Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త పా... డుగ్గు.. డుగ్గు.. డుగ్గనీ...' ఇటీవల చిన్న పోరడి దగ్గర్నుంచి డెబ్బై ఏండ్ల ముసలోడి దాకా అందర్నీ ఉర్రూతలూగించింది ఈ పాట. అచ్చ తెలంగాణ యాసలో ఆడిపాడిన ఈ గీతం... ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఫంక్షన్లు, పెండిండ్లు, తాజాగా వినాయక మండపాల దగ్గర కూడా డీజేల్లో మార్మోగుతూ కుర్రకారు చేత స్టెప్పుల మీద స్టెప్పులేయిస్తోంది. ప్రజా ప్రతినిధుల దగ్గర్నుంచి నవ వధువు దాకా ఈ పాటకు ఫిదా కాని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదేమో. ఓ పెండ్లి కూతురు ఏకంగా తనను కట్టుకున్న వాడి ముందు డుగ్గు.. డుగ్గు పాటకు డ్యాన్స్ చేసి... నెటిజన్ల మార్కులు కొట్టేసింది. నిజమే మరి.. అసలే కాబోయే పెండ్లి కూతురుకు సంబంధించిన పాట, అందులోనూ బుల్లెట్టు బండి గురించి ఆ అమ్మాయి చెప్పిందాయే. ఆ బండికి కుర్రకారులో ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు గదా. తనదైన శబ్దంతో, తనకే సొంతమైన ఠీవీతో మోటారు సైకిళ్లన్నింటికీ రారాజులా ఉండే ఆ డుగ్గు డుగ్గు బండిపై పోతుంటే ఆ మజా, ఆ రాజసమే వేరు. అందుకే కవి తెలివిగా ఆ బండిని ఎంచుకుని ఉంటాడు. కాకపోతే ఏ హీరోహోండాలాగో, ఏ స్కూటీలాగో కాకుండా ఈ బుల్లెట్టు లీటర్ పెట్రోల్ తాగి, 25 నుంచి 30 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇస్తుంది. అంటే ఈ డుగ్గు డుగ్గు బండి మీద ఓ వంద కిలోమీటర్లు పోయి రావాలంటే మినిమం నాలుగు లీటర్ల పెట్రోల్ కావాలన్నమాట. మన 'ఖర్మ యోగి...' మోడీగారి ఏలుబడిలో తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ... పెట్రోల్ ధరల విషయంలో వెనక్కు తగ్గేదే లేదంటూ ఖరాఖండిగా చెప్పిన తర్వాత, అతి త్వరలోనే లీటర్ పెట్రోల్‌ను రూ.150కి కొనుక్కోవటానికి మనం మానసికంగా సిద్ధం కావాలన్నమాట. ఈ లెక్కన ఎవరైనా ఉల్లాస వీరుడు... డుగ్గు, డుగ్గు బండి మీద శ్రీమతినో, కాబోయే శ్రీమతినో ఎక్కించుకుని వంద కిలోమీటర్లు తిరిగితే.. అందుకు ఇప్పుడు రూ.400, మున్ముందు రూ.600 దాకా ఖర్చు పెట్టాలన్నది నిర్మలమ్మగారి లెక్కల సారాంశం. ఈ క్రమంలో డుగ్గు.. డుగ్గు సాంగ్ వినటానికి వినసొంపుగా ఉండి, హుషారెత్తిస్తూ జోష్ నింపుతున్నా, పెట్రోల్ ధరల దెబ్బకు పెండ్లి కొడుకుల ఉత్సాహం కాస్తా నీరు గారి పోతున్నది. అందుకే మోడీజీ... జర జనాల బాధను పట్టించుకోండ్రి...
-బి.వి.యన్.పద్మరాజు