Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఊక దంపుడు మాటలే కానీ చేతలు శూన్యం''... అనే మాటకు మోడీ పాలన ఓ చక్కటి ఉదాహరణ. ఇందుకు కార్మికుల తిరోగమన బతుకులే సాక్ష్యం. దేశ పురోగమనాన్ని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. ఈ విధానాలపై కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు మరో సమ్మె పోరాటానికి సిద్ధమయ్యాయి. అదే 2021 సెప్టెంబర్ 24న స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె.
అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకెపి విఓఏ, కస్తూరీబా, చైల్డ్ లేబర్, మెడికల్ Ê హెల్త్, విద్యా రంగంలోని వివిధ కేంద్ర స్కీమ్‌లను బీజేపీ ప్రభుత్వం బలహీనపరుస్తున్నది. పేద పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించే బాధ్యత నుండి వైదొలగుతున్నది. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించ నిరాకరిస్తున్నది. కోవిడ్ కాలంలో ముందు వరుసలో పనిచేసిన స్కీమ్ వర్కర్లకు రక్షణ ఏర్పాటు, రిస్క్ అలవెన్సులు, కోవిడ్ బారినపడి మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం, సర్వీసుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, సాంఘిక భద్రత, పెన్షన్ చెల్లింపులను నిరాకరిస్తున్నది. ఈ సమస్యలపై ఏడేండ్లుగా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించడం దుర్మార్గం. ఈ నేపథ్యంలో కేంద్ర స్కీమ్‌లను రక్షించుకోవడానికి సెప్టెంబర్ 24న జరుగుతున్న అఖిల భారత సమ్మెలో స్కీమ్ వర్కర్లందరూ పాల్గొనాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు పిలుపునిస్తున్నాయి.
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, పౌష్టికాహారం, విద్య, వైద్యం తదితర సేవలను అందిస్తూ, వివిధ స్కీమ్‌లలో దేశంలో కోటి మంది, తెలంగాణలో 3లక్షల మంది పనిచేస్తున్నారు. స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.21,000లు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేయాలని, స్కీమ్‌లను ప్రైవేటీకరించవద్దని, బడ్జెట్ కోతలు పెట్టొద్దని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కరోనా నివారణ చర్యల్లో ముందు వరుసలో పనిచేస్తున్న వీరికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కరోనా చికిత్స చేయాలన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడంలేదు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడంతో వేలాది మంది మధ్యాహ్న భోజన, స్వచ్ఛ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి గొప్పలు చెప్పిన మోడీ ప్రభుత్వం అంగన్వాడీలను ఆ ఇన్సూరెన్స్ నుండి మినహాయించింది.
వివిధ స్కీమ్ వర్కర్స్ - సామాజిక భద్రత : ఐసిడిఎస్, ఎండిఎం, ఎన్హెచ్ఎం, ఎస్ఎస్ఎం, ఎన్‌సిఎల్‌పి వివిధ రాష్ట్ర కేంద్ర పథకాల క్రింద దాదాపు కోటి మంది పనిచేస్తున్నారు. భారతదేశంలో ఐసిడిఎస్, ఎండిఎం, ఎన్హెచ్ఎం, మూడు ప్రధాన పథకాల కింద పనిచేస్తున్న వారు 60లక్షల మంది. ఐసిడిఎస్‌లో 26లక్షల మంది, మధ్యాహ్న భోజనం 25లక్షల మంది, ఆశ 10లక్షల మంది వీరితో పాటు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ (ఎన్‌సిఎల్‌పి) కింద ఉన్న ప్రత్యేక పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది కింద కూడా వేలాదిమంది పనిచేస్తున్నారు. ఐసిడిఎస్, ఎన్హెచ్ఎం, మధ్యాహ్న భోజనం ద్వారా 8కోట్ల మంది పిల్లలకు, 2కోట్ల మంది తల్లులకు సేవలిందిస్తున్నారు. డ్రాపౌట్స్ తగ్గించి పాఠశాల హాజరు శాతాన్ని మెరుగుపర్చడానికి మధ్యాహ్న భోజన పథకం సహాయపడుతున్నది. ఎంహెచ్ఎం తల్లి, శిశు ఆరోగ్యాన్ని కాపాడుతోంది.
మన దేశ జనాభాలో సగం మంది మహిళలలో అత్యధిక మంది సంరక్షణ, సేవ పనులు చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, అనుబంధ పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు మొదలైన స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించడం లేదు. ఈ పథకాలను వ్యవస్థీకృతం చేసి విస్తృత అసంఘటితరంగ మహిళలు, పిల్లలకు ఆరోగ్య, శిశు రక్షణా సౌకర్యాలు కల్పించాల్సిందిపోయి ఈ స్కీంలకు నిధులను తగ్గించేసి, ప్రయివేటు వారికి అప్పగించి క్రమంగా మూసేయాలని చూస్తోంది. ఐఎల్ఓ సిఫారసులు 45, 46లను అనుసరించి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలనే, కనీస వేతనాలు, పెన్షన్ చెల్లించాలనే దీర్ఘకాల డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వామపక్ష పార్టీలు తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ తమ ఎన్నికల ఎజెండాలో శ్రామిక మహిళల డిమాండ్లను చేర్చటంలేదు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అట్టడుగు తరగతుల ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందే కొద్దిపాటి సేవలను కూడా మోడీ ప్రభుత్వం దక్కకుండా చేస్తున్నది. ప్రాథమిక హక్కులను తిరస్కరిస్తున్నది. జనాభాలో అధిక సంఖ్యకి ఆహారం, ఆరోగ్యం, విద్య తగిన విధంగా అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆసుపత్రులు, ప్రాథమిక సేవలు మానవాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటికి నాడీమండలంగా ఈ స్కీమ్‌లున్నాయి. కానీ ఈ స్కీమ్‌లను హరించాలన్న మోడీ ప్రభుత్వ వైఖరి ప్రజా వ్యతిరేకమైనది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లకు కేటాయించే బడ్జెట్లలో కోత పెడుతున్నది. స్కీమ్ వర్కర్ల వేతనాలు, స్కీమ్‌లకు పెట్టే పోషకాహారం, మెడిసిన్, తదితర రోజువారీ ఖర్చులను రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం చెప్పడం అప్రజాస్వామికం.
కార్మికులు సంఘం పెట్టుకునే, సమిష్టి బేరసారాలాడే హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాసింది. కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చివేసింది. పనిదినాన్ని 12 గంటలకు పెంచుతూ ఆర్డినెన్సులు తెచ్చింది. కీలక రంగాలైన బొగ్గు, రక్షణ, రైల్వే, విద్యుత్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, విమానయానం, అంతరిక్షం, అటామిక్ ఎనర్జీతో సహా అన్ని రంగాల్లోని విదేశీ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులకు అనుకూలంగా తలుపులు బార్లా తెరిచింది. సహజ వనరులను తెగనమ్మడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించింది. దేశ స్వావలంబనకు, రక్షణకు వ్యతిరేకమైన ఈ ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామిక దేశభక్తియుత ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. దేశభక్తి పూరితమైన 2021 సెప్టెంబర్ 24 సమ్మెను బలపర్చాలి.
- ఎస్.వి. రమ
సెల్: 9490098899