Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చారిత్రాత్మకమైంది. ఆనాటి యోధుల లక్ష్యసిద్ధి, చిత్తశుద్ది నేటి యువకులకు ఆదర్శనీయమైనది. అందుకే నాటి పోరాట ఘట్టాలను సింహవ లోకనం చేసుకోవటం ఎంతైనా అవసరం. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. సంస్థానాలన్నిటినీ భారతదేశంలో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ కూడా తన వంతు కార్యక్రమం మొదలుపెట్టింది.
ఈ స్థితిలో భారతదేశంలోని అనేక సంస్థానాలు భారత యూనియన్‌లో కలిసిపోయాయి. హైదరాబాద్, జమ్మూకాశ్మీర్, జోహన్ఘడ్ వంటి సంస్థానాలు మాత్రమే మిగిలిపోయాయి. కాశ్మీర్‌రాజు భారత యూనియన్‌లో కలవకుండా అక్కడి ముస్లింలకు అండగా, పాకిస్థాన్ నాయకులు 'జిన్నా' కాశ్మీర్‌పై దాడిచేసి కొంత ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ రాజ్యాల వత్తిడి మేరకు కాశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో నిజాం కాశీం రజ్వీ వత్తిడికి లొంగి పాకిస్థాన్‌లో చేరడానికి ఒకవైపు ప్రయత్నిస్తూనే, మెజార్టీ హిందువులను కాదని భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కలపడం సరికాదనే ఆందోళనలో ఉండగా, విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వం నుండి వత్తిడి ఎక్కువైంది. మరోవైపు కమ్యూనిస్టుల పోరాటం ఉధృతమైంది. దీంతో భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు భూస్వాముల నుండి 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది. సుమారు 5వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు పంచాయతీలుగా ఏర్పాటుచేసి, ప్రజలకు భద్రత, న్యాయం, అప్పుల నుండి విముక్తి కల్పించారు. ఈ క్రమంలో 'దున్నెవానికే భూమి' నినాదం బలపడింది. ఈ క్రమంలో ఉద్యమం ఇతర ప్రాంతాలకు వ్యాపించి తెలంగాణలో అత్యధిక భాగం ఎర్రజెండా కిందికి వచ్చింది. ఈ సమయంలో అధికారులుగాని, పోలీసులుగాని గ్రామాలకు రావడానికి జంకారు. పెద్ద గ్రామాల్లో క్యాంపులు పెట్టుకొని రజాకార్లు, భూస్వాములు పోలీసురక్షణతో ఉండేవారు. అక్కడిక్కడ రజాకార్లు సామూహికంగా దళాలను చంపటం జరిగింది. అప్పుడే ''ఊదర దెబ్బ ఉంది'' అనే నినాదం మొదలైంది. మహిళలు సహితం ఆత్మరక్షణకు కొంగున కారంపొడి, చేతిలో వేడినీళ్ళు , యువకులు వడిసెల రాళ్ళతో రజాకార్లను ఎదుర్కోవడం మొదలైంది. ఒకవైపు ఎర్రజెండ నీడన, ప్రజా దళాలు, మరోవైపు నిజాం తొత్తు సైన్యం రజాకార్లు, భూస్వామ్య గుండాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రమై గెలుపు ఓటములు ఎవ్వరివి అన్నది నిర్ణయించడం కష్టమైంది.
ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కలుగజేసుకుని హైదరాబాద్ చేయిజారితే పాకిస్థాన్‌లో కలవడమో, లేదా కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడటమో జరుగుతుందన్న అనుమానంతో నిజాంతో చర్చలు జరిపి యూనియన్‌లో కలవాలని వత్తిడి పెంచారు. నిజాం ఎటూ తేల్చుకోలేని స్థితిలో నాటి భారత హౌంమంత్రి సర్దార్ వల్లబారు పటేల్ పరిస్థితి అదుపు తప్పతుందని సైనిక చర్యకు పూనుకున్నాడు. మూడు నాలుగు రోజుల్లోనే బొంబాయి నుండి వచ్చిన సైనికాధికారి జె.ఎన్. చౌదరి హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించాడు. విధిలేని స్థితిలో భారతదేశంలో కలుస్తున్నట్టు నిజాం ప్రకటన చేయడం జరిగింది.
సైనిక చర్య అనంతర పరిణామాలు
నాటి భారత హౌంమంత్రి సర్దార్ వల్లబారు పటేల్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా నైజాం ప్రభువు లొంగిపోయి, తన సైన్యాన్ని ఉపసంహహరించుకుని భారత యూనియన్‌లో కలుస్తున్నట్టు వేలాది ప్రజల మధ్యన ఫత్తేమైదానంలో ప్రకటించాక జె.ఎన్.చౌదరిని సైనిక పరిపాలకుడుగా పటేల్ నియమించాడు. ఈ స్థితిలో ఉద్యమ సందర్భంగా అరెస్టు అయిన సంఘ నాయకులు స్త్రీ, పురుషులు జైళ్ళ నుండి విడుదలైనారు. గ్రామాల్లో పండుగలు జరుపుకున్నారు. రజాకార్లు లొంగిపోవడంతోపాటు దూరంగా పారిపోయారు. సంఘం దళాలు గ్రామ గ్రామాన పోరాట వీరులుగా ప్రజల ముందు మర్యాదలందుకున్నారు. కానీ ఈ పరిస్థితులు ఎన్నో రోజులుండలేదు. జోహెన్ఘడ్ మొదలుకొని రాష్ట్రాలు భారత యూనియన్‌లో కలిసిపోవడంతో విశాల భారతదేశంగా ఏర్పడింది. ఈ దశలో హైదరాబాద్ సంస్థానంలో పోరాటం జరిపిన కమ్యూనిస్టులపై యూనియన్ సైన్యాలు అణచివేతకు పూనుకున్నాయి. వారి అండతో భూస్వాములు కాంగ్రెస్ టోపీలతో తిరిగిగ్రామాలకు చేరారు. ఈ స్థితిలో పోరాటాన్ని యధావిధిగా కొనసాగించాలని కమ్యూనిస్టులు నిర్ణయించారు. కొందరు మాత్రం పోరాటం విరమించి భారత్ యూనియన్‌తో సహకరించాలని వాదించారు. ఈ చీలికను ఆధారం చేసుకొని పటేల్ తన సైన్యంతో కమ్యూనిస్టుల నిర్మూలనకు పూనుకున్నాడు. కమ్యూనిస్టులను ప్రజల నుండి దూరం చేయాలనే గట్టి ప్రయత్నం మొదలైంది. అందుకు పెత్తందార్లు కమ్యూనిస్టులను గ్రామాల్లోకి రాకుండా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకు వారు ప్రజలను లోబర్చడం జరిగింది. భూములప్పగిస్తామని హామిలిచ్చారు. అందులో భాగంగానే 'ఎల్లిగా' అని పిలిచిన వారే 'ఎల్లయ్య' అని మర్యాదగా పిలిచే పరిస్థితి ఏర్పడింది. సైన్యం నుండి సామాన్య ప్రజలకు 'దళాల జాడ చెప్పమని, లేనియెడల మీపై కేసులు పెడతామని బెదిరింపులు మొదలైనాయి. అక్కడక్కడ సామాన్య ప్రజలను కూడా చంపారు. ఆడపడుచులను మానభంగాలు చేశారు. ఈ స్థితిలో కమ్యూనిస్టులకు గ్రామాల్లో రక్షణ కరువైంది. దళాల ఉనికిని కనిపెట్టి దాడులు తీవ్రమైనాయి. అప్పుడు రాష్ట్ర నాయకత్వం నల్లమళ్ళ, అదిలాబాద్, వరంగల్ అడవుల్లో రక్షణకై వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన వారు భూస్వాముల తొత్తులుగా లొంగిపోయారు.
- పెన్నా అనంతరాయశర్మ