Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోప్లా తిరుగుబాటు(1921)ను అణచివేసి బ్రిటిష్ ప్రభుత్వం విజేతగా నిలిచింది. 1857 ప్రజాపోరాటాన్ని కేవలం సిపాయిల తిరుగుబాటుగా వారు ప్రజలను నమ్మించినట్లే, మోప్లా తిరుగుబాటును కూడా ఇస్లాం మత రాజ్య స్థాపన కోసం ముస్లింలు, హిందువులకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుగా నమ్మించింది. ఒక శతాబ్దం తర్వాత ఇప్పుడున్న విజేతలు, మోప్లా తిరుగుబాటును బ్రిటిష్ వారు గుర్తించిన తీరును బలపరుస్తూ, చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో ఉన్నారు. స్వయం ప్రకటిత దేశభక్తులైన స్వయంసేవకులకు వాస్తవాలను మరుగుపరచి చరిత్రను వక్రీకరించడం అలవాటైంది. హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు అంతం పలికిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కూడా ఈ దేశభక్తులు వక్రీకరిస్తున్నారు. వారి వక్రీకరణలలో భాగంగానే భారతీయ చారిత్రక పరిశోధనా సంస్థ (ఐసీహెచ్ఆర్) స్వాతంత్య్రోద్యమంలో అమరులైన 387 మంది పోరాట యోధుల పేర్లను స్వాతంత్య్రోద్యమ రికార్డుల నుండి తొలగించింది. తొలగించిన జాబితాలో కేరళలో మలబార్ జిల్లాలో జరిగిన మోప్లా తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించి, ఉరిశిక్షకు గురైన 'వరియన్ కున్నత్తు కున్నహమ్మద్ హాజీ', 'అలీ ముసలియార్' పేర్లు కూడా ఉన్నాయి. అనేక విచారణల నివేదిక ఆధారంగానే వారి పేర్లను అంతకు ముందు జాబితాలో చేర్చారు. అది ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నంలో భాగంగా హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు మాత్రమే చేసిన తిరుగుబాటని, దానికీ దేశ స్వాతంత్య్ర పోరాటానికీ ఏ విధమైన సంబంధం లేదనీ ఐసీహెచ్ఆర్ చరిత్రకారుల వాదన. బీజేపీ, ఆరెస్సెస్‌లు ఏ ఆధారాలు లేకుండా ఈ మోప్లా తిరుగుబాటును ''భారతదేశంలో మొదటి తాలిబాన్ భావజాల వ్యక్తీకరణ''గా పేర్కొంటున్నాయి. ఇది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎదురొడ్డిన అమరవీరుల పోరాటస్పూర్తికే వ్యతిరేకం.
కేరళలోని మలబార్ జిల్లాలో 1921 ఆగస్టులో రైతుల్లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. మోప్లా ముస్లిం కౌలుదార్లు అక్కడ తిరుగుబాటు చేశారు. కౌలు కాలానికి ఎటువంటి భద్రత లేకపోవడం, కౌలు ధరలు అధికంగా ఉండడం, పునరుద్ధరణ ఫీజులు అన్యాయంగా ఉండటం వంటి విషయాల్లో భూస్వాములపై వారు ఆగ్రహంగా ఉన్నారు. 1920 ఏప్రిల్‌లో జరిగిన మలబార్ జిల్లా కాంగ్రెస్ సమావేశాన్ని ఈ ప్రతిఘటనోద్యమానికి నాందిగా చెప్పవచ్చు. ఈ సమావేశం కౌలుదారుల సమస్యకు మద్దతు ప్రకటించి, కౌలుదారుల, భూస్వాముల సంబంధాలను గాడిలో పెట్టేందుకు వీలుగా ఒక చట్టం చేయాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారం ఒక వైపు సాగుతుండగా, మరోవైపు ఖిలాఫత్ ఉద్యమం బాగా విస్తరిస్తోంది. ఖిలాఫత్ సమావేశానికి, కౌలుదారుల సమావేశానికి మధ్య ఎలాంటి తేడా లేకుండా పోయింది. రెండు సమావేశాల్లో సభికులు, నాయకులు అంతా వారే. మోప్లా కౌలుదారులే ఖిలాఫత్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. రోజు రోజుకూ బలాన్ని సంతరించుకున్న ఖిలాఫత్-కౌలుదారీ ఉద్యమం, వలస ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేయడంతో, 1921 ఫిబ్రవరి 5న ఖిలాఫత్ సమావేశాలన్నింటినీ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, నాయకులను అరెస్ట్ చేసింది. దానితో ఉద్యమ నాయకత్వం స్థానిక మోప్లాల చేతుల్లోకి పోయింది.
భూస్వాములు వలస పాలకుల అండతో, కౌలుదారులను భూమి నుండి వెళ్ళగొట్టడం వల్లే కౌలు దారులకు, భూస్వాములు, బ్రిటిష్ వారికి మధ్య వైరుధ్యాలు ఉండేవి. ఇలాంటి ఘర్షణలు అనేకం వారి మధ్య జరిగాయి. పోలీసులు, మారణాయుధాలు ఉన్నాయనే కారణంతో మసీదుపై దాడి చేసిన సందర్భంలో అలీముసలియార్ ఆధ్వర్యంలో ఉన్న మంబ్రాత్ మసీదు పైన దాడి జరిపి దానిని నేలమట్టం చేశారనే వదంతులు వ్యాపించాయి. ఇది తిరురంగడి తాలూకాలోని చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అక్కడికి చేరుకున్న వివిధ గ్రామాల ప్రజానీకాన్ని అదుపుచేసేందుకు కాల్పులు జరిపినాగాని వారు అక్కడి నుండి కదలలేదు. పూక్కొత్తూర్, తిరురంగడిల తిరుగుబాటు వార్త దక్షిణ మలబార్‌కు వ్యాపించడంతో, వెంటనే మలప్పురం, పెరిన్తాల్మన్నా, పండిక్కడ్, ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో రోడ్లు దిగ్బంధం చేసి, టెలిఫోన్ లైన్లు తెంచేసి, తిరురంగడిలోని అక్కౌంట్స్ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో కలెక్టర్ ఆజ్ఞానుసారం పోలీసులు కోపోద్రిక్తులైన ప్రజలపై కాల్పులు జరపడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. దీనిలో ప్రజలతోపాటు కొందరు పోలీసులూ ప్రాణాలను కోల్పోయారు. బ్రిటీష్ ప్రభుత్వం మిలిటరీ సైన్యాన్ని దింపి, సుదీర్ఘ పోరాటం అనంతరం తిరుగుబాటును అణచి వేసింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనే కారణంతో తిరుగుబాటుదారుల పైన కేసులు నమోదు చేశారు.అలీ ముసలియార్, వరియన్కున్నత్ కుంజహమ్మద్ హాజీతో పాటు అందరు ఖిలాఫత్ ఉద్యమ నాయకులను ఉరితీశారు. అనేక మంది తిరుగుబాటు దారులను అండమాన్ దీవులకు పంపి నిర్బంధంలో ఉంచారు. ఈ తిరుగుబాటు బలితీసుకున్న సంఖ్య తక్కువేమీ కాదు. 2337 మంది మోప్లాలు మరణించారని అధికారిక లెక్కలు చెబుతుంటే, కనీసం 10 వేల మంది మరణించారని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి. మొత్తం 45,404 మంది తిరుగుబాటుదారులు అరెస్టయి, తరువాత లొంగిపోయారు.
హిందూ వ్యతిరేక తిరుగుబాటు కాదు
ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటే తప్ప, హిందువులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం కాదు. కానీ బ్రిటిష్ వారు మోప్లాలకు వ్యతిరేకంగా హిందువులను పోలీసులుగా, గూఢచారులుగా, సైనికులుగా ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే, రైతులను అణచివేయడానికి బ్రిటిష్ వారితో చేతులు కలిపిన భూస్వాముల పైన దాడులు చేశారు. మలబార్లో హిందూ ముస్లిం ఐక్యతలేదని, హిందువులను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారనే వదంతులను కొట్టివేస్తూ వరియన్కున్నత్ కుంజహమ్మద్ హాజీ 'ది హిందూ' పత్రిక లో ప్రకటన చేశాడు. ఆయనతో పాటు ఇంకొందరు నాయకులు హిందువుల పైన దాడులు, అత్యాచారాలు, లూటీలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హిందువులపై దాడి చేసిన తిరుగుబాటు దారులను శిక్షించారు కూడా. అదే విధంగా ముస్లింల పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని కూడా చూపించలేదు. బ్రిటిష్ వలస పాలకులు మోప్లా తిరుగుబాటుకు మతం రంగు పులిమి, అది బ్రిటిష్ వారికి, హిందువులకు వ్యతిరేకంగా, ఇస్లాం మత రాజ్యస్థాపన కోసం జరిగిన పోరాటంగా చిత్రించారు. కానీ మోప్లా నాయకుడు హాజీ మలయాళ రాజ్యం కావాలని కోరాడు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మోప్లా తిరుగుబాటు ఖిలాఫత్ ఉద్యమం నుండి ఉద్భవించిందని అనేక మంది చరిత్రకారులు పేర్కొన్నారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమాలు స్వరాజ్య సాధనలో భాగంగా మోప్లాలను తిరుగుబాటుదారులుగా మార్చాయి. 'ఖుద్దామ్-ఈ-కబా', 'సెంట్రల్ ఖిలాఫత్ కమిటీ' అనే రెండు ముస్లిం సంస్థలు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాయి. ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసిన తీరే ఈ తిరుగుబాటు వేగాన్ని పెంచింది. ''పోలీసు అణచివేత చర్యల నుండే ఈ తిరుగుబాటు పుట్టింది. ఖిలాఫత్ ఉద్యమాన్ని అణచివేసేందుకు అధికారులు అవలంబించిన హింసాత్మక పద్ధతులే ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం. పోలీసుల హింసాత్మక చర్యలను తట్టుకోలేని పరిస్థితుల్లో వారు అహింసా మార్గాన్ని వీడి హింసకు హింసే సమాధానం అనే పద్ధతిని పాటించారని'' స్వాతంత్య్ర సమర యోధుడు కే.పీ.కేశవమీనన్ అన్నారు. తిరుగుబాటుకు ప్రధాన కేంద్రంగా ఉన్న మంజేరీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాధవన్ నాయర్ దీనిని జాతీయవాద పోరాటంగా పేర్కొన్నాడు. 1934 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన సౌమ్యేంద్రనాథ్ ఠాగూర్ ఈ తిరుగుబాటును రైతుల తిరుగుబాటుగా అభివర్ణించాడు. వరుస నిరసనలు, ఘర్షణలతో పరాకాష్టకు చేరిన మోప్లా ముస్లింల తిరుగుబాటు రాజకీయ ప్రేరణతోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిందని చరిత్రకారుడు గంగాధరన్ అభిప్రాయపడ్డాడు. బ్రిటిష్ వలస పాలనా తొలిరోజుల నుండి సంస్కృతీ, సంప్రదాయాల ద్వారా మోప్లాలలో ఒక ప్రతికూల వర్గచైతన్యాన్ని కల్పించడానికి మతభావజాలాన్ని ఏ విధంగా ఉపయోగించారని చెప్పేందుకు, సామాజిక సాంస్కృతిక నేపథ్యాలను ప్రముఖ చరిత్రకారుడు కే.ఎన్.పణిక్కర్ విశ్లేషించాడు. 19వ శతాబ్దంలో 1836 నుండి వరుసగా జరిగిన హింసాయుత నిరసనలు దీనిని నిర్థారిస్తాయి. 1921లో వలస ప్రభుత్వానికి, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటే దానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. వాస్తవానికి, దేశ ప్రజలను అదుపు చేయడానికి బ్రిటిష్ వారు పెంచి పోషించిన హిందూ, ముస్లిం మత విభజనా చైతన్యం చాలా కీలకమైన పాత్ర పోషించిందని కూడా పణిక్కర్ అభిప్రాయపడ్డాడు.
1946లో ఈ తిరుగుబాటు 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ, ఈ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ తయారుచేసిన ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఎరనాడ్ మోప్లా రైతాంగం, భూస్వాములు, బ్రిటిష్ వలస పాలకుల చేతిలో అణచివేయబడిన చారిత్రక పరిస్థితులను విశ్లేషించి, అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం తప్ప వారికి వేరే మార్గం లేదని ఆ డాక్యుమెంట్ తెలిపింది. తిరుగుబాటుకు అవసరమైన వనరులను ఖిలాఫత్ ఉద్యమం, జాతీయోద్యమం రెండూ సమకూర్చాయి, కానీ నాయకులను అరెస్ట్ చేసి, ఉరి తీసిన కారణంగా తగిన దార్శనికత ఉన్న నాయకుల కొరతతో ఆ తిరుగుబాటు విచ్ఛిన్నమైందని డాక్యుమెంట్ తెలిపింది. తిరుగుబాటులోకి ప్రవేశించిన మతోన్మాద శక్తులు ఈ తిరుగుబాటు హిందూ వ్యతిరేక తిరుగుబాటుగా నమ్మించడంలో సఫలమయ్యారు. ఆ విధంగా భూస్వాములకు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటు ఒక మతహింసగా దిగజారింది. అయినా ఈ తిరుగుబాటు 1930 చివరిలో, 1940 తొలి నాళ్ళలో రైతు, ప్రజా తిరుగుబాట్లకు మార్గం చూపింది.
మలబార్ తిరుగుబాటు ముమ్మాటికీ జాతీయోద్యమ చట్రంలో జరిగిన పోరాటం. బ్రిటిష్ వలస పాలన అణచివేత నుండి విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ పోరాటాలను దిగజార్చి, విచ్ఛిన్నం చేసే శక్తులు కూడా పోరాటాలలోకి ప్రవేశిస్తాయని, 1946లో ఈ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ డాక్యుమెంట్ చేసిన హెచ్చరికలను కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. మహావృక్షం లాంటి భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో తనకంటూ ఒక్క కొమ్మ కూడా లేని ఆరెస్సెస్ అర్థసత్యాలతో, ఘోరమైన అబద్దాలతో చరిత్రను తారుమారు చేసి, తన లక్ష్యమైన హిందూ రాజ్య స్థాపన కోసం ప్రజల మధ్య మత విభజనను చేసే ప్రయత్నాలను ప్రజలంతా తిప్పికొట్టాలి.
- బోడపట్ల రవీందర్
సెల్:9848412451