Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర కార్మికోద్యమంలో సెప్టెంబర్ 8 ఒక ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన చారిత్రిక దినంగా ఉండబోతుంది. ఈ రోజున 'కార్మిక గర్జన' పేరిట సీఐటీయూ పాదయాత్ర చేపట్టింది. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో ప్రారంభమై హైదరాబాద్ సౌత్, యాదాద్రి భువనగిరి, మేడ్చెల్జిల్లా గుండా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతానికి చేరింది. ఇప్పటికి సుమారు 250 కి.మీటర్లు పూర్తిచేసింది. 15 రోజులలో అనేక అనుభవాలునిస్తూ, పాలకుల ఆటంకాల మధ్య కొనసాగింది. అనారోగ్యం పాలైనా, కాళ్ళకు బొబ్బలెక్కినా లెక్కచేయక లక్ష్యం చేరుకోవడానికి మునుముందుకు సాగు తున్నది. కార్మికులు కూడా మేము ఊహించిన దానికన్నా ఎన్నోరెట్లు స్పందిస్తున్నారు, అడుగడుగునా అపూర్వంగా స్వాగతిస్తున్నారు. పాలకుల దుష్టవిధానాలపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. రానున్న కాలంలో కార్మికవర్గ సంఘటిత పోరాటాలకు ఈ పాదయాత్ర ఒక గీటురాయిగా, ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని అనుభవాలను చూద్దాం...
ఈ పాదయాత్ర ఎందుకోసం? కార్మికుల శ్రమను, వారి రక్తమాంసాలను జలగల మాదిరి పీల్చుతూ తెగబలిసిన రక్తపిసాసి అయిన 'పెట్టుబడి' నేడు ప్రపంచాన్ని శాసిస్తున్నది. దేశం ఏదైనా, పాలకులు ఎవరైనా లొంగదీసుకుంటూ వెళ్తున్నది. యిందుకు ఆటంకాలుగా ఉన్న చట్టాలు, హక్కులను ఉక్కుపాదంతో తొక్కివేస్తున్నది. అందుకు దేశంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాగిలబడుతూ పెట్టుబడిదారుల సేవలో తరించుతున్నది. సరిగ్గా సంవత్సరం క్రితం సెప్టెంబర్ నెలలోనే ప్రతిపక్షాల గొంతునొక్కి, కార్మిక సంఘాల విజ్ఞప్తులను తోసిపుచ్చి తను తీసుకురావాలనుకున్న నాలుగు లేబర్ కోడ్లను చట్టబద్దం చేసింది. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సాంఘిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత పని పరిసరాల కోడ్ పేరిట 29 చట్టాలను రద్దుచేసి ఈ కోడ్లను తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక కార్మిక చట్టాలను ఏకపక్షంగా తొలగించింది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న హక్కులతో పాటు, ఆ తరువాత వచ్చిన అనేక సంక్షేమ చట్టాలను కాలరాసింది. కనీస వేతనం, ఎనిమిది గంటల పనిదినం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మెచేసే హక్కు, సామాజిక భద్రత, మహిళా కార్మికల రక్షణ ప్రశ్నార్థకమయ్యాయి. దేశంలోని సుమారు 40కోట్లమంది కార్మికవర్గం ఈదుర్మార్గాన్ని నిరసిస్తూ పోరాడుతూనే ఉంది. ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకుపోయేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నాం.
రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా కార్మిక హక్కుల విషయంలో బీజేపీ ప్రభుత్వాన్నే అనుసరిస్తోంది. 2014 జూన్‌లో తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ 'బంగారు తెలంగాణ' నినాదం పారిశ్రామిక వేత్తలకు వరంగా మారింది. కార్మికులకు శాపంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లలో ఒక కోటి ఇరువైలక్షల మంది కార్మికులున్నారు. ''1948 కనీస వేతనాల చట్టం'' ప్రకారం ప్రతి ఐదేండ్లకు ఒకసారి వేతనాలు పెంచుతూ సవరించాలి. కాని ఇప్పటివరకు సవరించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాలు నిర్ణయించి పది, పదిహేను ఏండ్లు అయినా అవే యిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలకు మాత్రం నీళ్ళు, నిధులు, భూములు, టాక్స్‌ల మినహాయింపు యిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా యాజమాన్యాలకు బంగారు తెలంగాణ, కార్మికులకు బాధల తెలంగాణగా మిగిలిపోయింది. అందుకే కనీస వేతనాలు సవరించాలని, జూన్ నెలలో యిచ్చిన ఐదు జీఓలను గెజిట్ చేయాలని ఈ పాదయాత్ర డిమాండ్ చేస్తోంది.
స్వాతంత్య్రం కంటే పూర్వస్థితిలో కార్మికుల హక్కులు, సౌకర్యాలు
15వ ఐఎల్‌సి తీర్మానం, ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం కనీస వేతనంగా కార్మిక సంఘాల డిమాండ్ రూ.21,000. వాస్తవంగా ఇస్తున్నది ఇందులో సగం. పాదయాత్ర బృందం ముందుగా కార్మికుల కనీస వేతనాల గురించి పరిశీలించింది. పాదయాత్ర ప్రారంభమైన కొత్తూర్‌లో మహిళా కార్మికులకు రోజుకు రూ.180 నుంచి రూ.200 ఇస్తున్నారు. 10-12 గంటల పనిదినం. అంటే నెలకు 5 నుండి 6శాతం వెట్టిచాకిరీ చేస్తున్నారు. పురుషులకు రూ.9,000 నుండి 12,000 లోపు చెల్లిస్తున్నారు. యిందులో కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క తీరుగా యజమానులు తమకు నచ్చినంత చెల్లిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులకు రూ.11,000 ఇస్తున్నారు. ప్రతి కంపెనీ వద్ద తప్పనిసరైన వీరిని సెక్యూరిటీ ఏజెన్సీలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి. రంగారెడ్డిజిల్లాలోని కాటెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కూడా కనీస వేతనాలు దారుణంగా ఉన్నాయి. 15000 మంది కార్మికులు ఉంటే సగం మంది మహిళలే. వీరికి 10గంటలు పని, రూ.250లు వేతనం. యజమానులు వీరి శ్రమని విపరీతంగా దోచుకుంటున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒళ్ళుకాలిన, నడుం విరిగిన, కాళ్ళు చేతులు తెగిన కార్మికులు వచ్చి పాదయాత్ర బృందం ముందు తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. సాతారాయి క్లష్టర్‌లో మహిళలకు రూ.250, పురుషులకు రూ.300 నుండి 400 ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇదే జిల్లాలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఎస్ఈజెడ్) పేరిట ఏర్పాటు చేసిన కంపెనీల్లో కార్మికుల శ్రమ విపరీతంగా దోచుకుంటున్నారు. యిందులో కీలకమైంది టాటా ఎయిరోస్పేస్ సెజ్. ఆదిభట్లలో ఉంది. యూనియన్ పెట్టుకునే హక్కు కోసం పోరాడితే యిప్పటి వరకు వందమందిని తొలగించారు. మా పాదయాత్ర ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి వీలులేదని 10కి.మీ. దూరంలోనే వందలాదిమంది పోలీసులు వచ్చి అరెస్టు చేసి 50కి.మీ. దూరంలోని పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. చివరికి కార్మిక ప్రతిఘటనతో దిగిరాక తప్పలేదు. పాదయాత్రకు అనుమతించక తప్పలేదు. సెజ్‌ల పేరిట కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరిజిల్లాలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటువుతున్న పారిశ్రామిక పార్క్‌ను సందర్శించాం. 2500 ఎకరాలు సేకరిస్తున్నారు. యిప్పటికే 1088 ఎకరాలు సేకరించారు. ముందుగా 460 ఎకరాలలో 360 మంది పారిశ్రామిక వేత్తలకు స్థలాలు కేటాయించారు. కొన్ని పరిశ్రమలు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకుని, తీరా ఉపాధి కల్పించక పోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. కొయ్యలగూడెం పారిశ్రామిక ప్రాంతం, పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల గుండా పాదయాత్ర సాగిన సందర్భంలో వలస కార్మికుల బతుకులు దారుణంగా కనపడ్డాయి. కొత్తూర్ మొదలు అన్ని ప్రాంతాలలో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. పోచంపల్లి, కొయ్యల గూడెంలో వలసకార్మికులకు 10-12వేలు వేతనం యిస్తున్నారు. 12గంటలు పని చేయించుకుంటున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ అమలుచేయరు. కంపెనీ కాంపౌండ్లోనే నివాసాలు ఏర్పాటు చేశారు. ఒక్కోగదిలో ఏడుగురిని పెడుతున్నారు. అవి మనుషులు నివాసం ఉండలేని దుర్బరమైన, దుర్గంధమైన ఆవాసాలు. ఆస్టిమాస్ అనే కంపెనీలో 300మందికి ఒకే టాయిలెట్, ఆరుబయట వంట, మంచినీరులేదు. వాటికి కూడా రూ.3000 కిరాయి వసూలు చేస్తున్నారు. దాదాపు అన్ని పరిశ్రమలలో వలస కార్మికుల దుస్థితి ఇదే. ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు.
చేనేత కార్మికుల పరిస్థితులు పరిశీలించాం. నాలుగు రోజులు కష్టపడి ఒక చీర నేస్తే రూ.1100 యిస్తారు. అంటే రోజుకు రూ.300 కూడా పడదు. వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కార్మికులను అడిగినా కనీస వేతనం రూ.10,000 మించి యివ్వడం లేదు. పెట్రోల్ పంపులు, షాపులు, మాల్స్, మిల్లులు, భవన నిర్మాణ కార్మికులకు కూడా కనీస వేతనాలు లేవు. సగటున రూ.8000 వేతనం ఉంది. యిటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాల ప్రకారం రూ.18,099 వేతనాన్ని పొందాల్సి ఉంది. ప్రతి ఐదేండ్లకు ఒకసారి సవరించకపోవడం వల్ల హైదరాబాద్ చట్టూ ఉన్న ఐదులక్షల మంది కార్మికులు నెలకు రూ.8000 నష్టపోతున్నారు. ఈ డబ్బు యజమానులకు మిగులుతున్నది. అంటే నెలకు నాలుగువేల కోట్లు, సంవత్సరానాకి 48వేల కోట్లు యజమానుల బొక్కసాలలోకి కార్మికుల కష్టార్జితం చేరుతున్నది. ఈ లెక్కన పదేండ్లకు సుమారు నాలుగు లక్షల కోట్లకు పైగా కార్మికవర్గం నష్టపోయింది. ఇక మొత్తం 1.20కోట్ల కార్మికులకు లెక్కవేస్తే ఎంత నష్టపోయామో ఊహించలేము. దేశంలో, రాష్ట్రంలో శతకోటీశ్వరుల సంఖ్య ఎందుకు పెరుగుతుందో తెలుసుకోగలం.
ఈ పాదయాత్ర పొడవునా పరిశీలించితే ఎక్కడా 8గంటల పనిదినం లేదు. కొన్ని భారీ పరిశ్రమలు లేదా సంఘటిత ఉద్యమం ఉన్న దగ్గర తప్ప. 12గంటల పనిదినం సర్వసాధారణం. చట్టబద్ద హక్కులు అమలులో లేవు. కార్మికశాఖ అధికారుల జాడ కనిపించదు. ప్రతిష్ట అనే కంపెనీలో నైట్‌డ్యూటీ కార్మికులు 10 నిమిషాలు లేట్‌గా వెళ్తే 30 రోజులు పనికి ఆపుతారట. ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ లాంటివి అవసరము లేదు అని రాయించుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు. 2019లో బోనస్ నేటికీ యివ్వలేదు. పాదయాత్ర నుండే కార్మికశాఖ అధికారులకు ఫోన్‌చేస్తే సరైన స్పందన లేదు. ఎస్వీజీ అనే కంపెనీలో విపరీతమైన కక్షసాధింపులు ఉన్నాయి.
పొల్యూషన్ మరింత తీవ్రమైన సమస్యగా ఉంది. పంట పొలాలు నాశనమవుతున్నాయి. మంచినీరు కలుషితమవుతోంది. కెమికల్, ఫార్మా కంపెనీలు భూముల్లోకి వ్యర్థాలను వదలడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇది పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంతాలో స్పష్టంగా కనపడింది. ఒకొక్క రైతు వరినాట్లు వేసుకొని 20-30వేలు నష్టపోతున్నాడు.
కార్మికుల ఆదరణ జీవితంలో మరువలేనిది
పాదయాత్రలో మేం పేద కార్మికుల నివాసాలలోనే బస చేయాలని, వారు పెట్టిందే తినాలని నిర్ణయించుకున్నాం. అమలు చేస్తున్నాం. కార్మికులు సంతోషంగా ఆదరిస్తున్నారు. రాష్ట్ర నాయకులు వారి ఇండ్లల్లో ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. మాకు ఆతిధ్యం యిచ్చిన అత్యధికులు నిరుపేదలు. 25గజాల యిల్లు, చిన్న గదిలో నివసిస్తున్నారు. వాటిలో ఉండటం వల్ల వారి జీవన పరిస్థితి కండ్లకు కట్టినట్టుగా అర్థమవుతోంది.
కార్మికుల ఆదరణ అపూర్వంగా ఉంది. గ్రామ పంచాయతి, మున్సిపల్, అంగన్వాడి, ఆశ తదితర రంగాలు బాగా ఆదరించాయి. వీరు కూడా కనీస వేతనాల కోసం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాదయాత్ర దారిలో శంషాబాద్, బాలాపూర్, యాంజిల్, బాటసింగారం, కొయ్యలగూడెం, పోచంపల్లి, భువనగిరి, అన్నోజీగూడ, రాజీవ్‌గృహకల్ప, చిలుకానగర్, బోరబండ, రాజుకాలనీ, భగత్‌సింగ్ నగర్లలో కాటికాపరి నుండి కాంట్రాక్టు వర్కర్ వరకు అందరి ఇళ్ళల్లో బసచేశాం. వారి జీవన విధానం పరిశీలించాం. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వారి జీవితాలు తెలుసుకునే అవకాశం కలిగింది. కార్మికగర్జన పాదయాత్ర అనుభవాలు మాకు ఎన్నో పాఠాలు నేర్పడమే కాదు, కార్మిక పోరాటాలకు మరింత పదునుపెడతాయనడంలో సందేహం లేదు.
- భూపాల్
సెల్: 9490098034