Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పది నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమం మరో మలుపు తిరగనుంది. ఆగస్టు 26, 27 తేదీలలో ఢిల్లీ సరిహద్దులోని సింఘులో జరిగిన జాతీయ రైతు సదస్సు సెప్టెంబరు 27న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీని సన్నాహాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సెప్టెంబరు 5న భారీ బహిరంగ సభ జరిగింది. ఊహించినదానికి భిన్నంగా లక్షలాదిగా రైతు, కూలీలు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది ప్రతినిధులం హాజరయ్యాం. మమ్మల్ని వారెంతో సోదర భావంతో ఆహ్వానించారు. ముజఫర్‌నగర్ సభకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ర్యాలీకి జనం ముందు రోజు నుండే హాజరవడం మొదలుపెట్టారు. ముజఫర్ నగర్కొచ్చే రైళ్ళు, బస్సులను ఆ రోజు తిరగకుండా యోగి ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఢిల్లీకి 130కి.మీ దూరంలో ఉన్న ముజఫర్ నగర్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ర్యాలీకి వచ్చిన జనానికి అందరితోపాటు ముస్లిం ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా లంగర్లు ఏర్పాటు చేసి ఉచితంగా భోజనం, స్వీట్లు, నీళ్ళు వగైరా అందించారు. ప్రదర్శన కారులతో రోడ్లన్నీ ఉదయానికే నిండిపోయాయి. లక్ష మంది పట్టే గ్రౌండు నిండిపోవడంతో రోడ్లు, పార్కులలో జనం విడిది చేశారు. జనం ఎక్కడికి వెళ్ళినా అక్కడల్లా మంచినీళ్ళతో పాటు ఆహారం కూడా అందించారు. ఇలాంటి సభలు గతంలో కాంగ్రెస్, బీజేపీతో సహా అనేక పార్టీలు నిర్వహించాయి. కానీ వాటికి స్వచ్ఛందంతోపాటు బలవంతంగా వచ్చేవాళ్లు, డబ్బులు తీసుకుని వచ్చేవాళ్ళు ఉంటారని అందరికీ తెలుసు. కానీ ఈ సభకు జనం నూటికి నూరు శాతం స్వచ్ఛందంగా తరలి వచ్చారు. సుదూర ప్రాంతాల నుండి సైతం ఎవరి వాహనాలు వారే పెట్టుకుని చేరుకున్నారు. వారి కదలిక యాంత్రికంగా లేదు. నడకలో, కళ్ళల్లో సమరోత్సాహం కనిపించింది. నినాదాల జోరులోనూ ఆవేశం తొణికిసలాడింది. మధ్యవయస్కులతోపాటు మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉపన్యాసకులు ఎవరూ 10 నిమిషాలకు మించి మాట్లాడలేదు. దాదాపు 40 సంఘాల నాయకులు వేదికపై ఉన్నారు. ఎలాంటి ఒత్తిడి, గందరగోళం లేకుండా సభ నిర్వహణ సజావుగా సాగింది. ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే... వచ్చిన జనం ఎవరూ (మేం తప్ప) మాస్కులు ధరించలేదు. ఈ సభ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మళ్ళీ ఊపు తెచ్చింది. ఆ తర్వాత కర్నాల్‌లో జరిగిన యాత్ర, ముట్టడి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, విద్యుత్తు బిల్లును ఉపసంహరించు కోవాలని, గిట్టుబాటు ధరల చట్టం తీసుకురావాలనే మూడు డిమాండ్లపై రైతు ఉద్యమం ఇప్పటివరకు సాగింది. ఈ బంద్ నేపథ్యంలో ముజఫర్ నగర్ సభ అన్ని వర్గాల, తరగతుల డిమాండ్లను ముందుకు తెచ్చింది. వ్యవసాయ చట్టాలతోపాటు నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించు కోవాలన్న డిమాండ్ జోడించడంతో కార్మిక, కర్షక ఐక్యతకు ప్రాతిపదిక ఏర్పడింది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని, కరోనాలో ప్రజల్ని ఆదుకోవాలని తదితర డిమాండ్లు ఉన్నాయి. గతంలో అనేక రైతు ఉద్యమాలు జరిగినా వాటిల్లో ఏనాడూ కార్మికుల డిమాండ్లు చోటు చేసుకోలేదు. వామపక్ష రైతు సంఘాలు మినహా ఇతర ధనిక, భూస్వామ్య నాయకులు తమ గురిని ఉద్యోగులు, కార్మికుల పైకి మళ్లించేవారు. కానీ ఈసారి దానికి భిన్నంగా కార్మిక, కర్షక ఐక్యతను ప్రతి ఒక్కళ్ళూ నొక్కి చెప్పారు. రైతు ఉద్యమానికి ఇప్పటి వరకు కార్మికులు, సంఘాలు అందించిన సహకారానికి వారు ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబరు 24వ తేదీన జరిగే స్కీమ్ వర్కర్ల అఖిల భారత సమ్మెకు కిసాన్ మోర్చా మద్దతు పలికింది. వివిధ వర్గాలను చీల్చి సంఘటిత ఉద్యమాలను దెబ్బకొట్టే పాలకవర్గాల ఎత్తుగడలకు ఇది చెక్ వంటిది.
ముజఫర్‌నగర్ అంటే ఒకప్పుడు హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతిబింబంగా ఉండేది. స్వాతంత్య్రోద్యమంలో కలిసికట్టుగా పోరాడారు. 1980లో మహేంద్ర సింగ్ టికాయత్ నాయకత్వంలో జరిగిన ఢిల్లీ ఛలో రైతు యాత్రలో వేలాది మంది పేద ముస్లిం రైతులు పాల్గొన్నారు. కానీ 2002 తరువాత గుజరాత్ పరిణామాల నేపథ్యంలో ముజఫర్ నగర్లో హిందూ - ముస్లిం విద్వేషాలకు బీజం పడింది. సంఫ్‌ుపరివార్ శక్తులు దీన్ని ఆసరా చేసుకుని ఖాప్ పంచాయతీల ద్వారా జాట్లను కూడగట్టి ముస్లింలపై దాడులు నిర్వహించారు. 2013 ఆగస్టు, సెప్టెంబరులలో జరిగిన ఘర్షణలలో ముజఫర్‌నగర్‌లో 50వేల మంది ముస్లింలు నిరాశ్రయులయ్యారు. 62 మంది హిందూ-ముస్లిం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ఈ విషపూరిత వాతావరణం సృష్టించిన భయంతో బీజేపీ స్వీప్ చేసింది. అప్పటివరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బలహీనంగా ఉన్న బీజేపీ ఈ ఘర్షణల తర్వాత బలపడింది. నేటికీ వారిలో ఆ భయకంపిత వాతావరణం ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ రైతు ర్యాలీ హిందూ-ముస్లిం ఐక్యతకు తిరిగి పునాది వేసింది. హిందూ, సిక్కులతోపాటు ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో సభలో పాల్గొన్నారు. మేము కొంతమందిమి ముస్లిం వాడలలోనే విడిదిచేశాం. వారి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించాం. వారు హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా కోరుకుంటున్నారు. తాము ఒంటరిపాటు కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రైతు ఉద్యమం ద్వారా వచ్చిన హిందూ-ముస్లిం ఐక్యతతో బీజేపీ, ఆర్‌యస్‌యస్ విచ్ఛిన్న రాజకీయాలకు గండి పడింది.
ముజఫర్ నగర్లో దళితులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో జరిగిన భారత్‌బంద్ ఒక కొత్త చరిత్రను సృష్టించింది. నాడు ఎస్.సీ, ఎస్.టీ అత్యాచార నిరోధక చట్టానికి సుప్రీం కోర్టు సవరణలకు వ్యతిరేకంగా ఆ బంద్ జరిగింది. నాడు దాన్ని యోగి ప్రభుత్వ పోలీసులు, భజరంగ్‌దళ్ ప్రయివేటు సైన్యం కలిసి రక్తపుటేరులో ముంచింది. ఉత్తర భారతంలో 11 మంది అమరులయ్యారు. ఆ తరువాత దళిత ఉద్యమ పొందికలోను మార్పు వచ్చింది. ఈ ఉద్యమంలో సహ భాగస్వామి కాని బీఎస్పీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పట్టు కోల్పోయింది. భీమ్ ఆర్మీ వంటి కొత్త శక్తులు పుట్టుకొచ్చాయి. ఈ ఆందోళనలో డిఎస్‌ఎంఎం ముఖ్య పాత్ర పోషించింది. రైతు ఉద్యమ నేపథ్యంలో దళిత సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. దళితులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు కిసాన్ సంయుక్త మోర్చా ప్రత్యేక ప్రయత్నం చేసింది. గతంలో ఖాప్ పంచాయితీలు జరిగితే గ్రామాల్లోని అగ్ర కులాలు మాత్రమే హాజరయ్యేవి. దళితులను రానిచ్చేవారు కాదు. కాని రైతు ఉద్యమ సందర్భంగా జరిగిన కిసాన్ పంచాయత్ సభలన్నింటికీ దళితులను కూడా ఆహ్వానించి సహ భాగస్వామిగా చేసుకున్నారు. ఇది రైతు, వ్యవసాయ కూలీల మధ్య ఐక్యతను పెంచడమే కాకుండా కుల అస్తిత్వాలను అధిగమించి ఉద్యమ ఐక్యతకు దోహదపడింది. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఎత్తులను ఈ రైతు సభ చిత్తు చేసింది. కిసాన్ సంయుక్త మోర్చా నాయకులు ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని ఓడించే దిశగా ''మిషన్ యు.పి'' పేరుతో ప్రజలను సమీకరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమం విజయం సాధిస్తుందని వారి ధీమా.
27 బంద్‌తో ఊపందుకోనున్న రైతు ఉద్యమం విజయం సాధించేదాకా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మోడీ మొండి వైఖరిని దించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడమో లేదా దిగిపోవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తోంది. రైతు ఐక్యత రైతు-కూలీ ఐక్యత గాను, కార్మిక - కర్షక ఐక్యత గాను, హిందూ-ముస్లిం ఐక్యతగాను రూపు దిద్దుకుంటోంది. విశాల ప్రజానీకాన్ని భాగస్వాములను చేస్తున్న రైతు ఉద్యమం నేడు జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. ఈ దిశగా ముజఫర్ నగర్ సభ మరో ముందడుగు అనడంలో సందేహం లేదు.
- వి. శ్రీనివాసరావు