Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 23ను అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి సంకేత భాషల ప్రాధాన్యత గురించి ఆవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23-29 వరకు సంకేత భాషల వారోత్సవాలను జరుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23ను అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 70 మిలియన్ల బధిరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 135 జాతీయ సంఘాల సమాఖ్య (డబ్ల్యు ఎఫ్డీ) 1951 సెప్టెంబర్ 23న ఏర్పడింది. దీనికి గుర్తింపే సెప్టెంబర్ 23 అంతర్జాతయ బధిరుల దినోత్సవం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా72 మిలియన్ల బధిరులు ఉన్నారు. 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోనే నివస్తున్నారు. అంతర్జాతీయంగా 300 కంటే ఎక్కువ సైన్ లాంగ్వేజ్‌లు ఉన్నాయి. కానీ కేవలం 2శాతం మందే సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. రష్యాలో మొదటగా 1802లో అలెగ్జాండర్ చెవిటి, మూగ వారి కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ప్రాన్స్, రష్యా, ఐరోఫాలాంటి దేశాలు ఈ ప్రత్యేక విద్యను ఒక వ్యవస్థగా అభివృద్ధి చేసాయి. రష్యాలో అనేక పాఠశాలల్లో వినికిడి సమస్య ఉన్న పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్ని కూడా తరగతులకు అనుమతించేవారు. రష్యాలో సోవియట్ కాలంలో పుట్టిన ప్రతిమూగ, చెవిటి వ్యక్తిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా సోవియట్ రష్యాలో బధిరుల విద్యా అభివృద్ధి కోసం కృషి జరిగింది.
చెవిటి పిల్లల విద్యాభివృద్ధి
చెవిటి పిల్లల కోసం సాధారణ విద్యాసంస్థల్లో ప్రత్యేక సామర్థ్యం కల్గిన ఉపాధ్యాయులను నియమించడం, వీరి ద్వారా పిల్లల సామర్థ్యానికి అనుగుణంగా చదవడం, రాయడం, వేలిముద్రలు వినియోగించి అక్షరాలు నేర్పించడం చేస్తున్నారు. సైగల భాష అభివృద్ధి కావడం ద్వారా బధిరులు ప్రస్తుతం అన్ని రంగాల్లో రానిస్తున్నారు. మనదేశంలో ప్రత్యేక పాఠశాలాల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పటికీ అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌నే మనదేశంలో వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు స్వతహాగా వారివారి దేశాల్లో జాతీయ స్థాయిలో సైన్లాంగ్వేజ్ని అభివృద్ధి చేస్తే 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో మాత్రం ఇతర దేశాల సైన్లాంగ్వేజ్పైనే ఆధారపడటం బధిరుల విద్య పట్ల మన పాలకులకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. 2021 ఆగష్టులో మనదేశంలో సైన్ లాంగ్వేజ్‌ను అధికారికంగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా మన సైన్ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేయడంపై పాలాకులు శ్రద్ధపెట్టాలి. ప్రపంచంలో అనేకదేశాలలో బధిరుల కోసం ప్రాధమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు సైన్ లాంగ్వేజ్‌లో బోధిస్తున్నారు. మనదేశంలో ప్రభుత్వరంగంలో బధిరులు చదువుకునేందుకు విద్యాసంస్థలు తగినన్ని లేవు. సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో 10-20 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 50 ఏండ్లు పైబడిన వారిలో 40 శాతం, 70 ఏండ్లుపైబడిన వారిలో 70 శాతం మందికి వినికిడి సమస్య ఉన్నది. జనాభాలో సగటున ప్రతి 6 మందిలో ఒకరికి వినికిడి లోపం ఉంది. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒక్కరికి వినికిడి సమస్య ఉండొచ్చని 2021 డబ్ల్యుహెచ్ఓ అధ్యయనం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో 2014లో ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.46లక్షల మంది వికలాంగు లున్నారు. వీరిలో 74,987 మంది బధిరులున్నారు. 2016 ఆర్పిడి చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది. డబ్ల్యుహెచ్ఓ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40 లక్షల మందికి వినికిడి సమస్య ఉంది. 40శాతం వైకల్యం ఉంటేనే ప్రభుత్వ పథకాలన్నింటిలో 2016 ఆర్పిడి చట్టం ప్రకారం వికలాంగులుగా అర్హులు. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 51శాతం వైకల్య ధృవీకరణ ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు. ప్రభుత్వ నిర్ణయం వలన వేలాది మంది అర్హులు అనర్హులుగా మారినారు. సామూహిక ప్రాంతాలన్ని మూగ, చెవిటి వారితోపాటు వికలాంగులు వినియోగించుకునే విధంగా ఉండాలని 2016 ఆర్పిడి చట్టం పేర్కొంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సెసెబుల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా 2020 నాటికి ప్రధాన నగరాల్లో 50శాతం అందుబాటులోకి రావాలి. బస్టాండ్, రైల్వేస్టేషన్స్, విమానశ్రయాలు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో సైగల భాష సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. కానీ, ఇవేవి అమలులో లేవు. బధిరులు వినియోగించే పరికరాలు అందుబాటులో లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినికిడి పరికరాలను ఉచితంగానే సరఫరా చేయాలి. శాస్త్రీయ పద్దతిలో చికిత్స అందించాలి. దీని కోసం ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆడియాలజిస్టు మరియు స్పిచ్ లాంగ్వేజ్ పాథలాజిస్టులను నియమించాలి. ఆడియాలజిస్టు శిక్షణ కోసం ప్రత్యేకంగా కళాశాలను ఏర్పాటు చేసి, పుట్టిన బిడ్డలకు వినికిడి పరీక్షలు చేయాలి. వినికిడి పరికరాలు కోనుగొలు కోసం రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పరికరాలు వాడేందుకు దోహదపడుతుంది. వినికిడి సమస్య ఉన్న వారిలో కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స చేయాల్సిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలి. వినికిడి తీవ్రతను బటి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకు కోవాల్సిన అవసరం ఉంది.
- యం. అడివయ్య
సెల్: 9490098713