Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ అధికారం చేజిక్కించుకోగలగడం వెనుక ఉన్న ప్రధాన కారణం ''హిందూత్వ'' పైచేయి సాధించడమేనని కొందరు ఉదారవాద వ్యాఖ్యాతలు అంటూంటారు. అయితే హిందూత్వ ఇంత హఠాత్తుగా పైచేయి సాధించడం ఏ విధంగా సాధ్యపడిందో ఆ సంగతి మాత్రం వారు వివరించరు. ఒకవేళ బాబ్రి మసీదు విధ్వంసం నుండి హిందూత్వ శక్తులు పైచేయి సాధించడం మొదలైంది అనుకుంటే ఆ మసీదు విధ్వంసం జరిగిన తర్వాత అధికారం చేజిక్కించుకోడానికి ఏకంగా ఇరవై సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఆ సంగతీ వివరించరు. ఇక బీజేపీ ఉన్నట్టుండి అత్యంత సంపన్నమైన పార్టీగా ఎలా తయారైందో, ఆ పార్టీకి దేశంలోని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో అత్యధిక భాగం ఎందుకు మద్దతు ఇస్తున్నారో ఆ విషయమూ వారు వివరించరు.
ఒకసారి దీని వెనక ఉన్న వర్గ కోణాన్ని పరిశీలించడం మొదలుపెడితే అప్పుడు ఈ విషయాలన్నింటినీ వివరించడం సాధ్యపడుతుంది. బడా బూర్జువా వర్గం వైఖరిలో వచ్చిన మార్పు బీజేపీ ఉన్నట్టుండి అధికార పార్టీగా ఎదగడం వెనుక కీలకమైన పాత్ర పోషించింది. 1990 దశకం ప్రారంభంలో ఈ మార్పు జరగలేదు. 2010 తర్వాత నయా ఉదారవాద విధానాల అమలు పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం అదుపు తప్పిపోతున్న పరిస్థితులకు దారితీసిన సమయంలో దేశ రాజకీయ రంగంలో బీజేపీ అత్యంత శక్తివంతమైన భాగంగా హఠాత్తుగా ముందుకొచ్చింది. ఆ సమయంలో ఏర్పడిన కార్పొరేట్- హిందూత్వ కూటమి రాజకీయరంగంలో ఒక్కసారి పెను మార్పులకు మూలకారణమైంది.
ఈ కార్పొరేట్ శక్తులకు, హిందూత్వ శక్తులకు నడుమ ఈ లంకెను కుదర్చడంలో మోడీ కేంద్రంగా పని చేశాడు. అటు కార్పొరేట్లకు, ఇటు ఆర్ఎస్ఎస్కు మధ్య సయోధ్య కుదిరింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బడా బూర్జువావర్గం ఆ సంక్షోభం వలన తమ ప్రయోజనాలు దెబ్బ తినకుండావుండేట్టు, తమ స్థానాన్ని గట్టి పరుచుకునేందుకు, తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఫాసిస్టు స్వభావం కలిగిన శక్తులతో జత కడుతుంది. భారత బడా బూర్జువా వర్గం కూడా చేసిందిదే. అందుకోసం మోడీని మధ్యవర్తిగా ఉపయోగించింది.
1990కి, 2014కి మధ్య బడా బూర్జువా వర్గం తన మొగ్గును బీజేపీ వైపు మార్చింది అనే వాస్తవాన్ని వివరించే రెండు సంఘటనలు ఉన్నాయి. 1990 దశకం తొలి నాళ్ళలో టాటా సంస్థల అత్యున్నత అధికారి ముంబైలో లౌకికవాద పరిరక్షణ కోసం జరిగిన ప్రదర్శనకు అగ్రభాగాన నడిచాడు. అదే టాటాల సామ్రాజ్యనికి అధిపతిగా ఉన్న వ్యక్తి ఇరవై ఏండ్ల తర్వాత గుజరాత్లో జరిగిన పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశంలో మోడీ ప్రధానిగా ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించాడు. గోద్రా ఘటన అనంతరం గుజరాత్లో ముస్లింలపై సాగిన మారణకాండ అదే మోడీ కనుసన్నలలోనే జరిగిందన్న వాస్తవం పక్కనబెట్టాడు. అదే టాటాల సామ్రాజ్య అధిపతి ఆ తర్వాత నాగపూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ నేతతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను ముచ్చటించాడన్నది మరో ఆసక్తికరమైన వాస్తవం.
తనకు ఇష్టులైన క్రోనీ కార్పొరేట్లకే సమస్తం కట్టబెడతాడని మోడీ గురించి వ్యాఖ్యానిస్తూంటారు. ఇది వాస్తవం అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అయితే కార్పొరేట్- ఫాసిస్టు కూటమి ఏర్పడి అధికారం చేజిక్కించుకున్న ప్రతీ చోటా జరిగేది ఇదే. అటువంటి సందర్భాలలోనే బడా బూర్జువా వర్గంలో కొత్త ముఖాలు తెరపైకి వస్తాయి. 1930 దశకంలో జర్మనీలోను, జపాన్‌లోను ఇదేవిధంగా జరిగింది. కాని, ఈ విధంగా కొత్త ముఖాలు తెరపైకి రావడం అంటే బడా బూర్జువా వర్గంలోని పాత ముఖాలను వెనక్కు నెట్టేశారని, వారిని పట్టించుకోకుండా విడిచిపెట్టారని మనం అనుకోకూడదు. బడా బూర్జువావర్గం అందించే సంపూర్ణ మద్దత్తుతో, చురుకైన సహకారంతో ఏర్పడే ఫాసిస్టు శక్తుల ప్రభుత్వం ఆ బడా బూర్జువా వర్గంలోని కొంతమందికి ప్రత్యేకంగా అదనపు వత్తాసు పలకవచ్చు కాని మొత్తంగానే బడా బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపాడే పనిలోనే ఉంటుంది. కార్మికవర్గాన్ని అణచివేసే కొత్త కార్మిక చట్టాలు, మన దేశీయ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ల చొరబాటుకు తలుపులు తెరిచే విధంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలు ఏ ఒకరిద్దరు క్రోనీలకు మాత్రమే ప్రయోజనం కల్పించేవి కావు. మొత్తం బడా బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపాడేవే.
అయితే మోడీ అధికారపీఠం కైవసం చేసుకోడానికి తోడ్పడిన ఈ ఏర్పాటు ఇప్పుడు చెదిరిపోతోంది. ఇలా అనగానే ఇక మోడీ అధికారం కోల్పోనున్నాడని నిర్ధారించకూడదు. దీనర్థం ఏమంటే తన అధికారాన్ని మోడీ నిలబెట్టుకోడానికి ఇంకా ఏక పక్షంగా, ఇంకా రాజ్యాంగ విరుద్ధంగా, ఇంకా విద్వేషాలను, అసహనాన్ని రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం జరుగుతుంది. ఏ ఉద్దేశ్యంతో మోడీని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారో, దేని కారణంగా ఈ అధికారం ఇంతవరకూ అతని చేతిలో నిలకడగా కొనసాగుతోందో, ఆ ఉద్దేశ్యం, దాని లక్ష్యం ఇప్పుడు దెబ్బ తింటోంది. ఇలా జరగడానికి రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది : మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బ్రహ్మాండమైన ప్రజాందోళన. ఈ మూడు చట్టాలూ కార్పొరేట్-హిందూత్వ కూటమి చేపట్టిన విధానాలకు అనుగుణంగా రూపొందినవే. అందుచేత ఇటువంటి చట్టాలు రావడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించేదేమీ కాదు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతిఘటన స్థాయి మాత్రం ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ తనకు తెలిసిన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రయోగించింది. కాని అవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం కార్పొరేట్-హిందూత్వ కూటమిని ఓ పెద్ద కుదుపు కుదిపింది.
ఇక రెండవది : కొంతమంది హిందుత్వ ప్రతినిధులు బహిరంగంగానే కొన్ని కార్పొరేట్ కుటుంబాల పట్ల శతృత్వాన్ని ప్రదర్శించడం. దీని వలన ఈ కూటమి ఎక్కువ కాలం కొనసాగుతుందన్న ఆశకు ఆస్కారం లేకుండా పోయింది. పియూష్ గోయెల్ మోడీ మంత్రివర్గంలో గణనీయమైన సీనియారిటీ కలవ్యక్తి. ఆర్ధిక మంత్రిగా కూడా తాత్కాలిక బాధ్యతలు చూసినవాడు. అటువంటి వ్యక్తి బహిరంగంగానే టాటాలపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బాకా అయిన పాంచజన్య పత్రిక ఇన్ఫోసిస్ మీద విషపూరితమైన రాతలతో దాడి చేసింది. ఇన్ఫోసిస్ ఆదాయపన్ను విభాగానికి సంబంధించి రూపొందించిన పోర్టల్‌తో కొన్ని చిక్కులు తలెత్తాయి. ఆ చిక్కులనన్నింటినీ పరిష్కరించమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా విధించింది. ఆ గడువు ముగిసేలోపే పాంచజన్య ఇన్ఫోసిస్‌పై ''జాతి వ్యతిరేకి'' ముద్రను వేయడంతోబాటు వామపక్షాలతోను, ''టుక్డే టుక్డే గ్యాంగ్'' (దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని ఎవరినైనా ఆరోపించాలనుకుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాడే ఊతపదం) తోను కలగలిపింది. ఆర్ఎస్ఎస్ నేతల భాషా పరిజ్ఞానం పరిమితమే కావొచ్చు. కాని ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయస్థాయి ఖ్యాతి గడించిన సంస్థ గురించి ప్రస్తావించేటప్పుడు చాలా ఘాటు పదాలనే ఉపయోగించారని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి ఒకరు ఆ వ్యాఖ్యలతో తమ సంస్థకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించడం వెనుక ఏమాత్రమూ నిజాయితీ లేదని స్పష్టమవుతూనేవుంది. పైగా ఆ పత్రికలో వచ్చిన వ్యాఖ్యలతో మరికొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా గొంతు కలిపారు.
కార్పొరేట్-హిందూత్వ కూటమిలో లుకలుకలు మొదలవడం కనపడుతూనేవుంది. రాబోయే కొద్ది మాసాల్లో ఇది మరింత పెద్దది కావచ్చు. ఈ హిందూత్వ శక్తులకి ఆర్థిక శాస్త్రం బొత్తిగా అర్థం కాని అంశం. అందుకే వాళ్ళు తమ కార్పొరేట్ మిత్రులు చెప్పినదల్లా తరతచేస్తూ వచ్చారు. అలాగే బ్రెట్టన్‌వుడ్ సంస్థల (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు) ఆదేశాలను కూడా అమలు చేస్తూ వచ్చారు. ఆ కార్పొరేట్ మిత్రులు, ఈ బ్రెట్టన్‌వుడ్ సంస్థలు చెప్పినవి ఆచరణలో కొరగాకుండా పోతున్నాయని ఇప్పుడిప్పుడు వాళ్ళకి బోధపడుతోంది. ఐతే ఇది తాము అమలు చేస్తున్న విధానాలలోని లోపంగా వాళ్ళు గుర్తించడంలేదు. దానికి మారుగా కొన్ని కార్పొరేట్ సంస్థలు తమని దుర్బుద్ధితో తప్పుదోవ పట్టించడం వల్లనే ఈ విధంగా జరుగుతోందని వాళ్ళు అనుకుంటున్నారు.
ద్రవ్య విధానాలలో పొదుపు పాటిస్తూనే, కార్పొరేట్ సంస్థలకు గనుక రాయితీలిస్తే ఆర్ధిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందన్న బోధనలను వాళ్ళు కార్పొరేట్లనుండి తలకెక్కించుకున్నారు. పెట్టుబడిదారుల ''ఆటవిక ప్రవృత్తి''ని రెచ్చగొడితే, అందుకోసం పన్ను రాయితీలను భారీగా ఇస్తే, కార్మిక వ్యతిరేక, రైతు-వ్యతిరేక చట్టాలను చేస్తే పెట్టుబడులు ప్రవహిస్తాయని వాళ్ళు నమ్మారు. ఎన్ని రకాలుగా, ఎంత భారీగా పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించినప్పటికీ మార్కెట్లో స్థూలంగా డిమాండ్ పెరగకపోతే (ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోతే) ఎటువంటి కొత్త పెట్టుబడులూ రావని, కొత్త పెట్టుబడులు రాకపోతే ఆర్థిక వ్యవస్థ కోలుకోదని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. మార్కెట్లో కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రభుత్వ వ్యయం పెరగాలి. అందుకోసం అవసరమైన సొమ్మును ద్రవ్యలోటు పెంచడంద్వారా కాని, పెట్టుబడిదారులమీద అదనపు పన్నులు విధించి కాని సమకూర్చుకోవాలి.
బొత్తిగా ఆర్థిక వ్యవహారకాలపై అవగాహనలేని ఈ హిందూత్వ నేతలు తమ నాయకుడు మోడీ నడుపుతున్న ప్రభుత్వం కూలబడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి చేయగలిగిన అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నదని, అయినా ఆర్థిక వ్యవస్థ దుస్థితి కొనసాగుతూనేవుందని, దీనికి కారణం దేశంలోని కార్పొరేట్ సంస్థలలో ఎక్కువ భాగం (తమ ఆశ్రితులుగాఉన్న కొద్దిమంది తప్ప) అనుసరిస్తున్న వికృత వైఖరులేనని భావిస్తున్నారు. మనదేశంలో పెట్టుబడులు పెట్టేబదులు వాటిని ఎక్కడికో తరలిస్తున్నారని, ఇది దేశద్రోహమని అంటున్నారు. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి పెట్టుబడి తరలిపోవడం దాని సహజ లక్షణమన్న ఆర్థిక సూత్రం వారికి వికృతంగా కనిపిస్తోంది.
హిందూత్వ శక్తులకి, కార్పొరేట్ సంస్థలకు మధ్య తలెత్తిన ఈ విభేదం మరింత పెరగనుంది. బెదిరింపులకు లొంగి పెట్టుబడులు పెట్టడం అనేది జరిగే పని కాదు. అలా బెదిరిస్తున్నకొద్దీ ఆ పెట్టుబడి ప్రపంచంలో మరేదైనా చోట ఇక్కడికన్నా ఎక్కువ లాభాలొచ్చే చోటు ఉందేమో మరింత పట్టుదలగా వెతుక్కుని అక్కడికి తరలిపోతుంది. అలా తరలిపోతున్నకొద్దీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్పొరేట్ పెట్టుబడిని జాతి వ్యతిరేకమైనదని మరింతగా నిందిస్తారు. ఈ ''టుక్డే టుక్డే గ్యాంగ్'' ప్రచారాన్ని లంకించుకునేవాళ్ళు రానున్న కాలంలో మరింతగా పెరుగుతారు.
ఈ మొత్తం వ్యవహారంలో మనకి కొట్టవచ్చినట్టు ఓ విషయం కనిపిస్తోంది. పియుష్ గోయెల్‌ను గాని, పాంచజన్య వ్యాస రచయితను గాని మోడీ పల్లెత్తు మాట అనలేదు. అదే జర్మనీలో జరిగినది చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. ఆ కాలంలో బడా బూర్జువా వర్గంతో పొత్తును స్థిరపరచుకోవడం కోసం ఫాసిస్టు నాయకులు రాత్రికి రాత్రి తమమద్దతుదారులనే హతం చేశారు. దానినే '' నైట్ ఆఫ్ లాంగ్ నైవ్స్'' ( పొడవాటి కత్తుల రాత్రి) అని పిలుస్తారు.
హిందూత్వ శక్తులకు, కార్పొరేట్ పెట్టుబడికి మధ్య కూటమి విజయవంతంగా కొనసాగాలంటే రెండు షరతులు నెరవేరాలి. మొదటిది : ఏ సంక్షోభ పరిస్థితులు ఈ కార్పొరేట్-హిందూత్వ కూటమిల ఏర్పాటుకు దారి తీశాయో, వాటిని ఈ కూటమి అధిగమించగలగాలి. రెండవది : హిందూత్వ కూటమిలోని వ్యక్తులకు, కార్పొరేట్లకు మధ్య ఘర్షణకు దారితీసే విధంగా పెట్టుబడిదారీ వ్యతిరేక ప్రకటనలు, ఖండనలు ఉండకూడదు. మన దేశంలో బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని ఏనాడూ బడా పెట్టుబడికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. కనుక ఈ ఇద్దరు భాగస్వాముల నడుమ ఎటువంటి సైద్ధాంతిక సమస్యలూ తలెత్తే అవకాశం లేదు. కాని మొదటి షరతు - అంటే ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించ గలగడం- నెరవేరే అవకాశమే లేదు. అంతకంతకూ ప్రపంచీకరణ అవుతున్న పెట్టుబడికి, జాతీయ సరిహద్దులకే పరిమితమై కొనసాగుతున్న జాతిరాజ్యాలకి (నేషన్ స్టేట్) నడుమ ఉన్న వైరుధ్యం ఈ సంక్షోభాన్ని అధిగమించనివ్వదు. అలా అధిగమించడానికి అవసరమైన ప్రభుత్వ వ్యయం పెంపుదలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనుమతించదు.
మరి మానెటైజేషన్ ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతామంటున్న ప్రభుత్వ ప్రతిపాదన సంగతేమిటి? దాని వలన ఆర్ధిక వ్యవస్థ కోలుకుని, కార్పొరేట్-హిందూత్వ కూటమి నిలదొక్కుకునే అవకాశాలు పెరగవా; అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి ఏ మూలకూ చాలని విధంగా రూ.6లక్షల కోట్లు ఖర్చుపెట్టినందువలన దేశ ఆర్థిక వ్యవస్థమీద చాలా స్వల్పమైన ప్రభావం మాత్రమే కలుగుతుంది. నాలుగేండ్ల వ్యవధిలో రూ.6 లక్షల కోట్లు ఖర్చు - అంటే జీడీపీలో 1శాతం కన్నా తక్కువ - వలన ఒరిగేదేమీ లేదు.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్