Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జస్టిస్ ఎం.సి. చాగ్లా స్మారకోపన్యాసం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ''స్పీకింగ్ ట్రూత్ టు పవర్: సిటిజన్స్ అండ్ ది లా'' అనే అంశంపై ఆలోచనాత్మకమైన రీతిలో చాలా స్పష్టమైన ఉపన్యాసం చేశారు.
అధికారంలో ఉన్న వారితో వాస్తవాలు మాట్లాడడంలో సత్యం, ప్రజాస్వామ్యం, పౌరుల పాత్ర మధ్య గల సంబంధాలపై పాండితీ ప్రకర్షతో కూడిన విశ్లేషణ జరిపారు. 'ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి సత్యం యొక్క శక్తి అవసరం. అధికారంలో ఉన్నవారితో వాస్తవాలే మాట్లాడాలన్నది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి హక్కుగా ఉండాలి. అంతేకాదు, అది ప్రతి పౌరుడి విధి కూడా' అన్నారు. అయితే, సత్యం లేదా వాస్తవం మాట్లాడటాన్ని అధికారంలో వున్నవారు వ్యతిరేకిస్తారని, దీనివల్ల నిరంకుశత్వం వైపునకు మొగ్గుచూపుతారని భావించబడుతోందని చంద్రచూడ్ పేర్కొన్నారు.
కొద్ది రోజుల ముందు, ''పాలనలో న్యాయ వ్యవస్థ పాత్ర'' అనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.రవీంద్ర భట్ ప్రసంగించారు. ''ఎంతో మూల్యం చెల్లించి మనం మన స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. అందువల్ల ప్రతి భారతీయుడు అధికారంలో ఉన్న వారి చర్యలను ప్రశ్నించడానికి తన స్వేచ్ఛలను నిరంతరంగా ఉపయోగించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉచిత భోజనానికి టిక్కెట్లు ఇవ్వదు. స్వేచ్ఛను నొక్కి చెప్పడం, పరిరక్షించడం, ఏదైనా ఆక్రమణ జరిగితే ఉదాసీనత ప్రదర్శించకపోవడమనేది మనందరి కర్తవ్యం'' అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అధికారంలో ఉన్నవారిని పౌరులు ప్రశ్నించాలనేది ఇక్కడ నొక్కి చెప్పారు.
దేశం నిరంకుశవాదం వైపునకు నెమ్మదిగా జారిపోతున్న వేళ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇటువంటి చైతన్య వంతమైన అభిప్రాయాలను వెల్లడించడం, ఉద్బోధించడం నిజంగా హృదయపూర్వకంగా ఆహ్వానించదగిన విషయం. అయితే, మనం మన చుట్టుపక్కల చూసినప్పుడు, జస్టిస్ చంద్రచూడ్ ప్రతిపాదించిన సత్యం, ప్రజాస్వామ్యం వంటి అద్భుతమైన ఆలోచనలకు విరుద్ధంగా, పూర్తి భిన్నమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్న వారితో వాస్తవాలు మాట్లాడిన వారికి, అణచివేత వర్గాలకు గురైన వారి హక్కుల కోసం అండగా నిలబడినవారికి ఏం జరుగుతోంది? యూఏపీఏ కింద ఎల్గార్ పరిషద్-బీమా కోరెగావ్ కుట్ర కేసు బనాయించడం వంటి కేసులు ఉన్నాయి. ఈ కుట్ర కేసు కింద అరెస్టయిన వారిలో కొంతమంది ఇప్పటికే ఎలాంటి విచారణ లేకుండా జైల్లో మూడేండ్లు గడిపారు.
సత్యం కోసం నిలబడే పౌరుల కోసం సాయంగా ఉండాల్సిన ప్రజా సంస్థలను బలోపేతం చేయడం గురించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. అలాంటి సంస్థల్లో మొదటగా ఉండేది స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగమన్నారు. అయితే, మీడియా అపారమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందన్నది ఇక్కడ వాస్తవం.
స్వతంత్రంగా ఉంటూ, సత్యాన్నే మాట్లాడాలనుకునే మీడియా సంస్థలు, జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్నారు. వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి లోని దేశద్రోహం క్లాజును వారిపై చాలా ఉదారంగా ఉపయోగిస్తున్నారు. రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మ్యాప్ నుంచి తొలగించడం, పౌరులకు మతపరమైన ప్రామాణికతను ప్రవేశపెడుతూ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించడం, ప్రభుత్వ చర్యల ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను ప్రతి రోజూ ఆక్రమించడం వరకు ప్రాథమిక హక్కులపై, రాజ్యాంగంపై నిర్ద్వంద్వమైన రీతిలో దాడి జరుగుతోంది.
వనరులు, ఆర్థిక నిధులనేవి గుత్తంగా పాలక పార్టీకే అందుబాటులో ఉండడంతో ఎన్నికల వ్యవస్థలో సమాన అవకాశాలు కొరవడి, ప్రజాస్వామ్యానికి ముప్పులు కూడా ఎదురవుతున్నాయి. ఇటువంటి వనరులన్నింటినీ లక్ష్యంగా చేసుకునే ఎత్తుగడే 2018లో ఎన్నికల బాండ్ల వ్యవస్థను ప్రవేశ పెట్టడం. ఎలాంటి రూపంలోనైనా వ్యతిరేకత లేదా అసమ్మతిని దెబ్బ తీయడం కోసమే పెగాసస్ స్పై వేర్ నిఘా వ్యవస్థను ఉపయోగించారు. బీమా కోరెగావ్ నిందితులను ఏకపక్షంగా నిర్బంధించడం, 370వ అధికరణను రద్దు చేయడం, ఎన్నికల బాండ్లు, దేశద్రోహ క్లాజును ఉపయోగించడం, పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం వంటి వాటికి పాల్పడ్డారు.
సత్యాన్ని నిర్ధారించేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కీలకమైనవిగా పరిగణించే ఈ అంశాలన్నీ కూడా ఏదో ఒక రకంగా సుప్రీం కోర్టు బాట పట్టాయి. బీమా కోరెగావ్ నిందితుడి కేసులో ప్రొఫెసర్ రొమిలా థాపర్ 2018లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏకపక్షంగా సాగే దర్యాప్తులను, విచారణలను, మహారాష్ట్ర పోలీసుల అరెస్టులను ఆపాల్సిందిగా, కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నలుగురు ప్రముఖులు పిలుపిచ్చారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తితో సహా ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీన్ని తిరస్కరించింది (ఇక్కడ జస్టిస్ చంద్రచూడ్ అసమ్మతిని వ్యక్తం చేస్తూ రూలింగ్ ఇచ్చారు). అప్పటి నుండి, ఈ కేసులోని 16 మంది నిందితులకు వివిధ స్థాయిల్లోని న్యాయ స్థానాలు బెయిల్ నిరాకరించాయి. వరవర రావు కేసు ఒక్కటే ఇందుకు మినహాయింపుగా పేర్కొనాల్సి ఉంది. వైద్యపరమైన కారణాల రీత్యా ఆయనకు స్వల్ప కాల బెయిల్ లభించింది. ఇంక మిగిలిన అనేక కేసులు (జమ్మూ కాశ్మీర్, ఎన్నికల బాండ్లు వంటివి) గత రెండు మూడేండ్ల నుండి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో వున్నాయి. ఇలాంటి కీలకమైన అంశాలను విచారించేందుకు కోర్టు ఎలాంటి అత్యావశ్యకతను ప్రదర్శించడం లేదు. గతంలోని ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల హయాంలో న్యాయం తుడిచి పెట్టుకుపోయిన రికార్డు ఉంది. అయితే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడమనే బాధ్యత కేవలం ఉన్నత న్యాయవ్యవస్థపైనే ఆధారపడిలేదు. ప్రజలను రాజకీయంగా సమీకరించడం పైనే అంతిమంగా ఆధారపడి ఉంది. అయితే, కార్యనిర్వాహక వర్గానికి లోబడి ఉండటంలో చట్టసభే నిర్వీర్యమైపోతున్న పరిస్థితుల్లో అర్థవంతమైన చర్చ అణచివేయబడుతోంది. ఇటువంటప్పుడు రాజ్యాంగ పరిరక్షకురాలిగా, పౌరుల ప్రాథమిక హక్కుల మార్గదర్శిగా సుప్రీంకోర్టు పాత్ర కీలకంగా మారుతోంది. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు మరింత సున్నితత్వంతో వ్యవహరించింది. అందులో కోవిడ్ సమయంలో వలస కార్మికుల హక్కులు, దేశద్రోహం కేసులను కొట్టివేయడం లేదా జర్నలిస్టులు, మీడియాకు వ్యతిరేకంగా బలవంతపు చర్యలను నివారించడం వంటివి కొన్ని స్వాగతించదగ్గ సంకేతాలే. అయినా, న్యాయ వ్యవస్థ స్వతంత్ర పాత్ర పట్ల, కార్యనిర్వాహక వర్గానికి లోబడి వుండడం వంటి ఆందోళనలు ఇంకా కొన్ని నెలకొనే ఉన్నాయి.
ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇవ్వడానికి హైకోర్టులు, బార్ నుండి 9 మంది న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిని న్యాయమూర్తులుగా ఇప్పుడు నియమించారు. కానీ, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అఖిల్ ఖురేషి పేరును మాత్రం కొలీజియం సిఫార్సు చేసిన జాబితా నుండి మినహాయించడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కూడా, ఆయన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. దానికి బదులుగా అతి చిన్న హైకోర్టుల్లో ఒకదానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆయనను సుప్రీం కోర్టుకు పంపే విషయమై కొలీజియం ప్రభుత్వానికి లొంగిపోయింది. ఆయన పేరును సిఫార్సు చేయడం సరికాదని భావించింది.
అధికారంలో ఉన్న వారితో వాస్తవాలు మాట్లాడడం పౌరుల హక్కు, బాధ్యత అంటున్న జస్టిస్ చంద్రచూడ్ నిర్మాణ వ్యవస్థలో బలమైన ప్రభుత్వ సంస్థలు, అధికారంలో వున్నవారి ప్రజాస్వామ్య జవాబుదారీతనం, అధికార ఒత్తిళ్ళకు దూరంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉనికి వంటివన్నీ ఇవ్వబడ్డాయి. వాస్తవం ప్రాతిపదికగా ఉన్న ఈ ప్రజాస్వామ్య దార్శనికత ఇందుకు విరుద్ధమైన ధోరణులను ఎదుర్కొంటుందని మనం ఆశిద్దాం. రాబోయే రోజుల్లో మొత్తంగా ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థకు వ్యాప్తి చెందుతుందని భావిద్దాం.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం