Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలిసిన కథైనా మరొక్కసారి చెప్పుకోవాలి. అది ఒక అడవి. అందులో ఒక కోతి. గాంధీగారి మూడు కోతుల్లా కాదది. ఎక్కువగా మాట్లాడుతుంది. అంతకంటే ఎక్కువగా తన సహజమైన కోతి చేష్టలు చేస్తుంది. సరే సింపుల్గా చెప్పుకుందాం దాని కథ... ఒకానొక రోజు ఆ కోతి అడవిలో బ్రేక్ డ్యాన్స్ వేసుకుంటూ పోతోంది. అనుకోకుండా దాని కాలికి ముల్లు గుచ్చుకుంది. ఏం చేద్దామబ్బా అనుకుంటుండగా అటుగా చిన్న కత్తి పట్టుకొని ఓ వ్యక్తి పోతుంటాడు. ఆయన్ను బతిమాలితే పాపం కోతి కదా అని తన కత్తితో ముల్లు తీస్తాడు. అది కోతి కదా ఊరకుండదు. ఆ కత్తిని అందులోనూ తన కాలిలో గుచ్చుకున్న ముల్లును పీకేసిన కత్తిని పట్టుకొని చెట్టెక్కుతుంది. అంతటితో ఊరకుందా? ఉండకుండా ఇలా ''ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం...ఢాం... ఢాం...'' అని పాడసాగింది. పాపం ఆ కత్తి యజమాని అడుక్కున్నాడు నా కత్తి నాకివ్వమ్మని. అది వినలేదు. పాట పాడుకుంటూ ఎటో పోయింది. అక్కడ ఒక మనిషి చేతితో కొబ్బరి మట్టలు కొడుతూ కనిపించాడు. జాలిపడి తన కత్తి ఇచ్చింది. అతను ఆనందంగా కత్తితో మట్టలు కొట్టసాగాడు. ఇంతలో దానికి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. కొన్ని టెంకాయ మట్టలు తీసుకొని అక్కడినుండి ఉడాయించింది. అలా పోతుంటే ఒకతను బెల్లపు అచ్చులు వేస్తున్నాడు. ఆయనకు మట్టలు ఇచ్చింది. వాటిపై బెల్లం అచ్చులు వేయసాగాడు. దాని అలవాటు కదా! బెల్లం అచ్చులు కొన్ని తీసుకొని పారిపోయింది. ఇంతలో ఓ పేదరాశి పెద్దమ్మ పాపం బెల్లం లేక చప్పిడి అప్పలు చేస్తోంది. ఆమెకు బెల్లమిచ్చింది కోతి. ఆమె తీపి అప్పలు చేసింది. ఇకనేమి కోతి ఆ తీపప్పలు తీసుకొని ఉడాయించింది. అలా పోతుంటే ఆవులు తోలుకుంటూ ఇద్దరు కాపర్లు కనిపించారు. వారికి తీపప్పలిచ్చింది. వాళ్ళు తీపప్పలు తింటూ ఉంటే ఒక ఆవును తీసుకొని అక్కడినుండి పారిపోయింది. మా ఆవును మాకిచ్చేయమని కాపరులు వాపోయారు. వాళ్ళకది చిక్కితేగా? అప్పుడు పాట అందుకుంది
''ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!
అచ్చులు పోయి తీపప్పలు వచ్చే ఢాం ఢాం ఢాం!
తీపప్పలు పోయి ఆవు వచ్చే ఢాం ఢాం ఢాం!
అని పాడింది. అదే ఊపులో ఆవుకు హుకుం జారీ చేసింది నీళ్ళు కాచు, వళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అనింది. ఆవు సైలెంటుగా నీళ్ళు కాచి వాటిని తెచ్చి కోతి మీద పోసింది. అంతే కోతి తోలు ఊడి కుయ్యో, మొర్రో అంటూ పారి పోయింది.
ఈ కథ వింటే మనకేమి గుర్తొస్తుంది? డి పోయి మా వచ్చే ఢాం ఢాం ఢాం అని పాడుకోవాలి. డిమానిటైజేషను పోయి మానిటైజేషనొచ్చే ఢాం ఢాం ఢాం అని కొత్త రాగంలో పాడాలి. డీమానిటైజేషన్ అని నల్లడబ్బు తెస్తామన్న పెద్దోళ్ళు అవి తీసుకురాకపోగా ఇప్పుడు మానిటైజేషన్ అని ప్రభుత్వ సంస్థల్ని అమ్మి డబ్బు తెస్తారట. ఇంటింటికీ పైపులైనేసి నీళ్ళిస్తామన్నోళ్ళు తమ మిత్రులైన కొందరు పెద్దోళ్ళకు పెట్రోలు, డీజలు పైపులు అంటే చమురు సంస్థల్ని కట్టబెడుతున్నారు. పైపులైన్ పైపులైన్ అని వింటున్న మనకు వాటిల్లోంచి డబ్బు పోవడమే కాని మనకు రాదని తెలిసిపోతోంది. ఒక పని మొదలు పెట్టి దాన్ని గమనించే లోపు ఇంకోదాంట్లోకి పోయి మనల్ని మరపిస్తున్నారు, కొందర్ని మురిపిస్తున్నారు. ఆవు మీద వ్యాసంలా ఎప్పుడూ ఈ గొడవేనా అనుకోవచ్చు కొందరు. అదే వ్యాసంలా మనపైన అన్యాయాలు చేస్తున్నవాళ్ళకు మనమూ అదే వ్యాసాన్ని పదే పదే వినిపించాలి. లేదంటే ప్రజలు మరచిపోతారు.
కరోనా వస్తే ఎవ్వరినీ అడగకుండా లాక్డౌన్ పెట్టేసి రోడ్ల మీద వలస కార్మికుల రక్తం గుర్తులు వేయించారు. అది మరచిపోవడానికి ఇంకేవో కార్మికులకు చేస్తామని నమ్మబలికారు. ఒకరిని ఉక్కు మనిషి అని ఇంకొకరిని తుక్కు మనిషిగా చూపబోతారు. తమను పైకి తీసుకొచ్చిన పెద్దమనిషినే పబ్లిక్గ్గా అమర్యాద చేస్తారు. మళ్ళీ దానికి ఇంకో డ్రామా. ఇలా ఒకదాని తరువాత ఒకటి చేయడమే కనిపిస్తుంది. ఏదో ఒక పార్టీనో, కేంద్రమో, రాష్ట్రమో ఇలా ఒక్కరినే అంటున్నామా అంటే అదీ కాదు. సర్వమూ ఇదే తంతు. ఓం గుటకాయాస్వాహా అని ఓ సినిమాలో చేసే పాత్ర చెప్పే డైలాగులు, యాక్షన్లు మనం నిత్యం చూడొచ్చు ఉచితంగా. ఉచితంగా అంటే నిజంగా కాదు, వాటి వెనుక మన డబ్బుంటుంది. అది పైపులైనుల ద్వారా ఇతరులకు చేరుతుంది.
ఆ పార్టీ పోయి ఈ పార్టీ వచ్చే ఢాం ఢాం ఢాం అని పాడినోళ్ళే వాళ్ళు పోయి మేము వస్తాం ఢాం ఢాం ఢాం అనీ పాడతారు. పెద్దపెద్దోళ్ళొచ్చి ఫలానా వాళ్ళతో తిరిగేటోళ్ళను నమ్మొద్దంటారు. మమ్మల్నే నమ్ముకొండంటారు. ఆ తరువాత మిమ్మల్ని అమ్ముతామంటారు. ఒకేరోజు అందరూ జెండాలు రెపరెపలాడిస్తారు. అసలు మొదటి నుంచీ ప్రజల పక్షాన నిలబడినోళ్ళను కనబడకుండా చేస్తారు ఈ ఢాం ఢాం ఢాం డాన్సులు చేస్తారు. ఒకటి పడగొట్టి ఇంకోటి కడతాం ఢాం ఢాం ఢాం అని జిమ్మిక్కులు చేయబోతారు. మళ్ళీ సర్దుకుంటారు. పాలన రాష్ట్రమంతటా విస్తరించాలని తాము విస్తరిస్తారు.
అయితే ఈ కోతి కథ చివర్లో ఫినిషింగు టచ్చు ఇచ్చినట్టు ప్రజలు వేడి నీళ్ళు పెట్టుకొని సిధ్ధంగా ఉంటారు. అదను చూసి పోస్తారు. అప్పుడు తోలులేచి లబో దిబోమన్నా ప్రయోజనముండదు. ఈలోగా ఆ కథలోని హీరోకు అన్నీ ఒక్కొక్కటిగా దొరుకుతూనే ఉంటాయి. ఆయన మారుస్తూనే ఉంటాడు. ఢాం ఢాం ఢాం పాట పాడుతూనే ఉంటాడు. ఒక్కో హీరోది ఒక్కో రాగం... పాట మాత్రం సేం టు సేం. అదే ఢాం ఢాం ఢాం. ఆ శబ్దాల గందరగోళంలో అదే పాట అని మనకర్థం కాదంతే. ఇంకో పాట, ఇంకో రాగమనుకుంటాం. అందుకే ఢాం ఢాం ఢాం అవుతుంటాం. ఇప్పుడు అలా అవ్వడం మానేసి చేయడం మొదలు పెట్టాలి. లేకుంటే మొత్తం దేశాన్నే ఢాం ఢాం ఢాం చేసే పనిలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త...! ఢాం ఢాం ఢాం అనిపించాలో ఢాం ఢాం ఢాం అనాలో మనచేతుల్లోనే ఉంది.
మబ్బు నుండి మేల్కొందాము ఢాం ఢాం ఢాం
మేల్కొని అడుగేద్దాము ఢాం ఢాం ఢాం
అన్యాయం మాకు చేస్తే ఢాం ఢాం ఢాం
గల్లంతైపోతారు మీరు ఢాం ఢాం ఢాం
అని ప్రజలే పాడాలి, వినిపించాలి బుర్రలోకి ఆ సౌండును పంపించాలి. రివర్సులో ఢాం ఢాం ఢాం మననుండి పంపించాలి. జై ఢాం ఢాం ఢాం.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298