Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ సందేహాలు నివృత్తి చేసే గౌరిశంకర్కే ఈసారి గొప్ప ధర్మ సందేహమొకటి వచ్చిపడింది. ఎవరినైనా అడుగుదామంటే చెప్పడమే కానీ అడిగే అలవాటు ఎన్నడూ లేదు. అయినా అడిగితే, ఆమాత్రం తెలియదా అని అంటే ఇప్పటి వరకు ఉన్న పరువేంగాను? ఇంకెప్పుడూ ఎవరూ తనను అడగరేమోననే అనుమానం. ఏం చేయాలో పాలుపోక ఇంట్లో కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తెగ తిరుగుతున్నాడు. కాఫీలో పంచదార తక్కువయిందని భార్య మీద కేకలు కూడా వేశాడు. పాపం ఆవిడేమో పేరుకు తగ్గట్లుగానే సున్నిత మనస్కురాలు. ఎప్పుడూ లేనిది ఇలా ప్రవర్తిస్తున్నారని ఆమెకనుమానం కలిగింది. అయినా చూద్దాంలే అని గమ్మునుంది. మధ్యాహ్నమయినా ఇంకా ఈ గోల తగ్గకుండా కూరలో ఉప్పు లేదని విసిరి కొట్టాడు. ఏదేదో పూనకం వచ్చిందేమో, ఇంకా ఊరుకుంటే ప్రమాదమేనని ఏమిటి వంట్లో ఏమైనా తేడా చేసిందా అని అడిగేసింది. ఏం లేదు, అయినా నీకేం తెలుస్తుందిలే అని ఒక కసురు కసిరాడు. సాయంత్రమయినా వ్యవహారంలో మార్పు లేకపోవడంతో ఇక ఆవిడ ఆగలేక ఏదో తేడా అనిపిస్తోంది, డాక్టర్ దగ్గరకు వెళ్దాం పదండని బలవంతం చేసింది. అందిరికి మందులివ్వడమే కానీ, అడగడం అలవాటులేని గౌరిశంకర్కు ఏం చేయాలో పాలుపోలేదు. పోనీ ఎవరినైనా స్నేహితులను అడుగుదామా అంటే మనసొప్పలేదు. ఆఖరికి ఒక నిర్ణయానికొచ్చేశాడు. ఏదైతే అదే అయింది ఇక భీష్మించుకోకుండా భార్యనే అడిగాలని అనుకున్నాడు. ఆమె తెలివితేటలు తనకు కూడా తెలుసు కనుక అలా చేయడమే సరైందనుకున్నాడు.
''మరేం లేదు. మన మోడిగారు గొప్ప గొప్ప ఆలోచనలు చేయడంలో సిద్ధహస్తుడు కదా..! మొన్న ప్రకటించిన బేడ్ బ్యాంకు కూడా అలాంటిదే అనుకున్నా. కానీ నా మిత్రులందరూ దానిపై ఒకటే విమర్శ. నాకేం పాలుపోవడం లేదు. నేను తప్పా? వాళ్లు తప్పా?'' అని తన అనుమానం కాస్తా వెళ్లగక్కాడు. ఇన్నాళ్లూ నేను చెప్పేదే సరైందనుకున్నాను. ఇప్పుడేమో ఇలా తేడా వచ్చేసింది.
''అయ్యో! దానికే ఎందుకండీ అంత ఇదై పోతారు? మీరెవరూ తప్పు కాదు. ఆయనే చెప్పేశారు కదా ఇది బ్యాడ్ అని. ఉట్టి పేరే కాదు ఇది చేసే పని కూడా బ్యాడే. దేశంలో అక్కడా ఇక్కడా అన్ని బ్యాంకుల లోనూ గొప్పోళ్ళు తీసుకున్న అప్పులన్నీ పేరుకుపోయి, ప్రభుత్వ బ్యాంకులన్నీ దివాళా తీసే దశలో ఉన్నాయి. దీనితో వాటిపై భారం పెరిగిపోతోంది. ఈ బకాయిలన్నీ రాబడితేనే కానీ వీటి పరిస్థితి మెరుగుపడదు. పోనీ ఆ పని చేద్దామంటే ఆ అప్పులు తీసుకుని ఎగ్గొడుతున్న వాళ్ళందరూ మోడీగారి కార్పొరేట్ మిత్రలాయే. దీనితో ఏం చేయాలా అని ఆలోచిస్తే మీరు చెప్పినట్లే మోడి గారికి ఎప్పటిలాగే మరో గొప్ప మోసపూరిత ఆలోచన చటుక్కున వచ్చింది. అన్ని బ్యాంకులలోని అప్పులన్నింటినీ వాటి ఖాతాల నుండి చెరిపేసి మరో కొత్త బ్యాంకుకు అమ్మేస్తారట! ఆ కొత్తదే బ్యాడ్ బ్యాంక్. అప్పులను ఎంతకు కొనాలనేది కూడా ఈ బ్యాడ్ బ్యాంకే నిర్ణయిస్తుందట! మరో విషయమండోరు! అభివృద్ధి చెందిన దేశాల కంటే మొత్తం రుణాలలో ఈ అప్పులు 9.8 శాతంతో మన దేశంలోనే ఎక్కువ ఉన్నాయట. చూశారా, ఇది అభివృద్ధి కాదా? ఇప్పుడు మోడీజీ ఇలాంటి 8.35 లక్షల కోట్ల రూపాయల అప్పు లను రాబట్టడానికి ఈ కొత్త బ్యాంకు ఏర్పాటు చేశారు.
''అది సరే! మరి ఆ కొత్త బ్యాంకు అప్పులు రాబట్టడానికి ఏం చేస్తుందని, మరో సందేహం లేవనెత్తాడు గౌరీశంకర్. అంత అమాయకులేమిటండీ! అంతా మీలా చెప్పినవన్నీ చేసేస్తారా ఏమిటి? కొత్త బ్యాంకుకు అప్పులన్నీ బదిలీ అయిన తరువాత దాని పేరుకు తగ్గట్లుగానే అదన్నీ చెడ్డ పనులే చేస్తుంది. ''అప్పులు తిరిగి ఇస్తే మంచిది. ఇవ్వకపోతే మరీ మంచిది'' అన్నదే దాని నినాదం. ఇస్తే బ్యాంకు ఖాతాలోనికి, ఇవ్వకపోతే మోడీ పార్టీ ఖాతాలోనికి. ఉభయ తారకం కదా! ఈలోగా అప్పులిచ్చిన బ్యాంకులకు ఎగ్గొట్టిన ఖాతాదారులెవరూ ఉండరు కదా! ఎందుకంటే ఆ ఖాతాలన్నీ ఈ బ్యాడ్ బ్యాంకుకు మారిపోయాయి కదా! ఇప్పుడు మహా అయితే అన్ని బ్యాంకుల బదులు ఈ కొత్త బ్యాంకు ఒక్కటే దివాళా తీస్తుందన్నమాట! వెరసి శఠగోపం మాత్రం ప్రజలకే అన్నది అసలు రహస్యం. ఇది తెలుసుకోకపోతే మాత్రం మీలా బొక్క బోర్లా పడటం మాత్రం ఖాయం సుమా!''
ఆహా ఏమి తెలివి మోడీగారిదని ఈసారి విస్తుపోవడం గౌరిశంకర్ వంతయింది. ఆస్తులను అమ్మేస్తున్నాడని అనుకున్నా కానీ ఇలా అప్పులను కూడా అమ్మొచ్చని ఇప్పుడే చూస్తున్నాం. ఆస్తులకే డబ్బు రాకపోతే ఇక అప్పులకేమొస్తాయనే మరో సందేహం కలిగి మొదటి సందేహం కాస్తా ఎగిరిపోయింది. ఇక పదండి రాత్రి భోజనం వేళయిందని భార్యామణి అనడంతో నా భార్య నిజంగానే బంగారం అనుకుంటూ అటు దారితీశాడు. పంచదార, ఉప్పు ఈ సారి సమపాళ్లలోనే ఉన్నాయనడంతో భార్య కూడా అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది.
- సీతారాం