Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చలనచిత్రరంగంలో ఆ నలుగురు చిత్రం ఎంత పాపులరైందో తెలిసిందే. మంచి సందేశం, సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని కథా, కథనం నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడెందుకు ఈ కథంతా చెబుతున్నారనుకోవచ్చు. దీనికో సందర్భమూ ఉందండీ... తాజాగా రాజకీయాల్లోనూ ఆ నలుగురు కేంద్ర బిందువుగా మారారు. ఆ నలుగురు చిత్రం సక్సెస్ ఎలా ఉన్నా... ఈ నలుగురు మాత్రం సక్సెస్ అవుతారో, లేక చతికిల పడుతారో తెలియదు కానీ ఆ చర్చ మాత్రం వారిపై పోకస్ అవుతున్నది. సామాజిక సమీకరణాలు మారి రాజకీయంగా కొంత ప్రభావాన్ని చూపిస్తాయనే చర్చ మొదలైంది. బహుజన రాజ్య స్థాపనే తమ లక్ష్యమని చెబుతున్నారందరు. దొరల రాజ్యం పోవాలంటూ, బడుగుల రాజ్యం కావాలంటూ వివరిస్తున్నారు. బహుజన రాజ్యమంటున్నప్పటికీ వారి పట్ల ప్రజలకు కొంత అపనమ్మకం ఉన్నది. తెలంగాణలో బహుజనుల ఓట్లను ఎంత వీలైతే అంత చీల్చేందుకు ఆ నలుగురిని పావులుగా ప్రయోగిస్తున్నారనే వాదన రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నది. దక్షణ భారత దేశంలో బలహీనంగా ఉన్న ఓ జాతీయ పార్టీ ఈ కుట్రకు ప్లాన్ చేసిందని వినిపిస్తున్నది. బలమైన బహుజనులను బలహీనులను చేసి, రాజ్యాన్ని బలవంతులకు అప్పగించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మతతత్వ ఎజెండా తిరస్కరణకు గురి అవుతున్న నేపథ్యంలో బహుజనుల చీలిక అనే కుట్రకు తెరలేసింది. అందుకే వారికి పరోక్షంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఈ తతంగం నడుస్తున్నది. ఇటీవల ఓ నేత ఆనారోగ్యం పాలైతే... కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్నీతామై చూసుకున్నారు. మరో నేత లైంగికదాడి కేసులో జైలుపాలైతే వెంట ఉండి నడిపించారు. ఈ పన్నాగాన్ని పసిగట్టిన టీఆర్ఎస్ దళిత బంధు ప్రకటించి, వారి మన్ననలు పొందేందుకు మరికొన్ని చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ కూడా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో భారీ బహిరంగ సభలు పెడుతూ వారిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని చర్చ నడుస్తున్నది.
- రఘు