Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీగారూ...
గత ఏడేండ్లుగా మీ నాయకత్వంలోని బీజేపీ పాలనను విశ్లేషించగా, నూటికి నూరుపాళ్ళు మీ పార్టీ ఎజెండా, అనగా ఆర్ఎస్ఎస్ హిందూ ఎజెండాను అమలు చేస్తున్నట్టు తేలుతున్నది. ఒక మతతత్వ బూర్జువాపార్టీగా దేశ సంపదను గుత్తపెట్టుబడిదారులకు దోచిపెట్టడం జరుగుతున్నది. గుత్తపెట్టుబడిదారలకు వేల, లక్షల కోట్లు బ్యాంకు బాకీలను పారుబాకీల కింద రద్దుచేయటం, లక్షల కోట్లు సబ్సిడీలు ఇవ్వటం, ఎగవేత దారులను దేశాలు దాటించటం చేస్తున్నారు. గుత్తపెట్టుబడిదారుల నుంచి ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్లు పార్టీ ఫండ్‌గా మీ పార్టీ పొందుతున్నది. ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలయిన టెలికం, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పెట్రోలు, గ్యాస్ లాంటివి మీ ప్రభుత్వం వారికి కట్టబెడుతున్నారు. రాబోయే కాలంలో రైల్వేలు, నౌకాశ్రయాలు, ఉక్కు కర్మాగారాలు, ఎల్ఐసీ, బ్యాంకులు, రోడ్లు మొదలైన అనేక ప్రభుత్వ (ప్రజల) ఆస్తులను అమ్మేస్తానంటున్నది. ప్రభుత్వం వ్యాపారికాదు ఇవన్నీ నిర్వహించటానికని అంటున్నారు. పెట్టుబడిదారులే దేశ నిర్మాతలంటున్నారు. కార్మిక రక్షణ చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను చేసి పెట్టుబడిదార్ల దోపిడీకి ద్వారాలు తెరిచారు. విద్యుత్తు బిల్లుతో ప్రయివేటుకు పట్టం కట్టాలని చూస్తున్నారు. ఇటువంటి అనేక చర్యలతో గుత్తపెట్టుబడిదారీ అనుకూల పరిపాలన గావిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమ విషయాల లాంటి వాటిలో మీ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయినది. బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్నది. ప్రజల అసంతృప్తిని ప్రక్కదారి పట్టించే మతతత్వ ఎజెండా చర్యలను పెంచి పోషిస్తున్నది. రాష్ట్రాలకు కేటాయించబడిన విద్య, వ్యవసాయం లాంటి వాటిని బలవంతంగా గుంజుకొంటున్నది. రాష్ట్రాల హక్కులను రద్దుచేస్తూ, సమాఖ్య వ్యవస్థను నీరుగార్చి కేంద్రీకృత పాలన దిశగా నియంతృత్వ చర్యలు తీసుకుంటున్నది. పార్లమెంటులో చర్చలు జరుగనీయని పరిస్థితి కల్పించి నిరంకుశంగా చట్టాలు చేస్తున్నది. మీ విధానాలను విమర్శించిన వారిని దేశద్రోహులంటూ, విచారణా రహితంగా జైళ్ళపాలు చేస్తున్నది. ఒకేదేశం, ఒకే భాష, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికలు అంటున్నది. ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ ఎజెండా. అంటే హిందూత్వ ఎజెండా. హిందూత్వ ప్రకారం జ్రాస్వామ్య విధానం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ నిరంకుశ పాలన సాగిస్తూ, గుత్తపెట్టుబడిదారులకు దేశాన్ని అప్పచెపుతూ ప్రభుత్వాన్ని జీరోస్థాయికి చేర్చుతున్నది. కాబట్టి ఇప్పుడున్న పంచాయతీల నుంచి పార్లమెంటు వరకూ ప్రతి ఐదేండ్లకు ఒకసారి వేలం పాట నిర్వహించి వచ్చిన డబ్బును ప్రతి మనిషికీ పంచండి. ఈ విధానంతో ఎన్నికలు, గెలుపోటములు, ప్రభుత్వ ఎన్నికల ఖర్చు, పార్టీలు, నిర్వహణ ఖర్చు లాంటి సమస్యలన్నీ పరిష్కరించబడి పూర్తి గుత్తపెట్టుబడిదారీ విధానం అమలు అవుతుంది. ఈ చర్యతో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ మతతత్వ గుత్తపెట్టుబడిదారీ విధానమైన మీ హిందూత్వ ఎజెండా కూడా అమలు జరపబడుతుంది. కాబట్టి మోడీగారూ వెంటనే ఈ సూచనను అమలుపరచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగలరని మనవి.
- టి. మోహనరావు
సెల్ 9908503997