేపీ. ఈ కళంకిత పార్టీ దుష్ట ప్రయత్నాలకు కళ్లెంవేయటం మన కర్తవ్యం.
వీరవనిత ఐలమ్మ వర్థంతి రోజయిన సెప్టెంబర్ 10 నుండి నిజాం సంస్థానం ఇండియాలో విలీనం జరిగిన సెప్టెంబర్ 17 వరకూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరపాలన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపును జయప్రదం చేస్తున్న ప్రజలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈ పిలుపు ఆ పోరాటాన్ని స్మరించుకోవటానికి మాత్రమే కాదు. ఆ పోరాట కర్తవ్యాలు పూర్తి కాలేదు. మోడీ ప్రభుత్వ విధానాలు ప్రజల బతుకుల్ని బజారు పాలుజేస్తున్నాయి. సాధించుకున్న కనీస హక్కుల్ని కాలరాస్తున్నాయి. పౌర హక్కులు, ప్రజాస్వామ్యం మృగ్యం అవుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అమలు జరపటం లేదు. బీజేపీ దుష్టపాలనను ఎదిరించటానికి తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాపాడటానికి ముందుకు రాలేకపోతున్నది. భూమి సమస్యలు పరిష్కారం కావటం లేదు. దళితులకిస్తామన్న మూడు ఎకరాల భూమి ఊసే లేకపోగా ఎన్నో సంవత్సరాలుగా గిరిజనులు సాగుజేసుకుంటున్న పోడు భూములను చట్ట విరుద్దంగా లాక్కుంటున్నది. రాక్షస నిర్భందాలను ప్రయోగిస్తున్నది. ఈ సమస్యలన్నింటిపైన సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఐక్యపోరాటాలకు పిలుపిచ్చాయి. తెలంగాణా సాయుద రైతాంగ పోరాట స్ఫూర్తితో ఈ ప్రజాస్వామ్య పోరాటాలను ముందుకు తీసుకుపోదాం.
- తమ్మినేని వీరభద్రం