Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్కారియా కమిషన్ సైతం కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని వ్యవహరించే ఒక ఏర్పాటు ఉండాలని సిఫార్సు చేసింది. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ఇంటర్-స్టేట్ కౌన్సిల్ (అంతర్రాష్ట్ర సలహా మండలి) వేదికగా ఈ సంప్రదింపులు జరగాలని సూచించింది. ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో తీర్పు చెప్తూ... రాష్ట్రాలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలు కావని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం నిలబెట్టాలే తప్ప తోసిరాజనకూడదని... సుప్రీం కోర్టు చెప్పింది. సహకార ఫెడరలిజం మన రాజ్యాంగ మౌలిక స్వభావం అని స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉమ్మడిగా అధికారాలు కలిగివున్న అంశాల జాబితా ఇచ్చారు. కాని ఆ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కీలకమైన చట్టాలను జారీ చేసేస్తోంది. ఈ ధోరణిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాలను ఎటువంటి చర్చలోనూ భాగస్వాముల్ని చేయకుండా కేంద్రం ఏకపక్షంగా చట్టాలను చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రాల పరిధిలోని అంశాలను, ఉమ్మడి జాబితాలోని అంశాలను సైతం కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకునే ధోరణికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలూ నిలవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పిలుపునిచ్చారు. 2020 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళనాడు అసెంబ్లీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానించింది. రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తూ పలు చట్టాలను చేయడం, ఆ ధోరణిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు నిలవడంతో ఫెడరల్ సూత్రాల ప్రాధాన్యత తెర ముందుకు వచ్చింది.
దాదాపు ఒక ఏడాది క్రితం రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. వ్యవసాయం వాస్తవానికి రాష్ట్రాల జాబితాలోని అంశం. కాని కేంద్రం ఉమ్మడి జాబితాలో ఉన్న 'వాణిజ్యం, వర్తకం' అంశం కింద ఈ చట్టాలను చేసింది. రాష్ట్రాల పరిధిలో ఉండే ఏ అంశంపైన అయినా, ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం చట్టం గనుక చేస్తే, దానిపై రాష్ట్రాలకు అభ్యంతరం ఉన్నప్పుడు ఆ చట్టం చెల్లదని, రాష్ట్రాల చట్టాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని సుప్రీం కోర్టులో పలు తీర్పులు వెలువడ్డాయి.
వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికీ కేంద్రం చట్టాలను చేసింది. రాష్ట్రాలను సంప్రదించనేలేదు. కోట్లాదిమంది రైతుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపే ఆ చట్టాలకు వ్యతిరేకంగా నేటికీ రైతుల ఆందోళన కొనసాగుతోంది. 2021 మేజర్ పోర్ట్స్ అథారిటీస్ యాక్ట్‌ను పార్లమెంటు ఆమోదించినప్పుడు బీజేపీ పాలిత గోవా రాష్ట్ర ప్రభుత్వం సైతం దానికి అభ్యంతరం తెలిపింది. గోవా ప్రభుత్వం చేసిన పలు చట్టాలు ఇందు వలన కొరగాకుండా పోతాయని వాదించింది.
ఇక మైనర్ పోర్టుల విషయంలో అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. కాని కేంద్రం చేసిన మేజర్ పోర్టుల చట్టం రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం అధీనంలో నడిచే మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు బదలాయించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు 'విద్యుత్ సవరణ చట్టం-2020'ని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లకు ఇంతవరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన అధికారులే ఉంటూ వస్తున్నారు. కాని కేంద్రం చేసిన ఈ చట్టంలో వారిని నియమించే అధికారం కేంద్రం అధీనంలో ఉండే నేషనల్ సెలక్షన్ కమిటీకి బదలాయించారు. అది కాకుండా, ఒక ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసే అధికారం ఇప్పుడు కేంద్రానికి సంక్రమించింది. ఇది విద్యుత్తు కొనుగోలు, అమ్మకం, ట్రాన్స్మిషన్ వంటి అంశాలను నియంత్రిస్తుంది. తద్వారా రాష్ట్రాలలోని విద్యుత్తు రంగాన్ని నియంత్రించే అధికారం రాష్ట్రం చేతుల్లోంచి కేంద్రం చేతిలోకి పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లేకుండానే ప్రయివేటు సంస్థల ప్రవేశాన్ని అనుమతించే అధికారం కేంద్రానికి కట్టబెట్టే అంశాలు సైతం ఈ చట్టంలో పొందుపరిచారు.
ఈ విధంగా రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలను కేంద్రం ఏకపక్షంగా తన చేతుల్లోకి తీసుకోవడం చాలా తీవ్రమైన విషయం. ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలను పొందుపరచడం వెనుక ఉద్దేశ్యం ఆ అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని దేశమంతా ఒకే విధంగా ఉండేవిధంగా క్రమంగా చట్టాలను రూపొందించుకోవడం. అయితే ఈ విధంగా కొన్ని అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చడం వలన క్రమంగా అవి కేంద్రం తన చేతుల్లోకి లాక్కుంటుందనే భయాన్ని రాజ్యాంగ సభ సభ్యులు కొందరు ఆనాడే వ్యక్తం చేశారు. ఆ భయాలు వాస్తవమేనని తర్వాత పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
సర్కారియా కమిషన్ సైతం కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని వ్యవహరించే ఒక ఏర్పాటు ఉండాలని సిఫార్సు చేసింది. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ఇంటర్-స్టేట్ కౌన్సిల్ (అంతర్రాష్ట్ర సలహా మండలి) వేదికగా ఈ సంప్రదింపులు జరగాలని సూచించింది. ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో తీర్పు చెప్తూ... రాష్ట్రాలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలు కావని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం నిలబెట్టాలే తప్ప తోసిరాజనకూడదని... సుప్రీం కోర్టు చెప్పింది. సహకార ఫెడరలిజం మన రాజ్యాంగ మౌలిక స్వభావం అని స్పష్టం చేసింది. ఈ తీర్పులను బేఖాతరు చేసి కేంద్రం వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటాల వంటివి మరెన్నో రాకమానవు.
- ముకుంద్ పి. ఉన్ని
(వ్యాసకర్త - సుప్రీం కోర్టు న్యాయవాది)